బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- తిరుగు ప్రయాణం లో …

   విజయవాడ నుండి శనివారం సాయంత్రానికి బదులుగా, ప్రొద్దుటే తిరిగిరావడంతో, ఆ రోజు భోజనం ఎక్కడో తెలిసింది కాదు,ఆదివారం లంచ్ అయితే, ‘వారం’ చెప్పేసికున్నా.అందుకోసం, ఎస్.ఆర్ .నగర్/కల్యాణి నగర్ లో ఉంటున్న, మా మరదలి ఇంటికి ఫోను చేసి, ఆరోజుకి తిండి పెడుతుందో లేదో తెలిసికుని, ఆటో లో కాచిగూడా నుండి, అక్కడకు వెళ్ళాను. ఎన్నిసార్లు వెళ్ళినా,వాళ్ళిల్లు పట్టుకోవడం నాకెప్పుడూ కన్ఫ్యూజనే!ఏదో మొత్తానికి, ఆటో వాడిని, తోటి ఆటో వాళ్ళని అడిగించి,చేరాను.ఆరోజు సుజాత గారికీ, రెహ్మానుకీ ఫోను చేశాను. మళ్ళీ ఆదివారం సంగతి మర్చిపోతే వామ్మొయ్.ఎందుకైనా మంచిదీ, వాళ్ళచెవినీ ఓ మాటేసి, వాళ్ళచేత ఓసారి confirm చేసేసికుంటే, ఓ గొడవొదిలిపోతుంది!

   మా డాక్టరు ఫ్రెండున్నారే ఆయనదీ ఇదే పాలసీ- వారు మా ఇంటికొచ్చినా, మేము వారింటికి వెళ్ళినా, భోజనాల ఏర్పాటు ఎక్కడో చెప్పమనెవారు!!-ఆదివారం ప్రొద్దుటే, పదకొండు గంటలకల్లా వాళ్ళింటికొచ్చేయమని వచ్చేయమని సుజాతా,
ఎటువంటి పరిస్థితుల్లోనూ తొమ్మిదిన్నర కల్లా, నేనుండే చోటుకి వచ్చి, నన్ను తీసికెళ్ళతానని రెహ్మానూ, మొత్తానికి అంచెలంచెలుగా, 10.45 కి బయలుదేరి 11.30 కి సుజాత గారుండే కొండాపూర్ చేరాము.అక్కడకి ఎలా వెళ్ళేమంటారా, ఓ పాయింటు నుంచి ఇంకో పాయింటు దాకా ఓ షేర్ ఆటో, మళ్ళీ అక్కడినుండి ఇంకో చోటకి ఇంకో ఆటో! ఆ పాయింట్ల పేర్లడక్కండి, నాకైతే గుర్తు లేవు.నాకు తెలిసినదల్లా, తీసికెళ్ళేవారు తెలిసినవారూ,వెళ్ళేవారు తెలిసినవారూ! మధ్యలో ఏమయితేనేమిటీ?

   ఈ షేర్ ఆటోల్లో నలుగురికి బదులుగా ఓ అరడజను మందిని కుక్కేస్తారు. వెనక్కాల ఒకళ్ళ ఒళ్ళో ఒకళ్ళూ, ముందు డ్రైవరుకి భుజకీర్తుల్లా, చెరోవైపునా ఒక్కోళ్ళు!దారిలో ఏ ట్రాఫిక్కు పోలీసో కనిపించాడనుకోండి, మనవాడు, రోడ్డు పక్కగా ఆటో ఆపేసి, సీరియస్సు గా ఆ పక్కనే ఉన్న పోలీసులదగ్గరకి వెళ్ళి, ఏదో దక్షిణ ఇచ్చేసి, పైగా దానికో ప్రింటెడ్ రసీదోటి తెచ్చి, ఆటో ముందర అంటించేస్తాడు! ఒకసారి ఆ రసీదుని చూస్తే చాలుట, ఇంక ఆరోజంతా వీడు ఎంతమందినెక్కించికున్నా, ఎవడూ అడగడుట!mutually accepted and government approved system!! వహ్వా!

   సుజాత గారింటికి వెళ్ళేటప్పటికి అక్కడ వేణు ఉన్నారు. ఆయనకీ నాకూ పరిచయం,’తెలుగుబాట’ కార్యక్రమం లో,ఎటువంటి హడావిడీ లేకుండా, ఏ చానెల్ వాడితోనూ ‘బైట్లు’ తీసికోబడకుండా,మా దారిన మేమిద్దరమూ ‘తెలుగుతల్లి’ విగ్రహం నుంచి, జ్ఞానభూమి వరకూ పాదయాత్ర ( ఎవరి దగ్గరా లిఫ్ట్ తీసికోకుండా) చేసిన ఇద్దరు ప్రాణులం! అంతా బావుంది కానీ, ఒక్కటే లోటు అనిపించింది. ఆవిడ లంచ్ కి పిలిచారు కదా, ఓ పండో, స్వీటో తీసికెళ్ళాలని తట్టొద్దూ,వాళ్ళమ్మాయికి ఓ క్యాడ్బరీస్ తీసికెళ్ళాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, చేతులూపుకుంటూ వెళ్ళాము.అక్కడకి వాళ్ళేదో expect చేస్తారని కాదు,జస్ట్ ఏ సంప్రదాయం! అసలు రెహమాన్ననాలి దీనికంతకూ, ఓ పాయింటు నుంచి ఇంకో పాయింటు వరకూ షెర్ ఆటో కోసమే చూస్తాడా, లేక ఈ విషయమే గుర్తుచేస్తాడా? ఏదో అలా జరగాలని రాసిపెట్టుంది ,జరిగింది.But it left a bitter taste in my mouth. Sorry అమ్మా!

   ఇంక అక్కడ కబుర్లంటారా, అడక్కండి, ఎన్నెన్ని టాపిక్కులో! మధ్యలో ఆ బజ్జులోటీ.విసుగొచ్చేసి, దాంట్లోంచి బయటకొచ్చి, బ్లాగులే రాస్తామన్నారు. అనడం వరకే లెండి, సుజాతా, రెహమానూ ఇంకా ఆ ‘మాయ’ లోనే ఉన్నారు!ఇంతలో శ్రీనివాసు వచ్చారు. మళ్ళీ ఈ శ్రీనివాసెవరని అడక్కండి, ఆ ఇంటి యజమాని!!సుజాతా శ్రీనివాసుల గారాల పట్టి, వీళ్ళిద్దరికంటే యాక్టివ్! అసలు నాకూ వీళ్ళందరికీ సంబంధం ఏమిటండీ?ఏదో ఈ బ్లాగులద్వారా పరిచయం.వారందరితోనూ గడిపిన నాలుగైదు గంటలూ, వారందరూ చూపిన అభిమానమూ, గౌరవమూ, సుజాత వడ్డించిన -పప్పూ, వంకాయకూరా, పులిహారా,దప్పళమూ,గారె- వీరందరి మనస్సులాగ షడ్రసోపేతం గా ఉన్నాయి.It made my day.

   నాలుగున్నరయిన తరువాత, శ్రీనివాస్ తన కార్ లో బస్ స్టాప్ దగ్గర దింపగా, రెహమాన్ బస్సులో ఇద్దరికీ టిక్కెట్లు తీసి, ఆ కండక్టరుకి నన్ను కోఠీ దగ్గర దింపేయమని అప్పగింతలు పెట్టేయగా,ఎవరి టిక్కెట్టు వారిదగ్గరే ఉంచమని ఆ కండక్టరు చెప్పగా,మొత్తానికి, కోఠీ దగ్గర దిగేసి, ఆటోలో కాచిగూడా చేరాను క్షేమంగా! అక్కడితో అయిందా, సాయంత్రం ఆరింటికి రామూ దగ్గరనుండి ఫోనూ, ‘ఇంకో అయిదు నిముషాల్లో మీ ముందరుంటానూ..’అని. అలాగే అయిదునిముషాల్లో వచ్చేసి ప్రత్యక్షం అయారు.ఆయనతో ఓ గంటన్నర కబుర్లూ. వచ్చేటప్పుడు ఏం తెచ్చారో తెలుసా? ‘చింతకాయలు’,అదేమిటో వాటిని చూడగానే నేను గుర్తొచ్చానుట, పైగా పుల్ల పుల్లగా ఉండే యాపిల్సూ! నాకేమైనా వేవిళ్ళా ఏమిటీ ( రామూ మరీ సీరియస్సుగా తీసికోకూ, ఉత్తిత్తినే, ఇదంతా మీరందరూ ఇచ్చిన చనువే ! నెత్తికెక్కించుకుంటున్నారుగా భరించాలి మరి !).

%d bloggers like this: