బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-It just happens !!

   ప్రతీ మనిషికీ ఏవో కొన్ని Priorities ఉంటూనే ఉంటాయి. వాటికి కారణాలు అడిగినా చెప్పలేకపోవచ్చు. మరీ బలవంతపెడితే, ‘నా ఇష్టం’ అని కర్ట్ గా సమాధానం చెప్పినా చెప్పొచ్చు.అందువలన మనం నేర్చుకోవలసినదేమిటంటే, ఎప్పుడైనా ఎవరైనా ప్రతీదీ తెగేదాకా లాక్కూడదని. ఈ Priorities కి ప్రత్యేకంగా కారణం ఉండదు,నిజం చెప్పాలంటే, మన మూడ్ ని బట్టి ఈ Priorities మారినా మారిపోతూండవచ్చు.ఉదాహరణకి, మనకి తెలిసిన వారెవరికైనా ఒంట్లో బాగోలెదని తెలిసినప్పుడు, అయ్యో,ఆయనకి సుస్తీ చేసిందిట, ఓసారి వెళ్ళి చూసొద్దామేమిటీ అని అనుకుని,ముందుగా ఫొను చేస్తాము,ఆరోగ్యం విషయం పరామర్శచేసి, మనం వాళ్ళింటికి వచ్చే ఉద్దేశ్యం- not in so many words- వ్యక్త పరచగానే, వాళ్ళుకూడా, మా అబ్బాయీ కోడలూ వచ్చారండి, ఇప్పుడే డాక్టరు వస్తానన్నారు అని, not in so many words – ‘మీరేమీ ఇప్పుడు వచ్చి మమ్మల్నేమీ disturb చేయనఖ్ఖర్లేదూ’ అనే భావం వచ్చేటట్లు చెప్పేస్తారు!
ఎవరి priorities వాళ్ళవీ.

   ఇంక వీళ్ళకీ అనిపించదూ,వెళ్ళి పోనీ ఒకసారి చూసొద్దామా అని. అలా వెళ్ళి చూడ్డం అనేది వెనక్కి పడిపోతుంది.చివరకి ఎప్పుడో రోడ్డుమీద కనిపించినప్పుడు,’అప్పుడెప్పుడో మీ ఆరోగ్యం బాగాలేదన్నారూ, ఇప్పుదెలా ఉందీ?’ అని అడగలేముకదా.ఎప్పుడో జరిగిన ఆరోగ్యభంగం గురించి అడగడానికి, ఇప్పుడు వీలుచిక్కిందా వీళ్ళకీ అని అవతలివాళ్ళేమైనా అనుకుంటారేమో అని అసలు ఆ ఆరోగ్యం విషయమే ఎత్తరు!అలా పెద్ద పెద్ద కారణాలేవీ లేకుండా, వీళ్ళ రిలేషన్స్ కొద్దిగా strain అవడం మొదలుపెడతాయి.ఇద్దరిదీ తప్పులేదు నిజం చెప్పాలంటే, విషయం తెలియగానే వెళ్దామని వీళ్ళూ అనుకున్నారు, ఆ టైములో ఆ పరిస్థితిలో ఉన్న చిరాకో పరాకో ధర్మమా అని, ఆరోజు ఫోను చేసినప్పుడు,వాళ్ళలా అన్నారు.It just happens!

   అలాగే, మేము, మా అమ్మగారి సంవత్సరీకాలు, చుట్టాలందరూ ఉంటారు కదా అని హైదరాబాద్ లో పెడదామనుకున్నాము. ఆ సందర్భంలో వాటి వివరాలు, మా స్నేహితులొకరిని అడిగితే, మల్కాజ్ గిరి లో వీలౌతుందీ అన్నారు. మా చెల్లెలు కూడా, అక్కడే ఉండడంతో, బుక్ చేసేయమని చెప్పాను మా బావగారికి డబ్బిచ్చేసి. వాళ్ళని అడిగినప్పుడు, మూడు రోజులకీ ఏదో పాతిక మంది చొప్పున భోజనానికి రానిస్తామన్నారు. మా చుట్టాలే, పాతికమందికి పైగా ఉన్నారు,దగ్గరవాళ్ళే.వాళ్ళందరూ వస్తారనే కదా అసలు ఆ ఊళ్ళో పెట్టిందీ.దినితో ఏమయ్యిందంటే, పిలిచేవారి లిస్ట్ ఒకటికి రెండుసార్లు ఫిల్టర్ చేసి,మొత్తానికి పిలిచాను. భోజనానికి ఎంతమందొస్తారో ముందుగానే చెప్పాలిగా, పైగా ఇదేమీ శుభకార్యం కాదుకూడానూ,RSVP అనడానికి.మనం పిలిచినవాళ్ళు వచ్చినా రాకపొయినా మనం మాత్రం బిల్లు పూర్తిగా ఇవ్వాలేకదా.ఆ పిలిచినవాళ్ళకీ ఎవరి priorities వాళ్ళకుంటాయి.ఏదో పిలవాలి కాబట్టి పిలిచాడు కానీ, అంతదూరం వెళ్ళేదేమిటీ అనుకోవచ్చు.అలాగని మనం వాళ్ళనేమీ తప్పూ పట్టలెమూ, పిలవడం మన బాధ్యత, రావడం రాకపోవడం వాళ్ళిష్టం. అది అర్ధం చేసికున్నంతవరకూ, అపార్ధాలకి చోటుండదు.

   నిజం చెప్పాలంటే, నేను పిలిచిన వారందరూ, మా అమ్మగారిపైన ఉండే అభిమానంతో మూడు రోజులూ వచ్చారు. మాకూ సంతోషమనిపించింది.హైదరాబాద్ లో పెట్టినందుకు ఫలితం దక్కింది కదా అని.ఇంత ఆనందంలోనూ, పంటిక్రింద రాయిలాగ, మా స్నేహితుడు ( ఆయనతో, నేను కాలేజీలో చదువుతున్నప్పటినుండీ స్నేహం!)గారిని పిలవలేకపోయాను. కారణం, మా దగ్గర చుట్టాలే అమ్మగారివైపు చాలా మందున్నారు,అప్పటికీ మా నాన్నగారివైపు వాళ్ళని పిలవనే లేదూ.ఇలా priorities ధర్మమా అని కొన్ని కొన్ని పొరపాట్లు వద్దనుకొన్నా జరుగుతూంటాయి. అది అర్ధం చేసికునే వారిలో ఉంటుంది.మా ఫ్రెండు పూణె వచ్చినప్పుడల్లా మమ్మల్ని కలుసుకోకుండా వెళ్ళేవారు కాదు, అలాటిది 2008 నుండీ, ఇక్కడకు ఎన్నిసార్లు వచ్చినా కలవనూ లేదు, నేను ఎన్నిసార్లు ఫోను చేసినా ఏదో తూతూమంత్రం లా మాట్లాడడం తప్పించి,ఆయన ఫోనే చేయడం లేదు. It just happens !

%d bloggers like this: