బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- పుత్రోత్సాహం-7

    ఇంట్లో ఉన్న పెద్దాయన భార్య కొడుకూ,భర్త ల మధ్య నలిగిపోతుంది. ఎవరూ తన మాట వినరు. కొంచెం తెలివైనావిడైతే ‘పోన్లెద్దూ వాళ్ళే ఊరుకుంటారు’ అని వదిలేస్తుంది. ఇంకో గొడవుందండోయ్- 40 సంవత్సరాలూ నిరాటంకంగా ప్రతీ రోజూ, కాఫీ త్రాగుతూ ఆరోజు పేపర్ చదవడం, మన గురువుగారి అలవాటు. ఇప్పుడలాగ కాదే-నాన్నగారు కూడా చదువుతారని ఇంకో రెండు మూడు వెరైటీల పేపర్లు తెప్పిస్తాడు. ఆఫీసు కెళ్ళే ముందర ఓ సారి చదివేద్దామని, పేపరు వచ్చీ రాగానే చేతిలోకి తీసికుంటాడు.అక్కడే వస్తుంది మన పెద్దాయనకి కోపం, ‘ అదిగో పేపరు చదవడానికి కూడా నోచుకోలేదూ’అని. పోనీ అబ్బాయీ, కోడలూ ఆఫీసు కి వెళ్ళిన తరువాత సావకాశంగా చదువుకోవచ్చుగా, అబ్బే వంతుల వీరయ్య లాగ తనుకూడా ముందరే చదివేయ్యాలి !

    ఇంటికి అబ్బాయి స్నేహితులో, కోడలు స్నేహితులో వచ్చినప్పుడు చూడాలి- వాళ్ళదారిని వాళ్ళని ఖబుర్లు చెప్పుకోనీకుండా, అక్కడే ఓ కుర్చీ లో కూర్చొని, వాళ్ళు మాట్లాడే ప్రతీ విషయం లోనూ తలదూర్చడం. ఒప్పుకున్నామండీ, ఈయనకి అనుభవం చాలా ఉంది, ప్రపంచంలో ఉన్న ప్రతీ విషయమూ తెలుసు, అయినా ఈయనకెందుకూ ఆ పిల్లల గొడవలూ? ఆ వచ్చినవాళ్ళు ఈయన గొడవ భరించలేక, అనుకున్నదానికంటే ముందరే వెళ్ళిపోతారు. పెద్దాళ్ళకి సంబంధించిన స్నేహితులెవరైనా వచ్చినప్పుడు, ఈ పిల్లలు అక్కడ కూర్చొంటారా?

    ఎప్పుడైనా బయట తిందామని అనుకొని కారులో అమ్మా, నాన్నల్ని బయటకు తీసికెళ్తారు. అటువంటప్పుడు కొంచెం ఈ పెద్దాళ్ళకి ఇబ్బందౌతూంటుంది. ఆ కారులో, తమ చిన్న పిల్లకి ఓ ‘బేబీ సీట్’ లాటిది పెడతారు.ఈ ‘కుర్చీ’ వల్ల పెద్దాళ్ళిద్దరూ సర్దుకొని కూర్చోవడం కొంచెం కష్టమైన పనే !అదీ మరీ దూర ప్రయాణమైతే ఇంకా కష్టం. రెండు మూడు సార్లు చూసిన తరువాత, ఇంక మేం రాలేమూ, మీరే వెళ్ళండిరా అని తప్పించేసుకుంటారు.ఇలాటప్పుడు కొడుకు అనుకుంటాడూ,’ అమ్మా నాన్నలకి మాతో రావడం ఇష్టంలేదూ’అని, అంతేకానీ అనుభవిస్తున్న అసౌకర్యం వాడు అడగడూ, వీళ్ళు చెప్పరూ.

    పిల్లలు ( అమ్మాయైనా, అబ్బాయైనా) తమ తల్లితండ్రుల్ని ఎలాటి కష్టం పెట్టకూడదనే అనుకుంటారు. వచ్చిన గొడవల్లా ఒకరినొకరు అర్ధం చేసికోవడంలోనే.వీళ్ళు లక్జరీ అనుకునేది ఆ తల్లితండ్రులకి ‘యూస్ లెస్’ గా అనిపిస్తుంది.ఊరికే డబ్బు తగలేస్తున్నారూ అనిపిస్తుంది.
Children’s intentions are very Noble. The problem lies in execution.
అనిపిస్తుంది నాకైతే.
….ఇంకా ఉంది

%d bloggers like this: