బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు-పుత్రోత్సాహం-5

    ఎంత ఉద్యోగం లోంచి రిటైర్ అయినా, మరీ ఇంట్లోని పెద్దాయన్ని, మరీ పెద్దగా చెసేయఖ్ఖర్లేదు.ఆయనకీ, ఆవిడకీ కొంత ప్రివసీ కూడా ఇస్తే సంతోషిస్తారు.కొడుకూ, కోడలూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని, తమే చూసుకుంటూ, అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న తల్లితండ్రుల సలహాలు తీసికుంటే బాగుంటుంది కానీ,మరీ ‘ఫుల్ టైమ్’ డ్యూటి లు వేసేస్తే ఎలాగండి బాబూ! ఏదో పెళ్ళైన ఏ రెండుమూడేళ్ళో వాళ్ళకి ప్రైవసీ అనేది ఉండేది.పిల్లలు పుట్టిన తరువాత, వాళ్ళ బాగోగులు చూసుకోవడంతోటే సరిపోయింది పాపం. వాళ్ళ కడుపు కాల్చుకొని, పిల్లల్ని పెంచి పెద్ద చేశారు.
మరీ ‘లిటరరీ మీనింగ్’ తీసికోకండి, నా ఉద్దేశ్యం ఏమిటంటే వాళ్ళ అవసరాల కంటే, పిల్లల అవసరాలకే ‘ప్రైయారిటీ’ ఇచ్చారు. వాళ్ళు అలా చేసి ఉండకపోతే వీళ్ళు ఇలాగ ఉండేవారా?

    ‘మమ్మల్ని పుట్టించారు కనుకు పెంచడం మీ డ్యూటీ ‘ అనకండి. అలాటివి కథల్లోనూ, సినిమాల్లోనూ బాగుంటాయి. అంతే కానీ జీవితంలో కాదు. తండ్రి 30/40 ఏళ్ళు సర్వీసు చేసిన తరువాత ఏం ఆశిస్తారు? ఈయనకి కనీసం ఉద్యోగ బాధ్యతలు తప్పుతాయి, కానీ ఆయన భార్యకి,అంతకుముందు తన పిల్లలకీ ఇప్పుడు పిల్లల పిల్లలకీ సేవ చేయడం తప్ప ఇంకేమీ ఉండకూడదా ? అది న్యాయం కాదు. మీరు ఇవ్వ కలిగితే విశ్రాంతి ఈయండి, అంతే కానీ లేనిపోని చికాకులు తెప్పించకండి. ఇవేవో ‘బాగ్ బాన్’ సినిమాలో డైలాగ్గులు కావు.వీళ్ళకి సాయం, ఈ తాత గారి తల్లో, తండ్రో ఇంకా జీవించే ఉంటారు.ఇంక ఆ ‘నానమ్మ’ గారి పని ఐపోయినట్లే.మూడు తరాల వారికి సేవ చేస్తూ పుణ్యకాలం గడిపేస్తూండాలి.ఇందులో ఎవరికెవరూ తక్కువ తినలేదు.ప్రతీవారూ ఆవిడ మీద హక్కు జమాయించడం తమ ‘ ఫండమెంటల్ రైట్’ అనుకుంటారు!ఆవిడకీ ఏమేమో కోరికలుంటాయి, ఈ ఇంటికి 40 సంవత్సరాల క్రితం ఎన్నెన్నో కలలు కంటూ, అడుగు పెట్టింది. ఆ కల మాట దేముడెరుగు, కనీస మనశ్శాంతి ఇవ్వడం ప్రతీ కొడుకూ/ కూతురీ విధి.

   ఇంకో ఇంటికి కోడలిగా వెళ్ళిన కూతురు కూడా, తన తల్లితండ్రులు తనకేదో తక్కువ చేశారూ అని అనుకోవడం తప్పు.ఉన్నదంతా కొడుక్కే దోచిపెట్టేస్తున్నారూ అనుకుంటే ఎలాగ? తన ఇంటిలో ఉంచుకోవడానికి, తన భర్త ఒప్పుకోడూ, ఇంక విధి లేక కొడుకు తోనే ఉంటారు, అంతేకానీ వాళ్ళు ఏదో ఉధ్ధరించేస్తారని కాదు.నగరాల్లో అయితే కొంచెం ఫర్వాలేదు, అదే పట్టణాల్లోనూ, చిన్న చిన్న గ్రామాల్లోనూ అయితే,అదికూడా వీలు కాదు.విడి విడి గా ఉంటే, ఊళ్ళో ఉన్న ప్రతీ వాడూ అడగడం–‘ ఏమిటీ, మీకోడలు వేరింటి కాపరం పెట్టించేసిందా?’ అంటూ. ఆ అడిగిన వాడింట్లో ఏదో ‘ఐడియలిస్టిక్’ గా ఉంటోందనికాదు, ఇంకోడి ఇల్లు తగలడిపోతూంటే కలిగే పైశాచికానందం అంతే.ఈ గొడవలన్నీ భరించలేక కొట్టుకుంటూనో, తిట్టుకుంటూనో కొడుకుతో సెటిల్ ఐపోతారు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ పిల్లలు,‘ఫలానా వారి అబ్బాయి‘అనే మీకు సొసైటీలో గౌరవం. మీకంటే 30 ఏళ్ళు ముందర పుట్టి,తనకంటూ ఓ ‘ఇమేజ్’ క్రియేట్ చేసికున్నారు ఆయన. అది గుర్తుంచుకొని దానిని కాపాడడం పిల్లల విధి. చిన్న చిన్న పట్టణాల్లో చూస్తూనే ఉంటాము, ఇప్పటికీ ఏదైనా ఇల్లు చూపించి ఇది ఫలానా వారి ఇల్లూ అంటారు. ఎవరి పేరు తీసికొంటారూ, మీనాన్నగారిది కాదు, మీతాత గారిది. అది ఏ బిల్డర్ కో ఇచ్చేసినా సరే, ఇంకా మీతాతగారి పేరే చెప్తారు.అది విన్నప్పుడల్లా మీ నాన్నగారి( ఈ మధ్యనే రిటైర్ అయి ఆ ఇంట్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రాణి) ఎంత గర్వంగా భావిస్తారో?

   ప్రతీ ఇంట్లోనూ ఇలాగే ఉంటుందనికాదు.నూటికి 80 మందికి ఇంకా తల్లితండ్రుల మీద ప్రేమా అభిమానం ఉంటాయి. వచ్చిన గొడవల్లా ఆ మిగిలిన 20 మంది గురించే.వాళ్ళు ఎలాటి వారంటే ‘ కూసే గాడిదొచ్చి మేసే గాడిదని పాడిచేసింది’ అన్నట్లు, ఆ 80 మంది కాపురాల్లోనూ చిచ్చు పెట్టగల సమర్ధులు.చెప్పానుగా కొడుకు లెక్చరరూ, కోడలు పోస్టాఫీసో, బ్యాంకో- ఈ కోడలు ఎప్పుడైనా ఆఫీసుకి రావడం ఆలశ్యం అయిందా, రెండో రకం ఆవిడ అడుగుతుంది కారణం ఏమిటని.ఈ అమ్మాయి స్వతహాగా మంచిదే కానీ, ఇంకోళ్ళు సానుభూతి చూపేసరికి తను, ఇంట్లో అందరికీ వంట వండి, పిల్లల్ని స్కూలుకి పంపడానికి రెడీ చేసేసరికి తను పడ్డ శ్రమ గురించి చెప్తుంది.

    ఆ మాత్రం చనువిచ్చి, మాట్లాడితే చాలు, అవతలి వాళ్ళు పేట్రేగి పోతారు.
‘ అయ్యో ఇంట్లో రెండు పూటలా నువ్వు వంట చేస్తున్నావా, మా ఇంట్లో అలా కాదు, నాకు ఆఫీసు కెళ్ళాలీ, నాకు టైముండదూ వంటావార్పులకి, అని వచ్చిన కొత్తలోనే చెప్పేశాను.మా అత్తగారే చేస్తారు.నువ్వుకూడా ఊరికే వాళ్ళని నెత్తెంకించుకోకు’ అని ఈ అమాయక్కపిల్లని ‘పాయిజన్’ చేసేస్తుంది. నిజమే కాబోలనుకొని, రోజూ గోడమీదా పిల్లిమీదా ఏవేవో పితూరీలు , దెప్పిపొడవడాలూ మొదలెడుతుంది.ఇంక ఆ ఇంట్లో నలిగిపోయేవాడు కొడుకే. అటు తల్లితండ్రులకి చెప్పాలేడు, ఇటు భార్యని సముదాయించా లేడు. వయా మీడియా గా నానమ్మ గారికి వంట డ్యూటీ పడుతుంది. ‘అరబ్ ఎండ్ ద కేమెల్’ కథలో లాగ తాతయ్య గారికి పిల్లల స్కూలి డ్యూటీ !! శ్రీ మద్రమాణ గోవిందో హరి!! ఇంకా ఉంది

%d bloggers like this: