బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- This also happens !!

   నిన్న నేను వ్రాసిన టపా చదివి, కొంతమంది వ్యాఖ్యలు పెట్టారు.చాలా సంతోషం.అందులో ఒకరన్నారూ, నేనే ఒకడుగు ముందుకువేసి, ఎవరైతే స్నెహితుడితో అభిప్రాయ బేధం లాటిది వచ్చిందో, ఆయనని కలిసి, అపోహలు దూరం చేసికోవాలని. ఒకవిషయం చెప్పండి, స్నేహం కొనసాగించాలనే సదుద్దేశ్యంతోనే కదా, ఆయనకు అన్నిసార్లు ఫోను చేసిందీ,అసలు నాతో స్నేహం కొనసాగించే ఉద్దేశ్యం ఆయనకుంటే, నేను చేసిన ఆరు/ఏడు ఫోన్ కాల్స్ కీ, ఒక్కసారైనా కాల్ బాక్ చేసేవారు.ఆయనకా ఉద్దేశ్యమే లేనప్పుడు, నేను అదే విషయం పట్టుకుని బాధ పడడం అనవసరం. మా అమ్మమ్మ గారు చెప్పేవారు-‘ఎవరైనా పలకరించేరా మహబాగు, పలకరించలేదా ఇంకా మహాబాగు’ అని.ఇదివరకటి రోజుల్లో అయితే బాధ పడిఉండేవాడినేమో? ప్రతీ చిన్న విషయమూ, మనసుకు పట్టించుకుంటూ పోతే, మన ఆరోగ్యం దెబ్బ తింటుంది, లేనిపోని టెన్షన్లూ అవీనూ.కట్టుకున్న భార్య మనల్ని అర్ధం చేసికుంటే చాలు, ప్రపంచంలో ఇంకెవరు మనల్ని గురించి పట్టించుకోపోయినా ఫరవాలేదనేది నా ప్రిన్సిపల్.

   ఆతావేతా చెప్పేదేమిటంటే, ఇంటావిడతో అభిప్రాయబేధాలుండొచ్చు కానీ, మరీ ప్రాణాంతకంగా ఉండకూడదు. ఏదైనా రోగం వస్తే చూసేది ఆ భార్యే! పిల్లలకి వాళ్ళ ప్రయారిటీజ్ ఉంటాయి.ఏమో బాబూ, నాకు నచ్చింది చెప్పాను, ఇంక మీఇష్టం!

   ఏదో మనకి తెలిసిన స్నేహితుడో లేక అతని భార్యో చనిపోయారని తెలిసిందనుకోండి, వీలునిబట్టి వెంటనే వెళ్ళి పరామర్శించినా సరే, వీలునిబట్టి ఆ పదిరోజుల్లో వెళ్ళకలిగామా ఫరవాలేదు,ఒక్కొక్కప్పుడు, పరిస్థితుల ప్రభావంచేత వెళ్ళలెకపోయామా, చాలా embarrassing గా ఉంటుంది. దొంగొచ్చిన ఆరునెలలకి కుక్క మొరిగినట్లు, ఎప్పుడో వెళ్ళి పరామర్శించడం కూడా బాగోదు.అనుకోకుండానే జరిగిపోతూంటాయి ఇలాటి సంఘటనలు. అలాటివాటికి firefighting కూడా చేయలేము.పోనీ అక్కడతో అయిపోతుందా అంటే, ఒకేఊళ్ళో ఉంటూ, ఒకళ్ళనొకళ్ళు కలుసుకోకుండానూ వీలుపడదు. ఎప్పుడో కలిసినప్పుడు పరిస్థితి చాలా awkward గా ఉంటుంది.అయినా ఇలాటివి జరుగుతూనేఉంటాయి..Life goes on..

   అలాగే పెళ్ళిపిలుపుల్లోనూ,ఎంతోకాలంనుండీ స్నేహంగా ఉంటూన్నా, మతిమరపనండి, బధ్ధకం అనండి,ఇంకోటేదో కారణం చేత ఆ స్నేహితుడిని పిలవలేకపోతాము. అలాగని అతనితో శతృత్వం ఏమీ లేదు,It just happens.కనీసం ఇలాటి పరిస్థితులు రాకుండా, మనం ఎవరినైతే తప్పకుండా పిలవాలో వారి లిస్ట్ ఒకటి తయారు చేసికుని,ఆ పిలుపులేవో చేసేస్తే ఎవరికీ బాధుండదు. కొడుకైనా కూతురైనా పెళ్ళంటే మాటలా. దూరంగా ఉన్న వారికి రిజర్వేషన్లూ వగైరా చేసికోడానికి
ఓ నెలో రెండునెలలో ముందుగా తెలియపరుస్తాము.ఊళ్ళో ఉండేవారే కదా అని, దగ్గరవాళ్ళకి చెప్పొచ్చులే ఇంకా పదిహెనురోజులుందిగా,అని అశ్రధ్ధ చేస్తాము. స్నేహితులైతే అర్ధం చేసికుంటారు, వచ్చిన గొడవల్లా చుట్టాలతోనే !ప్రతీవారినీ ఇంటికి వెళ్ళి బొట్టుపెట్టి పిలిస్తేనేకానీ పిలిచినట్లుండదుట! చిన్న చిన్న ఊళ్ళలో పరిస్థితి వేరు, హైదరాబాద్ లాటి నగరాల్లో ఒకరి కొంప ఒకచోటుంటుంది, ఇంకోళ్ళది ఊరికి ఇంకోమూలా.ఊరంతా తిరిగేసరికి ఆయుద్దాయం మట్టం అయిపోతుంది. వీటికి మధ్యలో పుల్లలు పెట్టే చుట్టాలు కొందరూ,ఒకళ్ళింటికి వెళ్ళి పిలుపెట్టగానే, ఠింగు మని ఫోనెళ్ళిపోతుంది- ‘మా పెదమావగారింట్లో ఫలానా రోజు ముహూర్తం, ఇప్పుడే వచ్చి పిలుపెట్టివెళ్ళారు, మీకొచ్చిందా పిలుపూ…’అని సాగతీసుకుంటూ.మీ మామగారొక్కరే వచ్చారా, అత్తగారుకూడా వచ్చారా;;’ అంటూ ఈ ‘పిలుపుల’ మీద ఓ investigation ఒకటీ!ఆ అడిగినావిడింటికి, సమయం కుదరక వెళ్ళలేక ఏ ఫోన్నో చేశారే అనుకోండి, ఇంక వీళ్ల వ్యంగ్యాస్త్రాలు మొదలెట్టొచ్చు-‘అవున్లెండి, మా ఇంటికి రావడానికి మీకు తీరికెక్కడిదిలెండి, ఊరికి బయటెక్కడో ఉన్నా, మీ తమ్ముడిగారికోడలింటికి వెళ్ళి పిలుపెట్టడానికి టైమే టైమూ..’ ఇలాటి శాల్తీలని భగవంతుడుకూడా బాగుచేయలేడూ.

   కొందరుంటారు- కుటుంబంమీద ఉండే అభిమానంతో,ఏదో పిన్నికూతురిదో, కొడుకుదో పెళ్ళి నిశ్చయించారని గాలి కబురు తెలిసి, ఊరికి ముందర రిజర్వేషన్ చేసికుని ఉంటారు.పెళ్ళిపిలుపు రాకపోతుందా అని.శుభలేఖ మాట దేముడెరుగు, ఓ ఫోను కూడా రాదు. పాపం ఈ పెద్దమనిషి, ఏదో పోస్టల్ డిలే వల్ల రాలేదేమోనే అని సమాధానపడి, వయస్సు,ఆరోగ్యం పెర్మిట్ చేయకపోయినా, ప్రయాణం అవుతాడు, భార్య వద్దన్నా కానీ.ఇలాటివారు కూడా ఉంటారా అని అడక్కండి, ఉన్నారు నాకు తెలిసిన ఒక చుట్టం.ఎవరైనా చుట్టాల్లో పెళ్ళీ అని తెలిస్తే చాలు, మొట్టమొదట రిజర్వేషన్ చేయించేసికుంటారు. కారణం ఆయన పెరిగిన వాతావరణం అలాటిదీ, అభిమానాలు అలాటివీనూ! This also happens !

%d bloggers like this: