బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-” ప్రజాసేవలు”

    శ్రీరమణ గారి ‘గుత్తొంకాయ కూర-మానవ సంబంధాలు’ పుస్తకంలో ‘ప్రజాసేవ’ అని ఓ వ్యాసం చదువుతూటే, నేను ఉద్యోగం చేస్తూన్నప్పుడు, మా మేనేజరు ఒకాయన గురించి గుర్తుకొచ్చింది. ఆయనకి ఈ ‘ప్రజాసేవ’ ఎక్కువేలెండి. ఇక్కడ ప్రజాసేవ అంటే అదేదో గొప్ప సేవ అనుకోకండి.మామూలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో, కొద్దిగా చేతి వాటం ఉన్నవాళ్ళు ,ఒక పని చేయడానికి వసూలు చేసే ‘ఫీ’ అన్నమాట.

    మన పనినిబట్టి ఉంటుంది, మనం కట్టవలసిన ‘మామూలు’. ఈయనేంచేసేవాడంటే, ఎప్పుడైనా తనకి ‘చిల్లర ఖర్చులకి’ డబ్బులు అవసరం వచ్చిందనుకోండి, ఎవడో ఓ వెండరుని
ఫామిలీ తో ఇక్కడనుండి ఢిల్లీ దాకా 2-టయర్ ఏ.సీ.లో టిక్కెట్లు తెమ్మనేవాడు.ఆ వచ్చినతను పాపం సిన్సియర్ గా స్టేషన్ కి వెళ్ళి, వెయిటింగ్ లిస్ట్ అయినా సరే, నాలుగు టిక్కెట్లు బుక్ చేసి తెచ్చేవాడు.ఆ రోజుల్లో ఆన్ లైన్ రిజర్వేషన్లూ అవీ ఉండేవి కావు. పాపం చాలా బాధపడిపోతూ ‘సారీ సార్, కన్ఫర్మ్డ్ టిక్కెట్టు దొరకలేదూ’అనేవాడు.ఈయనకేమిటీ, ఏమైనా ఢిల్లీ వెళ్తాడా పెడతాడా!మూడో రోజున స్టేషన్ కి వెళ్ళో, ఇంకో ఆర్డర్లీని పంపో, ఆ టిక్కెట్లు క్యాన్సిల్ చేసి, ఆ డబ్బులు జేబులో వేసికునేవాడు! ఆయనేమైనా పెట్టుబడి పెట్టాడా ఏమిటీ, ఎంతొస్తే అంతా లాభమే !

7nbsp;   కొంతమందుంటారు, సంవత్సరంలో ఏ సీజనైనా సరే రిజర్వేషన్ మాత్రం ఛస్తే చేయించుకోరు.అలాగని డబ్బులు ఖర్చుపెట్టరా అని కాదు.వాళ్ళకి వాళ్ళమీద అంత నమ్మకం! మనం నెలల ముందునుంచీ రిజర్వేషన్లు చేయించుకుని, అదేదో పేద్ద ప్లాన్డ్ గా ప్రయాణాలు చేసేమనుకుంటాము.ఈ ‘తమమీద తమకి నమ్మకం గాళ్ళు’ అదేదో తమ కి రిజర్వ్ అయినట్లు, మన సీట్ లో కూర్చుంటాడు. ఏమిటయ్యా ఇదీ అంటే, ‘ఆర్.ఏ.సీ’ అండీ, టీ.టీ. రాగానే కన్ఫర్మ్ చేస్తాడు,అప్పటిదాకా ఇక్కడ సర్దుకోనివ్వండీ, మీరుకూడా అప్పుడే పడుక్కుంటారా ఏమిటీ అని ఓ పరామర్శా! కాదు,ఇక్కడనుండి వెళ్ళిపో అనడానికి మొహమ్మాటం.చచ్చినట్లు వాడిని భరిస్తాము.ఆ టిటీ వచ్చేదాకా,పైగా దేశంలో పెరిగిపోతున్న లంచగొండితనం గురించి విన్నవాడికీ, విననవాడికీ
లెక్చరోటీ. ఇంతలో ఓ గంటో,రెండు గంటలకో, ఆ టీటీ గారు, బోగీలన్నీ చూసుకుంటూ మన బోగీకీ వస్తాడు.అప్పుడు తెలుస్తుంది, ఈ ‘తతనగా'( తమమీద తమకి నమ్మకం గలవాళ్ళు’) ఇంకా చాలా మందే ఉన్నారని.బోగీకి కనీసం ఓ డజను మందిదాకా తేలుతారు! అయినా సరే వాళ్ళకేమీ ఖంగారుండదు. చెకింగు పూర్తయిన తరువాత చూస్తానూ, అప్పటిదాకా ఎకడో అక్కడ ఎడ్జస్ట్ అయిపోండీ అనే ఓ ఎస్యూరెన్స్ సంపాదిస్తారు!

    పాపం ఆ టీటీ గారుమాత్రం ఏంచేస్తాడూ?ఎంతమందిని సర్దాలో! నోరులెని మామూలు జనాల్ని మాత్రం, రూల్సూ,సింగినాదం చెప్పి, ఆర్.ఏ.సీ అయితేమాత్రం ఫర్వాలేదు, వెయిటింగు వాళ్ళుమాత్రం ఇక్కడ ఉండకూడదూ అని ఓ ఆర్డరు వేసేసి వెళ్ళిపోతాడు. పైగా ఈసారి రౌండ్లకొచ్చినప్పుడు రైల్వే పోలీసుల్ని కూడా తోడు తెచ్చుకుంటాడు. గుండె ధైర్యం లేని మామూలు జనాలు
అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపంచేస్తారు.కానీ, మన ‘తతనగా’లు ఏమీ పట్టనట్లు, హాయిగా భోజనం అదీ పూర్తిచేసికుని కూర్చుంటారు.వీడికి, మామూలు టిక్కెట్టు మాత్రమే ఉంది.మన అదృష్టం బాగుంటే( మన అని ఎందుకన్నానంటే, వాడికి బెర్త్ దొరికే దాకా వాడు మనసీటు లొనే ఎడ్జస్ట్ అవుతాడు), ఆ టీటీ దగ్గరకి వెళ్ళి,’మామూలు’ ఏదో సమర్పించి, హాయిగా ఓ బెర్తు సంపాదించుకుంటాడు.బోగీలో అందరూ హాయిగా నిద్ర పోతున్నా, మనం మాత్రం వీడి సేవలో ఉండాలి.లేకపోతే, ఎక్కడో మన సీటు క్రిందే ‘కొంచెం జాగా చేసికుని’ సెటిల్ అయిపోతాడు.ఇలాటి కేసులు, ఏ.సీ. 3-టయర్, మామూలు 3-టయర్ లోనూ చూస్తూంటాము. ఏ.సీ. 2 టయర్ లో మరీ ఇంత అన్యాయంకాదు.

    రిజర్వేషన్ లేకుండా, మనం ప్రయాణం చేయాలనుకోండి, మనం స్టేషన్ కి చేరగానే ఓ పోర్టరొకడు మనల్ని గుర్తుపట్టేస్తాడు. అదేమిటో మన మొహంమీద వ్రాసి పెట్టుందనుకుంటాను, ఈ దరిద్రుడికి రిజర్వేషన్ లేదూ అని! ఆ టిక్కెట్టిలా ఇయ్యండి, నేను మా సార్ ని అడిగొస్తానూ అంటాడు.పోనీ అని వాడిని నమ్మి ఎలా ఇస్తామూ, వాడిని గుర్తుపెట్టుకుందామనుకోవడం వ్యర్ధ ప్రయత్నం, ఎందుకంటే ప్రతీ పోర్టరూ ఎర్ర చొక్కా వేసికునే ఉంటాడు కనుక!ఖంగారు పడకండి, నేనేమీ మీ టిక్కెట్టు తీసికుని పారిపోనూ,మీకు శ్రమ అవుతుందని ఏదో సహాయం చేద్దామనుకున్నాను అంటాడు. మొత్తానికి వాడిని నమ్మి, మన టిక్కెట్టు వాడిచేతిలో పెడతాము.కావలిసిస్తే నా బిళ్ళా నెంబరు గుర్తుపెట్టుకోమంటాడు.

   వాడికి టిక్కేట్టు ఇచ్చేసిన తరువాత, ఇంక మనవాళ్ళు మనకి క్లాసు తీసికోవడం మొదలెడతారు. ‘అదేమిటండీ, ఎవడో ముక్కూ మొహంతెలియనివాడికి టిక్కెట్టు అలా ఇచ్చేశారూ’ అంటూ. ఒకవైపు ఆ పోర్టరు మన టిక్కేట్టు తిరిగి తెస్తాడా లేదా అని బుర్ర పగలుకొట్టుకుని ఛస్తూంటే, ఈ గోడవోటీ ! వస్తూన్న ప్రతీ ‘ఎర్రచొక్కావాడూ’ మనవాడే అనుకుని ఎంతో ఆశ తో చూస్తూంటే, చూస్తూంటే,చూస్తూంటే…మొత్తానికి,మన ఎర్రచొక్కావాడు వస్తాడు. ఏమయ్యిందయ్యా అని అడిగితే, ‘ మనం వెళ్ళడం, పని అవకపోడమూనా’ అని ఓ పోజిచ్చేస్తాడు.

   ఇంతా చేసి వాడు చేసొచ్చిందేమిటా అంటే, మన టిక్కెట్టు వెనకాల, ఓ కొండ గుర్తూ, ఓ సంతకంలాటిదీనూ. సంగతేమిటంటే, మన టి.టీ గారికి ఎలాట్ చేసిన బోగీలో, ఈ ఎర్ర చొక్కవాడు మనల్ని సామాన్లతో సహా అక్కడ కూర్చోపెడతాడు, గంటకో రెండు గంటలకో ట్రైను ప్రయాణం మొదలైన తరువాత, ఈ టీటీ గారు వచ్చి, మన టిక్కెట్టుమీద, కొండగుర్తు గుర్తు పట్టి, అదేదో పుస్తకంలాటిదాంట్లో, మూడు కార్బన్ కాగితాలు పెట్టి,ఏదేదో వ్రాసేసి,అందులో నాలుగో కాపీ ( ఏం వ్రాసుందో బ్రహ్మకైనా తెలియదు!) మనం ఇచ్చిన టిక్కెట్టుకి తగిలించి ఇస్తాడు. ఈ తతంగానికి పూర్వమే, వీటికయ్యే ఖర్చు స్టేషన్ లోనే వసూలు అయిపోయింది.దాంట్లో, మళ్ళీ మన ఎర్రచొక్కా ఆయన ఫీజూ ( అదే చాయ్ పానీ). సామాన్లు పెట్టడానికి పైన ఇవ్వాలి. ఈ టిక్కెట్ల సేవ ప్రజా సేవ క్రింద వస్తుంది.
ఇంకా మరిన్ని తరువాతి పోస్టులో….

%d bloggers like this: