బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   మా రాజమండ్రి గురువుగారు, శ్రీ ‘సురేఖ’ అప్పారావుగారి ధర్మమా అని, ‘ఇంకోతికొమ్మచ్చి’ సంపాదించే అదృష్టం కలిగింది.ఇక్కడ పూణే లో కావాలంటే దొరకదుగా.అందుకని ఆయనను పంపమని అడిగాను. అక్కడ ఆయన, జనవరి 1 న ‘కొరియర్’ లో పంపితే వారం పట్టింది, నాకు చేరడానికి.ఇదివరకు పోస్టల్ వాళ్ళే ‘లేట్ కేట్’ అనుకునేవాళ్ళం. ఇప్పుడు ‘కొరియర్ సర్వీసులు’ కూడా అలాగే తగలడ్డాయి. ఏ సర్వీసైనా మొదట బాగానే ఉంటుంది. కాలక్రమేణా అందరికీ ఒకటే రోగం పట్టుకుంటుంది.

   ప్రతీ వారం ‘స్వాతి’ వారపత్రిక లో చదువుతూనే ఉన్నాను. అయినా సరే శ్రీ ముళ్ళపూడి వారి రచనలు ఎన్నిసార్లైనా చదవొచ్చు.పుస్తకరూపంలో అంతా కలిపి చదవడం లో ఉన్న మజా వేరు.రాత్రి 1.00 గంటదాకా పూర్తిగా చదివాను. ఈ వేళ హైదరాబాద్ నుండి, మా వియ్యపరాలు గారు వచ్చారు. ఆవిడ వచ్చినప్పుడల్లా, మాకు ఏదో ఒక పుస్తకం తేవడం అలవాటు.క్రిందటి సారి డాక్టర్.సోమరాజు సుశీల గారి ‘దీపశిఖ’ తెచ్చారు. దానిలోని ‘ఈవెంట్ మేనేజ్మెంట్’ కథ చదివి, వెంటనే డాక్టర్. సుశీల గారికి ఫోన్ ( పుస్తకం లో ఆవిడ ఫోన్ నెంబర్ ఇచ్చారు) చేస్తే, కొంతసేపు రింగ్ అయి ఆగిపోయింది. నెంబర్ తప్పేమో అనుకున్నాను. కొద్దిసేపట్లో ఆవిడ దగ్గరనుండే ఫోన్ వచ్చింది.ఆవిడతో కొద్ది నిమిషాలు మాట్లాడే అదృష్టం కలిగింది.

   మా వియ్యపురాలు గారు ఈ సారి మాకోసం ‘కోతికొమ్మచ్చి’ రెండు భాగాలూ తెచ్చారు. ప్రస్తుతం నా దగ్గర రెండు సెట్లున్నాయోచ్ !నాకు పుస్తకాలు పంపడానికి సహాయం చేసిన మరొకరు
అరుణ పప్పు గారు. ఈ ఊళ్ళో నవ్య వార పత్రిక వస్తుంది కానీ, దీపావళి సంచిక రాదు.అందుకని ఆవిడని రెక్వెస్ట్ చేశాను. వెంటనే పంపించారు. ఈ బ్లాగ్ ద్వారా శ్రీ అప్పారావు గారికీ, అరుణ గారికీ కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ దెమ్.మా వియ్యపురాలు గారికి పెర్సనల్ గానే థాంక్స్ చెప్పాను.
ఇంకో సంగతండోయ్–నిన్న శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ లో ‘ నాద నీరాజనం’ నాట్య కార్యక్రమం ‘లైవ్’ వచ్చింది. ఆ కార్యక్రమంలో మాకు పరిచయమూ, మా కోడలి ద్వారా చుట్టమూ అయిన శ్రీమతి.డాక్టర్.గంటి స్వర్ణబాల గారూ, వారి కుమార్తె చి.అనాహిత పాల్గొన్న నాట్యం చూసే అదృష్టం కలిగింది.ఎంతమంది తల్లీ కూతుళ్ళు ఒకే వేదికమీద నాట్యం చేసే భాగ్యవంతులు?

   నేను చెప్తున్నానే దీన్నే ‘నేం డ్రాపింగ్’ అంటారనుకుంటాను. ప్రముఖ కార్టూనిస్ట్ ‘సురేఖ’ అప్పారావు గారూ,డాక్టర్. సోమరాజు సుశీల గారు, గంటి స్వర్ణబాల గారూ–ఎంతమందితో పరిచయమో. ఆ మధ్యన హైదరాబాద్ వచ్చినప్పుడు శ్రీ సుద్దాల అశోక్ తేజా గారూ, ‘మిథునం’ శ్రీ రమణ గారూ, శ్రిమతి బలభద్రపాత్రుని రమణి గారూ, అలాగే మెయిల్స్ ద్వారా వంగూరి చిట్టెన్ రాజు గారు, శ్రీ మందపాటి సత్యం గారూ, శ్రీమతి మృణాలిణి గారూ–అబ్బ ఇవాళ్టికి చాల్లెండి. ఇంతమంది సెలిబ్రెటీస్.ఇంకా ఎంతమందితో పరిచయం అయ్యే అదృష్టం ఉందో!!

%d bloggers like this: