బానిఖానీ-లక్ష్మిఫణి కబుర్లు

    మొన్న మా అబ్బాయి స్నేహితుడి వివాహ రిసెప్షన్ కి వెళ్ళాము.అక్కడ అందరూ చిన్నవాళ్ళే ఉంటారూ,నేనేం చెయ్యడం అనుకున్నాను ముందుగా.పెళ్ళికూతురు వారివైపు, మిలిటరీ లో(ఏ.ఎం.సి) లో పనిచేస్తున్నారు.దానితో అక్కడ ఉన్నచాలా మంది సూట్లలోనూ,మెడలో టై తోనూ ఉన్నారు.వారెవరితోనూ పరిచయం లేదు.ఇంకో సంగతి ఏమంటే ఇలాటి రెసెప్షన్లలో,అదీ మిలిటరీ వారైతే వాతావరణం అంతా ‘ఫార్మళ్ గా ఉన్న ఓ ఫీలింగొకటి వస్తుంది. అక్కడ నాలాటివాళ్ళు ఇమడలేరు.వచ్చిన వారిలో పై ఆఫీసరు అయితే ఇంక ఈ క్రిందివాళ్ళందరూ,నోరుమూసుకునే కూర్చోవాలి.ఆ పెద్దాయన ఏం మాట్లాడితే దానికి ‘హా హా హా’ అంటూ ఆర్టిఫిషియల్ నవ్వులూ, ‘హాజీ’ అంటూ ఉండడమే.
ఎవర్ని చూసినా వారి చుట్టూరా వారి క్రిదది ర్యాంకు వారే ఉన్నట్లుగా కనిపించింది!ఎక్కడ చూసినా నవ్వులే.ఈ బ్లాగ్ చదివేవారిలో ఎవరైనా మిలిటరీ వారుంటే నన్ను కోప్పడకండి. ఏదో నాకు అనిపించింది వ్రాశాను.మిలిటరీ వాళ్ళు, ఇది ఎంత నిజమనిపించినా పైకి చెప్పుకోలేరు!

    మా అబ్బాయి నన్ను వాడి స్నేహితులకందరికీ పరిచయం చేశాడు. వాళ్ళు కూడా మొహమ్మాటానికి ‘హాయ్

అంకుల్ ‘ అంటూ ఓసారి పలకరించేశారు.ఇంక మనకేమీ పని లేదనుకుని, మా మనవరాలు నవ్య తో కాలక్షేపం చేద్దామనుకుంటుండగా, మా వాడి స్నేహితులు అందరూ లైన్లో నిలబడి,’అంకుల్, మీరు చేసే మిస్టరీ షాపింగ్ గురించి, హరీష్ మాకిప్పుడే చెప్పాడూ, ప్లీజ్ మాక్కూడా చెప్పండీ’అంటూ ఇంక నన్ను ఓ గంట దాకా వదిలిపెట్టలేదు. నేను చెప్పిందంతా శ్రధ్ధగా విని, అందులో ఏమైనా డౌట్లుంటే క్లియర్ చేసికొని వెళ్ళారు.అక్కడంతా నేను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిపోయాను.
వినేవాళ్ళుంటే ఇంక నన్ను పట్టుకోవడం ఎవరి తరమూ కాదు!!అందులోనూ ఈ మిస్టరీ షాపింగుల ధర్మమా అని ఈ విద్యోటి వంటపట్టేసింది.అడగనివాడిది పాపం!!అర్రే రెండు గంటలైపోయిందా అనిపించింది! అంత హాయిగా గడిపేశాను.

   నేను ప్రతీ రోజూ దగ్గరలో ఉన్న దేవాలయాలకి వెళ్తూంటాను,మా నవ్య స్కూలు బస్సు ఎక్కేశాక.ప్రతీ రోజూ ఓ అబ్బాయిని చూస్తూన్నాను.’మేంచెస్టర్ యునైటెడ్’ లోగోతో ఉన్న ఓ షర్ట్ వేసికొస్తూంటాడు.మా వాడికంటె ఓ ఏడాది అటో ఇటో వయస్సుండొచ్చు.పలకరించడానికి అవకాశం కుదరలేదు. కానీ, ఈవేళ కుదిరింది.ఊరూ, పేరూ అడిగిన తరువాత మేంచెస్టర్ యునైటెడ్ గురించి, నాకు తెలిసినదేదో వాగేశాను. కొద్దో గొప్పో కొంచెం తెలుసులెండి (మా అబ్బాయి ధర్మమా అని).ఓ అరగంట కబుర్లు చెప్పుకున్నాము. అంతా అయిన తరువాత ఆ అబ్బాయి అంటాడూ-‘ అంకుల్, మీ వయస్సున్న పెద్దవారితో ఇంత ఫ్రీ గా మాట్లాడడం ఇదే మొదటిసారీ,ఎవ్వరూ మమ్మల్ని పలకరించరూ, పలకరించినా ఏదో ఉద్యోగాల సంగతీ, పెళ్ళి సంబంధాల సంగతీ మాత్రమే.ఆ గొడవలు కాకుండా నాకు ఇష్టమైన టాపిక్కు మీద మాట్లాడుకోవడం,అదీ మన ఇద్దరికీ పూర్వ పరిచయం లేకుండా!! థాంక్యూ అంకుల్,జీవితంలో ఈ రోజు మరచిపోనూ’ అన్నాడు.

    నేను చెప్పొచ్చేదేమిటంటే అవతలివారితో మాట్లాడడం మనలోనే ఉంది.నన్ను ముట్టుకోకూ నామాలికాకి అంటూ, మడి కట్టుక్కూర్చుంటే ఎవరు ముందరకొస్తారూ?
Extend a hand of Friendship.The whole World looks beautiful!

%d bloggers like this: