బాతాఖానీ-లక్ష్మి ఫణి కబుర్లు-సాక్షి కేలెండర్

    ‘సాక్షి’పేపర్ వాడికీ, నాకూ ఏదో గత జన్మ వైరం ఉందనుకుంటాను.2008 జనవరి 1 న మొదలయింది ఈ ఏడాది అంటే జనవరి 1, 2010 కూడా జరిగింది. ఒకసారైతే పొరపాటనుకుంటాము. రెండో సారి మన ఖర్మ అని సరిపెట్టుకుంటాము.మూడో సారి కూడా అలాగే అయితే ఇందులో ఏదో ‘ దాల్ మే కాలా హై’ అనుకోవలసివస్తుంది! జరిగిందేమిటంటే… 2008 లో కొత్తసంవత్సర క్యాలెండరొకటి పేపర్ తో ఇచ్చాడుట. ఆరోజు దొరకలెదు. ఆ తరువాత ‘ఉగాది’ కి పూణే లో ‘ఆంధ్రా ఎసోసిఏషన్’ వాళ్ళ కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఈ కేలెండర్ల బండిల్ ఒకటి చూశాను.ఎవరో నాక్కూడా ఇచ్చారు.

   2008 లో జనవరి 1 న రాజమండ్రీ లో ఉన్నాము. అక్కడ ‘సాక్షి’ తెప్పించుకునే వాడిని. అదేం ఖర్మమో అందరికీ కేలెండర్ ఇచ్చాడు కానీ, నాకు ఇవ్వలేదు.అదికూడా ఇంకో దుకాణానికి వెళ్తే తెలిసింది. పేపర్ కుర్రాడిని అడిగితే,వాడు అమ్మేసికున్నాడని తెలిసింది. నాకు కేలెండర్ ఇస్తే కానీ బిల్ ఇవ్వనన్నాను. ఎక్కడో ఎవరి కాళ్ళో పట్టుకొని మొత్తానికి తెచ్చి ఇచ్చాడు.

    ఈ వేళ జనవర్ 1, 2010 న కేలెండర్ ఎక్కడ మిస్ అవుతానో అని పెందరాళే మరీ వెళ్ళాను. ఉత్తి పేపరే ఉంది మైనస్ కేలెండర్! ఇంత తాపత్రయం ఎందుకూ ఆ కేలెండర్ కోసం అనకండి.అది పేపర్ తో మనకి ఇస్తున్న ఫ్రీ గిఫ్ట్.దానిని తీసికోవడం మన హక్కు! కొన్ని విషయాలలో నేను కొంచెం నిక్కచ్చి గా ఉంటాను.ఒకసారి రాజమండ్రీ బస్ స్టాండ్ లో పేపర్ కొనుక్కున్నాను. వాడి దగ్గర చిల్లర లేక అర్ధరూపాయి ఇవ్వలేదు. దానికి బదులు ఏ చాకొలెట్టో ఇవ్వమన్నాను.లేదన్నాడు. సరే అని డబ్బులు వెనక్కి తీసేసికొని పేపర్ తిరిగి ఇచ్చేశాను. వాడు నన్ను చూపించి అందరి ఎదురూగా ఏదో గేలిగా ‘ ఈయన చూడండి, అర్ధ రూపాయ కోసం మొహం వాచినట్లుగా దెబ్బలాడుతున్నారూ’ అన్నాడు. అంటే నేనన్నానూ, ‘నేను నీకు అర్ధరూపాయ తక్కువ ఇస్తే నాకు పేపర్ ఇస్తావా?’ పేపర్ వాళ్ళు ఇచ్చే కమీషన్ తో పాటుగా, మీరు ఇలాగ కస్టమర్స్ నుండి పేపర్ కి అర్ధ రూపాయ నొక్కేయడం ఎందుకూఅంటే వాడి దగ్గర సమాధానం లేదు. ఇక్కడ ప్రశ్న అర్ధరూపాయ కాదు,అవసరం వస్తే ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. కానీ ఇలా ‘దిన్ దహాడే లూట్’ చేసేవాళ్ళని కొంచెం కంట్రోల్ చెయ్యాలి. బస్సుల్లో కూడా మనకి ఇలాటి అనుభవాలు ఎదురౌతూంటాయి.మనం చిల్లర అడిగితే అదేదో క్రైం చేసినట్లు చూస్తాడు ఆ కండక్టర్ !
ఇదేదో పేద్ద ఘనకార్యం చేసినట్లు చెప్తున్నారూ, మీ దబాయింపు అంతా పేపర్ వాళ్ళూ, కండక్టర్ల మీదే కదా అనకండి.ప్రతీ చోటా మనం దోపిడీ కి ‘బక్రా’ లు అవుతున్నాము.కానీ అన్ని చోట్లా అడగలేముగా.వీలు అయినప్పుడైనా ఇలాటివి
అడ్డుకొందాము.
ఇంత చెప్పీ ఆ ‘సాక్షి ‘ పేపరే ఎందుకు కొంటున్నారూ, అనొచ్చు. దాంట్లో ఏవో సాహిత్య విలువలు ఉన్నాయని కాదు. పేపర్ తెరిస్తే వచ్చిన భాష కూడా తగలడిపోతూంది. పతాక శీర్షికల్లో ఏముంటాయి–‘నాలుక కోస్తా’
‘పీక నరుకుతా’ అంతే కదా!
ఏం లేదూ, ఉన్నవాటిలో తక్కువ ఖరీదు కదా అని.రద్దీ క్రింద అమ్మినప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది. మా ఇంటావిడంటుందీ, హాయిగా ఆన్ లైన్ లో చదువుకుంటున్నారు కదా ఇంకా ఈ గొడవెందుకూ అని.
పేపర్ తెప్పించడం ఓ అలవాటు. పైగా మన ఇంటికి ఎవరైనా తెలుగు వాళ్ళొస్తే ‘వీళ్ళు పేపరు కూడా తెప్పించుకోరూ’ అనుకోకుండా !! కొన్ని పనులు స్టేటస్ సింబల్ కోసం చెయ్యాల్సొస్తుంది !

%d bloggers like this: