బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఆదివారం సందడి-2

   నాలుగింటిదాకా మామిడికాయల గొడవతో అయిందిగా,హాయిగా రాత్రి EPL లో Manchester United, Chelsea చూసుకోవచ్చూ అనుకున్నాను.మా ఇంటావిడకు ఏమీ పనిలేకుండా ఉంటే తోచదు.సోఫాలమీద ఉండే కుషన్ల కవర్లు
ఉతికి ఆరేద్దామని ఓ కార్యక్రమం పెట్టుకుని, ముందురోజు వాటిని బకెట్లో నానబెట్టి,చేత్తో ఉతికి ఆరేసింది.అదేమిటో, వాషింగ్ మెషీన్ లో వేయకూడదుట! సుఖపడేయోగం లేనప్పుడు ఎవరేంచేస్తారులెండి?

   ఒకటా రెండా, పది కుషన్లూ,వాటికి పది కవర్లూ! తీయడం అంటే అరటిపండొలిచినట్లు ఈజీయే గానీ, తొడగడం అంత సులభమా మరి? పోనీ ఏదో త్యాగం లాటిది చేసి, నేనూ ఓ చెయ్యివేద్దామా అని అలోచించి, తొడగడం మొదలెట్టే సరికి, ఆ కుషన్ కాస్తా, ఏదో స్పీడ్ బ్రేకరుకుంటుందే అలా వంపొచ్చేసింది! పోనీ అదే వేసికుని నేనే కూర్చుందామా అనుకుంటే, అదేదో ఒంటె మీద కూర్చున్నట్లుంది! దీనిల్లుబంగారంగానూ,లొంగదే.ఇదికాదనుకుని,త్యాగాలూ అవీ మానేసి,ఆవిడకే ఆ పని వదిలేశాను. ఇంతలో మా అమ్మాయి ఫోనూ, ‘మదర్స్ డే’ కి క్రమంతప్పకుండా వచ్చి ప్రతీ ఏడూ, వాళ్ళమ్మకి గ్రీటింగ్స్ చెప్పడం మాత్రం మరిచిపోదు.
అల్లుడూ,కూతురూ,మనవడూ వచ్చేసరికి ఈవిడేమో, తను బ్రేక్ ఫాస్టుకి తెచ్చుకుంటుంది,మట్కీ ( నానబెట్టిన పెసలు) మిక్సీలో ఓ తిప్పు తిప్పి, అవేవో చేసేసింది, పెసరపుణుకుల్లా ఉన్నాయి. అలా అనకూడదుట,’హరా కబాబ్’ అనాలిట,
హొటళ్ళలో అయితే వాటికి ఓ టూత్ పిక్ గుచ్చేసి, స్టార్టర్స్ అని ప్లేటుకి 70 రూపాయలు లాగేస్తాడు!ఇప్పుడు టూత్ పిక్కులెక్కడినుండి తేనూ? నాకైతే పళ్ళేలేవూ, ఆవిడకు ఉన్నా,మరీ టూత్ పిక్కులూ వాటి అవసరం ఉండదు!అయినా చూడ్డానికి ,తినడానికీ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈసారి ఆ టూత్ పిక్కులేవో తెచ్చి పడేస్తే ఇంకా స్టైలిష్ గా ఉంటాయి!

   వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి, ఇల్లంతా కవర్లు తీసేసిన కుషన్ కవర్లూ అవీనూ. ఎలాగూ కవర్లు పట్టడం లేదుకదా, ఆ కవర్లు కత్తిరించేసి, కుషన్లు పెట్టేయమని మా మనవడి సలహా. వామ్మోయ్ ఇంకేమైనా ఉందా? మొత్తానికి తల్లీ కూతురూ కలిసి కుషన్లకి కవర్లు తొడిగేశారు!ఏమ్తైనా ఆ తల్లికి కూతురే కదా! ఓ గంట కూర్చుని వెళ్ళారు. నా దారిన నేను, పావుతక్కువ తొమ్మిదినుంచీ మాచ్ చూసుకున్నాను! మా వాళ్ళు(MU) నెగ్గారులెండి.ఈవేళ సోమవారం, మా నవ్యని క్రెచ్ కి పంపకుండా, మాదగ్గర వదిలేస్తామన్నారు. ఒక్కర్తేకదా, పోనీలే, దానిదారిన అది టివి.చూసుకుంటూనో, డ్రాయింగులు చేసికుంటూనో ఉంటుందీ, సరే అన్నాము.మా అగస్థ్యని కూడా వదిలారు,Buy one, get one free లాగ! వాణ్ణి కంట్రోల్ చేయడం,బ్రహ్మ తరంకూడా కాదు. ఇంక మా నవ్యేమో, వాళ్ళ నాన్నమ్మ చేత ముద్దలు తిని, అరగంటయ్యేసరికి ఫూడుల్స్ కావాలీ, నూడుల్స్ కావాలీ అంటూ మొదలెడుతుంది.మనవడేమో ఇల్లంతా ( ఆ ఉన్నదేలెండి) దూసేస్తాడు. పూర్తిరోజెళ్ళేసరికి,ఒళ్ళంతా కదుములు కట్టేస్తుంది! అయినా, మనవలూ, మనవరాళ్ళూ బెల్లం ముక్కలే !!

%d bloggers like this: