బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-అత్తిసరు మార్కులు…

   నా భాగ్యనగర/బాపట్ల అనుభవాలు వ్రాద్దామనే అనుకున్నాను. కానీ మధ్యలో ఈ ఆవకాయ సంబంధిత Annual Exam ఓటి వచ్చిందిగా. దానికి ఈవేళ ముహూర్తం పెట్టింది మా ఇంటావిడ! వర్షాలు పడేలోపల పెట్టేయాలిట,రెండురోజులనుండి ఇక్కడ మబ్బు మబ్బుగా ఉంటోంది. పైగా, నాచేత భాగ్యనగరంనుండి, ఆవకాయ కోసం ఆవపిండి, కారం తెప్పించింది.ఏ వర్షమో పడిందంటే, ఆ కారం, ఆవపిండీ, ఏ ఫుట్ పాత్ మీదో పెట్టుకుని అమ్ముకోవాల్సివచ్చేదిఎందుకొచ్చిన గొడవా,అయేదేదో అవకా మానదూ, నలభైఏళ్ళనుండి అలవాటుపడ్డానూ,మహ అయితే ఇంకోదఫా చివాట్లూ.పట్టించుకోడం మానేస్తే సరీ అనుకుని, నా స్టాక్ ప్రశ్నలు ఎన్ని కాయలూ,ఎలా ఉండాలీ వగైరాలు అడిగాను. నాకెలాగూ తెలుసు,ఆవిడ నేనడిగినవాటికేవీ సరైన సమాధానం ఈయదూ అని,అయినా అదో ట్రెడిషనూ!ఆవిడా, నేననుకున్నట్లుగానే ఓ మూడు నాలుగు గిన్నెల ముక్కలవాలీ,కండ,టెంక బాగా ఉండాలీ Etc etc…చెప్పేసింది.

   మండి మార్కెట్ కెళ్ళి చూస్తే ఓ నాలుగైదు కొట్లలో ఊరగాయకి సంబంధించిన కాయలలాటివి కనిపించాయి.నా కళ్ళకైతే అన్నీ బాగానే ఉన్నాయి. ఓ కొట్టువాడిని సెలెక్ట్ చేసి, कैसा है? అన్నాను నా ఉద్దేశ్యం ఖరీదెంతా అని, వాడేమో
अछा है
అంటాడు. ఇలా కాదని ఖరీదెంతా అని అడిగాను. కిలో నలభై అన్నాడు. ఉన్న వాటిలో అవే ఖరీదెక్కువా, బాగానే ఉండుంటాయిలే అని, 30/- కి ఇవ్వమన్నాను.అయిదారు కిలోలు తీసికుంటానంటే సరే అన్నాడు.తడిగుడ్డతో తుడిచి ముక్కలు చేయమంటే, ఓ స్టూలూ,ఓ టబ్బూ దాంట్లో నీళ్ళూ, ఓ గుడ్డముక్కా ఇచ్చి నన్ను తుడవమన్నాడు. మామూలే ఎప్పుడూ జరిగేదే. క్రిందటేడాది ముక్కలు చేయడానికి కిలోకి అయిదు రూపాయలు పుచ్చుకున్నవాడు, ఈ ఏడాది పది చేశాడు. అదేమిట్రా అంటే, పెట్రోల్ ధరలు పెరిగేయికదా అంటాడూ. పెట్రొల్ ధరలకీ, వీడి కత్తిపీటకీ ఉన్న అవినాభావ సంబంధం ఏమిటో అర్ధం అవలేదు.

   ఓ అయిదు కిలోలు తరిగిన తరువాత, ఎక్కడో అనిపించింది, మా ఇంటావిడ చెప్పిన మూడు నాలుగు గిన్నెలవవేమో అని, ఇంకో రెండు కిలోలు తూపించి, మళ్ళీ తడిగుడ్డా తుడుపూ చేసి, వాటిని కూడా తరిగించి, పన్నెండింటికి కొంపకు చేరాను. ఇంటికి వచ్చిన తరువాత,As usual, బ్యాగ్గులో చెయ్యి పెట్టి,Random sampling ఓ అయిదు ముక్కలు తీస్తే, అందులో నాలిగింటికి కండా, టెంకా మిస్సింగ్! ఏమిటండీ ఇన్నేళ్ళనుండీ తెస్తున్నారూ, ప్రతీసారీ చెప్పించుకోడమే!
అయిదు ముక్కల్లో నాలుగు రెజెక్టెడ్డా? అయినా ఎక్కడో నాకు అనిపిస్తోంది, నేను దగ్గరుండి కోయించిన ముక్కలు నన్ను వీధిన పెట్టవూ అని.ముందర భోజనం చేసేసిన తరువాత చూద్దామూ అంది. అదేదో మన ప్రాక్టికల్ పూర్తయిపోతే, భోజనమేనా సావకాశంగా చేయొచ్చూ అనుకుని, కావలిస్తే నేనూ ఓ చెయ్యేస్తానూ, పని పూర్తిచేసేయ్ అన్నాను.ఆవిడతో పాటు నేనూ ముక్కల సెగ్రెగేషన్ మొదలెట్టాను.నేనేదో శభాషీ సంపాదించడం కోసం, ముక్కలు కలిపేస్తున్నానేమో అని ఆవిడకు అనుమానం! ఎంత చెప్పినా కట్టుకున్న భార్యని మోసం చేస్తానా, మీరే చెప్పండి.

   ఈ కార్యక్రమం అంతా పూర్తయేసరికి, ముక్కలు అయిదు గిన్నెలొచ్చాయి.నాకు తెలుసు, ఈసారి ఈవిడకు ఛాన్సివ్వకూడదనే,ఆ పై రెండు కిలోలూ తీసికుంట!ప్రతీసారీ ముక్కలు తక్కువయ్యాయో అనే!ఇంకో సంగతి ఈ సారి ఒకటికి రెండు సార్లు అడిగి మరీ తెచ్చాను ‘తిల్ ఆయిల్’! అయినా అన్నీ బాగున్నాయని ఒప్పుకోదుగా, ప్రతీ సారీ తెచ్చే బ్రాండు తిల్ ఆయిల్ తీసుకురాలేదేమిటీ అని ఓ పది మార్కులు తగ్గించేసింది!
మొత్తానికి సీనియర్ సిటిజెన్ కోటాలో మోడరేషన్ మార్కులేసి, ఈసారికి పాస్ చేసేసింది. ఈ ఏడాదికి గట్టెక్కెసినట్లే. వచ్చే ఏడాది సంగతి అప్పుడు చూసుకోవచ్చు, ఏమంటారు?