బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-ప్రభలతీర్థం

prabhalateertham-1Prabhalateertham-2Prabhala teertham-3Prabhala teertham-4Prabhala teertham-5

అదేమిటో ప్రభలతీర్థం గురించి ఎంత వ్రాసినా సరిపోదనిపిస్తుంది. కొంతమందికి బోరు కొట్టినా సరే చదవండి.

బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు-వి.ఏ.కే.రంగారావు గారు

vakrangarao

ఆంధ్రజ్యోతి ఆదివారం 'నవ్య' లో శ్రీ వి.ఏ.కే రంగారావు గారి తోనూ, శ్రీ పీ.బీ.శ్రినివాసు గారితోనూ ఆసక్తికరమైన ఇంటర్వ్యూ.

Read it here.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు

Jandhyaala

హాస్యబ్రహ్మ శ్రీ జంధ్యాల గురించి వారి భార్య మాటలలో..

Read it here

బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు-పుత్రోత్సాహం-5

    ఎంత ఉద్యోగం లోంచి రిటైర్ అయినా, మరీ ఇంట్లోని పెద్దాయన్ని, మరీ పెద్దగా చెసేయఖ్ఖర్లేదు.ఆయనకీ, ఆవిడకీ కొంత ప్రివసీ కూడా ఇస్తే సంతోషిస్తారు.కొడుకూ, కోడలూ వాళ్ళ వాళ్ళ పిల్లల్ని, తమే చూసుకుంటూ, అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న తల్లితండ్రుల సలహాలు తీసికుంటే బాగుంటుంది కానీ,మరీ ‘ఫుల్ టైమ్’ డ్యూటి లు వేసేస్తే ఎలాగండి బాబూ! ఏదో పెళ్ళైన ఏ రెండుమూడేళ్ళో వాళ్ళకి ప్రైవసీ అనేది ఉండేది.పిల్లలు పుట్టిన తరువాత, వాళ్ళ బాగోగులు చూసుకోవడంతోటే సరిపోయింది పాపం. వాళ్ళ కడుపు కాల్చుకొని, పిల్లల్ని పెంచి పెద్ద చేశారు.
మరీ ‘లిటరరీ మీనింగ్’ తీసికోకండి, నా ఉద్దేశ్యం ఏమిటంటే వాళ్ళ అవసరాల కంటే, పిల్లల అవసరాలకే ‘ప్రైయారిటీ’ ఇచ్చారు. వాళ్ళు అలా చేసి ఉండకపోతే వీళ్ళు ఇలాగ ఉండేవారా?

    ‘మమ్మల్ని పుట్టించారు కనుకు పెంచడం మీ డ్యూటీ ‘ అనకండి. అలాటివి కథల్లోనూ, సినిమాల్లోనూ బాగుంటాయి. అంతే కానీ జీవితంలో కాదు. తండ్రి 30/40 ఏళ్ళు సర్వీసు చేసిన తరువాత ఏం ఆశిస్తారు? ఈయనకి కనీసం ఉద్యోగ బాధ్యతలు తప్పుతాయి, కానీ ఆయన భార్యకి,అంతకుముందు తన పిల్లలకీ ఇప్పుడు పిల్లల పిల్లలకీ సేవ చేయడం తప్ప ఇంకేమీ ఉండకూడదా ? అది న్యాయం కాదు. మీరు ఇవ్వ కలిగితే విశ్రాంతి ఈయండి, అంతే కానీ లేనిపోని చికాకులు తెప్పించకండి. ఇవేవో ‘బాగ్ బాన్’ సినిమాలో డైలాగ్గులు కావు.వీళ్ళకి సాయం, ఈ తాత గారి తల్లో, తండ్రో ఇంకా జీవించే ఉంటారు.ఇంక ఆ ‘నానమ్మ’ గారి పని ఐపోయినట్లే.మూడు తరాల వారికి సేవ చేస్తూ పుణ్యకాలం గడిపేస్తూండాలి.ఇందులో ఎవరికెవరూ తక్కువ తినలేదు.ప్రతీవారూ ఆవిడ మీద హక్కు జమాయించడం తమ ‘ ఫండమెంటల్ రైట్’ అనుకుంటారు!ఆవిడకీ ఏమేమో కోరికలుంటాయి, ఈ ఇంటికి 40 సంవత్సరాల క్రితం ఎన్నెన్నో కలలు కంటూ, అడుగు పెట్టింది. ఆ కల మాట దేముడెరుగు, కనీస మనశ్శాంతి ఇవ్వడం ప్రతీ కొడుకూ/ కూతురీ విధి.

   ఇంకో ఇంటికి కోడలిగా వెళ్ళిన కూతురు కూడా, తన తల్లితండ్రులు తనకేదో తక్కువ చేశారూ అని అనుకోవడం తప్పు.ఉన్నదంతా కొడుక్కే దోచిపెట్టేస్తున్నారూ అనుకుంటే ఎలాగ? తన ఇంటిలో ఉంచుకోవడానికి, తన భర్త ఒప్పుకోడూ, ఇంక విధి లేక కొడుకు తోనే ఉంటారు, అంతేకానీ వాళ్ళు ఏదో ఉధ్ధరించేస్తారని కాదు.నగరాల్లో అయితే కొంచెం ఫర్వాలేదు, అదే పట్టణాల్లోనూ, చిన్న చిన్న గ్రామాల్లోనూ అయితే,అదికూడా వీలు కాదు.విడి విడి గా ఉంటే, ఊళ్ళో ఉన్న ప్రతీ వాడూ అడగడం–‘ ఏమిటీ, మీకోడలు వేరింటి కాపరం పెట్టించేసిందా?’ అంటూ. ఆ అడిగిన వాడింట్లో ఏదో ‘ఐడియలిస్టిక్’ గా ఉంటోందనికాదు, ఇంకోడి ఇల్లు తగలడిపోతూంటే కలిగే పైశాచికానందం అంతే.ఈ గొడవలన్నీ భరించలేక కొట్టుకుంటూనో, తిట్టుకుంటూనో కొడుకుతో సెటిల్ ఐపోతారు. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఈ పిల్లలు,‘ఫలానా వారి అబ్బాయి‘అనే మీకు సొసైటీలో గౌరవం. మీకంటే 30 ఏళ్ళు ముందర పుట్టి,తనకంటూ ఓ ‘ఇమేజ్’ క్రియేట్ చేసికున్నారు ఆయన. అది గుర్తుంచుకొని దానిని కాపాడడం పిల్లల విధి. చిన్న చిన్న పట్టణాల్లో చూస్తూనే ఉంటాము, ఇప్పటికీ ఏదైనా ఇల్లు చూపించి ఇది ఫలానా వారి ఇల్లూ అంటారు. ఎవరి పేరు తీసికొంటారూ, మీనాన్నగారిది కాదు, మీతాత గారిది. అది ఏ బిల్డర్ కో ఇచ్చేసినా సరే, ఇంకా మీతాతగారి పేరే చెప్తారు.అది విన్నప్పుడల్లా మీ నాన్నగారి( ఈ మధ్యనే రిటైర్ అయి ఆ ఇంట్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రాణి) ఎంత గర్వంగా భావిస్తారో?

   ప్రతీ ఇంట్లోనూ ఇలాగే ఉంటుందనికాదు.నూటికి 80 మందికి ఇంకా తల్లితండ్రుల మీద ప్రేమా అభిమానం ఉంటాయి. వచ్చిన గొడవల్లా ఆ మిగిలిన 20 మంది గురించే.వాళ్ళు ఎలాటి వారంటే ‘ కూసే గాడిదొచ్చి మేసే గాడిదని పాడిచేసింది’ అన్నట్లు, ఆ 80 మంది కాపురాల్లోనూ చిచ్చు పెట్టగల సమర్ధులు.చెప్పానుగా కొడుకు లెక్చరరూ, కోడలు పోస్టాఫీసో, బ్యాంకో- ఈ కోడలు ఎప్పుడైనా ఆఫీసుకి రావడం ఆలశ్యం అయిందా, రెండో రకం ఆవిడ అడుగుతుంది కారణం ఏమిటని.ఈ అమ్మాయి స్వతహాగా మంచిదే కానీ, ఇంకోళ్ళు సానుభూతి చూపేసరికి తను, ఇంట్లో అందరికీ వంట వండి, పిల్లల్ని స్కూలుకి పంపడానికి రెడీ చేసేసరికి తను పడ్డ శ్రమ గురించి చెప్తుంది.

    ఆ మాత్రం చనువిచ్చి, మాట్లాడితే చాలు, అవతలి వాళ్ళు పేట్రేగి పోతారు.
‘ అయ్యో ఇంట్లో రెండు పూటలా నువ్వు వంట చేస్తున్నావా, మా ఇంట్లో అలా కాదు, నాకు ఆఫీసు కెళ్ళాలీ, నాకు టైముండదూ వంటావార్పులకి, అని వచ్చిన కొత్తలోనే చెప్పేశాను.మా అత్తగారే చేస్తారు.నువ్వుకూడా ఊరికే వాళ్ళని నెత్తెంకించుకోకు’ అని ఈ అమాయక్కపిల్లని ‘పాయిజన్’ చేసేస్తుంది. నిజమే కాబోలనుకొని, రోజూ గోడమీదా పిల్లిమీదా ఏవేవో పితూరీలు , దెప్పిపొడవడాలూ మొదలెడుతుంది.ఇంక ఆ ఇంట్లో నలిగిపోయేవాడు కొడుకే. అటు తల్లితండ్రులకి చెప్పాలేడు, ఇటు భార్యని సముదాయించా లేడు. వయా మీడియా గా నానమ్మ గారికి వంట డ్యూటీ పడుతుంది. ‘అరబ్ ఎండ్ ద కేమెల్’ కథలో లాగ తాతయ్య గారికి పిల్లల స్కూలి డ్యూటీ !! శ్రీ మద్రమాణ గోవిందో హరి!! ఇంకా ఉంది

బాతాఖానీ—లక్ష్మిఫణి కబుర్లు-పుత్రోత్సాహం–4

    పెద్ద పెద్ద ఉద్యోగాల్లో పని చేస్తున్న పిల్లల ఇంట్లో ఒకలాగ ఉంటుంది. ఏ గవర్నమెంటు ఉద్యోగమో చేస్తున్నాడనుకోండి, ఆ ఇంట్లో పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఎంత పే కమీషన్లొచ్చి జీతాలు పెరిగినా, ఇంకా వాళ్ళకి ‘ క్రెచ్ కల్చర్’ వంట బట్టలేదు. అందరికీ వేలల్లోనూ, లక్షల్లోనూ జీతాలు రావుగా.అందువలన నగరాల్లో కాకుండా, ఇంకా పట్టణాలలోనే ఉండే పిల్లల ప్రవర్తన వేరేగా ఉంటుంది.

అక్కడ ఏమిటంటే రిటైరు అయిన తండ్రి గారు, మనవడికో, మనవరాలికో ఇన్ ఛార్జ్ గా ఉంటూంటాడు. ఈ చిన్న పిల్లాడు స్కూలినుండి వచ్చినప్పటినుండీ, వీడి ఆలనా పాలనా తాతయ్యా,నానమ్మా చూసుకోవాలి. భార్యా భర్తా ( ఈ చిన్న పిల్లాడి తల్లితండ్రులు)సినిమాలకీ, వగైరాలకి ఠింగురంగా అంటూ ఊరంతా తిరుగుతూంటారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, ఈ పిల్లాడికి తిండి పెట్టడం దగ్గరనుండీ, నిద్రపుచ్చేదాకా వీళ్ళదే బాధ్యత. ఊళ్ళోవాళ్ళు ఎవరైనా అడిగితే, ‘ మా పిల్లాడికి వాళ్ళదగ్గరే అలవాటండీ’ అనడం.దీంతో ఆ పెద్దవాళ్ళ ముందరి కాళ్ళకి బంధం పడిపోతుంది. ‘ ఇమేజ్’ కాపాడుకోవాలిగా !

అప్పుడు వయస్సులోనూ చిన్నవాళ్ళే కావడం తో వాళ్ళ పిల్లలు పెరిగేటప్పుడు ఒళ్ళు వంచ కలిగేవారు. కానీ ఇప్పుడంత పరుగులు పెట్టలేరుగా. ‘సిరి అబ్బకపోయినా చీడ అబ్బినట్లు’ పట్టణాల్లో కూడా, ఈ కేబుల్ టి.వీ ల ధర్మమా అని ‘ కార్టూన్ నెట్వర్క్ లూ’ ‘ పోగో’ లూ వగైరా వగైరాలు మాత్రం అలవాటు అయిపోయాయి. ఈ చిన్న పిల్లలకి అన్నం పెట్టాలన్నా, బోనస్ గా టి.వీ ఉండాల్సిందే. ఈ పెద్దాళ్ళకి విశ్రాంతి దొరికేది ఎప్పుడయ్యా అంటే చిన్న పిల్లలు స్కూలికి వెళ్ళిన ఆ రెండు మూడు గంటలు మాత్రమే. వియ్యాల వారు అదే ఊళ్ళో ఉన్నా సరే,పిల్లల బాధ్యత ససేమిరా తీసికోరు. వాళ్ళ అమ్మా నాన్నా పిల్లలతో వేగలేరని కోడలి ఉద్దేశ్యం. అలాగని అక్కడికి వెళ్ళకుండా ఉంటారా, అబ్బే పదిహేను రోజులకోసారి ఈ పిల్లల్ని ‘ షో కేస్’చెయ్యొద్దూ!

ఇంక ఆ ఇంట్లో ఉన్న తల్లితండ్రుల బాధ పగవాడికి కూడా ఉండకూడదు.ఇంట్లో టైం టేబుల్ అంతా మారిపోతుంది.అక్కడి కుటుంబాలు జనరల్ గా ఎలా ఉంటాయంటే (నేను చూసినవి),భర్త ఏ కాలేజీ లోనో, లెక్చరర్, భార్య ఏ పోస్టాఫీసులోనో, బ్యాంకులోనో పనిచేస్తూంటుంది. వీళ్ళకి ఒక ‘ ఆంఖోం కా తారా’, వాడేమో కాన్వెంటుకో, ప్లేస్కూలుకో వెళ్తూంటాడు.

కోడలు గారికి తమ కుటుంబ భవిష్యత్తు మీద ఒక్కసారిగా ప్రేమ వచ్చేస్తుంది. ఇంక ఇంట్లో ఖర్చులమీదా, బడ్జెట్ లోనూ ‘కాస్ట్ కట్టింగ్’ ఎక్సర్సైజులు ప్రారంభం.మొదటి దెబ్బ ఇంట్లో ఉన్న పెద్దాయనమీద పడుతుంది. రిక్షాలో పిల్లాడిని పంపితే’ అసలే రోడ్లన్నీ ట్రాఫిక్కు తో నిండి ఉంటాయీ’ అనే సాకుతో,ఇంట్లో ఉన్న పెద్దాయనకి డ్యూటీ వేస్తుంది.హాయిగా మీకు ఎక్సర్సైజు గానూ ఉంటుంది,పిల్లాడు సేఫ్ గానూ ఉంటాడూ’అని పిల్లాడిని స్కూలికి దిగబెట్టే డ్యూటీ ఈయనకి పడుతుంది.కాదని ఎలా చెప్పగలడూ,నోరు మూసుకొని ఒప్పుకుంటాడు.ఈ పిల్లాడు స్కూలికి కొత్త మోజులో నడుస్తాడు. ఆ తరువాత పేచీ పెట్టి ఎత్తుకోమంటాడు. ఈయనకా ఓపిక ఉండదు, అలాగని చెప్పలేడూ.ఉన్న చిరాకంతా ఇంట్లో ఉన్న తన భార్య మీద చూపిస్తాడు.

అలాగని ఇంట్లో ఆవిడేమీ సుఖపడిపోవట్లేదు. ఆవిడ దినచర్య ప్రొద్దుటే మొదలౌతుంది. టైముకి కాఫీ తాగడం ఈయనకి నలభైయేళ్ళ నుండీ అలవాటు. అది పడితేనే కానీ ఏమీ చెయ్యలేడు.
తీరా ఫ్రిజ్జి లో చూస్తే పాలుండవు. ఉన్న గ్లాసుడు పాలూ చిన్నాడికి ఇవ్వాలి. రోజూ ఉండే పాలేమయ్యాయంటే, అంతకు ముందురోజు సాయంత్రం వియ్యాలవారు వచ్చారు, వాళ్ళకి కాఫీలూ అవీ ఇచ్చేటప్పటికి పాలు అయిపోయాయి. ఈ సంగతి కోడలు పిల్లకి తెలుసు. అయినా సరే తనకేం పట్టనట్టుగా ఉండిపోతుంది. ఆ పెద్దాయన ఏమైనా మణులు అడిగాడా, మాణిక్యాలు అడిగాడా, జస్ట్ ఓ కప్పు కాఫీ. పాపం దానికి కూడా నోచుకోలేదు.ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఓ ప్యాకెట్టు పాలు ఎక్స్ ట్రా తీసికోవచ్చుకదా.అమ్మో ఇంకేమైనా ఉందా, ఈ పెద్దాళ్ళు నెత్తెక్కేయరూ?

ఆ స్కూలుకెళ్ళే పిల్లాడికి యూనిఫారం అవీ ‘ మమ్మీ’ గారే వెయ్యాలి.వీడుకూడా ఆ తాతయ్యనబడే ప్రాణి తనని స్కూలికి తీసికెళ్ళడం, తిరిగి ఇంటికి తీసికుని రావడం ఒకటే పని అనుకుంటాడు.కొడుక్కీ, కోడలికీ భోజనం పెట్టి, వాళ్ళని పంపించేటప్పటికి ఈవిడకి తల ప్రాణం తోకకి వస్తుంది.ఖర్మ కాలి పని మనిషి రాలేదా, అంతే సంగతులు.అదృష్టం బాగుంటే ఒక్కొక్కప్పుడు
రాత్రి వంట కోడలు చేస్తుంది. ఇంక అక్కడ చూడాలి తినేవాళ్ళు నలుగురైనా సరే బియ్యం బొటా బొటీ గానే పెడుతుంది.ఇంత వయస్సు వచ్చిన తరువాత మరీ భారీగా తింటే అరగదూ అంటూ
ఓ హితబోధా! ఇవన్నీ ఎవరితో చెప్పుకుంటారూ? ఇదో టైపు టార్చరూ
…. ఇంకా ఉంది

.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పుత్రోత్సాహం-3

    ఇదివరకటి రోజుల్లో అయితే చంటి పిల్లలకి ఏమైనా అస్వస్థత చేస్తే, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, వారి అనుభవం ఆధారంగా, ఏదో ఇంటి వైద్యం చేసేవారు. అంతదాకా ఎందుకూ, పసిపిల్లకి,సరీగ్గా జీర్ణం అవక, కడుపునొప్పితో ఏడుస్తూంటే, ఇంట్లోని ఏ పెద్దవాళ్ళో, శుభ్రంగా కాళ్ళు జాపేసికొని, చంటి పిల్లకి, ఆరారగా నూనెతో మర్దనా చేస్తే, ఓ అరగంటలో హాయిగా, కడుపు ఖాళీ అయి నవ్వుతూ కేరింతలు కొట్టేది. ఇప్పుడో అసలు నూనె మాట ఎత్తుతేనే చాలు, గయ్య్ మంటారు.ఇంక కడుపు మీద మర్దనా మాట దేముడెరుగు ! ఏమైనా అంటే, ఇప్పుడు మెడికల్ సైన్స్ బాగా అభివృధ్ధి చెందిందీ, నాటు వైద్యాలు చేయకూడదు,అంటారు.పాపం, ఆ పెద్దవాళ్ళు మొహం చిన్నబుచ్చుకుంటారు.ఇంకొంతమందైతే లాప్ టాప్ తెరిచేసి, నెట్ లో వెదికేసి,పసిపాప ఎందుకేడుస్తూందో, దాని వెనక ‘పాసిబుల్ ‘ కారణాలు ఏమిటో ,ఓ లెక్చర్ ఇచ్చేసి , ఇవతలి వారికి ‘జ్ఞానోదయం’ చేస్తారు.

పోనీ ,పెద్దవాళ్ళూ, ఏదో చెప్తున్నారూ అనుకోవచ్చుగా. వీళ్ళుమాత్రం పసిపిల్లని హింస పెట్టేస్తారా? అబ్బే, ‘పాత’ వాళ్ళకంటె, మనకే ఎక్కువ తెలుసూ,అని ఓ భావం.ఒకటి మర్చిపోతారు, ఆ పెద్దవాళ్ళే వీడిని అన్ని బాలారిష్టాలనుండీ కాపాడేరు ! ఒకసారి అనుభవం అయి ,లెక్చర్ విన్న తరువాత ఈ పెద్దాళ్ళూ, రంగంలోంచి తప్పేసుకుంటారు.అటు పసిపాప గుక్క పట్టి ఏడుస్తూంటే చూడాలేరూ, అలాగని వీళ్ళ మూర్ఖత్వానికి సమాధానమూ చెప్పలేరు.అంతే ‘జీవిత చక్రం’ అలా నడుస్తూనే ఉంటుంది.

ఈ బాలారిష్టాలన్నీ జయించి, ఆ పిల్లో, పిల్లాడో ‘ప్లే స్కూల్ ‘ స్టేజ్ కి వచ్చిన తరువాత ఉంటుంది, అప్పటికి ఆ చిన్న పిల్లో/పిల్లాడో ఈ పెద్దవాళ్ళకి చేరువౌతూంటాడు. ఈ సంగతి వాళ్ళకి ఎవరూ నేర్పరు. సహజంగా వచ్చేస్తుంది.ఎంతైనా రక్తసంబంధం కదా ! తల్లితండ్రుల మాట వినకుండా, ఈ పెద్దవాళ్ళ దగ్గరకు వాళ్ళ పిల్లలు రావడం వీళ్ళకు నచ్చదు.అయినా ఏదో మొహమ్మాటానికి కొంత సేపు నోరు మూసుకు కూర్చుంటారు. అయినా ఎన్నాళు ఇలాగ?

ఇంక ఆ పిల్లో పిల్లాడో ఈ తల్లితండ్రులకి ‘ ఆంఖో కా తారా’ ‘ట్వింకిల్ ఆప్ మై ఐ ‘ ఎట్సట్రా, ఎట్సట్రా….చెప్పానుగా వీళ్ళు తమ పిల్లల్ని ఎంతలా ప్రేమిస్తున్నారో,తమ చిన్నతనం లో ఏమేమి కోల్పోయారో, అవన్నీ తాము తమ ‘ఆంఖో కా తారా’ కి ‘వితౌట్ సెకండ్ థాట్ ‘ ఎలా ఇవ్వకలుగుతున్నారో, క్షణక్షణం గుర్తు చేస్తూ రోజులు గడుపుతూంటారు. ఒక్క విషయం చెప్పండి- వీళ్ళ అమ్మా నాన్నలు ఎలా పెంచారో వీళ్ళకి ఎలా తెలుస్తుందీ? ఆ చిన్న పిల్లతో అవీ ఇవీ కబుర్లు చెప్తూ, చివరికి సబ్జెక్ట్ ఎక్కడకు తెస్తారంటే–‘డాడీ,యు ఆల్సో గాట్ టాయిస్ లైక్ మీ,వెన్ యు వర్ ఆఫ్ మై ఏజ్?’ అనేదాకా.అప్పుడు ఈ పిల్ల తల్లితండ్రులు ‘చూడండి, మా పిల్లకి కూడా తెలిసింది, మీ నిర్వాకం’ అనే అర్ధం వచ్చేలా ఓ చూపు విసిరి,వాళ్ళ పాయింట్ రిజిస్టర్ అయింది కదా అని ఇంకో టాపిక్ లోకి వెళ్తారు.

మరి ఆరోజుల్లో చైనీస్ టాయ్ లు, బార్బీ లూ ఉండేవి కాదు. వీళ్ళు మాత్రం ఎక్కడినుండి పుట్టిస్తారూ? ఓ ఎర్ర చందనం బొమ్మో, తాటాకుతో చేసిన బొమ్మలో, మహా అయితే అబ్బాయికి కర్రతో దొల్లించుకోడానికి ఏ సైకిలు టైరో ఉండేవి. ఏ పుణ్య క్షేత్రానికో వెళ్ళినప్పుడు, చిన్న చిన్న తాటాకు బుట్టల్లో లక్క పిడతలూ.ఇంకొంచెం పెద్ద అయిన తరువాత, సిగరెట్టు పెట్టిలతో కుక్క బొమ్మా లాటివీ. ఏదో పండగొచ్చినప్పుడు కొత్త బట్టలూ, ఇంట్లో మగ పిల్లలు మరీ ఎక్కువైతే ఓకే తానులో బట్టలూ ! ఏ తీర్థానికో వెళ్ళినప్పుడు మిఠాయి కొమ్ములూ, జీళ్ళూ, కారప్పూసా–చిరుతిళ్ళు వీటికి మాత్రమే పరిమితం.అలాగని వాళ్ళూ ఏమీ పేచీ పెట్టేవారు కాదు.ఉన్న దానిలోనే హాయిగా ఆనందించేవారు. ఇక్కడ బాటం లైన్ ఏమిటంటే ‘ కంటెన్ట్ మెంట్’ అని నా ఉద్దేశ్యం.

ఇప్పుడు అలాగ కాదే.ఇంటి నిండా బట్టలూ, పెట్టి నిండా రకరకాల బొమ్మలూ.ఎలెక్ట్రానిక్కూ, మెకానికలూ ఒకటేమిటి మార్కెట్ లో దొరికే అన్ని రకాలూ ఇంట్లో ఉండాలి. ఈ చిన్న పిల్ల అమ్మయౌతే కొన్ని రోజులు ఆడుకుంటుంది పాపం, అదే అబ్బాయైతే ఆ బొమ్మ తన చేతికి వచ్చిన పావుగంటలో దానిని పీకి పందిరేస్తాడు.వందలూ, వేలూ పోసి తెచ్చిన బొమ్మ కాస్తా క్షణాల్లో
ముక్కలౌతుంది. తెచ్చే తాహతు ఆ తల్లితండ్రులకి ఉంది, దానిని ముక్కలు చేసే హక్కు ఆ పిల్లాడికి ఉంది.కానీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి మాత్రం గుండె చెరువైపోతూంటుంది. ఏం అనకూడదూ
ఏదో ధైర్యం చేసి అన్నా కానీ ‘ పోనీ డాడీ, లెట్ హిం ఎంజాయ్, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆడుతాడూ’ అంటారు. ఇంట్లో ఉన్న పెద్దాయన ఏ రిటైర్డ్ టిచరో అయితే పాపం అలవాటు ప్రకారం
-‘ఆడుకోవడం అంటే విరక్కొట్టడం కాదురా అని వాడికి చెప్పొచ్చుగా’ అంటే, ‘మేం విన్నాంగా ఇన్నాళ్ళూ,వదిలేయండి’ అనేస్తారు. ఈ పెద్దాయన చేతిలో వందలాది పిల్లలు చదువులు నేర్చుకొని క్రమ శిక్షణతో పెద్ద అయ్యారు. కానీ ‘పెరటి మొక్క వైద్యానికి పనికి రాదు’ లేక ‘ ఘర్ కీ ముర్గీ దాల్ బరాబర్’ అనుకోవడం తూర్పు కి తిరిగి దండం పెట్టడం!…ఇంకా ఉంది.

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కోనసీమ లో ప్రభల తీర్థం

Prabhala teertham

Read it here

ప్రభల తీర్థం గురించి, ‘సాక్షి ‘ లో ప్రచురించిన వ్యాసం

బాతాఖానీ–లక్ష్మిఫణి కబుర్లు–పుత్రోత్సాహం –2

    కాలేజీ చదువులలో ఉండగానే అబ్బాయికీ, అమ్మాయికీ కూడా లోకంలో ఉన్న ‘ నిన్న లేని అందాలేవో’ కనిపించడం మొదలెడతాయి. అప్పటిదాకా ‘పార్వతీ పరమేశ్వరుల్లాగ’ ఉన్న తల్లి తండ్రులు అంటే కొంచెం ‘ బోరు’ కొట్టడం ప్రారంభం అవుతుంది. అబ్బా ఎప్పుడూ వీళ్ళేనా అనిపిస్తుంది.కొంచెం కొంచెంగా ప్రాపంచిక విషయాలలో ఆసక్తి పెరగడం కూడా మొదలౌతుంది. కాలేజీ చదువుల్లో ఉన్నాడు కాబట్టి మరీ బరి తెగించేయడు.ఇంకా కొద్దికాలం తండ్రి ‘ఆర్ధిక సహాయం’ మీదే బ్రతకాలిగా, అందుకూ !

కాలేజీ చదువులు పూర్తి అయి ఉద్యోగంలో చేరేటప్పటికి ‘ఆర్ధిక స్వాతంత్రం’కూడా వచ్చేస్తుంది.సడెన్ గా ఓ రోజు అమ్మాయైతే ఫలానా అబ్బాయంటే ఇష్ట పడుతున్నానూ అంటుంది.ఈ విషయంలో అమ్మాయికి తండ్రి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది.కారణాలు ఏమైనా ఇష్టపడిన అబ్బాయితో వివాహం చేసేస్తారు. ఇంక ఇంట్లో మిగిలేది అబ్బాయి ఒక్కడే.వీడు కూడా చదువు పూర్తి అవగానే, ఓ ప్రకటన చేసేస్తాడు.ఫలానా అమ్మాయంటే ఇష్ట పడుతున్నానూ అంటూ.అమ్మాయికే చేయగాలేనిది, అబ్బాయి విషయంలో ఎందుకు కాదనడం అనుకుంటారు తల్లితండ్రులు. పెళ్ళి అయినప్పటినుంచీ, ఆ వచ్చిన అమ్మాయే లోకంగా ఉంటాడు. ప్రపంచంలో ఇంకేదీ కనిపించదు.
ఇక్కడ తండ్రి అనుకుంటాడూ, ‘మనం కూడా పెళ్ళి అవగానే ఇలాగే ఉన్నాము కదా’ అనుకొని సరిపెట్టేసుకుంటాడు.తను ఈ పాతికేళ్ళూ, ఏం చేశాడో అప్పుడు గుర్తుకు రావడం మొదలెడతాయి. దేముడు మన తల రాతలు రాసేసి ఈ భూలోకంలోకి పంపుతాడు–మనం మన తల్లితండ్రులకి ఏం చేశామో అది మన పిల్లలు మనకి చేస్తారు.ఇందులో ఆశ్చర్యపడఖ్ఖర్లేదు.
పిల్లలు మనకేదో చెయ్యడం లేదూ అని ఏడవడం కంటే, మనం మన తల్లితండ్రులకి ఏం చేశామో గుర్తుతెచ్చుకుంటే అసలు గొడవే ఉండదు.అసలు సమస్యలు ఎప్పుడు వస్తాయంటే, ఈ విషయాలు మర్చిపోయి, ‘పెళ్ళైన తర్వాత మనం అల్లం, పెళ్ళాం బెల్లం అయిందీ’ అని ఏడ్చినప్పుడు.

పిల్లల పెళ్ళిళ్ళు అవడంతోటే ఈ యజ్ఞం పూర్తి అవదు. వాళ్ళ పురుళ్ళూ అవీకూడా చూసుకోవాలి కదా. ఇదివరకటి రోజుల్లో అయితే మొదటి పురుడు అమ్మాయి వైపు వారు పోసేవారు. ఇప్పుడు అందరూ తెలివిమీరి పోయారు. యువజంటలు ఒకళ్ళనొకరు వదలి ఇదివరకటి లాగ చాలా రోజులు ఉండలేరు.అమ్మాయి తల్లితండ్రులు కూడా, ‘పోన్లెండి, అక్కడే పోసేయండి, ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా తక్కువే’ అంటూ,గొడవ వదిలించుకుంటారు. ఏదో చుట్టపు చూపుగా పురిటి రోజుకి వచ్చి, ఇరవై ఒకటో రోజు దాకా ఉంటే సరిపోతుంది.ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగాల ధర్మమా అని ఓ సౌలభ్యం వచ్చింది ఈ రోజుల్లో, పురిటి ఖర్చులు చాలా భాగం కంపెనీ ఇన్స్యూరెన్స్ లో కవర్ అవుతోంది.మిగిలిందేదో పెట్టుకుంటే సరిపోతుంది.

ఇంట్లో ఓ పిల్ల ( ఆడైనా సరే, మొగైనా సరే) వచ్చిందంటే చాలు, ఆ పిల్లే లోకంలా పెంచుతారు. మిగిలిన విషయాలూ, మిగతా వారూ ‘ టు హెల్ విత్ దెం’. చిన్నప్పుడు వాళ్ళు ఏమేం కోల్పోయారో, అవన్నీ తమ బేబీకి ఎలా సమకూర్చుకోగలమో, క్షణక్షణం ఈ తల్లితండ్రులకి గుర్తుచేస్తూంటారు. ఒక్క విషయం మర్చిపోతూంటారు–తన తల్లితండ్రులు కూడా,తమ కున్నంతలో పిల్లలకే పెట్టారు. ఒక్కొక్కప్పుడు అప్పైనా చేసి పిల్లల్ని సుఖపెడతాడు.ఏ తల్లీ తండ్రైనా ఇంతే. ఎప్పుడైనా ఎక్కడైనా ఇది జగమెరిగిన సత్యం. అయినా మైకం కమ్మేసి, తమకేదో తక్కువయ్యిందీ,తమ పిల్లలు అలాగ పెరగకూడదూ,తమని ప్రెండు లా చూసుకోవాలీ ( ఒకటి చెప్పండి, తన తల్లితండ్రులు వీడిని ఫ్రెండు లాగ చూసుకోపోతే వీళ్ళ పెళ్ళి అయేదా!).

ఇంట్లో కొత్త మెంబరు వచ్చినప్పటినుండీ ఇంక హడావిడి మొదలు. ఆ బిడ్డ అడిగితే ‘కొండ మీద కోతి’ అయినా వచ్చేస్తుంది.ఇంట్లో అందరికీ డిసిప్లీన్ నేర్పేస్తారు. పైగా ఇవన్నీ ఆధునిక పధ్ధతుల్లో మరీనూ! అందరూ ఇంగ్లీషులోనే మాట్లాడాలి, ప్రతీ దానికీ థాంక్యూ చెప్పాలి,అందర్నీ అంకులూ, ఆంటీ యే అని పిలవాలి ( చివరకి వాచ్ మెన్,చాకలి కూడా అంకులే). ఏదో మనల్ని మాత్రం మరీ ‘గ్రాండ్ పా’ ‘ గ్రాండ్ మా’ అనకుండా ఏదో ‘తాతయ్యా’ ‘ అమ్మమ్మా/ నానమ్మా’ అని పిలవడానికి పెర్మిషన్ ఇస్తారు. మళ్ళీ వాళ్ళని ‘ మమ్మీ, డాడీ’ అనే పిలవాలి. లేకపోతే ఎంత సిగ్గుచేటూ!పోన్లెండి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని పిలవ్వలసినట్లే పిలుస్తున్నారుగా, ఇంకోళ్ళని ఎలా పిలుస్తే వీళ్ళకెందుకూ? ఇదిగో ఇక్కడే వస్తాయి గొడవలు, అవసరం లేని చోట్ల తల దూర్చడం, అందరిచేతా చివాట్లు తినడం. ఛాన్స్ దొరికింది కదా అని ‘తాత’ గారి భార్య కూడా ‘ఓ రాయి’ వేస్తుంది.నలభయేళ్ళు ఈయనతో మాటలో మాటా, చూపులో చూపూ కలిపిన భార్య కూడా అవతలి పార్టీ లో చేరుతుంది–‘ మీకెందుకూ వాళ్ళకి కావల్సినట్టుగా పెంచుకుంటారు’అంటుంది. ఇక్కడే ‘తాత’ గారికి మొదటి దెబ్బ.….. అప్పుడే ఎక్కడ అయింది.ఇంకా ఉంది.

బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు- N.R.A s

   ఎన్.ఆర్ ఏ అంటే తెలుసుగా, నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్! ఎన్.ఆర్.ఐ అయే అదృష్టం ఎలాగూ లేదు, పోనీ ఇలాగైనా ఓ కొత్త టైటిల్ పెట్టుకుని సంతోషిద్దామని ఉద్దేశ్యం!పుట్టింది ‘కోనసీమ’ అయినా, గత 47 సంవత్సరాలనుండీ, ఆంధ్ర ప్రదేస్ కి బయటే ఉంటున్నాము. ఉద్యోగ రీత్యా ఇక్కడే ఉండడం వలన, మన ప్రాంతంలో కట్టుకున్న ఇల్లూ,నాన్నగారి ద్వారా వచ్చిన ఇల్లూ అమ్మేసి, పూణే లోనే స్థిర పడ్డాము. నేను ఇక్కడే ఉన్నాను కదా అని మా అమ్మాయీ, అబ్బాయీ కూడా ఇక్కడే స్తిర పడ్డారు. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, మాకు ‘ఎన్.ఆర్.ఏ’ టైటిల్
పూర్తిగా అన్వయించుకోవచ్చు.

47 సంవత్సరాలనుండీ ఇక్కడే ఉన్నా తెలుగు భాష మీద అభిమానం ఏ మాత్రం తగ్గలేదని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ ఇంటర్ నెట్ ధర్మమా అని తెలుగు గురించి ఉన్న చాలా సైట్లు రోజూ చూస్తూంటాము. ఇప్పటికీ పూణే లో ఏ తెలుగు మాట వినిపించినా పరిచయం చేసికుంటాను. 42 ఏళ్ళ సర్వీసు లోనూ తెలుగువాడినని సగర్వంగా చాటుకుంటూ,మిగిలిన భాషల వాళ్ళకు ఏమాత్రం తక్కువ కానని కాలరు ఎత్తుకుని మరీ తిరిగాను. ఇదేదో నేను ఏమేమో గొప్ప పనులు చేసేశానని కాదు.నేను చెప్పేదేమిటంటే మన ‘తెలుగు అస్థిత్వాన్ని’ అడుగడుగునా,అందరికీ చూపించకలిగాను.ఇప్పటికీ కొత్తగా వచ్చిన తెలుగు వారితో పరిచయం అయినప్పుడు, వాళ్ళు ‘నేను రమారమి 50 ఏళ్ళనుండీ ఇక్కడే ( మహారాష్ట్ర) లో ఉంటూ కూడా తెలుగు చక్కగా మాట్లాడ కలుగుతున్నానని! అంటే నేనంటానూ ‘ మాట్లాడలేక పోవడానికి ఏం రోగం? భోజనం ప్రతీ రోజూ ఎలా చేస్తున్నామో, ఊపిరి ప్రతీ క్షణం ఎలా పీలుస్తున్నామో, తెలుగు మాట్లాడడం, చదవడం కూడా అలాగే. అమ్మని ఎవరైనా మరచిపోతారా?‘అంటూంటాను.

రిజర్వు బ్యాంకు డెప్యూటీ గవర్నర్ గా పనిచేసిన శ్రీ బుర్రా వెంకటప్పయ్య గారి నుండి, ప్రస్తుత గవర్నర్ శ్రీ దువ్వూరి సుబ్బారావు గారి దాకా, ఎంతమందికి మన కరెన్సీ నోట్లమీద సంతకం చేసే అదృష్టం వచ్చింది? వారు ‘మన తెలుగు వారు’ అని గర్వంగా చెప్పుకున్నాము. జాతీయ పతాక సృష్టి కర్త శ్రీ పింగళి వెంకయ్య గారి పేరు వినగానే ఒళ్ళు పులకరిస్తుంది.ఎన్నెన్నో రంగాల్లో
దేశ విదేశాల్లో మన తెలుగు వారు ఎంత పేరు తెచ్చుకున్నారో! ఏ రంగం తీసికొన్నా అందులో తెలుగు వారి ప్రత్యేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది!

బయటి రాష్ట్రాల్లో ఉంటూ మన ఉనికిని సగర్వంగా చెప్పుకున్నాము. ఆఖరికి మహారాష్ట్రలో ‘శివసేన’ ఉద్భవించినప్పుడు కూడా, తెలుగు వారి మీద ఎవరూ వేలెట్టి చూపలేదు.ఇక్కడికి వచ్చిన కొత్తలో అంటే 1963 లో అందరినీ కలిపేసి ‘మద్రాసీ ‘ అనేవారు. వాళ్ళకి మేము ‘మద్రాసీలు’ కాదురాబాబూ,అని ఒప్పించడానికి తల ప్రాణం తోకకి వచ్చేది. కానీ, రోజులు గడిచేకొద్దీ, వివిధ రంగాల్లో మన తెలుగు వారు చేసిన ఉత్కృష్ట కార్యాల వల్ల ఇంకా పరువు ప్రతిష్ఠలు పెరిగాయి.

శ్రీ ఎన్.టీ.ఆర్ గారి ధర్మమా అని జాతీయ స్థాయిలో కూడా మన పేరు మ్రోగిపోయింది.’తెలుగు’ అన్నా ‘తెలుగు వాడు’ అన్నా అందరికీ తెలిసింది. దేశం లో హిందీ తరువాత తెలుగు మాట్లాడే వాళ్ళే ఎక్కువ. సాప్ట్ వేర్ లో కూడా మనవాళ్ళే ఎక్కువ.

ఇదంతా 2008 చివరి దాకా ఉన్న పరిస్థితి. రామలింగరాజు అనే దౌర్భాగ్యుడు వీటన్నింటికీ ‘చరమ గీతం’ పాడేశాడు.2008 డిశంబర్ తరువాత మన తెలుగు రాష్ట్రానికి ఏదో ముసలం పట్టింది.ఒక్క రోజూ ప్రశాంతంగా ఉండడం లేదు. దీనికి సాయం, మొన్నటిదాకా తెలుగు వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడ్డానికి, మాట్లాడదానికీ ధైర్యం లేని ప్రతీ వాడూ, మనమీద జోక్కులు వేస్తున్నాడు. ఎక్కడైనా ఏదైనా ‘ప్రాడ్’ జరిగితే దాని వెనకాల ‘తెలుగు వాడి’ చెయ్యి ఉందంటున్నారు.పైగా ఏదైనా జరిగితే, ‘ఓహో వీడు గత నాలుగేళ్ళగా ఆంధ్రా లో ఉండి వచ్చాడుగా, ఏదో నేర్చుకునే ఉంటాడులే’ అనే దాకా వచ్చిందంటే మనం,మన రాష్ట్రం దాని పేరు ప్రతిష్టలూ ఎంత దిగజారిపోయాయో ఊహించుకోండి.

తెలుగు భాష మీదా, తెలుగు వాతావరణం మీదా అభిమానంతో రిటైర్ అయిన తరువాత రాజమండ్రీ లో అపార్ట్మెంట్ అద్దెకు తీసికుని మరీ ఉండొచ్చాను. ఆ ఏణ్ణర్ధం నా జీవితం లో అమూల్యమైన మధురమైన క్షణాలు.ఇప్పుడేమనిపిస్తోందంటే,మంచిదయింది, సరైన సమయంలో పిల్లల దగ్గరకు వచ్చేశామూ అని.నాకు అలాటి భావన వస్తుందని కలలో కూడా అనుకో లేదు.
ఇప్పుడు ఆంధ్ర దేశం లో ఉండకపోవడం మా అదృష్టం అనుకుంటున్నాము.ఇక్కడే పుట్టి పెరగడం వల్లైతే కానీండి, వాళ్ళకి ఆసక్తి ఉండడం లేకపోవడం వల్ల కానీండి, మా అశ్రధ్ధ వల్లైతే కానీండి,
వాళ్ళు తెలుగులో మాట్లాడతారు కానీ, చదవ లేరు.పోన్లే మనకింతే ప్రాప్తం అనుకుని, పోనీ తెలుగు గురించీ,తెలుగు వారు చేసిన ఉత్కృష్ట కార్యాల గురించీ ఛాన్స్ దొరికినప్పుడల్లా లెక్చర్ ఇచ్చేవాడిని. ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి చూసి,వాళ్ళకి కూడా లోకువయ్యాము.

ఎప్పటికైనా మన పరువూ, ప్రతిష్ఠా తిరిగొస్తాయా? మేము తెలుగు వారము,అని సగర్వంగా చెప్పుకునే రోజు త్వరలో రావాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పుత్రోత్సాహం-1

   ఇదివరకటి రోజుల్లో ‘పుత్రోత్సాహం’ అంటే, ఏ తండ్రికైనా పుత్రుడు పుట్టినప్పుడు కానీ, ఆ పుత్రుడు ఏదైనా ఘనకార్యం చేసినప్పుడు పొందే ఉత్సాహాన్ని అని చెప్పేవారు. కాల క్రమేణా ఈ నిర్వచనం మారింది. కొడుకు అనబడేవాడు 18 సంవత్సరాలదాకా తల్లితండ్రులు చెప్పే మాటలు వింటూంటాడు. అవసరం అనండి, మానసిక పరివర్తన చెందకపోవడం అనండి-ఏదైతేనే అమ్మా నాన్నలు వాడికి పార్వతీ పరమేశ్వరులకి మారుపేరులా ఉంటారు.

   ఆ తరువాత తండ్రి చెప్పిన కాలేజీలో చేరి, అప్పుడు కూడా పాపం అదే (అంటే పార్వతీ పరమేశ్వరులూ ఎట్సట్రా..) భావంలో ఉంటాడు.ఇక్కడ తండ్రికూడా,తన కొడుకు ఏదో చదివేస్తున్నాడూ, పెద్ద అయిన తరువాత ఏదో ఉధ్ధరించేస్తాడూ అనుకుంటూంటాడు.ఊళ్ళో వాళ్ళ ప్రవర్తన కూడా దీనికి తోడౌతుంది. కనిపించినప్పుడల్లా ‘మీకేంటండీ అబ్బాయి పెద్ద చదువులు చదివేస్తున్నాడూ, ఉద్యోగంలోకి వచ్చేడంటే మీకేం లోటూ’ లాటి డయలాగ్గులు వింటూంటాము.తల్లికి కూడా ఏ పేరంటానికి వెళ్ళినప్పుడో ఇలాటివే వినిపిస్తూంటాయి, ‘మీకేమిటండీ,ఇద్దరే పిల్లలూ,అమ్మాయి పెళ్ళి చేసేశారూ, త్వరలో కోడలుకూడా వచ్చేస్తుంది, కాలు మీద కాలేసికొని ఉండడమే.ఎంతమందికి ఈ అదృష్టం పడుతుందీ’అంటూ..

   పాతకాలంలో అయితే ఇంటికి ఓ ఆరుగురికి తక్కువ కాకుండా పిల్లలుండేవారు. నలుగురు మగ పిల్లలనుకోండి–ఇంక ఆ తండ్రి పగటికలలు కంటూ’అబ్బా రిటైర్ అయిన తరువాత నలుగురి దగ్గరా తలో మూడు నెలలు గడిపినా మన రోజులు వెళ్ళిపోతాయీ’అనుకుంటాడు.ఇప్పుడైతే న్యూక్లియర్ కుటుంబాల ధర్మమా అని, మొదటి రెండు కాన్పులూ ఏ ఆడపిల్లో అయితే
మూడోసారికి ప్రయత్నం. అందుకని ఎక్కడ చూసినా ఇద్దరూ ఒక్కొక్కప్పుడు ముగ్గురూ.అంతే. ఈ ఫాషన్ మా రోజుల నుండీ వచ్చేసింది.పైగా దీనిని సమర్ధించుకోవడమొకటీ, ఇద్దరైతే వాళ్ళకి కావలిసినవన్నీ ఇవ్వొచ్చూ అంటూ, అక్కడికి మన తల్లితండ్రులు ఏదీ ఇవ్వలేదన్నట్లూ.ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు, నలుగురు బడుధ్ధాయిలకి చదువు చెప్పించారు, వాళ్ళ తండ్రి దగ్గరనుండి వచ్చిన ఇంటిని ఏ తాకట్టూ పెట్టకుండా నిలబెట్టారూ. ఒక్కొక్కప్పుడైతే వీళ్ళే ఇల్లూ అదీ ( అదికూడా ఇప్పటి లాటి అగ్గిపెట్టెల లాటివి కాదు) కట్టుకునేవారు. ఇంకా ఏం చేయాలిట?

    ఈ రోజుల్లో ఎవడికైనా ఈ ధైర్యం ఉందా? నేను ఏదో పేద్దపేద్ద ఆస్థులున్నవాళ్ళగురించి కాదు చెప్పేది.మామూలు ఉద్యోగాలు చేసినవారి గురించి. దేనితోనో మొదలెట్టి దేంట్లోకో వెళ్ళిపోయాను.పైగా ఏమైనా అంటే ఇప్పుడు ఖర్చులు ఎక్కువా, అవసరాలుకూడా పెరిగాయీ అంటూ ఓ కుంటిసాకులొకటి. వాటికి తగినట్లుగా జీతాలూ భత్యాలూ పెరిగాయిగా! ఆ విషయం కన్వీనియెంట్ గా పక్కకు పెట్టేస్తాము. ఇదంతా ప్రస్తుత తరం గురించనుకోకండి, మా రోజుల్నుండీ ఈ జాడ్యం మొదలయింది.ఇప్పుడు ఆలోచిస్తే నేనేం చేశాను, మా తల్లితండ్రులకి? మా నాన్నగారు ఎప్పుడూ మా దగ్గరకు వచ్చి ఉంటాననలేదు. పొనీ అలాగని నేనెప్పుడైనా వాళ్ళని అడిగేనా? అబ్బే లేదు.ఆఖరికి నా దగ్గరకు వచ్చి ఉందామనుకునే వేళకి ఈ లోకంలోంచే వెళ్ళిపోయారు.ఇప్పుడనుకొనీ ఏం లాభం?అలాగని అందరూ అలాగే ఉంటారని కాదు నా ఉద్దేశ్యం. నూటికీ, కోటికీ ఎక్కడో ఉండేఉంటారు తల్లితండ్రుల్ని ఇంకా ‘పార్వతీ పరమేశ్వరుల’లాగ చూసుకునేవారు. ఇందులో కూడా కొన్ని కొన్ని‘మతలబులు’ ఉండే ఉంటాయి. ఇదివరకటి రోజులైతే ఆలోచించకుండా నమ్మొచ్చు. కానీ ఇప్పటి కాల ,మాన పరిస్థితుల్ని బట్టీ, ఇప్పటి ‘పొల్యూషన్ ఆఫ్ మైండ్’ ని బట్టీ నమ్మడం కష్టం. దీనిని ‘పొల్యూషన్ ఆఫ్ మైండ్’ అంటే ఇప్పటివారు కోప్పడొచ్చు.’సర్కమస్టెన్సెస్’ని బట్టి కుదరడంలేదూ అంటారు. ఏ రాయైతేనే బుర్ర పగలుకొట్టడానికి….. ఇవాళ్టికి ఇది చాలు..రేపు ఈ ‘పుత్రోత్సాహం’ నేను విన్న నిర్వచనం వ్రాస్తాను.

%d bloggers like this: