బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పైసా వసూల్…

   ఏమిటో ఏదో అనుకుని ఏదో చేస్తాము.మొన్న ఆదివారం మార్కెట్ కి వెళ్ళినప్పుడు, నేను రెగ్యులర్ గా కూరలు తీసికునే కొట్టువాడు, దొరికినప్పుడల్లా తప్పకుండా తీసికునే ‘బచ్చలి కూర’ తెచ్చాడు. ఆ బచ్చలికూర చూస్తే అసలు వళ్ళూ ఇల్లూ తెలియదు నాకైతే.ఓ అరకిలో తూపించి, దానితో ఇంకో అరకిలో కంద కూడా తీసికుని కొంపకు చేరాను. ఆరోజు, పిల్లలు హైదరాబాదు నుంచి ఇంకా రాలేదు కదా అని, మా ఇంట్లోనె ఉన్నాము. తెచ్చిన కూరలన్నీ, పనిమనిషి చేత ఫ్రిజ్ లో పెట్టిస్తూ చూసింది, మా ఇంటావిడ నేను తెచ్చినవి. ‘అబ్బా మళ్ళీనా బాబూ కందా బచ్చలీనూ..’ అంటూ. నేనేమైనా మణులడిగానా మాణ్యాలడిగానా, ఎప్పుడైనా కందా బచ్చలీ దొరికినప్పుడు, కూర చేయమన్నానంతే కదండీ. పోనీ మా అబ్బాయీ వాళ్ళకుక్కు చేత చేయించనా అంది. వద్దుబాబోయ్ ఆవిడకి కంద కీ కాందా( ఉల్లిపాయ) కీ తేడా తెలియదు. ఎలాగోలాగ ఓపిక చేసికుని, మనం ఉండే ఇంటికి వెళ్ళిన తరువాత చెయ్యీ, అని బ్రతిమాలించుకుని, బామాలించుకుని మొత్తానికి ఒప్పుకుంది.

   అవ్విధంబుగా కందా బచ్చలికూర కార్యక్రమం ఈవేళ పెట్టుకుంది. ఏమాటకామాటే చెప్పుకోవాలి, కందా బచ్చలికూర బ్రహ్మాండంగా చేస్తుందిలెండి. అలాగని మిగిలినవి చేయదనికాదూ, దానితోపాటు మామిడికాయ పప్పూ,మజ్జిగపులుసూ, కొత్తావకాయైతే ఉండనే ఉంది.ఇంకేం కావాలి? ఏదో వేళపట్టున అప్పుడప్పుడు ఇలాటి తిండి తినొచ్చుననే కదా, విడిగా ఫ్లాటు తీసికుని ఉంటున్నదీ? అక్కడైతే ఆ కుక్కు చేసే వంటలు తినే ఓపికా సహనమూ లేదు నాకైతే.ఆవిడ మాత్రం ఏంచేస్తుందీ,పిల్లలు నూనె ఎక్కువ వేయొద్దూ, ఉప్పూ కారం తగ్గించూ అంటే. ఏమిటో అర్ధం అవదు, బతికున్న నాలుక్కాలాలపాటూ హాయిగా నోటికి హితవుగా ఉండేవి తినకుందా, ఏమిటో, హెల్త్ కాన్షస్సూ అంటూ…

   ప్రొద్దుటే వెళ్ళి, మా అమ్మాయికి ఈవిడిచ్చిన మాగాయ, మామిడికాయ ఒరుగులూ ఇచ్చేసి, తనతో ఓ గంట కబుర్లు చెప్పి,ఓ చాయ్ తాగెసి, దారిలో మా ఇంటికి వెళ్ళి, కోడలుతో మాట్లాడి, మెల్లిగా పన్నెండున్నరకి కొంపకి చేరాను.ఈవేళ మా ఇంటావిడ చేసిన మెనూ చెప్పానుగా (పైన రెండో పేరాలో మొదటి లైను..).వహ్వా ‘ఏనాటి నోము ఫలమో..అని త్యాగరాజస్వామివారి కృతి హమ్ చేసికుంటూ, భోజనం పూర్తి చేశాను. అప్పుడు కూడా పొంచి ఉన్న డేంజరు పసికట్టలేకపోయాను. అన్నదాతా సుఖీభవా అని ఆశీర్వదిస్తూ భోజనం పూర్తయిన తరువాత, ఓ కునుకు తీద్దామని పడుక్కున్నాను.

   నాలిగింటికి ఏదో కిరసనాయిలు వాసనేస్తూందేమిటా అనుకుంటూ చూశాను. అప్పటికే మా ఇంటావిడ క్లీనింగ్ అభియాన్ కార్యక్రమంలో కొంత భాగం పూర్తి చేసి, ఓ కుర్చీ వేసికుని ఫాన్లు తుడుద్దామనే సదుద్దేశ్యంతో ఓ ఫాన్ కింద నుంచుని, ప్రయత్నం చేస్తోంది.అప్పటికే, ఈ కిరసనాయిలు వాసన తగిలి ఒకావిడ వచ్చి ఇంక్వైరీ చేసింది. దానిమీద ఓ టపా కూడా వ్రాసేసింది ( మా ఇంటావిడే లెండి).ఎంత కాళ్ళెత్తినా ఆ ఫాన్ అందుతుందా ఏమిటీ? పైగా ఏ కాలో తూలి కిందపడిందంటే అదో గొడవా.అసలు ఈ ఫాన్లెందుకో, పీరియాడికల్ గా వాటిని క్లీనింగెందుకు చేయాలో అర్ధం అవదు నాకు. నాకు తెలిసినదల్లా, మా ఇంటావిడ స్లిప్ అయి కిందపడకుండా చూడ్డం మాత్రమే. పోనీ నేనేమైనా తాటి చెట్టులా పొడూగ్గా ఉంటానా అంటే అదీ లేదూ, మా ఇంటావిడకంటె ఓ బెత్తెడు పొడుగు. నా ఖర్మకాలి, కుర్చీ వేసికుంటే ఆ ఫాన్ రెక్కలు నాకు అందేలా ఉంటాయి. అదండీ నేను చేసికున్న పాపమల్లా! పొనీ పక్కవాళ్ళింట్లో ఎత్తుగా ఉండే స్టూలు తెద్దామా అంటే, వాళ్ళ పిల్ల, స్టూల్ కనిపించడంలేదూ అని డిక్లేరు చేసేసింది. ఆ స్టూలేమైనా చిన్నదా చితకదా మాయం అయిపోవడానికీ, ఏమిటో నా దురదృష్టం!

   ఇంక ప్రారంభం నా exercise,ఆ కుర్చీ పాడైపోకుండా ఓ గుడ్డ వేసి, నా చేతిలో కిరసనాయిల్లో ముంచిన గుడ్డోటి పెట్టి, your time starts now.. అంటూ ఓ విజిలేసింది.ఆ ఫాన్ రెక్కలకున్న బూజూ,మట్టీ ఇంతా అంతానా? నేను ఈ కిరసనాయిల్లోముంచిన గుడ్డ పెట్టి తుడవడం మొదలెట్టేసరికి అక్కడ అప్పటిదాకా లేని మరకలు, పైగా ఆ ఫాన్ రంగుకూడా క్రీం కలరేమో,తయారయ్యాయి.పైగా ఎండే లోపల, పొడిగుడ్డతో తుడిచేయాలని, instructions from time to time ఓటీ.ఒక రెక్క తుడుస్తూంటే ఇంకో రెక్క మీద ఆరిపొకుండా ఉంటుందా? ఏమిటో ఈవిడ చేతిలో పడ్డానూ, అనుకుంటూ, ఆ దిక్కుమాలిన కిరసనాయిల్లో ముంచిన గుడ్డ అవతల పారేసి, మామూలు సీదా సాదా తడిగుడ్డ తీసికుని, మా ఇంటావిడ దర్శకత్వంలో మొత్తానికి, ఆవిడ చేత ‘ఫరవాలేదూ..’ అనిపించుకుని ఆ కుర్చీ దిగాను. అప్పుడే ఎక్కడయిందీ ఇంకా రెండు ఫాన్లు మిగిలాయి.అదృష్టం ఏమిటంటే, వాటి కలర్ బ్రౌన్ ! మరీ నన్ను తిప్పలు పెట్టకుండా రక్షించాయి.

   అప్పుడనిపించింది, ప్రొద్దుటే కందా బచ్చలి కూర చేయమన్నందుకు ఏమైనా రివెంజ్ కార్యక్రమమా ఇదీ అని! ఏమైతేనేం, మా ఇంటావిడకి పైసా వసూల్!అప్పుడే ఎక్కడ అయిందిలెండి, ఏ రాత్రివేళో లైటు వెల్తుర్లో మళ్ళీ ఏ మరకైనా కనిపించిందో
మళ్ళీ మొదలూ, కుర్చీ,దానిమీద ఓ గుడ్డా, చేతిలో ఓ తడిగుడ్డా! అర్ధరాత్రి లేపకుండా ఉంటే చాలు !!!!

%d bloggers like this: