బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ప్రయాణంలో కాలక్షేపం..

   క్రిందటివారంలో బాపట్ల వెళ్ళే భాగంలో, మొదటగా భాగ్యనగరం వెళ్ళాలిగా.ఇక్కడనుంచి (పూణె) నుండి/మీదుగా మొత్తం తొమ్మిది ట్రైన్లయితే ఉన్నాయి, కానీ ఖాళీలుండొద్దూ,చివరగా పూణె-హైదరాబాద్ Express లో ముందుగా, RAC ఉన్నా, తీరా బుక్ చేసేసమయానికి సీనియర్ సిటిజెన్ల కోటాలో కన్ఫర్మ్ అయిపోయింది, పైగా క్రింది బెర్తు కూడానూ!నేను సీనియర్ సిటిజెన్ అయినప్పటినుండీ, తోటి ప్రయాణీకుల కాళ్ళు పట్టుకోకుండా, క్రింది బెర్తు దొరకడమే, వామ్మోయ్
It calls for celebration! నేను ఆటోలో స్టేషనుకి వెళ్ళేటప్పటికే, ట్రైను ప్లాట్ఫారం మీదుంది.మళ్ళీ అదో వింతా!ఈ ట్రైనులో పాంట్రీ కార్ లేని కారణంగా, మా ఇంటావిడ, పులిహార చేసి ఇచ్చింది.నేను,ఓ రెండు తెలుగు పత్రికలు తీసికుని ఎక్కేశాను.

    సైడు బెర్తుల్లో, ఒక జంట కూర్చున్నారు.ఆయన, నాకంటె వయస్సులో పెద్దవారిలాగే కనిపించారు.కొంచం సేపు వెయిట్ చేసి, ఆయనని పలకరించాను.తేలిందేమిటయ్యా అంటే, ఆయనకూడా, పూణె లోనే 1963 లో CDA లో జాయిన్ అయారుట,ఎక్కడెక్కడో తిరిగి, చివరకు పూణె లోనే స్థిరపడ్డారు. ఆయనతో కబుర్లు మొదలెట్టేసరికి, ఇద్దరికీ తెలిసిన కామన్ ఫ్రెండ్స్ ఎంతోమంది తేలారు!1963 లో పూణె లో చాలామంది తెలుగువారు, ఎకౌంట్స్ లోనూ,మా ఆర్ద్నెన్స్ ఫాక్టరీల్లోనూ, ఎవరో ఒకరి ద్వారా చేరినవారే.ఒప్పుకోడానికి మొహమ్మాట పడొచ్చుకానీ, ఆరోజుల్లో పెద్ద పొజిషన్ లో ఉన్న తెలుగువారు,తమ తోటి తెలుగువారికి చాలా సహాయం చేశారు.చదువుకీ చేసే పనికీ సంబంధం ఉండేది కాదు, డిగ్రీయో,డిప్లొమాయో ఉంటే చాలు, ఉద్యోగం వచ్చేసినట్లే.అంతా ఇండో చైనా యుధ్ధం ధర్మం!

   ఆరోజుల్లో తెలుగువారు రాస్తాపేటలో రిపబ్లిక్ గెస్ట్ హౌస్, పంద్రా ఆగస్ట్ లాడ్జి లో ఓరూమ్ములో ఉండే అయిదారు మంచాల్లోనూ ఓ మంచం అద్దెకు తీసుకోడం, సింగు హొటల్ లో భోజనం.ఎకౌంట్స్ లో ముందు చేరిన చాలా మంది, ఏదో ఓవర్ టైము తో కలిపి ఎక్కువొస్తుందీ అని, ఫాక్టరీల్లో చేరినవారే!ప్రతీ ఆదివారం పూనా స్టేషన్ కి,సికిందరాబాద్-బొంబై ఎక్స్ ప్రెస్ వచ్చే టైముకి వెళ్ళడం,అందులోంచి దిగే తెలుగు కుర్రాళ్ళతో పరిచయం చేసికోవడం, వారికి ఎవరైనా తెలిసినవారున్నారా సరే, లేదా వీరే, వాళ్ళని తీసికెళ్ళి ఓ రూమ్ములో చేర్పించడం, భోజనానికీ దానికీ ఎరేంజ్ చేయడం! కొంతమందైతే, భయ పడేవారుట, ఎవరో కొత్త ప్రదేశంలో వివరాలడిగేసరికి, ఎందుకంటే,వాళ్ళు ఇంటినుండి బయలుదేరేముందు, వాళ్ళ తల్లితండ్రులు చెప్పేవారుట, పూనా లో ‘మాయల మరాఠీలు’ ఉంటారూ, వాళ్ళ మాయల్లో పడకండీ అని! వీళ్ళేమో చాలా సిన్సియర్ గా ఆజ్ఞాబధ్ధులుగా ఉండేవారు! ఆయన చెప్పే ఆరోజుల్లోని విషయాలు చెప్తూంటే, అలా అలా పాత జ్ఞాపకాల్లొకి వెళ్ళిపోయాను!

   అలా చెప్పుకుంటూపోతూంటే, ఎంతంతమంది పేర్లు గుర్తుకు తెచ్చుకున్నామో. మాకు ఫాక్టరీ వారం అంతా ప్రొద్దుట 7.30 నుండి, సాయంత్రం 6.30 దాకా ఉండడం, వారంవిడిచి ఓ ఆదివారం కూడా డ్యూటీకి వెళ్ళడంతో, ఇలాటి activities (అంటే స్టేషన్లకెళ్ళడాలూ వగైరా..) ఎక్కువగా ఉండేవికావు. పైగా ఆరోజుల్లో పేర్లు కూడా రావూ, మూర్తీ,రెడ్డి…ఒక్కో రూమ్ములో ఓ అరడజను మూర్తులూ, ఓ పరక రెడ్డిలూ..మళ్ళీ వాళ్ళకి ఓ టాగ్ తగిలించి ఏదో టై రావు
( ఎప్పుడూ టై తోనే ఉండేవాడు), పైజమా మూర్తీ ( ఏం లేదూ ఆరోజుల్లో ఆయన వేసికునే పాంటు బాటం పైజమా లా ఉండేది!),గెడ్డం రెడ్డీ ( గెడ్డం పెంచేవారు) ఇలాగన్న మాట.

   చివరకి ఓ తెలుగు పురోహితుణ్ణి కూడా చేర్చారు ఆయనకి ఉండడానికి ఓ ఇల్లిచ్చి, ఎక్కడ పూజలూ పునస్కారాలున్నా ఆయనకే ఆ బేరాలొచ్చేటట్లుగా చూసి,వీరు చేయకలిగినన్నీ చేశారు. ఆయనే మాట దక్కించలేదుట.ఈపాటికి ఎంత ఉఛ్ఛస్థితికి వెళ్ళేవారో కదా. ఇప్పుడో సగం తెలుగూ సగం కన్నడం పురోహితులే దిక్కు.దేనికైనా అదృష్టం ఉండాలిలెండి.మేము కబుర్లు చెప్పుకుంటూంటే ఆవిడకు బోరుకొడుతోందని, చదువుకోడానికి ఓ తెలుగు మ్యాగజీన్ ఇచ్చాను. మళ్ళీ ఇదో వింతా. ప్రయాణాల్లో పుస్తకాలు ( అందులో తెలుగువి) ఛస్తే ఇంకోళ్ళకివ్వను! ఆ కబుర్లలో ఓ విషయం చెప్పారు–అప్పుడెప్పుడో చాలా సంవత్సరాలక్రిందట, ఆంధ్రప్రదేస్, మహరాష్ట్ర ముఖ్యమంత్రులూ, శ్రీ సత్యసాయి బాబా గారూ వచ్చిన సందర్భంలో, ఆ ముగ్గురూ తలా పాతికవేలూ డొనేషన్ ఎనౌన్స్ చేశారుట. అప్పటికీ ఇప్పటికీ అందే లేదుట ! ఆరోజుల్లో ఆంధ్రసంఘం లో రాజకీయాలెట్లా ఉండేవో ( ఇప్పటికీ అంతే అనుకోండి) వగైరా వగైరా కబుర్లతో ఓ అయిదు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియకుండానే గడిపేశాము!

   తెల్లవారుఝామున నాలుగున్నరకల్లా నాంపల్లి చేరాను…

%d bloggers like this: