బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టీ.వీ ల్లోనూ కొన్ని మంచి కార్యక్రమాలు !!

    నేను ప్రతీ రోజూ తప్పకుండా చూసే ఒకే ఒక్క సీరియల్ జీ హిందీ చానెల్ లో రాత్రి 8.00 గంటలకు ప్రసారమయ్యే “ఝాన్సీ కీ రాణి”.చాలా బాగుంటోంది.ఆ మధ్యన జీ తెలుగు లో ఈ సీరియల్ తెలుగు వెర్షన్ ప్రారంభించారు. కానీ దీనిలో హిందీ లో ఉన్న గాంభీర్యం లేదు.పైగా ఒకసారి హిందీ వెర్షన్ చూసేక, తెలుగులో చాలా ఫీకా ఫీకా గా ఉంటోంది.అందువలన దాని జోలికే పోవడం లేదు.

    మిగిలిన సీరియల్స్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఇదివరకంతా ఏక్తా కపూర్ ధర్మమా అని, భారతీయ కుటుంబ వ్యవస్థ అంతా అకలా వికలం అయిపోయింది.సాస్ సీరియల్స్ మొత్తానికి పూర్తి అయ్యాయి అనుకుంటూంటే, ఇప్పుడు ఏ సీరియల్ (హిందీ, తెలుగు) చూసినా అంతా గందరగోళంగా ఉంటోంది.హాయిగా ఏదో ఒక సంగీతం ప్రోగ్రాం చూద్దామనుకుంటే,
వాటిలో పార్టిసిపెంట్లూ, వాళ్ళ తల్లితండ్రులూ ‘అభినయించే’ ఇమోషనల్ ఏడుపులూ, రాగాలూ చూళ్ళేకపోతున్నాము.

    సోమవారం రాత్రి 9.30 కి ఈ టీ.వీ లో వచ్చే ‘పాడుతా తీయగా’ ఒక్కటీ వీటన్నిటికీ భిన్నంగా ఉంటోంది.ఆయన ఎటువంటి వెర్రి వెర్రి వేషాలూ వేయకుండా, పిల్లలు పాడిన ప్రతీ పాట తరువాతా, ఆ పాటకు సంబంధించిన విశేషాలు చెప్పడం బాగుంటోంది. ప్రతీ రోజూ రాత్రి ఈ.టి.వీ లో ఒక పాత సినిమా వేస్తున్నారు. పోనీ వాటిని చూసి ఆనందిద్దామంటే, ఓ ప్రతీ పావుగంటకీ బ్రేక్ లు. యాడ్లు ఉండకూడదని ఎవరూ అనరు, కానీ మరీ అన్నిసార్లా? ఇంతకంటె, ‘మోసే బేయర్’ వాళ్ళు రిలీజ్ చేసిన సీ.డీ లు కొనుక్కుని, అలనాటి చలన చిత్రాలు చూడ్డం హాయి.

    క్రికెట్టు తో మొత్తం క్రిందటి నెలంతా బోరు కొట్టేశారు.చాలా మట్టుకు మాచ్చిలు ‘ఫిక్స్’ అయినవే అయినా, ప్రేక్షకులు మాత్రం చూస్తూనే ఉన్నారు.అదృష్టం కొద్దీ, నేను ఒక్క ఫైనల్ తప్ప ఏ మాచ్చీ చూడలేదు!అంతకంటె, అర్ధ రాత్రి వచ్చినా సరే,’ఛాంపియన్స్ లీగ్’ ఫుట్ బాల్, లేక ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ మాచ్చిలు చూసి ఆనందించాను.

    సోనీ హిందీ చానెల్ లో ‘సి.ఐ.డి’ అనే సీరియల్ కొన్ని సంవత్సరాలనుండీ ( అంటె కేబుల్ చానెల్స్ ప్రారంభం అయినప్పటినుండీ) వస్తోంది, దానిలో నటులు ముందునుండీ ఒకరిద్దరు తప్ప మారలేదు,చాలా బాగుంటుంది.

    ఇంక తెలుగు న్యూస్ చానెల్స్ లో ‘ సాక్షి’ అంతా ఎప్పుడు వీలుంటే అప్పుడు రోశయ్య గారిని తక్కువ చేసి, జగన్ ని పొగడడంతోటే సరిపోతూంది! మొన్న అనుకుంటా, టి.వి-5 లో ‘రోడ్ల మీద ప్రమాదాలు’ అని ఒక కార్యక్రమం చూశాను. అప్పుడు తెలిసిందేమిటంటే, నా పుట్టిన రాష్ట్రం రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం లో ఉందిట. నేను మెట్టిన రాష్ట్రం మహారాష్ట్ర రెండో స్థానం ట !

    ఎన్.డి.టి.వి ఇండియా( హిందీ) లో ప్రతీ రోజూ రాత్రి 9.30 కి ఒక అరగంట పాటు ఓ మంచి న్యూస్ కార్యక్రమం వస్తుంది. వీలుంటే తప్పకుండా చూడండి శ్రీ వినోద్ దువా చేసేది.ఆయన హిందీ, ఇంగ్లీషూ ఉచ్చారణ ఎంత బాగుంటుందో ఒకసారి చూడాల్సిందే. ఒక్కొక్క విషయాన్ని తీసికొని, దానిమీద విశ్లేషణ, ఏ రాజకీయ పార్టీనీ సపోర్ట్ చేయరు. కార్యక్రమం చివరలో ఓ హిందీ పాట ( పాత సినిమాలోది).

%d bloggers like this: