బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–బాపట్ల….


   రాత్రి 10.30 కి బయలుదేరవలసిన సింహపురి Express సికిందరాబాద్ స్టేషనులోకి రావడమే 11.30 దాటిన తరువాత వచ్చింది.చెప్పేనుగా ఈ సారి అన్ని ప్రయాణాల్లోనూ క్రింది బెర్తే దొరికింది.నా దారిన నేను,ఎటెండర్ ఇచ్చిన దీక్షావస్త్రాలు పరిచి నిద్ర పోయాను. 5.30 కి బాపట్ల వెళ్తుందీ అన్నారు, ఎలాగూ ఓ గంట లేటవుతోందికదా, తెల్లారిపోతుందిలే అనే భరోసాతో నిద్రపోయాను. మెళుకువ రాకపోతే, మహ ఏం అవుతుందీ, గూడూరు దాకా వెళ్ళి వెనక్కి వస్తాను, పెళ్ళి ఎలాగూ రాత్రికేగా!నాకేమీ మునిగిపోయే రాచకార్యాలేవీ లేవు!

   ఓ పదినిముషాల్లో బాపట్ల వస్తోంది అనగా, ఎటెండరు వచ్చి లేపాడు, నాకిచ్చిన దీక్షావస్త్రాలు తిరిగి తీసికుని మడతబెట్టుకుంటూ, అక్కడనుంచి కదలడే, చాయ్ పానీకి డబ్బులేమైనా ఇవ్వమన్నాడు. పోనీలే అని చేతిలో ఓ పదిరూపాయలు పెట్టాను.ఇలాటివి అన్నీ ఎంకరేజ్ ఎందుకు చేస్తారూ అని మీరడగొచ్చు, ఏం చేస్తాం బాబూ సోషల్ ఆబ్లిగేషన్స్! కనీసం అడగనైనా అడుగుతున్నాడు, మరీ మన రాజకీయనాయకుల్లాగ హడప్ చేయడం లేదు.స్టేషను దగ్గర మా ఫ్రెండు మేనల్లుడు,రిసీవ్ చేసికోగా, ముందుగా హొటల్ కి వెళ్ళి, ఫ్రెష్ అయి, కమ్మకల్యాణ మండపానికి వెళ్ళాను.నాకేం తెలుసూ, అక్కడ డెకొరేషన్లూ, సోఫాలూ,కర్టెన్లూ పింకు కలర్ లో(TRS రంగు) ఉంటాయనీ, నేను కూడా పింకు కలర్ షర్ట్( మిస్టరీ షాపింగులో కొనుక్కున్నది!) వేసికున్నాను!అబ్బ ఏం మ్యాచింగండీ అంటూ అందరూ నవ్వడమే! పోన్లే ఎదో విధంగా పరిచయం అయ్యాన్లే అని నేనూ ఆనందపడిపోయాను! అక్కడ,మా ఫ్రెండూ,అతని ఫామిలీ తప్ప ఇంకెవ్వరూ తెలియదాయే, తరువాత అందరికీ పరిచయం చేశాడులెండి,అయినా నాకేం కొత్తా, ఎవరో ఒకరిని పట్టుకుని పరిచయం చేసెసికుని, వాళ్ళని ‘బోరు’ కొట్టేయడంలో ఫస్టే లెండి!

   అక్కడ ఒకతను, అహ్మదాబాద్ నుంచి వచ్చాడు, అతనికి హిందీ, ఇంగ్లీషూ తప్ప ఇంకోటి రాదు, అన్నీ వచ్చిన మా ఫ్రెండేమో పెళ్ళి హడావిడిలో ఉన్నాడూ, వీళ్ళ బావగారొకరున్నారు, ఆయన, నేను కోనసిమ వాడినని తెలిసి,’అటువైపు వాళ్ళందరికీ జాతకాలు చెప్పడం, పంచాంగాలు వ్రాయడం బాగా వచ్చూ, మీరేమైనా చెప్పగలరా అన్నారు. హారోస్కోప్ అనే మాట విని, ఆ గుజరాతీ ఆయన, నాకొచ్చూ అన్నాడు.ఇంక చూసుకోండి, ఈ పెద్దమనిషి ఆయనని వదలడూ, ఇద్దరికీ భాషా సమస్యా,ఇంక నేనే ‘దుబాషీ’ రోల్ ప్లే చేశాను! అంతవరకూ బాగానే ఉంది, రవి,కుజుడు,గురువు,కేతు… లకి ఇంగ్లీషు చెప్పమంటే, నాకేం తెలుసూ?ఏదొ నాకు తెలిసిన ఇంగ్లీషులో చెప్పి, ఇద్దరినీ సమాధాన పరిచాను.ఆయన ఊళ్ళో ఉన్న వాళ్ళింటికి తీసికెళ్ళి, వచ్చేటప్పుడు, ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ చూపించారు. సాయంత్రం మా స్నేహితురాలొకావిడ తో భావన్నారాయణ గుడికి వెళ్ళాను.

   ఆ దేవాలయం ఆంధ్రదేశం లో ఉన్న అయిదు భావన్నారాయణ ఆలయాల్లోనూ అతి ప్రాచీనమైనదిట. 1400 సంవత్సరాల పై చరిత్ర ఉంది, ఆ దేవాలయానికి.ఇంకోటి సర్పవరం( కాకినాడ) లో దర్శించుకున్నాము. ఇంకో మూడు ఉన్నాయిట.పెళ్ళి మండపానికి వచ్చి,రాత్రి 11.30 కి ముహూర్తం, ఈ లోపులో భోజనాలూ అవీ కానిచ్చాము.మా ఫ్రెండు బ్యాంకులో పనిచేస్తూండడం వలన, అతని స్నేహితులు చాలా మంది బ్యాంకు వాళ్ళే వచ్చారు. ఒక విషయం గమనించాను- యాదృచ్చికమే కావొచ్చు- వీళ్ళు అంటే ఈ బ్యాంకుల్లో పెద్ద పొజిషన్లలో ఉండేవారు, పెద్దగా అందరితోనూ కలవరు! పరిచయం చేసికుంటే ఎక్కడ అప్పు అడుగుతాడేమో అని భయం కావొచ్చు! ఒక బ్యాంకు వాళ్ళు ఇంకో బ్యాంకు వాళ్ళతో బాగానే ఉంటారు. బయటవాళ్ళతోనే ముభావంగా ఉంటారు!ఊరికే సరదాగా అన్నాను, ఏమనుకోకండీ, అయినా నాకెందుకండి బాబూ ఇప్పుడు అప్పులు?

   బాపట్లనుండి, హైదరాబాద్ రావడానికి రిజర్వేషను చేయించలేదు, మా స్నేహితురాలు కారులో వచ్చింది, ముహూర్తం అవగానే, రాత్రికే ఏలూరు వెళ్ళిపోతూందని తెలిసి, నన్ను దారిలో విజయవాడలో దింపేయమన్నాను.ఎరక్కపోయి, మా ఫ్రెండుతో చెప్పాను.ఎక్కడ విన్నాడో ఈ విషయం, నేనూ విజయవాడే వెళ్ళాలీ, నన్నూ తీసికెళ్ళండీ అంటూ తయారయ్యాడు! నాకైతే చాలా ఎంబరాసింగ్ గా అనిపించింది. పోనీ నేను మానేద్దామా అనుకుంటే, కాదూ కూడదన్నారు, మా ఏలూరు స్నేహితురాలు. మా స్నేహం 30 సంవత్సరాలు, ఈ కొత్తాయనకి కొన్ని గంటలు పరిచయం! అసలు ఎలా అడిగేస్తారో, ముక్కూ మొహం తెలియని వాళ్ళని. వద్దూ అనడానికి మా ఫ్రెండుకి మొహమ్మాటం! పైగా, మేము ఎక్కడ ఆయనకి చెప్పకుండా చెక్కేస్తామో అని, నా బ్యాగ్గు ఆ పెళ్ళిమండపం లో ఆయనకిచ్చిన రూమ్ములో పెట్టి తాళం వేశాడు. అలాగుండాలి తెలివితేటలంటే!ఎన్ని చెప్పండి,చాలా సంవత్సరాలు రాష్ట్రానికి బయట ఉండి,తిరిగి అక్కడ నెగ్గుకురావడం చాలా కష్టం అని అనుభవం ద్వారా తెలిసింది! ఇంకో విషయం-ఈయనకూడా ఓ బ్యాంకులో మేనేజరే !

   రాత్రి 1.30 కి విజయవాడ లో దిగ్గానే హైదరాబాద్ కి బస్సు రెడీగా ఉంది. తెల్లారి, 8.30 కి హైదరాబాద్ చేరాను…

13 Responses

  1. 🙂 బావున్నాయండీ కబుర్లు. మొత్తానికి మా వూరు చూసొచ్చారు 😀

    Like

  2. I am from bapatla. I am expected lot of new/gossip/information from you sir. I am curiously waiting for this post. But looks like you are disappointed ….. 🙂

    Like

  3. అంతే అంతే…..

    భావనారాయణ స్వామి గురించి రాయలేదే???

    Like

  4. @వీకెండ్ పొలిటీషియన్,

    మీ ఊరు చూసే అవకాశం లభించినందుకు నాకూ సంతొషమయింది.
    @kum,
    I was not disappointed. I posted another blog about Bapatla, today.Hope I did not hurt your sentiments.

    @రెహ్మానూ,

    ఈవేళ ఇంకో టపా వ్రాశాను.

    Like

  5. సో అలా బాపట్ల వెళ్ళొచ్చారన్నమాట.
    నేను సుమారు ఇరవయ్యేళ్ళ కిందట అక్కడ ఒక యేడాది ఉన్నాను, ఇంజనీరింగ్ కాలేజిలో పాఠం చెబుతూ. ఆ వీధీ, వీధిలో సైకిళ్ళూ అన్నీ అలాగే ఉన్నాయి 🙂
    వాహన యోగాన్ని వాసనతో పసిగట్టడం, ఒకసారి పసిగట్టాక, అది సిద్ధించుకునే దాకా పట్టు విడవకపోవడం కొందరికి మజాగతమైన విద్య. కొంతమందైతే దబాయించి అడుగుతారు గూడాను, ఎందుకు తీసుకెళ్ళరండీ అని.

    Like

  6. యాభైఏళ్ళ క్రిందటి నాచిన్నతనపు గుర్తుల రీలు కళ్ళ ముందు తిరిగింది .
    బాపట్ల లో మూడేళ్ళ వయస్సు నుంచి సుమారు రెండేళ్ళు గడిపాను.
    భావనారాయణ స్వామి కోవెల గుర్తు పట్టాను.
    చిన్న నాడే చని పోయిన నా పెద్దక్క జానకి బాపట్ల లోనే నన్ను వదిలింది .
    నన్ను పెంచి ప్రయోజకుడిని చేసి నన్ను అనాధ గా వదిలి న మా అమ్మ నాన్న,
    ఎదురు ఇంటిలోని గంటివారి అక్కయ్యులు, అన్నయ్యలు అందరూ గుర్తుకొచ్చారు.
    గుర్తుకు తెచ్చిన మీకు ధన్యవాదాలు
    .

    Like

  7. ఫణిబాబుగారూ,

    మీరు జత చేసిన చిత్రాలలో ఉన్నది భావన్నారాయణస్వామి గుడి. ఆ చిత్రాలు గడియారస్తంభం దగ్గర నుంచి తీసి ఉంటారు. ఇప్పుడు గడియారస్తంభం లేదులెండి. ఆ గుడి చోళుల కాలములో నిర్మించారని చెబుతారు. ఆ గుడి మూల విరాట్టు ఉన్న గదికి వెనుక తిరువనంతపురములో ఉన్నట్టు అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంటుంది. అయితే అది ఆధునిక నిర్మాణం. గుడి ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. ఆ గుడిలో జరిగే రథోత్సవం ప్రజాకర్షణ కలది. గుడి పక్కనే రధాన్నికూడా గమనించవచ్చు. రథం ఉన్న బజారు పేరు రథం బజారు. ఎలాగూ బాపట్లదాకా వెళ్ళారు కదా సూర్యలంక చూడలేకపోయారా?

    @ కొత్తపాళీగారూ: మీరు బి,ఇ.సిలో చేశారా? ఏ సంవత్సరమో? నేను పోయినేడాదే కెమికల్ ముగించి బయటకి వచ్చాను.

    Like

  8. @ అచంగ – నేనెప్పుడు చేశానో పైన వ్యాఖ్యలో చెప్పాను. నేనున్నది ఒక్క ఏడే. ఇప్పుడూ కెమికల్ కూడా పెట్టారా? అప్పటికింకా బాగా కొత్త కాలేజి. హాస్టలు నిర్మాణం అవీ కూడా పూర్తికాలేదు. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్ – మూడే బ్రాంచిలుండేవి. మీకెప్పుడన్నా కొంచెం ఖాళీ ఉన్నప్పుడు నా బ్లాగులో బాపట్ల అని సెర్చి కొట్టి చూడండి.

    Like

  9. @కొత్తపాళీ గారూ,

    మీలాటివారి ఫుట్ ప్రింట్స్ ఉన్నచోటుకి, నేనూ వెళ్ళేనన్నమాట. అదృష్టవంతుణ్ణి .

    @మోహన్ గారూ,

    మీ చిన్నతనపు రోజులూ,అక్క గారూ, తల్లితండ్రులూ,అన్నిటికంటె ముఖ్యంగా మీ ఇంటికెదురుగా ఉండే గంటి వారినీ గుర్తుచేయడం లో నా టపా ఉపయోగపడినందుకు చాలా సంతోషం గా ఉంది.

    @అచంగా,

    అసలు ఈ మాత్రమైనా చూడడం నా అదృష్టం.

    Like

  10. మా వూరు వెళ్లి వచ్చారన్న మాట. మా ఊరని కాదుకానీ అక్కడ ఉన్నంత ప్రశాంత వాతావరణం ఇంకెక్కడా కనిపించదు. గడియారస్తంభం పడగొట్టడం గుర్తొచ్చింది మీ టపా చదవగానే. ఇంతకీ అక్కడ మిరపకాయ బజ్జీలు తిన్నారా లేదా?

    Like

  11. తొలకరీ,

    మిరపకాయ బజ్జీలు తినే సావకాశం ఎక్కడా? రోజంతా పెళ్ళివారి భోజనాలతోనే సరిపోయింది !!

    Like

  12. maa bapatla cusinanduku meeku abinandanalu

    Like

  13. @ మల్లిఖార్జున రావుగారూ,

    ధన్యవాదాలు.. btw ఈవేళ ఒక టపా పెట్టాను. దయచేసి ఒకసారి చదవండి. మీరు వ్యాఖ్యలు అచ్చ తెలుగు లిపి లో ఎలా వ్రాయాలో తెలిసికోవచ్చు. మిమ్మల్ని తప్పు పట్టేననుకోకండి. మీరు టింగ్లీషులో వ్రాయబట్టి, ఇలా చెప్పాను. ఏమీ అనుకోకండి…

    Like

Leave a comment