బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఆదివారం సందడి…

   క్రిందటేడాది ఏమిటిలెండి, ఎన్నెన్నో ఏళ్ళనుండీ జరుగుతున్న ‘harassment’, ఏదో బ్లాగులు వ్రాయడం నేర్చుకున్నాను కాబట్టి, మీఅందరితోనూ పంచుకున్నాను.దానికే మా ఇంటావిడ ‘బాధ’ పడిపోయి, తన వెర్షన్ కూడా వ్రాసేసి,
పబ్లిక్ సింపతీ సంపాదించేసింది. అదేమైనా ఒక ఏడాదితో పూర్తవుతుందా ఏమిటీ? ప్రకృతిలో ఋతువులు మారి, వేసవికాలం వచ్చినన్ని రోజులూ, మామిడికాయలు వస్తున్నన్ని రోజులూ, మన వాళ్ళు ఆవకాయలు తింటున్నంతకాలమూ ఇది తప్పదు! ఊరికే డిగ్రీ తేడా అంతే. జరిగేది ఎలాగూ జరక్కమానదు అని నోరుమూసుకుని కూర్చోడమే!

   క్రిందటేడాది అనుకున్నాను, మా ఇంటావిడ గోల భరించలేక, మామిడికాయలు కొనడానికి తననే తీసికెళ్తే, ఆ తిప్పలేవో తనే పడుతుందీ అనుకున్నాను.అంత అదృష్టం కూడానా? వచ్చేవారం నేను బాపట్ల వెళ్ళడానికి టిక్కెట్టు తీసికున్నాను, మళ్ళీ తిరిగి వచ్చేసరికి, వాతావరణం మారిపోతుందేమో, పోనీ మామిడికాయలు తెచ్చేయకూడదూ, అంది.ఆ మామిడికాయలెందుకూ, ఒరుగులు చేసి, ఏడాదంతా, కూతురూ,కోడలూ అప్పుడప్పుడు పప్పులో వేసికుంటారని.క్రిందటేడాది అలవాటు పడ్డారులెండి.వాళ్ళకేంపొయిందీ?అమ్మ ఇస్తోంది . ఏవో కాకిమీదా, పిల్లిమీదా వంకలు చెప్పేసి, తనుమాత్రం రాదు మార్కెట్టుకి.తనొస్తే నామీద గయ్యిమనడానికి అవకాశం ఎక్కడా? ప్రతీ ఏడాదీ జరుగుతున్నట్లే పోనీ మీరే వెళ్ళి తెచ్చేయండి అంది. ఈవిడకి కొడుకూ,కోడలూ వత్తాసోటి!

   తప్పుతుందా, సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ చేస్తూంటే.సరే అని, ఎన్ని కాయలు కావాలీ,’ఎంతా, ఈమాత్రం చాలు’అని రెండుచేతులూ చూపుతుందేకానీ, లెఖ్ఖమాత్రం చెప్పదు.చివాట్లేయడానికి ఆప్షన్ తనే ఉంచుకునేటట్లుగా. అయినా నాకూ బై డిఫాల్ట్ చివాట్లు ఇలాటి వాటిల్లో తినడం అలవాటైపోయింది! కాయలెలా ఉండాలీ అంటే ‘టెంక పట్టాలిట, తొక్క పల్చగా ఉండి, కండ ఎక్కువుండాలిట’ అసలు ఇలాటి స్పెసిఫికెషన్లు ఉంటాయా? ఏమిటో దేముడిమిద భారం వేసి తెచ్చేశాను, ఓ అయిదుకిలోలు. తెచ్చినప్పటినుండీ, ఎప్పుడు ఆ కాయలు చూస్తుందా, ఆ తినే చివాట్లేదో తినేసే, భోజనం చేస్తే, బావుంటుందేమో, అని నేనకుంటే సరిపోతుందా, ఆవిడనుకోద్దూ? ఓ టబ్ తీసికుని నీళ్ళల్లో పెట్టింది,ఎన్ని కిలోలూ అంటుందే కానీ, వాటి క్వాలిటీ చెప్పదే.కొద్దిగా సైజు పెద్దగా ఉంటే, తొక్క తీసి తరుక్కోడానికి బావుండేది. మొదటి భాగం పూర్తయింది. ఆ మిగిలినవేవో పరీక్ష చేసి, కండుందా,టెంకుందా చెప్పేస్తే ఓ గొడవొదిలిపోతుందిగా,అబ్బే ఆ ఇచ్చేవేవో తన పేస్ లోనే ఇస్తే వచ్చే అలౌకికానందం,రావద్దూ?

   భోజనం వ్యవహారం పూర్తిచేసి, నడుం వాలుస్తుందే తప్ప, ఇక్కడ ఇంటిమొగాడు,పరీక్ష రిజల్ట్ కోసం చూస్తున్నాడే అని ఆలోచించొద్దూ. ఇంక ఇదికాదు పధ్ధతీ అని కొంతసేపు టి.వి. చూసేసి, నిద్రపోయాను, అయినా ఎంతసేపూ?సాయంత్రం నాలుగింటికి నిద్రలేచి. ముందుగా కిచెన్ లో చూశాను. ఆ టబ్ కనిపించలేదు, పోన్లే బాల్కనీలో పెట్టిందేమో అని అక్కడా చూశాను, మాదేమైనా బక్కింఘాం పాలెస్సా ఏమిటీ? ఉన్నవి రెండు రూమ్ములూ, ఓ బాల్కనీనూ.ఎక్కడా కనిపించకపోయేసరికి, అమ్మయ్యా తరిగేసింది అని ఆనంద పడిపోయి, రిజల్ట్ కోసం ఆగేను, ఏం చెప్తుందా అని. ఏవో రెండు కాయలు మరీ జీడికాయలూ, ఫరవాలేదూ అని పాస్ మార్కులిచ్చేసింది!

   అక్కడికి Half yearly లో పాస్ మార్కులొచ్చిన్నట్లన్నమాట,ఇంక Annual ఉంది. అదికూడా పాస్ అయితే ఈ ఏడాదికి గట్టెక్కినట్టే !!!

%d bloggers like this: