బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ఉభయ భాషా ప్రవీణులు…

   మొన్నెప్పుడో Hm tv లో ఒక కార్యక్రమం చూశాను. ఇంగ్లీషు ఎలా మాట్లాడాలో,మామూలుగా మాట్లాడడానికి ఏమేం చేయాలో వగైరా వగైరా.ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇంగ్లీషు రాకపోతే, ఉద్యోగాలు రావేమో అనే బెంగోటి. దానితో రోడ్డుకో
Institute of spoken english లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశాయి.ఆఖరికి ఎల్.కేజీ,యు.కేజీ చదివించే స్కూళ్ళ బయట కూడా బోర్డులూ, ‘కేరళ నుండి ప్రత్యేకంగా వచ్చిన టీచర్లూ’ అని, అక్కడికేదో, వాళ్ళే ఇంగ్లీషు బాగా మాట్లాడేవాళ్ళలా.ఇంక అలాటి బోర్డులు చూసి, మన పెరెంట్స్ కూడా ఎగేసుకుంటూ పోతారు.
మళ్ళీ ఇంటికొచ్చి ‘దిక్కుమాలిన’ తెలుగు లో మాట్లాడి, అంతంత డబ్బులుపోసి నేర్పిస్తున్న ఇంగ్లీషు ఎక్కడ మర్చిపోతారో అని ఆ పిల్లకో పిల్లాడికో ప్రొద్దుటే నిద్రలేపి, పళ్ళు తోమించి, తిండి పెట్టి, స్కూలుకి రిక్షాలో పంపి,రాత్రికి మంచం మీద నిద్రబుచ్చేదాకా అన్నీ ఇంగ్లీషులోనే. మాటకు ముందర ఓ Excuse me, ప్రతీదానికీ మళ్ళీ ఓ Welcome, thanks. ఇంక ఆ పిల్లాడో/పిల్లదో ఇంగ్లిషు పరిజ్ఞానం చూసి, ఆ తల్లితండ్రులు మురిసిపోవడం,’అబ్బ మన offspring గాడు ఎంత బాగా ఇంగ్లీషులో మాట్లాడుతున్నాడో అవటా’ అని! ఈ offspring అన్నమాట, ’30 రోజుల్లో ఇంగ్లీషు నేర్చుకోడం’ పుస్తకం ఒకటి, footpath మీదో కొనితెచ్చుకుని నేర్చుకున్న బాపతన్నమాట!

ఈలోపులో, వీళ్ళ చుట్టాలెవరో ఏ అమెరికానుండో,ఇంగ్లాండ్ నుండో పిల్లా పీచులతో వస్తారు, ఇంక వీళ్ళకి పండగే పండగ.వాళ్ళు ఇండియాలో ఉన్నంతకాలమూ, వీళ్ళతోనే కాలక్షేపం, ఇంగ్లీషులో తినడం,ఇంగ్లీషులో నిద్రపోవడం వగైరా వగైరాలు. పాపం ఆ అమెరికా నుండి వచ్చిన వాళ్ళకేమో, మన పిల్లలకి మన సంస్కృతీ,సంప్రదాయాలు నేర్పించొచ్చు కదా ఈ శలవల్లో అని వాళ్ళూ, ఈ పిల్లలతో ఎక్కువ సమయం గడిపితే, మన పిల్లలూ అమెరికా వెళ్ళిపోవచ్చుకదా అని వీళ్ళూ. అంతా ఓ పేద్ద కామెడీ లాగుంటుంది!’ సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాలో సుధాకర్ పోషించిన పాత్ర లాగ! అదేదో సినిమా అని కొట్టిపారేయొద్దు, నిజజీవితంలోనూ ఇప్పుడు ఎక్కడ చూసినా ఇలాటివే.ఈ ఎన్ ఆర్ ఐ లకి, ఇండియా వచ్చి పొడిచేసేదేదీ లేదూ, ఈ నేర్పించేదేదో అక్కడే హాయిగా నేర్పించొచ్చూ అని ఓ అభిప్రాయం ఏర్పడిపోతుంది. మరి వాళ్ళు తిరిగి భారతదేశం రావడం లేదో అని వాళ్ళమిద పడి ఏడవడం దేనికీ? ఎక్కడో అక్కడ, మాతృభాష నేర్చుకుంటున్నారూ అని సంతోషించక?

పోనీ ఏదో నానా తిప్పలూ పడి, ఓ ‘కేరళనుండి ప్రత్యేకంగా తెచ్చిన టీచర్ల’ దగ్గరా, తదుపరి, ఓ కిళ్ళీకొట్టు దగ్గర పెట్టిన స్పోకెన్ ఇంగ్లీషు వాడి దగ్గరో నేర్చుకున్న పరిజ్ఞానం వల్ల లాభం ఏమైనా ఉంటుందా అంటే అదీ లేదూ. ఆ స్పొకెన్ వాడు మాట్లాడడం ఎలాగో నేర్పడం వరకే చెప్తాడు. మామూలుగా దంపతుల్ని Mr and Mrs. ఫలానా అంటారు. మనవాడు అరకొరగా నేర్చుకున్నది Mrs.కి ఫుల్ ఫాం Mistress అని. వీడికి డౌట్ వచ్చేస్తుంది, Mistress అంటే
సెకండ్ సెటప్
అనికూడా అదేదో సినిమాలో విన్నామూ, ఇప్పుడు ఈ Mrs. గారు ఒరిజినలా, లేక సెకండా అని!అలాగే పెద్దవారైన స్త్రీలని madam అని సంబోధించాలీ అని ఆ స్పోకెన్ వాడు ఏడ్చి చచ్చాడు, మనవాడేమో, పైరేటెడ్ సీ డీ ల్లో చూశాడు,’అక్కడెక్కడో’ అమ్మాయిలని సప్లై చేసే చోట, అవిడని ‘మేడం’అని అంటారని!ఏమిటో అంతా గందరగోళం గా ఉందీ అని రెంటికీ చెడ్డ రేవడిలాగ,ఏ భాషా రాకుండా పోతాడు.

ఇంక వీడి తల్లితండ్రులైతే సూపర్ ! అడిగినవాడికీ, అడగనివాడికీ, ఆపి మరీ చెప్తారు- మా వాడు చాలా hardly గా చదువుతున్నాడండీ అని, అక్కడికి ఓ hard కి ly చేర్చేస్తే అందంగా ఉంటుందని! తెలియడం లేదూ ! అసలు ఈ గొడవంతా ఎందుకు వచ్చిందంటే, మా స్నేహితుడొకాయన ఎవరి గురించో చెప్తూ వాళ్ళబ్బాయికి మార్షల్ సమస్యలొచ్చాయండీ అన్నారు.ఏ లోకసభా లోనో అసెంబ్లీలోనో మార్షల్ గా ఉద్యోగంలో ఏమైనా సమస్యలొచ్చాయేమొ అనుకున్నా, కాకపోతే,ఏ కుంగ్ఫూ,కరాటే లేమో అనుకున్నా. కాదుట, ఆ స్నేహితుడి కొడుకూ కోడలూ ( ఈ మధ్యనే పెళ్ళి చేసికున్నారు) ఏవో సమస్యలొచ్చి కొట్టుకున్నారుట! అర్ధం అయిందా, ఏదో ఇంగ్లీషులో చెప్తే స్టైల్ గా ఉంటుందీ అని,మారిటల్ కి మార్షల్ అన్నాడు!

అన్నిటిలోకీ గందరగోళం తెచ్చే పదాలు decease,disease.నా చిన్నప్పుడు మా చుట్టం ఒకాయనకి పెళ్ళి శుభలేఖ పంపారు.ఆ రోజుల్లో మన పోస్టల్ వాళ్ళు చాలా sincere గా ఉండేవారు. ఏ కారణం చేతైనా ఆ లెటర్ డెలివర్ అవకపోతే, దానిమీద Addressee not found అని ఎర్రింకుతో రాసేసి DLO ( dead letter office) కో, ఒక్కొక్కప్పుడు తిరిగి మనకో పంపేసేవారు.ఈ రోజుల్లో DLO ల్లో ఆ Dead ఒకటే మిగిలిందనుకోండి, అది వేరే విషయం, అసలు సంగతికొస్తే ఎవరికైతే పంపామో ఆయన, నిజానికి జబ్బు పడి హాస్పిటల్లో చేరాడు, ఆ పోస్టల్ వాళ్ళేమో Deceased అని వ్రాసేసి,తిరిగి పంపేశారు.ఇక్కడేమో వీళ్ళకి ఖంగారూ, ఆయన ఉన్నాడో ఊడేడో అని,ముహూర్తం మార్చుకోవాలేమో, అసలే మైలా అదీనూ అని. మింగలేరు కక్కలెరు .ఏదైతే అదే అవుతుందని పెళ్ళి కానిచ్చేశారు. చివరకు పదహార్రోజుల పండగ టైముకి ఆయనా వచ్చాడు, గుండ్రాయిలా ఉన్నాడు కథ సుఖాంతం!!!

%d bloggers like this: