బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- బాపట్ల -2

   ఆంధ్రదేశంలో అంతగా తిరిగింది లేదు. అలాగని మిగిలిన ప్రదేశాలన్నీ చూశానని కాదు. ఎక్కడికైనా కొత్త ప్రదేశానికంటూ వెళ్తే, అక్కడ రిక్షాల్లోనూ, ఆటోల్లోనూ తిరగనైనా తిరగాలి, లేదా నడిచైనా తిరగాలి అని నా ఉద్దేశ్యం. ఎవరో కారుల్లో తీసికెళ్తే ఏం తెలుస్తుందీ? అయినా ఏదైనా ప్రదేశాన్ని గురించి వ్రాయడానికి, కనీసం రెండు మూడు రోజులైనా గడపందే ఏం తెలుస్తుందండీ?ఏదో పెళ్ళికి వెళ్ళానూ, పైగా ఎంతో దూరం (పూణె నుంచాయే) నుండి వచ్చానూ, ఎక్కడ శ్రమ పడిపోతానో, అని ఏ.సీ. రూమ్ముల్లో వసతీ, ఇంకేం తెలుస్తుందీ?

   మమ్మల్నుంచిన హొటల్, ఒక వారం క్రిందటే ప్రారంభించారుట.అందుచేత, దానిలోని లోటు పాట్లు అప్పుడే బయట పడలేదు! మహరాష్ట్ర గవర్నరు గా పనిచేసిన, కోన ప్రభాకర్రావుగారిదిట ఆ హొటల్.ఈ హోటల్ కి ఎదురుగానే ఓ ఓపెన్ యెయిర్ థియేటరోటీ,అది కూడా ఆయనదే.ఇంక ఊరుసంగతంటారా,మామూలుగా ఉండే యావరేజ్ పట్టణం లాగానే ఉంది. దుమ్మూ, ధూళీ,ఓ వరసా వావీ లేని ట్రాఫిక్కూ. రోడ్డు వెడల్పు చేయడానికి మున్సిపాలిటీ వారిచే, కొట్టేయబడిన మొండి గోడలూ, వాటి పక్కనే శుభ్రంగా ఉన్న షాప్పులూ, కారణం ఏమిటయ్యా అంటే, వాళ్ళు కోర్టునుంచి స్టే తెచ్చుకున్నారుట! ఇంక అయినట్లే రోడ్డు వెడల్పు కార్యక్రమం !</b.

   బాపట్ల ప్రజలమీద రుద్ద బడిన పార్లమెంటు సభ్యురాలు,పనబాక లక్ష్మి, అక్కడావిడ కాదుట! ఆ ప్రాంతానికి చెందిన పురంధరేశ్వరిని విశాఖ పట్టణమో ఎక్కడకో పంపించేశారుట. ఏమిటో, ఈ రాజకీయాలూ అవీనూ.అదే రోజున కడప ఎన్నిక ఫలితాలొచ్చాయి. ఓ రెండు మూడు ఆటోల్లో ఓ పాతికమందిదాకా అరుచుకుంటూ, టపాకాయలు కాల్చుకుంటూ తిరగడం మాత్రం చూశాను.

   నెట్ లో చదవడం వలన, భావన్నారాయణ గుడి అంత ప్రాచీనమైనదని తెలిసింది. ప్రొద్దుటే 11.30 కి వెళ్తే, మూసేసుంది. అందువలన ప్రత్యేకంగా సాయంత్రం ఆరింటికి వెళ్ళి దర్శనం చేసికున్నాను.మామూలుగా నారాయణుడుండే చోట లక్ష్మీ దేవి ఉంటుందంటారు. ఏమిటో ఆ వైభవేమీ కనిపించలేదు, నా కళ్ళకి.The temple looked its age (1400 years). అంత పురాతనమైన దేవాలయం అక్కడ ఉండడం, అదృష్టంగా భావించి, ప్రభుత్వం వారుకూడా, ఓ చెయ్యేస్తే,బావుండేది. కానీ అలాటిదేమీ ఉన్నట్లు లేదు. తమిళనాడులో ఇన్నాళ్ళూ డి.ఎమ్.కే వారికి దేముడిమీద అంత నమ్మకం ఉండకపోయినా, దేవాలయాలన్నీ బాగానే మైన్టైన్ చేశారు. మీకెల్లా తెలిసిందీ అని అడక్కండి, 2004 లో నేనూ మా ఇంటావిడా టిటిడిసి వారి టూర్ లో ఓ వారం రోజులు తిరిగొచ్చాము.అప్పుడనిపించింది అలా !

   ఆ తరువాత తూ.గొ.జి లో ఉన్న చాలా ప్రాచీన దేవాలయాలు చూసే అవకాశం కలిగింది. అక్కడ ఉండే పరిస్థితులు చూస్తే చాలా బాధేసింది.దేవాలయం ఎంత ప్రాచీనమైనదయితే అంత Poor maintainance. ఈమాత్రందానికి,దేవాదాయ శాఖలూ అవీ, మళ్ళీ వాటికి ఓ కమీషనరూ వగైరాలు ఎందుకో? ఏదో ప్రైవేటు మానెజ్మెంటు దేవాలయాలు,తప్ప మిగిలినవన్నిటి పరిస్థితీ అంతే. పోనీ దేముడూ, భక్తీ లేదంటారా, అబ్బే ఎక్కడ చూసినా దీక్షలూ, వ్రతాలూ, నోములే!కావలిసినంతమంది స్వాములూ,ఆశ్రమాలూనూ. మరి దేవాలయాలంటే అంత చిన్న చూపెందుకో మన ప్రభుత్వానికి? వాళ్ళని మాత్రం అని లాభం ఏమిటిలెండి?ఎవరి గొడవలో వాళ్ళు.ఒకరు తెలంగాణా అంటారు, ఇంకోరు సమైఖ్యాంధ్ర అంటారు. ఒకాయనేమో తొమ్మిదేళ్ళు పాలన చేసి, ఐ.టి. తప్పించి ఇంకేమీ లేదన్నారు. ఒక్కసారి గద్దె దింపెసరికి, రైతులూ వాళ్ళూ గుర్తొచ్చారు.

   పోనీ ఏ బస్సైనా ఎక్కి విజయవాడ వెళ్ళేనా అంటే అదీలేదు, తెలిసినవారితో ఝూమ్మని కారులో వెళ్ళానాయే.పోనీ ఓ రెండు మూడు రోజులుందామా, పనీ పాటూ లేదూ అనుకుంటే, నన్నెవడుంచుకుంటారు?పెళ్ళిళ్లల్లోనే, అప్పగింతలవగానే
బిచాణా కట్టేసికుని ఎవరి దారిన వారు వెళ్ళిపోతున్నారు.ఇంక నేనెంత?

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–బాపట్ల….

   రాత్రి 10.30 కి బయలుదేరవలసిన సింహపురి Express సికిందరాబాద్ స్టేషనులోకి రావడమే 11.30 దాటిన తరువాత వచ్చింది.చెప్పేనుగా ఈ సారి అన్ని ప్రయాణాల్లోనూ క్రింది బెర్తే దొరికింది.నా దారిన నేను,ఎటెండర్ ఇచ్చిన దీక్షావస్త్రాలు పరిచి నిద్ర పోయాను. 5.30 కి బాపట్ల వెళ్తుందీ అన్నారు, ఎలాగూ ఓ గంట లేటవుతోందికదా, తెల్లారిపోతుందిలే అనే భరోసాతో నిద్రపోయాను. మెళుకువ రాకపోతే, మహ ఏం అవుతుందీ, గూడూరు దాకా వెళ్ళి వెనక్కి వస్తాను, పెళ్ళి ఎలాగూ రాత్రికేగా!నాకేమీ మునిగిపోయే రాచకార్యాలేవీ లేవు!

   ఓ పదినిముషాల్లో బాపట్ల వస్తోంది అనగా, ఎటెండరు వచ్చి లేపాడు, నాకిచ్చిన దీక్షావస్త్రాలు తిరిగి తీసికుని మడతబెట్టుకుంటూ, అక్కడనుంచి కదలడే, చాయ్ పానీకి డబ్బులేమైనా ఇవ్వమన్నాడు. పోనీలే అని చేతిలో ఓ పదిరూపాయలు పెట్టాను.ఇలాటివి అన్నీ ఎంకరేజ్ ఎందుకు చేస్తారూ అని మీరడగొచ్చు, ఏం చేస్తాం బాబూ సోషల్ ఆబ్లిగేషన్స్! కనీసం అడగనైనా అడుగుతున్నాడు, మరీ మన రాజకీయనాయకుల్లాగ హడప్ చేయడం లేదు.స్టేషను దగ్గర మా ఫ్రెండు మేనల్లుడు,రిసీవ్ చేసికోగా, ముందుగా హొటల్ కి వెళ్ళి, ఫ్రెష్ అయి, కమ్మకల్యాణ మండపానికి వెళ్ళాను.నాకేం తెలుసూ, అక్కడ డెకొరేషన్లూ, సోఫాలూ,కర్టెన్లూ పింకు కలర్ లో(TRS రంగు) ఉంటాయనీ, నేను కూడా పింకు కలర్ షర్ట్( మిస్టరీ షాపింగులో కొనుక్కున్నది!) వేసికున్నాను!అబ్బ ఏం మ్యాచింగండీ అంటూ అందరూ నవ్వడమే! పోన్లే ఎదో విధంగా పరిచయం అయ్యాన్లే అని నేనూ ఆనందపడిపోయాను! అక్కడ,మా ఫ్రెండూ,అతని ఫామిలీ తప్ప ఇంకెవ్వరూ తెలియదాయే, తరువాత అందరికీ పరిచయం చేశాడులెండి,అయినా నాకేం కొత్తా, ఎవరో ఒకరిని పట్టుకుని పరిచయం చేసెసికుని, వాళ్ళని ‘బోరు’ కొట్టేయడంలో ఫస్టే లెండి!

   అక్కడ ఒకతను, అహ్మదాబాద్ నుంచి వచ్చాడు, అతనికి హిందీ, ఇంగ్లీషూ తప్ప ఇంకోటి రాదు, అన్నీ వచ్చిన మా ఫ్రెండేమో పెళ్ళి హడావిడిలో ఉన్నాడూ, వీళ్ళ బావగారొకరున్నారు, ఆయన, నేను కోనసిమ వాడినని తెలిసి,’అటువైపు వాళ్ళందరికీ జాతకాలు చెప్పడం, పంచాంగాలు వ్రాయడం బాగా వచ్చూ, మీరేమైనా చెప్పగలరా అన్నారు. హారోస్కోప్ అనే మాట విని, ఆ గుజరాతీ ఆయన, నాకొచ్చూ అన్నాడు.ఇంక చూసుకోండి, ఈ పెద్దమనిషి ఆయనని వదలడూ, ఇద్దరికీ భాషా సమస్యా,ఇంక నేనే ‘దుబాషీ’ రోల్ ప్లే చేశాను! అంతవరకూ బాగానే ఉంది, రవి,కుజుడు,గురువు,కేతు… లకి ఇంగ్లీషు చెప్పమంటే, నాకేం తెలుసూ?ఏదొ నాకు తెలిసిన ఇంగ్లీషులో చెప్పి, ఇద్దరినీ సమాధాన పరిచాను.ఆయన ఊళ్ళో ఉన్న వాళ్ళింటికి తీసికెళ్ళి, వచ్చేటప్పుడు, ఎన్.జి.రంగా వ్యవసాయ యూనివర్సిటీ చూపించారు. సాయంత్రం మా స్నేహితురాలొకావిడ తో భావన్నారాయణ గుడికి వెళ్ళాను.

   ఆ దేవాలయం ఆంధ్రదేశం లో ఉన్న అయిదు భావన్నారాయణ ఆలయాల్లోనూ అతి ప్రాచీనమైనదిట. 1400 సంవత్సరాల పై చరిత్ర ఉంది, ఆ దేవాలయానికి.ఇంకోటి సర్పవరం( కాకినాడ) లో దర్శించుకున్నాము. ఇంకో మూడు ఉన్నాయిట.పెళ్ళి మండపానికి వచ్చి,రాత్రి 11.30 కి ముహూర్తం, ఈ లోపులో భోజనాలూ అవీ కానిచ్చాము.మా ఫ్రెండు బ్యాంకులో పనిచేస్తూండడం వలన, అతని స్నేహితులు చాలా మంది బ్యాంకు వాళ్ళే వచ్చారు. ఒక విషయం గమనించాను- యాదృచ్చికమే కావొచ్చు- వీళ్ళు అంటే ఈ బ్యాంకుల్లో పెద్ద పొజిషన్లలో ఉండేవారు, పెద్దగా అందరితోనూ కలవరు! పరిచయం చేసికుంటే ఎక్కడ అప్పు అడుగుతాడేమో అని భయం కావొచ్చు! ఒక బ్యాంకు వాళ్ళు ఇంకో బ్యాంకు వాళ్ళతో బాగానే ఉంటారు. బయటవాళ్ళతోనే ముభావంగా ఉంటారు!ఊరికే సరదాగా అన్నాను, ఏమనుకోకండీ, అయినా నాకెందుకండి బాబూ ఇప్పుడు అప్పులు?

   బాపట్లనుండి, హైదరాబాద్ రావడానికి రిజర్వేషను చేయించలేదు, మా స్నేహితురాలు కారులో వచ్చింది, ముహూర్తం అవగానే, రాత్రికే ఏలూరు వెళ్ళిపోతూందని తెలిసి, నన్ను దారిలో విజయవాడలో దింపేయమన్నాను.ఎరక్కపోయి, మా ఫ్రెండుతో చెప్పాను.ఎక్కడ విన్నాడో ఈ విషయం, నేనూ విజయవాడే వెళ్ళాలీ, నన్నూ తీసికెళ్ళండీ అంటూ తయారయ్యాడు! నాకైతే చాలా ఎంబరాసింగ్ గా అనిపించింది. పోనీ నేను మానేద్దామా అనుకుంటే, కాదూ కూడదన్నారు, మా ఏలూరు స్నేహితురాలు. మా స్నేహం 30 సంవత్సరాలు, ఈ కొత్తాయనకి కొన్ని గంటలు పరిచయం! అసలు ఎలా అడిగేస్తారో, ముక్కూ మొహం తెలియని వాళ్ళని. వద్దూ అనడానికి మా ఫ్రెండుకి మొహమ్మాటం! పైగా, మేము ఎక్కడ ఆయనకి చెప్పకుండా చెక్కేస్తామో అని, నా బ్యాగ్గు ఆ పెళ్ళిమండపం లో ఆయనకిచ్చిన రూమ్ములో పెట్టి తాళం వేశాడు. అలాగుండాలి తెలివితేటలంటే!ఎన్ని చెప్పండి,చాలా సంవత్సరాలు రాష్ట్రానికి బయట ఉండి,తిరిగి అక్కడ నెగ్గుకురావడం చాలా కష్టం అని అనుభవం ద్వారా తెలిసింది! ఇంకో విషయం-ఈయనకూడా ఓ బ్యాంకులో మేనేజరే !

   రాత్రి 1.30 కి విజయవాడ లో దిగ్గానే హైదరాబాద్ కి బస్సు రెడీగా ఉంది. తెల్లారి, 8.30 కి హైదరాబాద్ చేరాను…