బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మధ్యతరగతి మనస్థత్వం

    మొన్న శనివారం నాడు, మా అమ్మాయి ఆడపడుచు వాళ్ళ వివాహ సిల్వర్ జూబిలీ కి పిలిస్తే వెళ్ళాము.ఆ రోజు మా అబ్బాయి, ల్యాండ్ మార్క్ వారు ముంబైలో నిర్వహించిన, క్విజ్ పోటీకి వెళ్ళవలసివచ్చింది. అందువలన, మా అమ్మాయీ అల్లుడూ వచ్చి మమ్మల్ని తీసికెళ్ళారు.మా అబ్బాయి టీం, క్విజ్ లో సెకండ్ వచ్చారు. ఆగస్ట్ 15 న చెన్నైలో జరిగే నేషనల్ ఫైనల్ కి
క్వాలిఫై అయ్యారు.

   పూణే లో సోలాపూర్ హైవే మీద ‘సంస్కృతి’ అని ఓ రిసార్ట్ ఉంది. అక్కడ పెట్టారు వీళ్ళ ఫంక్షన్.మేము మా తాహతుని బట్టి ఏదో చిన్న బహుమతీయే తీసికెళ్ళాము.మా అల్లుడు, వాళ్ళ అక్కా, బావగార్లకు ఏదైనా గిఫ్ట్ తీసికెళ్ళాలని, ‘సద్గురూస్’ అని ఓ షాప్ కి తీసికెళ్ళాడు. వామ్మోయ్ అక్కడ ఏదీ కూడా,నాలుగైదు వేలకి తక్కువ లేదు!అన్నీ అవేవో ఆర్ట్ పీసులూ, వగైరా….అలాటివాటిలోకి మొట్టమొదటి సారిగా వెళ్ళామేమో, అంతా విచిత్రంగా ఉంది.అప్పుడప్పుడు,పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ చదవడం,బొమ్మలు చూడడమే కానీ అంత దగ్గరగా వాటిని చూసిందెక్కడ?

    అక్కడ కొన్ని కొన్ని పైంటింగ్స్ ఉన్నాయి. నా బుర్రకేమీ అర్ధం అవలేదు.వాటిని ఎప్రీసియేట్ చేసేటంత యీస్థటిక్ సెన్స్ కూడా లేదు. కానీ, మా మనవరాలు తాన్యా అడిగిందీ ‘ తాతయ్యా,క్యా ఆప్కో కుచ్ సంఝా క్యా?ఇస్ మే కౌన్సీ చీజ్ హై.ఐ కెన్ డు బెటర్’అంది.పోన్లే నేనే కాదు, నాలాటి వాళ్ళు ప్రపంచంలో ఇంకా చాలా మందే ఉన్నారు అనుకున్నాను.నేను చెప్పేదేమిటంటే,మన వాళ్ళల్లో చిత్రాలు గీసే వడ్డాది పాపయ్య గారనండి, లేక మన ‘బాపూ’ గారనండి, రవి వర్మ అనండి, వాటిని చూస్తే వారు వేసిన చిత్రాల్లో ప్రాణం ఉంటుంది. ఈ ఆర్ట్ గ్యాలరీల్లో వేసే చిత్రాల్లో ఏం ఉంటుందో నాకైతే ఇప్పటికీ తెలియలేదు.అయినా సరే వాహ్ వాహ్ క్యా చీజ్ హై అనడం ఒక స్టేటస్ సింబల్ !

    బహుశా నా మిడిల్ క్లాస్ మెంటాలిటీ వల్ల నాకు అర్ధం అవమేమో. ముందునుండీ ప్రభుత్వోద్యోగంలోనే పనిచేసి, అందులోనూ రిటైర్ అయే సమయానికి ఆఫీసరు(అదీ గ్రూప్ బి) అయ్యాను, బహుశా, నా మనస్థత్వం కూడా అలాగే ఉండిపోయింది.ఇప్పుడు రిటైర్ అయ్యాక, పిల్లలు సంపాదించి, ఎక్కడెక్కడికో అంటే ఇదివరకెప్పుడూ వెళ్ళని లోకాలికి తీసికెళ్ళినా, బేసిక్ గా ఉన్న మనస్థత్వం మారదు కదా! అప్పుడప్పుడనుకుంటూంటాను, ఇలాటివాటికి వెళ్ళకపోతేనే ప్రాణానికి హాయిగా ఉంటుందని, కానీ పాపం మాఇంటావిడేం పాపం చేసికుంది,అలాటివాటికి వెళ్ళకుండా ఉండడానికీ అనుకొని, మా పిల్లలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్దామంటే తలూపేస్తూంటాను. ఏది ఎలా ఉన్నా అలాటిచోట్ల ఎవరికీ మాటరాకుండానూ, వీలైనంతవరకూ ఎవరిచేతా మాట పడకుండానూ లాగించేస్తున్నాను!

   ఏది ఏమైతేనేం, మొత్తానికి అక్కడికి వెళ్ళాము.అక్కడి వాతావరణం చాలా బాగుంది. మణిపూర్ బృందం వారు చేసిన గెడకర్రలతో డ్యాన్సూ,కత్తి యుధ్ధాలూ వగైరా, సినిమా పాటల తంబోలా,ఇంకా ఏవేవో ఉన్నాయి.భోజనం, స్నాక్సూ కూడా బాగున్నాయి.రాత్రి 12.00 గంటలదాకా మన ఇష్టం వచ్చినట్టు గడపొచ్చు(తిండి తో సహా!). ఖరీదు కూడా అంత ఎక్కువ కాదు( ఈ మధ్యన ఇలాటి వాటికి వెళ్ళి వెళ్ళి నాలోకూడా మార్పొస్తూంది!) 450/- రూపాయలు.ఇంకా ఏవేవో మెహిందీ, టాటూ, జాతకాలూ కూడా ఉన్నాయి.

    ఎప్పుడైనా బయటకి వెళ్ళాలంటే సిటీ బస్సులోనే వెళ్ళడం, ఆటో ఛస్తే ఎక్కను. అప్పుడప్పుడు మా ఇంటావిడని మేము అద్దెకుండే ఫ్లాట్ కి తీసికెళ్ళినప్పుడు, వెళ్ళేటప్పుడు ఆటోలోనే తీసికెళ్ళినా, తిరిగి వచ్చేటప్పుడు పోనీ బస్సులో వెళ్దామా అని కక్కూర్తి పడి అడూగుతూంటాను.అదేం ఖర్మమో,ఎప్పుడూ బస్సుగురించి వెయిట్ చేయడం, మా ఇంటావిడ తిప్పలు చూసి నా బి.పి. పెంచేసుకోవడం, జీవితంలో ఎప్పుడూ ఇంక నిన్ను బస్సుల్లో తీసికెళ్ళనులే అంటూ ఓ లెక్చరిచ్చేయడం. అసలు తనకి బయటకు రావడానికే కుదరదు, ఎప్పుడో అమావాస్యకీ, పౌర్ణమికీ బయటకు వస్తే నాతో గోల ! ఇదిగో దీన్నే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. ఎప్పుడో నెలకోసారో, రెండుసార్లో తీసికెళ్ళేదానికి, హాయిగా రానూ పోనూ ఆటోలోనే తీసికెళ్ళొచ్చుగా, అబ్బే, అలా కాదు,అక్కడ కక్కూర్తి.జీవితంలో అసలు ఎప్పటికైనా బాగుపడతానా?

%d bloggers like this: