బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పుస్తక పఠనం

    ఈ మధ్యన ఏ టి.వి. చానెల్ చూసినా శ్రీ శ్రీ గారి గురించే. ఒక్కొక్క కవితా వింటూంటే ఇన్నాళ్ళూ ఎందుకు వీటిని చదవలేదా అనిపించింది.ఆ కవితల్లోని గాంభీర్యాన్ని అర్ధం చేసికునేంత బుర్ర లేదనుకోండి, అయినా ఆ పదాల సొంపులు చూస్తూంటే, వీటి గురించి చిన్నప్పుడు ఎందుకు వినలేదా అనిపించింది.సినిమాల్లో ఆయన వ్రాసిన పాటలు చాలా వరకు బ్రహ్మాండంగా ఉండేవి.అదేదో సంగీత దర్శకుల గొప్పతనమేమో అనుకునేవాడిని.

    ఈ మధ్యన చర్చల్లో తెలిసింది వాటిలో శ్రీశ్రీ గారి ప్రతిభే ఎక్కువ అని.ఆ రోజుల్లో అంటే నేను చదువుకునే రోజుల్లో, శ్రీ శ్రీ గారిగురించి విన్నాను.కానీ చాలామంది చెప్పేవారూ, ఆయనవి అన్నీ కమ్యూనిస్టు సిధ్ధాంతాలూ,మనలాటివారు చదవకూడదూ అనేవారు. కాబోసు,అనుకొని వాటివేపే చూసేవాడిని కాదు.పైగా నా వయస్సు కూడా అలాటి పుస్తకాలు చదివి, ఎప్రీసిఏట్ చేసేటంత ఉండేది కాదు.18 సంవత్సరాలకే బి.ఎస్.సీ పూర్తిచేసికొని ఉద్యోగంలో చేరేను కదా.ఇంక పూనా వచ్చేసిన తరువాత, తెలుగు పుస్తకాలతో సంపర్కమే తక్కువయింది,పైగా ఇక్కడ ఏమీ దొరికేవి కావు.ఇంట్లో ఉన్నప్పుడు’చలం’ సాహిత్యం ఒకటి ముట్టుకోనిచ్చేవారు కాదు, అలాగే ‘కొవ్వలి’ వారివి కూడా.

    ఆ రోజుల్లో పూనా లో తెలుగు పేపరు దొరకడమే గగనమైపోయేది. ఎప్పుడో రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు, ఒక రోజు లేటు గా తెలుగు పేపరు మాత్రం దొరికేది.అప్పుడప్పుడు ఏ ఎం.జి.రోడ్డుకో వెళ్ళినప్పుడు, వార పత్రికలు దొరికేవి.జిల్లా పరిషత్ ఆఫీసు దగ్గర ఓ ‘అజంతా లైబ్రరీ’ అని ఒకటుండేది, అతను బొంబాయి నుంచి తెలుగు వార, మాస పత్రికలు తెచ్చేవాడు.రాస్తాపేట లో తెలుగు పత్రికలు దొరికేవి.
ఆతా వేతా చెప్పొచ్చేదేమిటంటే, ఎప్పుడో శలవలకి హైదరాబాద్ వెళ్ళినప్పుడు, మా అన్నయ్య గారి ఇంటివద్ద ఉండే కిళ్ళీ కొట్టులో తెలుగు నవలలు, అద్దెకి తెచ్చుకుని, అవికూడా ఏ డిటెక్టివు నవలలో, చదివేవాడిని.శ్రీశ్రీ లు, బాలగంగాధర తిలక్కులూ, చలం రచనలు చదివేటంత ఓపిక కానీ, ‘కవిహృదయం’ కానీ ఉండేది కాదు.అప్పటికి ప్రసార మాధ్యాలూ అంత ఎక్కువేమీ కాదు.

   రేడియోలో హైదరాబాద్ స్టేషన్ మాత్రం ఎంతో శ్రమపడితే వినిపించేది( షార్ట్ వేవ్ లో).టి.వీ. ప్రశ్నే లేదు.తెలుగు పుస్తకాలు పూనా లో దొరకడం లేదని, ఎమెస్కో వారి ‘ఇంటింటా గ్రంధాలయం’ లో చేరి పుస్తకాలు తెప్పించేవాడిని.జ్యోతి, యువ, విజయచిత్ర,ఆంద్రప్రభ,ఆంధ్రజ్యోతి,ఆంధ్ర పత్రిక మాత్రం ఎక్కడా మిస్ అవకుండా కొనేవాడిని.అలాగే ఇంగ్లీషు మేగజీన్లు కూడా,
-లైఫ్, శాటర్ డే రివ్యూ, టైం, న్యూస్ వీక్, రీడర్స్ డైజెస్ట్,లాటివీనూ.వచ్చే జీతం 300 రూపాయల్లోనూ, వీటికే అయ్యేది.దీనికి సాయం, గ్రామఫోన్ రికార్డులోటి.ప్రతీ నెలా ఒక ఎల్.పీ కొనాల్సిందే.1974 లో నా పెళ్ళై, మా ఇంటావిడ వచ్చేసరికి, ఇంటినిండా మిగిలిన ఆస్థులు ఇవే. ఆ తరువాత అమ్మాయి పుట్టిన తరువాత, రికార్డులు కొనడం మాత్రం తగ్గించాను.అప్పటికే
ఓ నాలుగైదు వందల దాకా రికార్డులు కొన్నాను.పుస్తకాలు మాత్రం కొనడం ఆపలేదు, ఎందుకంటే మా ఇంటావిడకి కూడా చదవడం ఇష్టమే కాబట్టి.పాపం తనేదో కవితలూ అవీ కూడా ఉంటే బాగుంటుందేమో అన్నా కానీ, వాటిమీదకు గాలి మళ్ళలేదు!

    ఆ తరువాత 1983 లో వరంగాం ట్రాన్స్ఫర్ అయిన తరువాత, అక్కడ అసలు తెలుగు పుస్తకాలే దొరికేవి కావు.ఏ భుసావల్ స్టేషన్ కో వెళ్ళినప్పుడు మాత్రం తెచ్చేవాడిని.ప్రతీ రోజూ మా ఫాక్టరీ లో భుసావల్ నుంచి వచ్చే ఒక మిత్రుడి ద్వారా తెప్పించుకునే వాడిని. తెలుగు పత్రికలు మాత్రం ఎప్పుడూ మిస్ అవలేదు.వీటికి సాయం మాస పత్రికల్లో వచ్చే సప్లిమెంటు నవలలు అన్నీ విడిగా బైండు చేయించాము.1998 లో మేము తిరిగి పూణే ట్రాన్స్ ఫర్ అయి వచ్చేటప్పుడు, కేంద్రీయ విద్యాలయం లో ఇంగ్లీషు చెప్పే ఓ మాస్టారు ( తెలుగు వారే), ఆయనకి
ఓ మూడు బస్తాల తెలుగు నవలలూ ఇచ్చేసి వచ్చాము.ఇప్పుడు అనుకుంటూంటాను, అవన్నీ ఉంటే ఎంత కాలక్షేపమో కదా ఇప్పుడు! దేనికైనా రాసిపెట్టుండాలి.పూనా వచ్చేటప్పుడు లగేజీ ఎక్కువైపోతూందని, ఆ పుస్తకాలన్నీ ఇచ్చేశాము.ఎన్ని పుస్తకాలో, తలుచుకుంటూంటే గుండె అదిరిపోతూంది! వాటిల్లో ఏ పుస్తకమూ, ఇప్పుడు దొరకడం లేదు. ఆ మాస్టారు మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే అడిగితే బాగుండుననిపిస్తోంది, ఆ పుస్తకాలన్నీ ఏం చేసారూ అని.ఇంకా అవి ఆయన దగ్గరే ఉంటే మాత్రం, ఆయన్ని ఎలాగో ఒప్పించి, తిరిగి తీసుకుంటే బాగుండుననిపిస్తోంది. ఛాన్సెస్ తక్కువే అనుకోండి.

    ప్రస్తుతానికొస్తే, నెట్ ధర్మమా అని, తెలుగు సాహిత్యం లో ఇన్నాళ్ళూ మేము మిస్ అయినవన్నీ చదవడానికి ప్రయత్నిస్తూన్నాము.అన్ని బాధ్యతలూ అయిపోయాయి గా, చూద్దాం ఈ సంబరం ఎన్నాళ్ళో! ఏది ఏమైనా పుస్తకం చదవడం అంత మంచి కాలక్షేపం ఇంకోటి ఉండదు.రాజమండ్రీ లో ఉన్న ఏణ్ణర్ధం, ప్రభుత్వ గ్రంధాలయం లో నవలలు తెచ్చుకుని చదివేవాళ్ళం, వీలున్నప్పుడల్లా కొనేవి కొనుక్కుంటూ. మా కజిన్ ఒకడుండేవాడు,35 సంవత్సరాలు కాలెజీల్లో లైబ్రరీయన్ గా పనిచేశాడు. నేను పుస్తకాలమీద పెట్టే ఖర్చు చూసి అస్తమానూ కోప్పడ్డమే!
వాడికి వీలుండీ చదవలేదు, నాకు చదవడానికి అవకాశమే ఉండేది కాదు( ఉద్యోగ రీత్యా).

    నేనేదో పేద్దపెద్ద క్లాసిక్స్ చదివానని మాత్రం చెప్పను, నాకు ఇష్టమైన పుస్తకం గురించి ఏ పత్రికలోనైనా చదివితే మాత్రం తెప్పించేసుకుంటాను.దానికి, నా మిత్రులూ, బంధువులూ హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు సహాయం చేస్తూంటారు. గాడ్ బ్లెస్ దెం!

%d bloggers like this: