బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-థాంక్యూ నాన్నా !!

   1972 దాకా అసలు పెళ్ళే అవుతుందో లేదో అనుకున్న నాకు,మొత్తానికి మా అబ్బాయీ, కోడలూ, 2010 కి నూతన సంవత్సరంలో ఓ మంచి బహుమతీ ఇచ్చారు.భమిడిపాటి వంశవృక్షాన్ని కొనసాగించే సదుద్దేశ్యంతొ ఓ బంగారు మనవడిని మాకు ఇచ్చారు! గాడ్ బ్లెస్ దెం! ఈ వేళ ఆ శ్రీవెంకటేశ్వరుని దయతో మా ఇంట్లో ఓ బుల్లిబాబు వచ్చాడు.మా బంగారు తల్లి చి.నవ్య ఉన్నాకానీ, ఎప్పటికో అప్పటీకి ఇంకో ఇంటికి వెళ్ళవలసిందేగా. ఏదో మొగపిల్లలు మనని ఉధ్ధరించేస్తారని కాదు, మన పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల ఈవేళ,మనం రెండుపూటలా భోజనం చేయకలుగుతున్నాము.ఏదో మన ఇంటిపేరు ఇంకా చాలా కాలం కొనసాగుతుందికదా అని ఓ సంతృప్తీ! మా అమ్మగారు 95 సంవత్సరాలు జీవించారు.ఇంకొక్క రెండేళ్ళు బ్రతికి ఉంటే ఎంత సంతోషించేవారో అనిపించింది.

   పూణే లో ప్రొద్దుటే జహంగీర్ హాస్పిటల్ కి వెళ్ళాము.నాలుగు రోజులు ముందుగానే రూం బుక్ చేశాము.ప్రైవేట్ రూం కావాలన్నాము.అదేమిటో, మనకి ఎప్పుడూ ఓ మెట్టు పైన లక్జరీ రూం ఎలాట్ చేస్తారు.ఎందుకంటే దీని ఖరీదెక్కువ!!ఈ కార్పొరేట్ హాస్పిటళ్ళలో మనకి కావలిసినట్టుగా దొరకవు.ఒక్కటే లోటు ఈ సారి–మా డాక్టరమ్మ గారు ఈ సారి యు.ఎస్. వెళ్ళడం వల్ల, మా మనవడు ఆవిడ చేతిలో పుట్టలేదే అని ఓ వెలితి.ఆవిడ వచ్చేవారం వస్తారుట.

   కొంతమంది హాస్పిటళ్ళలో తిరుగుతున్నామని ఎందుకు మరచిపోతారో అర్ధం అవదు. చేతిలో రెండేసి సెల్ ఫోన్లు పేద్ద సౌండ్ చేసికుంటూ అటూ ఇటూ తిరుగుతూంటారు.ఇంకోళ్ళకి అసౌకర్యంగా ఉంటుందేమోనని కూడా ఆలోచించరు. గంటల తరబడి మాట్లాడుకోవడమే.అదేదో హొటల్లో ఉన్నామనుకుంటారు.’సైలెంట్’ లేక ‘వైబ్రేట్’ మోడ్ లో పెట్టుకోవచ్చుగా.అబ్బే మన దగ్గర రెండేసీ, మూడేసీ ఫోన్లున్నాయని ఊరంతా తెలియాలిగా!

   30 సంవత్సరాల క్రితం ఇదే హాస్పిటల్ లో మా అబ్బాయి పుట్టినప్పుడు(మా డాక్టరమ్మ గారి ఆధ్వర్యం లో),దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళి మా మామ గారికి టెలిగ్రాం ద్వారా తెలియ చేస్తే, మూడో నాటికి కానీ మా అత్తగారు రాలేక పోయారు. ఈవేళ అలా కాదే-నిమిషాల్లో చుట్టాలందరికీ తెలియ చేయ కలిగాము.టెక్నాలజీ మహిమ!!

%d bloggers like this: