బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-మాయదారి సెల్ ఫోను

   నేను ఈ సెల్ ఫోన్లొచ్చినప్పటినుండీ వాడుతున్నాను.మా అబ్బాయి ఇంజనీరింగులో ఉన్నప్పుడు,ఓ బైకు కావాలంటే తీసికున్నాను. తను కాలేజీకి వెళ్ళినప్పటినుండీ,మా ఇంటావిడకి ఖంగారూ,సరీగ్గా నడిపేడో లేదో అని.సెల్ ఫోన్లొచ్చిన కొత్తలో
ఇప్పటిలాగ సందు సందుకీ సెల్ ఫోన్లకంపెనీలూ, 2G లూ,3G లూ లేవుగా,ఉన్నదల్లా BPL ఒక్కటే!పైగా మార్కెట్ లోకి వచ్చే Electronic gadget ప్రతీదీ కొనేయాలనే ‘ఆబ’ ఒకటీ! వాడెవడో BPL వాడొస్తే,ఓ సెల్ ఫోనోటి కొన్నాను.ఖరీదెంతో మర్చిపోయాననుకోండి, నెలనెలా కట్టే బిల్లు మాత్రం గుర్తుంది! ఏమైతేనేం, అబ్బాయికి ఉపయోగిస్తుందీ అనుకుని,కొని వాడి చేతుల్లో పెట్టాము. వాళ్ళ ఫ్రెండొకరు అన్న మాట ఇప్పటికీ గుర్తుంది-You made Harish a spoilt brat అని!ఎందుకంటే అప్పటికి ఈ సెల్ఫోన్ల వాడకం మరీ అంత ప్రాచుర్యం పొందలేదు,ఏదో డబ్బులున్నాయి కదా అని కొంటారు అనుకునేవారు.డబ్బులా పాడా, మా ఇంటావిడ పుత్రాభిమానం కించపరచలేక,నా తాహతుకి మించినదైనా కొన్నాను.అబ్బాయికీ అందరికీ చూపించుకోడానికీ బావుండేది! ఓ బైక్కూ,ఓ సెల్ ఫోనూ!కొన్ని రోజులు యడాపెడా వాడేసి,ఇంజనీరింగు పూర్తయిన తరువాత ఎం.బి.ఏ చదవడానికి గుర్గాం వెళ్తూ,తీసికెళ్ళాడు. పోన్లే పిల్లాడి బాగోగులు తెలుస్తాయీ అనుకుని నేనూ ఊరుకున్నాను. మొదట్లో హాండ్ సెట్లు ఇప్పటిలాగ స్లిమ్ గా ఉండేవికావుగా, ప్లాట్ఫారం మీద రైల్వేవాళ్ళు ఉపయోగిస్తారే వాకీ టాకీ సెట్లు,అంతుండేది!మా అబ్బాయికీ, అక్కడకి వెళ్ళిన తరువాత తెలిసొచ్చింది,ఈ సెట్ వద్దుపొమ్మన్నాడు! అదేదో ఆఫరుందని ఇంకోటి కొనిపించాడు.ఉద్యోగంలో చేరేదాకా వాడి సెల్ ఫోన్ల బిల్లులు నాకే పడేవి!పైగా ఫ్రెండ్స్ తో గంటల తరబడి కబుర్లూ! ఏం చెప్పుకుంటారో ఏమో కానీ, వాడు మాట్లాడుతున్నంతసేపూ,నాకు దానికయ్యే బిల్లే కనిపించేది. పైగా ఏమైనా అంటే ( అప్పటికింకా పెళ్ళవలేదులెండి ఇంకా బాప్ కి కమాయీ మీదే బ్రతుకుతున్నాడు!)అతనితో ఈ నెలలో ఒక్కసారేగా మాట్లాడిందీ అనేవాడు.అలా ‘నెలలో ఒక్కసారే’ మాట్లాడే ఫ్రెండ్స్ ఓ డజనుమందుండేవారు!

   కాలక్రమేణా సెల్ ఫోన్ల వాడకం ఎక్కువయింది. ఆ BPL కంపెనీ ఏమయ్యిందో తెలియదు!సరే ప్రతీవాడిదగ్గరా ఫోన్నే, మనకెందుకుండకూడదూ అని, మా ఇంటావిడ పేరన ఓ రిలయన్స్ కొన్నాను.వాడేనా పెట్టేనా? ఏదో ఫాక్టరీలో విజిటింగ్ కార్డులు వేస్తూంటే, నేనూ వేయించుకుని, దానిలో ప్రింటు చేయించుకుందామనీ, పైగా ఇంట్లో ఉన్న కంప్యూటర్ ధర్మమా అని, ఆరోజుల్లో మా అబ్బాయి క్రియేట్ చేసిన ఓ మెయిల్ ఐడీ! అదో గ్లామరస్ గా ఉండేది!అడిగినవాడికీ,అడగనివాడికీ ఇచ్చేయడం ఓ సరదా!మొదట్లో ప్రతీదానికీ ఉండే సరదా అలాగే ఉంటుందిలెండి!ఏదైనా అంతే!ప్రతీవాడినీ అడగడం, మీ మెయిల్ ఐడి ఏమిటీ అని! ఆ మెయిలేమిటో, ఐడీ ఏమిటో తెలిసిఛస్తేనా?అదో సరదా మళ్ళీ!

   ఏదో చెప్పాలని, దేంట్లోకో వెళ్ళిపోయాను.అసలు ఈ గొడవంతా ఎందుకొచ్చిందంటే, ఆమధ్యన మా పెళ్ళి రోజుకి, మా అబ్బాయీ కోడలూ ఓ గిఫ్ట్ ఇద్దామని మూడు చాయిసులిచ్చారు- కొల్హాపూర్ ట్రిప్పూ, డిజిటల్ ఫ్రేం, కెమేరా ఫోనూ-
కొల్హాపూర్ ఒకసారి వెళ్ళాము, మా అగస్థ్య ఓ కొలిక్కి (అంటే మాటా,పాటా) వచ్చేదాకా ఎలాగూ వెళ్ళేది లేదూ, ఇంక డిజిటల్ ఫ్రేం అంటారా, మేముండే ఇల్లు ఏదో కాలక్షేపానికి కానీ,ఇలా డెకొరేటివ్ ఐటంస్ పెట్టుకోడానికి స్థలం లేదు,అందుకని సెల్ ఫోనుకి సెటిల్ అయ్యాను/ము.నిజం చెప్పాలంటే మా ఇంటావిడకి కొత్త హాండ్ సెట్ కొనాలి, తనది మా మనవడు దానిమీద చేసే అఘాయిత్యాలకి బలైపోయింది. ఏదో ఇది సెల్లూ అనేట్లుగా ఉంది, మాటలు వినిపిస్తాయిలెండి! మా ఇంటావిడ కూడా మొహమ్మాటానికి, పోనీ మీరే తీసికోండీ అంది. అనడం తరవాయి, మళ్ళీ మనస్సు మార్చుకునేలోపల వెళ్ళి, ఓ కెమెరా ఫోను తెచ్చుకున్నాను. ఏదో స్టేటస్ కోసం కెమెరాది తీసికున్నా గానీ, నాకెందుకు చెప్పండి ఇప్పుడు ఆ కెమేరాలూ అవీ అవసరమా? దీన్నే ‘ఆబ’ అంటారు! ఎవడుపడితే వాడు, ఎక్కడపడితే అక్కడ క్లిక్ క్లిక్.. మంటూ ఫొటోలు తీస్తూంటే, మనకెందుకుండకూడదూ అని!

   ఎలాగో తిప్పలు పడి,ఇంట్లోనే ఫొటోలు తీయడం మొదలెట్టాను. బయటెక్కడైనా తీస్తే ఏమౌతుందో అనే భయం! పోనీ వాటిని డౌన్ లోడ్ చేసికోడం తెలుసా అంటే అదీ లేదూ.మొన్నేమయిందో తెలియదు,దాంట్లో వచ్చే SMS లు ఓపెన్ అవడం లేదు. పైగా ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే డిస్ కనెక్ట్ అయిపోతూంది. LG Service Centre కి వెళ్తే, వాడు కొట్టే ఎత్తేశాడు.నిన్నరోజంతా అదే గొడవ. ఎవరితోనైనా మాట్లాడుతూంటే, మెసేజ్ వచ్చిందా, కనెక్షన్ కట్! ఇదికాదూ అని, రిలయెన్స్ వాడికి ఫోను చేస్తే, ఓ సలహా చెప్పాడు- బ్యాటరీ, సిమ్ కార్డూ తీసేసి, ఓ గంటా రెండు గంటల తరువాత ప్రయత్నించమన్నాడు. గంటేం ఖర్మా,రాత్రంతా ఆపేసి, ప్రొద్దుటే ట్రై చేసినా అదే రిజల్టు! ఈవేళ ప్రొద్దుట, మా అమ్మాయినీ,పిల్లల్నీ చూద్దామని వెళ్ళి, తనతో నా గోడంతా చెప్తూంటే, సడెన్ గా ఓ మెసేజ్ వస్తే, ఓపెన్ అయింది! అమ్మయ్యా మళ్ళీ సర్వీసుసెంటర్ కి వెళ్ళఖ్ఖర్లేకుండా పనైపోయిందని, మా అమ్మాయితో చెప్పాను ఓ మెసేజ్ పంపూ, చూద్దాం అని.సరేనని పంపింది, బాగానే ఓపెన్ అయింది.

   ఇప్పుడు మళ్ళీ ఇంకో గొడవొచ్చింది-ఎక్కడనుంచి ఏ మెసేజ్ వచ్చినా, సెండర్ మా అమ్మాయి పేరుతో వస్తున్నాయి! ఏమిటో అంతా గందరగోళంగా ఉంది ఈ మాయదారి ఫోనుతో….

%d bloggers like this: