బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- బాపట్ల -2


   ఆంధ్రదేశంలో అంతగా తిరిగింది లేదు. అలాగని మిగిలిన ప్రదేశాలన్నీ చూశానని కాదు. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికంటూ వెళ్తే, అక్కడ రిక్షాల్లోనూ, ఆటోల్లోనూ తిరగనైనా తిరగాలి, లేదా నడిచైనా తిరగాలి అని నా ఉద్దేశ్యం. ఎవరో కారుల్లో తీసికెళ్తే ఏం తెలుస్తుందీ? అయినా ఏదైనా ప్రదేశాన్ని గురించి వ్రాయడానికి, కనీసం రెండు మూడు రోజులైనా గడపందే ఏం తెలుస్తుందండీ?ఏదో పెళ్ళికి వెళ్ళానూ, పైగా ఎంతో దూరం (పూణె నుంచాయే) నుండి వచ్చానూ, ఎక్కడ శ్రమ పడిపోతానో, అని ఏ.సీ. రూమ్ముల్లో వసతీ, ఇంకేం తెలుస్తుందీ?

   మమ్మల్నుంచిన హొటల్, ఒక వారం క్రిందటే ప్రారంభించారుట.అందుచేత, దానిలోని లోటు పాట్లు అప్పుడే బయట పడలేదు! మహరాష్ట్ర గవర్నరు గా పనిచేసిన, కోన ప్రభాకర్రావుగారిదిట ఆ హొటల్.ఈ హోటల్ కి ఎదురుగానే ఓ ఓపెన్ యెయిర్ థియేటరోటీ,అది కూడా ఆయనదే.ఇంక ఊరుసంగతంటారా,మామూలుగా ఉండే యావరేజ్ పట్టణం లాగానే ఉంది. దుమ్మూ, ధూళీ,ఓ వరసా వావీ లేని ట్రాఫిక్కూ. రోడ్డు వెడల్పు చేయడానికి మున్సిపాలిటీ వారిచే, కొట్టేయబడిన మొండి గోడలూ, వాటి పక్కనే శుభ్రంగా ఉన్న షాప్పులూ, కారణం ఏమిటయ్యా అంటే, వాళ్ళు కోర్టునుంచి స్టే తెచ్చుకున్నారుట! ఇంక అయినట్లే రోడ్డు వెడల్పు కార్యక్రమం !</b.

   బాపట్ల ప్రజలమీద రుద్ద బడిన పార్లమెంటు సభ్యురాలు,పనబాక లక్ష్మి, అక్కడావిడ కాదుట! ఆ ప్రాంతానికి చెందిన పురంధరేశ్వరిని విశాఖ పట్టణమో ఎక్కడకో పంపించేశారుట. ఏమిటో, ఈ రాజకీయాలూ అవీనూ.అదే రోజున కడప ఎన్నిక ఫలితాలొచ్చాయి. ఓ రెండు మూడు ఆటోల్లో ఓ పాతికమందిదాకా అరుచుకుంటూ, టపాకాయలు కాల్చుకుంటూ తిరగడం మాత్రం చూశాను.

   నెట్ లో చదవడం వలన, భావన్నారాయణ గుడి అంత ప్రాచీనమైనదని తెలిసింది. ప్రొద్దుటే 11.30 కి వెళ్తే, మూసేసుంది. అందువలన ప్రత్యేకంగా సాయంత్రం ఆరింటికి వెళ్ళి దర్శనం చేసికున్నాను.మామూలుగా నారాయణుడుండే చోట లక్ష్మీ దేవి ఉంటుందంటారు. ఏమిటో ఆ వైభవేమీ కనిపించలేదు, నా కళ్ళకి.The temple looked its age (1400 years). అంత పురాతనమైన దేవాలయం అక్కడ ఉండడం, అదృష్టంగా భావించి, ప్రభుత్వం వారుకూడా, ఓ చెయ్యేస్తే,బావుండేది. కానీ అలాటిదేమీ ఉన్నట్లు లేదు. తమిళనాడులో ఇన్నాళ్ళూ డి.ఎమ్.కే వారికి దేముడిమీద అంత నమ్మకం ఉండకపోయినా, దేవాలయాలన్నీ బాగానే మైన్టైన్ చేశారు. మీకెల్లా తెలిసిందీ అని అడక్కండి, 2004 లో నేనూ మా ఇంటావిడా టిటిడిసి వారి టూర్ లో ఓ వారం రోజులు తిరిగొచ్చాము.అప్పుడనిపించింది అలా !

   ఆ తరువాత తూ.గొ.జి లో ఉన్న చాలా ప్రాచీన దేవాలయాలు చూసే అవకాశం కలిగింది. అక్కడ ఉండే పరిస్థితులు చూస్తే చాలా బాధేసింది.దేవాలయం ఎంత ప్రాచీనమైనదయితే అంత Poor maintainance. ఈమాత్రందానికి,దేవాదాయ శాఖలూ అవీ, మళ్ళీ వాటికి ఓ కమీషనరూ వగైరాలు ఎందుకో? ఏదో ప్రైవేటు మానెజ్మెంటు దేవాలయాలు,తప్ప మిగిలినవన్నిటి పరిస్థితీ అంతే. పోనీ దేముడూ, భక్తీ లేదంటారా, అబ్బే ఎక్కడ చూసినా దీక్షలూ, వ్రతాలూ, నోములే!కావలిసినంతమంది స్వాములూ,ఆశ్రమాలూనూ. మరి దేవాలయాలంటే అంత చిన్న చూపెందుకో మన ప్రభుత్వానికి? వాళ్ళని మాత్రం అని లాభం ఏమిటిలెండి?ఎవరి గొడవలో వాళ్ళు.ఒకరు తెలంగాణా అంటారు, ఇంకోరు సమైఖ్యాంధ్ర అంటారు. ఒకాయనేమో తొమ్మిదేళ్ళు పాలన చేసి, ఐ.టి. తప్పించి ఇంకేమీ లేదన్నారు. ఒక్కసారి గద్దె దింపెసరికి, రైతులూ వాళ్ళూ గుర్తొచ్చారు.

   పోనీ ఏ బస్సైనా ఎక్కి విజయవాడ వెళ్ళేనా అంటే అదీలేదు, తెలిసినవారితో ఝూమ్మని కారులో వెళ్ళానాయే.పోనీ ఓ రెండు మూడు రోజులుందామా, పనీ పాటూ లేదూ అనుకుంటే, నన్నెవడుంచుకుంటారు?పెళ్ళిళ్లల్లోనే, అప్పగింతలవగానే
బిచాణా కట్టేసికుని ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నారు.ఇంక నేనెంత?

6 Responses

  1. గుడి ఎంత పాతది అని కాదు మాస్టారూ గుడి వలన మనకెంత లాభం అని ఆలోచిస్తుంది గవర్నమెంటు. ఏ గుడిలో అయినా హుండీ కి ఉన్న ప్రాధాన్యత గర్భగుడిలో ఉన్న అమాయకుడికి (పూజారి కాదు సుమా) ఇచ్చుంటే ఆ గుడి విలువ తెలుస్తుంది. “దేవాదాయ” అంటే దేవుడి వలన మనకొచ్చే ఆదాయం అని అర్ధమన్నమాట. ప్రస్తుతం ఈ గుళ్ళూ అవీ పాలక మండళ్ళ పేరుతో అస్మదీయులకి పదవులూ అవీ పంచుకోడానికి మాత్రమే పనికొస్తున్నాయి.

    Like

  2. శంకర్ గారూ,

    మీరన్నది అక్షరసత్యం !

    Like

  3. శంకర్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా!

    Like

  4. భావన్నారాయణ స్వామి గుడి మావూళ్ళోనూ ఉంది,రెంటికీ ఒక్కసారే తిరణాల జరుపుతారు.మా వూరు పొన్నూరు.ఈసారి ప్రయత్నించండి.అది నిత్యశోభాయమానంగాను,కళకళలాడుతూనూ ఉంటుంది.

    Like

  5. I am glad that you wrote this post with more details about Bapatla.

    Like

  6. రెహమానూ,రాజేందర కుమార్, వీకెండ్ పొలిటీషియన్,

    నా టపా చదివి వ్యాఖ్యలుంచినందుకు ధన్యవాదాలు.

    Like