బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

   అప్పుడే రమారమి ఆరు రోజులయిపోయింది నేను టపా వ్రాసి! మా ఇంటావిడ తణుకు వెళ్ళిందిగా, తిరిగి వచ్చి ‘అరే ఒక్క టపా వ్రాయలేదూ, బెంగెట్టుకున్నారా నేను లేనని’.పోన్లెండి, ఆవిడని disappoint చేయడం ఎందుకూ అనుకుని, ఔనూ అన్నాను! నాదేం పోయిందీ? ఆంధ్రదేశంలో ఎండలకి, పేలాల్లాగ వేగిపోయింది! ఈవిడ అక్కడకి ప్రయాణం అయినప్పటినుండీ, ఆవిడ movements మోనిటర్ చేస్తూనే ఉన్నాను,క్షేమంగా చేరిందా లేదా అని, ఎంతచెప్పినా
దగ్గరదగ్గర నలభై ఏళ్ల అనుబంధమాయే!ఈవిడ తణుకు చేరగానే, పాపం మా అత్తగారు, తెల్లవారుఝామున ఫోను చేసి మరీ చెప్పారు, ఈవిడ క్షేమంగా చేరిందని,అలాగే తణుకులో హైదరాబాద్ వెళ్ళడానికి,బస్సు ఎక్కినప్పటినుండీ, ఫోన్లమీద ఫోన్లు, పెళ్ళిలో అప్పగింతల టైములో కూడా, ఇన్నిన్ని ప్రికాషన్లు తీసికోలేదు! ఏమిటో, కూతురు ఒక్కర్తీ వచ్చిందీ,తిరిగి క్షేమంగా చేరేవరకూ, తనదే బాధ్యత అన్నట్లుగా!ఈవిడ ప్రయాణంలో ప్రతీ చోటా, ఈవిడని రిసీవ్ చేసికోడానికి ఎవరో ఒకరు,ఉన్నారు. తీరా తిరిగి పూణె వచ్చేటప్పటికి,తను ఒక్కర్తే ఇంటికి వచ్చింది.

   అప్పటికీ, తెల్లవారుఝామున 4.30 నుండీ, అలారం పెట్టుకుని మరీ లేచికూర్చున్నాను.ఆ మాయదారి బస్సు చివరకు, మా ఇంటిదగ్గరే, ఏడున్నరకి దింపి వెళ్ళింది. ఇంకా ఈవిడ దగ్గరనుంచి ఫోను రాలేదేమని చూస్తూంటే, ఠింగురంగా అనుకుంటూ,బెల్లు కొట్టింది. నేనేం చేయనూ?సాయంత్రం దాకా అక్కడే ఉండి, భోజనం చేసి ఇదిగో ఇప్పుడే మేముండే ఫ్లాట్ కి చేరాము.ఇంక మొదలూ,ఇల్లంతా మట్టికొట్టుకుపోయిందీ, ఒక్కసారి ఓ చీపురేస్తే మీసొమ్మేంపోయిందీ అంటూ! అప్పటికీ, ఈవిడకి భయపడి, నిన్న వచ్చి, నాకొచ్చిన క్లీనింగేదో చేశాను. మనం చేసినవి ఆవిడకు నచ్చుతాయా ఏమిటీ?ఆవిడ benchmark వేరు.ఎక్కడో వేలెట్టి చూస్తుంది, ఇదిగో ఇక్కడ తుడవలేదూ అంటుంది. అంతంత ఓపికల్లేవమ్మోయ్ నాకు.

   ఏదో ఇన్నాళ్ళూ ఎండన పడొచ్చిందీ,ఇంట్లో మజ్జిగ లాటిదుంటే, ఆరారగా త్రాగుతూంటుందీ అనుకుని, ఈమధ్యన, అముల్ వాళ్ళు మార్కెట్ చేస్తున్న ‘మజ్జిగ’ సీసా ఒకటి కొని, ఫ్రిజ్ లో పెట్టాను. ఈవిడొచ్చి ‘అదేమిటండీ ఫినైల్ సీసా ఎవరైనా ఫ్రిజ్ లో పెట్టుకుంటారా?’. అయ్యా ఇదీ నా పరిస్థితి, ఎంతో ప్రేమతో మజ్జిగ సీసా పెడితే, ఫినైల్ లా కనిపించిందీవిడకి. పోన్లెండి, బకెట్ నీళ్ళల్లో పొసి, ఇల్లంతా తుడవలేదు! ఏమిటో మరచెంబుల్లో పోస్తేనే మజ్జిగట!మంచివాళ్ళకి రోజులు కావండి బాబూ!అలాగని త్రాగడం మానిందా, హాయిగా త్రాగేసి, బాగానే ఉందండోయ్,ఈ సీసా అయిపోగానే ఇంకోటి తెండి, అనేసి ఓ Standing instruction కూడా ఇచ్చేసింది.

   ఇంక ఇంటి క్లీనింగ్ అభియాన్ పూర్తికాగానే మొదలెడుతుంది, తను టపాలు వ్రాయడం. ఒకటా రెండా, పదిరోజుల కబుర్లు. అదీ చాలా రోజులతరువాత, పుట్టింటికి వెళ్ళిందేమో, కావలిసినన్నుంటాయి.

%d bloggers like this: