బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పుత్రోత్సాహం-1

   ఇదివరకటి రోజుల్లో ‘పుత్రోత్సాహం’ అంటే, ఏ తండ్రికైనా పుత్రుడు పుట్టినప్పుడు కానీ, ఆ పుత్రుడు ఏదైనా ఘనకార్యం చేసినప్పుడు పొందే ఉత్సాహాన్ని అని చెప్పేవారు. కాల క్రమేణా ఈ నిర్వచనం మారింది. కొడుకు అనబడేవాడు 18 సంవత్సరాలదాకా తల్లితండ్రులు చెప్పే మాటలు వింటూంటాడు. అవసరం అనండి, మానసిక పరివర్తన చెందకపోవడం అనండి-ఏదైతేనే అమ్మా నాన్నలు వాడికి పార్వతీ పరమేశ్వరులకి మారుపేరులా ఉంటారు.

   ఆ తరువాత తండ్రి చెప్పిన కాలేజీలో చేరి, అప్పుడు కూడా పాపం అదే (అంటే పార్వతీ పరమేశ్వరులూ ఎట్సట్రా..) భావంలో ఉంటాడు.ఇక్కడ తండ్రికూడా,తన కొడుకు ఏదో చదివేస్తున్నాడూ, పెద్ద అయిన తరువాత ఏదో ఉధ్ధరించేస్తాడూ అనుకుంటూంటాడు.ఊళ్ళో వాళ్ళ ప్రవర్తన కూడా దీనికి తోడౌతుంది. కనిపించినప్పుడల్లా ‘మీకేంటండీ అబ్బాయి పెద్ద చదువులు చదివేస్తున్నాడూ, ఉద్యోగంలోకి వచ్చేడంటే మీకేం లోటూ’ లాటి డయలాగ్గులు వింటూంటాము.తల్లికి కూడా ఏ పేరంటానికి వెళ్ళినప్పుడో ఇలాటివే వినిపిస్తూంటాయి, ‘మీకేమిటండీ,ఇద్దరే పిల్లలూ,అమ్మాయి పెళ్ళి చేసేశారూ, త్వరలో కోడలుకూడా వచ్చేస్తుంది, కాలు మీద కాలేసికొని ఉండడమే.ఎంతమందికి ఈ అదృష్టం పడుతుందీ’అంటూ..

   పాతకాలంలో అయితే ఇంటికి ఓ ఆరుగురికి తక్కువ కాకుండా పిల్లలుండేవారు. నలుగురు మగ పిల్లలనుకోండి–ఇంక ఆ తండ్రి పగటికలలు కంటూ’అబ్బా రిటైర్ అయిన తరువాత నలుగురి దగ్గరా తలో మూడు నెలలు గడిపినా మన రోజులు వెళ్ళిపోతాయీ’అనుకుంటాడు.ఇప్పుడైతే న్యూక్లియర్ కుటుంబాల ధర్మమా అని, మొదటి రెండు కాన్పులూ ఏ ఆడపిల్లో అయితే
మూడోసారికి ప్రయత్నం. అందుకని ఎక్కడ చూసినా ఇద్దరూ ఒక్కొక్కప్పుడు ముగ్గురూ.అంతే. ఈ ఫాషన్ మా రోజుల నుండీ వచ్చేసింది.పైగా దీనిని సమర్ధించుకోవడమొకటీ, ఇద్దరైతే వాళ్ళకి కావలిసినవన్నీ ఇవ్వొచ్చూ అంటూ, అక్కడికి మన తల్లితండ్రులు ఏదీ ఇవ్వలేదన్నట్లూ.ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు, నలుగురు బడుధ్ధాయిలకి చదువు చెప్పించారు, వాళ్ళ తండ్రి దగ్గరనుండి వచ్చిన ఇంటిని ఏ తాకట్టూ పెట్టకుండా నిలబెట్టారూ. ఒక్కొక్కప్పుడైతే వీళ్ళే ఇల్లూ అదీ ( అదికూడా ఇప్పటి లాటి అగ్గిపెట్టెల లాటివి కాదు) కట్టుకునేవారు. ఇంకా ఏం చేయాలిట?

    ఈ రోజుల్లో ఎవడికైనా ఈ ధైర్యం ఉందా? నేను ఏదో పేద్దపేద్ద ఆస్థులున్నవాళ్ళగురించి కాదు చెప్పేది.మామూలు ఉద్యోగాలు చేసినవారి గురించి. దేనితోనో మొదలెట్టి దేంట్లోకో వెళ్ళిపోయాను.పైగా ఏమైనా అంటే ఇప్పుడు ఖర్చులు ఎక్కువా, అవసరాలుకూడా పెరిగాయీ అంటూ ఓ కుంటిసాకులొకటి. వాటికి తగినట్లుగా జీతాలూ భత్యాలూ పెరిగాయిగా! ఆ విషయం కన్వీనియెంట్ గా పక్కకు పెట్టేస్తాము. ఇదంతా ప్రస్తుత తరం గురించనుకోకండి, మా రోజుల్నుండీ ఈ జాడ్యం మొదలయింది.ఇప్పుడు ఆలోచిస్తే నేనేం చేశాను, మా తల్లితండ్రులకి? మా నాన్నగారు ఎప్పుడూ మా దగ్గరకు వచ్చి ఉంటాననలేదు. పొనీ అలాగని నేనెప్పుడైనా వాళ్ళని అడిగేనా? అబ్బే లేదు.ఆఖరికి నా దగ్గరకు వచ్చి ఉందామనుకునే వేళకి ఈ లోకంలోంచే వెళ్ళిపోయారు.ఇప్పుడనుకొనీ ఏం లాభం?అలాగని అందరూ అలాగే ఉంటారని కాదు నా ఉద్దేశ్యం. నూటికీ, కోటికీ ఎక్కడో ఉండేఉంటారు తల్లితండ్రుల్ని ఇంకా ‘పార్వతీ పరమేశ్వరుల’లాగ చూసుకునేవారు. ఇందులో కూడా కొన్ని కొన్ని‘మతలబులు’ ఉండే ఉంటాయి. ఇదివరకటి రోజులైతే ఆలోచించకుండా నమ్మొచ్చు. కానీ ఇప్పటి కాల ,మాన పరిస్థితుల్ని బట్టీ, ఇప్పటి ‘పొల్యూషన్ ఆఫ్ మైండ్’ ని బట్టీ నమ్మడం కష్టం. దీనిని ‘పొల్యూషన్ ఆఫ్ మైండ్’ అంటే ఇప్పటివారు కోప్పడొచ్చు.’సర్కమస్టెన్సెస్’ని బట్టి కుదరడంలేదూ అంటారు. ఏ రాయైతేనే బుర్ర పగలుకొట్టడానికి….. ఇవాళ్టికి ఇది చాలు..రేపు ఈ ‘పుత్రోత్సాహం’ నేను విన్న నిర్వచనం వ్రాస్తాను.

%d bloggers like this: