బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-తిరుమలలో సీ.డీ.ఆవిష్కరణ సభ

   రెండు రోజులనుండి ఊరించారు లతామంగేష్కర్ పాడిన అన్నమయ్య సంస్కృత కీర్తనల సీ.డీ. ఆవిష్కరణ గురించి. ఓ అరగంట ఆలశ్యం అయినా ఎలాగో మొదలెట్టారు. మనల్ని బోరుకొట్టడానికి, ముందుగా రాళ్ళబండి ఆయన మైకు చేతిలో పుచ్చుకుని మనల్ని బాదేశాడు. ఆయన ఏం చెప్తున్నారో, ఎందుకు చెప్తున్నారో అసలు ఎవరికీ అర్ధం అవలేదు. ఒక మాటకీ,ఇంకో మాటకీ సంబంధం లేదు.ప్రసంగం కాకుండా మిగిలినవి మాట్లాడేటప్పుడు, మైక్ స్విచ్ ఆఫ్ చేయాలనికూడా తెలియదు.‘ ఒరే గవర్నరు గారికి కుర్చీ లెదర్రోయ్, తీసికుని రండి..’ లాటి వ్యర్ధ డైలాగ్గులు వినే భాగ్యం కలిగింది. అసలు ఇలాటి కార్యక్రమాలు చేయడానికి ఎందరో మహానుభావులు-శ్రీ ఎస్.పి. శ్రీమతి సునీత లాటివారుండగా వీళ్ళందరూ ఎందుకు మనని బాధ పెడతారో? ఆయన ‘తెలుగు వెలుగు’లాటి టీ.వీ. కార్యక్రమాల్లో పద్యాలు చదవడం వరకూ ఓ.కే. సంబంధం లేని కార్య్క్రమాల్లో వేలు పెట్టకూడదు.ఏం మాట్లాడాలో ముందుగా ఓ కాగితం మీద వ్రాసుకుని వచ్చినా బాగుండేది.

   ఇంకో నమూనా-తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి అద్యక్షుడు (లోక్ సభలో తెలుగు దేశాన్ని ముంచేసి కాంగ్రెస్ ని రక్షించిన లిక్కర్ బేరన్) ఆదికేశవులు నాయుడు– ఈయనకున్న క్వాలిఫికేషన్ ఏమిటో ఎవరికీ తెలియదు.ఆయన పదిహేను నిమిషాలు మనల్ని పెట్టిన హింస పూర్తి అయిన తరువాత అమ్మయ్యా అనిపించింది. ఏ భాషా సరీగ్గా మాట్లాడలేడు. అసలు ఎందుకొచ్చిన గొడవా తనకొచ్చిన తూఠీ ఫూఠీ తెలుగులోనే మాట్లాడొచ్చుగా. ఇంగ్లీషు,హిందీ ఓటీ.రైల్వే వాళ్ళ అనౌన్స్మెంట్లలాగ. రాళ్ళబండాయన లతా మంగేష్కర్ పాడినవి 50,000 పాటలన్నారు. ఆదికేశవులు 25000 అన్నారు! వీ.ఏ.కే రంగారావుగారిని అడగాలి !! పైగా రోశయ్య గారు మాట్లాడినది ఈ ఆదికేశవులు ట్రాన్సిలేట్ చేసి చెప్దామనుకున్నట్లు కనిపించింది! అదృష్టం కొద్దీ గవర్నర్ గారు చెప్పినట్లున్నారు.బ్రతికిపోయింది !!
అందరిలోకీ నరసింహన్ మాట్లాడింది బాగుంది.’ ఇక్కడ ఉన్న మేమంతా ఏదో ఓ పొజిషన్ వల్ల వచ్చామూ, మీరు ( లతా జీ ని ఉద్దేసించి) ఒక్కరే స్వశక్తి మీద ఉన్నవారూ అని. ఇంక లతామంగేష్కర్ పాడినదేదో వినలేదు.సీ.డీ కొంచెం విన్నాము.ఫర్వాలేదు. ఎంత ‘ భారత రత్న’ అయినా, ఇంకో భారతరత్న ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పాడినట్లుగా అనిపించలేదు. ఇటుపైన అయినా రాళ్ళబండి వారూ, ఆదికేశవులు లాటి వారూ మన మానాన్న మన్ని వదిలేస్తే సీ.డీ లు విని ఆనందిస్తాము.అసలు హీరో ‘డాలర్’ శేషాద్రి. ఆయనొక్కడే ఇందుగలడందులేడని అన్నట్లు ప్రతీ చోటా కనిపిస్తాడు.

%d bloggers like this: