బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-బ్రేక్ తరువాత…

   11 వ తారీకున బయలుదేరి, బాపట్లలో మా స్నేహితుడి కుమార్తె వివాహం చూద్దామని బయలుదేరాను. మా ఇంటావిడ ఈ మధ్యనే తణుకు వెళ్ళొచ్చిందికదా, మళ్ళీ ఈ ఎండల్లో ప్రయాణం చేయించడం ఎందుకూ అని ( అది ఒక ‘బహానా’ మాత్రమే లెండి)ఒక్కడినే బయలుదేరాను.మళ్ళీ ఆవిడకూడా వచ్చిందంటే, నన్నెవళ్ళూ పట్టించుకోరనేది ముఖ్యకారణం! అదే రోజు పగటి పూట ముహూర్తానికి, మన బ్లాగు స్నేహితురాలు జ్యోతి గారి కుమార్తె వివాహం కూడానూ. రైళ్ళలో ముందుగానే రిజర్వేషన్లు చేయించుకోవడంతో,హైదరాబాద్ పెళ్ళికి హాజరవలేకపోయాను. అలాగని, అంత అభిమానంగా, ఆహ్వానపత్రిక పంపిన, జ్యోతిగారిని, పలకరించకపోతే ఎలాగా? అందుకని, గురువారం నాడు పెళ్ళికి ఒకరోజు ముందర,హిమయత్ నగర్ లో వాళ్ళింటికి వెళ్ళి,వారందరినీ పలకరించాను. వివాహానికి హాజరై ఉంటే బహుశా మన బ్లాగుబంధువుల్ని కలిసుండేవాడినేమో.ఎంతకంతా!

   ముందుగా నా ప్రయాణ ఔట్ లైన్ మాత్రమె వ్రాస్తున్నాను,బాపట్లలో నా అనుభవాలూ, రైల్లో అనుభవాలూ,ఇంకా ఇంకా మిగిలిన టపాల్లో! కావలిసినన్ని ఉన్నాయి. మనకి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా లేకపోయినా,ఒక్కొక్కప్పుడు మనం involve అయిపోతూంటాము.అదో అనుభవమూ! ఎలాగూ నేను వెళ్ళే ట్రైను ‘సింహపురి express’ రాత్రి 10.30 కి కదా, అప్పటివరకూ కాలక్షెపం కావద్దూ మరి, జ్యోతి గారింటినుండి, మల్కాజ్ గిరి లో ఉంటున్న మా చెల్లెలుగారింటికి బయలుదేరాను.ఆటో వాడితో ముందే చెప్పేశాను, ‘చూడు నాయనా, నాకు మీ హైదరాబాదేమో కొత్తా,ఏమీ తెలియదు, పేర్లన్నీ ఒక్కలాగే ఉంటాయి,మీటరు వేసేయ్, ఆ మల్కాజి గిరి లో నాకు తెలిసిందల్లా అదేదో ఈస్ట్ ఆనంద్ బాగ్ అనేది, అక్కడ వదిలేయ్, నేనే ఏదొ తిప్పలు పడి వెళ్తాను’అని చెప్తే, అతనంటాడూ’తార్నాకా మీదనుండి వెళ్దామా’అంటే నాకేం తెలుస్తుందీ, ఒకచోట తార్నాకా, మళ్ళీ ఇంకోచోట కార్ఖానా ఏమిటో అంతా గందరగోళం!

   మొత్తానికి నెను చెప్పినచోట వదిలేశాడు.ఎన్నిసార్లు వెళ్ళినా, మావాళ్ళింటికి వెళ్ళాలంటే మళ్ళీ కన్ఫ్యూజనే!జ్ఞానసరస్వతి గుడి రోడ్డులో ఏదో ఒక సందులోకి వెళ్ళాలి. అన్ని సందులూ ఓలాగే ఉంటాయి. పోనీ ఏదైనా కొండగుర్తుంటుందా అంటే, వచ్చిన ప్రతీసారీ ఏదొ ఒక మార్పే. ఎవరినీ అడిగినా ఇంటినెంబరు అడుగుతారు, ఆ నెంబర్లేమో, పోనీ మామూలుగా ఉంటాయా అంటే అదీ లేదు.ఓ అరడజను అంకెలూ, నాలుగో అయిదో డ్యాషులూ, ఓ రెండో మూడో భిన్నాలూ, వామ్మోయ్,అసలు ఆ పోస్టల్ వాళ్ళకి ఎలా గుర్తుంటాయో? ఈ గొడవంతా పోనీ పేరుచెబ్దామా అంటే, ఆ ఇల్లు ఎవరిపేరుమీదుందో నాకేం తెలుసూ?ఫొను చేస్తే ఎవరూ తీసేవాళ్ళే లేరు.మొత్తానికి, నానా తిప్పలూ పడి వాళ్ళింటికి చేరి, మా ఇంటావిడ ఈమధ్య చేసికున్న గ్రామకుంకం నోము బాపతు, పసుపూ కుంకమూ మా చెల్లెలికిచ్చి, ఓ దండం పెట్టించుకుని, వచ్చేశాను.

   తిరిగి కాచిగుడా, మా వియ్యాలారింటికి వచ్చి, భోజనం చేసి నిద్రపోయాను.నాంపల్లిలో,తెల్లవారుఝామున 4.15 కి రైలు దిగానేమో, నిద్ర సరిపోలేదు.దగ్గరలోనే ఉందికదా అని నవోదయా కి వెళ్ళి తెలుగు పుస్తకాలు కొందామని వెళ్ళాను.
సాంబశివరావుగారితో పరిచయం ఉండడంవలన, ఆయనకి ఫోను చేసి,కొట్టుకి వెళ్దామనే సదుద్దేశ్యంతో ఫోను చేస్తే, ఆరోజు ఫొను ఇంట్లో మర్చిపోయారుట, ఆవిడెవరో ఫోనెత్తి, ఆయన కొట్లోనే ఉంటారండీ అని,చెప్పించబడి, షాప్ కి వెళ్ళి, ముందుగా ఆయన అలా ఫోన్లూ అవీ ఇళ్ళల్లో మర్చిపోకూడదూ అని ‘జ్ఞానబోధ’ చేసి,అప్పుడెప్పుడో పుస్తకం.నెట్ లో పరిచయం చేయబడ్డ శ్రీ పుచ్చా పూర్ణానందం గారి పుస్తకాలున్నాయా అని అడిగితే, అసలు ఆ పేరే వినలెదన్నారాయన,ఇంకేం చేస్తానూ? నాకు తెలిసిన వివరాలేవో చెప్తే, పాపం నలుగురైదురికి ఫోన్లు చేసి, చేతులెత్తేశారు! ఏం చేస్తాను,తూర్పుకి తిరిగి దండం పెట్టాను. అలాగని వదిలేయకుండా సుజాత గారికి ఫొను చేసి, ఛడామడా కోప్పడేశాను. ఆవిడేమో ‘కోప్పడేసేయకండి బాబయ్యగారూ, నేనే ఏదొ ప్రయత్నం చేసి మీకు ఆయన రచనలు సంపాదిస్తానూ’ అని assurance ఇచ్చిన తరువాత చల్లబడి, మిగిలిన పుస్తకాలు చూసి, పురాణం సుబ్రహ్మణ్యశర్మ గారి కథలూ,బారిస్టర్ పార్వతీశం( పూర్తి పుస్తకమూ), కాంతం కథలు ఓ మూడు భాగాలూ( అక్కడ అవే దొరికాయి),కొనుక్కుని ఇంటికి వెళ్ళాను.
రాత్రి తిండి తినేసి, సికిందరాబాద్ స్టేషన్ కి చేరి రైలెక్కాను. మిగిలిన విశేషాలు ఇంకో టపాలో….

%d bloggers like this: