బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మధ్యతరగతి మనస్థత్వం –2

    నేను మిస్టరీ షాపింగ్ ఎసైన్ మెంట్లు చేస్తూంటానని చెప్పానుగా, ఆ సందర్భం లో ఈ వేళ షాపర్స్ స్టాప్ కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ రెండు నెలలోనూ ఇది నాలుగోది.ఇంతకు ముందువి, మా ఇంటావిడతో చేశాను. నాకు వచ్చిన మెయిల్ ప్రకారం ‘మెన్స్ వేర్ ‘ ఆడిట్ చేయాలి. వాళ్ళిచ్చే 500-1000 రూపాయలకీ షాపర్స్ స్టాప్ లో ఏమొస్తాయీ. వెళ్ళినప్పుడల్లా మా మనవడికోసం ఏదో ఒకటి కొంటూంటాను.ఏదో ఒకటి కొన్నట్లు వాళ్ళకి ఫ్రూఫ్ కావాలిగా !

   ఇప్పటికి గత రెండు మూడు సంవత్సరాల్లోనూ మొత్తం ఓ అరడజను సార్లైనా ఆడిట్ చేసే ఉంటాను.అయినా సరే ప్రతీ సారీ కొత్తే! నా ఆడిట్ లో మెన్స్ ఫార్మల్స్, సెమి ఫార్మల్స్, కాజుఅల్, షూస్, బ్యాగ్స్ లాటి కౌంటర్ లకి వెళ్ళి అక్కడి సేల్స్ మన్/గర్ల్ ఎలా ప్రవర్తిస్తున్నారో రిపోర్ట్ వ్రాయాలి.

    అసలు క్యాజుఅల్స్ కీ, ఫార్మల్స్ కీ తేడా ఏమిటో ముందర తెలియాలికదా! ఎప్పుడైనా అలాటివి కొన్నానా పెట్టానా? ఏదో డబ్బులిస్తున్నారూ, కాలక్షేపంఅవుతుందీ, ప్రతీ రోజూ చుసేవాళ్ళకంటే కొత్త కొత్త వాళ్ళని చూడొచ్చూ అనే తాపత్రయం తప్ప నాకెందుకండీ ఈ షాపర్స్ స్టాప్పులూ అవీనూ! అయినా సరే వచ్చే డబ్బులు ( ఫూకట్ గా!)కోసం ఇలాటివన్నీ చేయడం( మధ్య తరగతి మనస్థత్వం మళ్ళీ!).పైగా వీటిలో ఫార్మల్స్, సెమీ ఫార్మల్స్, కాజుఅల్ అని అన్ని తేడాలెందుకు పెట్టారో ఆ దేముడిక్కూడా తెలుస్తుందనుకోను.

    ఇక్కడ ప్రతీ దాని ఖరీదూ చుక్కల్నంటుకుంటూటాయి. బయట వాటికీ, ఇక్కడి వాటికీ కనీసం 40-50 శాతం ఎక్కువే.వాడి ఎస్టాబ్లిష్ మెంటు ఛార్జీలూ అన్నీ కలిపి వేసేస్తాడు.అయినా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. అందరూ నాలాగే ఉండరుగా! ప్రతీదాంట్లోనూ అక్కడ ఏమేమి పెట్టారో ఆ బ్రాండు పేరోటి వ్రాయాలి, అవేవో బొమ్మలు ( మానీక్విన్స్) పెట్టారో వ్రాయాలి. అక్కడుండే సేల్స్ మన్ పేరు, వాడి రూపం ఎలా ఉందో, పేరుతో సహా వ్రాయాలి. పేరు అడక్కూడదూ, వాడి నేమ్ ట్యాగ్గు ఎప్పుడూ తిరగేసే ఉంటుంది.అది ఎప్పుడు కనిపిస్తుందో అని చూడ్డంతోనే సరిపోతుంది.ఆ బ్రాండుల పేర్లు ఎక్కడ గుర్తుంటాయీ, దానికి మా కోడలు ఒకసారి ఓ చిట్కా చెప్పింది, మన మొబైల్ లో వాటి పేర్లు సేవ్ చేసేసుకుని, తరువాత తీరికగా చూసుకోవడం. ఈ పధ్ధతీ బాగానే ఉందనిపించింది.అప్పటినుండీ, ఎప్పుడు ఏ షాప్ కి వెళ్ళినా ఓ రౌండు వేసేయడం, ఓ పక్కకి వెళ్ళి ఆ పేర్లన్నీ సేవ్ చేసేసుకోవడం! వాటిల్లోవి కొనేదీ లేదూ,పెట్టేదీ లెదు!

    ప్రతీ కౌంటర్ లోనూ నోరు వెళ్ళపెట్టుకుని చూడ్డం, అదేదో కొనేసేవాడిలాగ ఓ షాపింగ్ బ్యాగ్గోటి తీసికొని అటూ ఇటూ తిరగడం. ఇలాటివి మాత్రం నేర్చేసుకున్నాను! అంతా చేసి, పిల్లల కౌంటరులోకి వెళ్ళి మా మనవడి కోసం ఏదో మన బడ్జెట్ లో సెలెక్ట్ చేయడం. పోనీ అక్కడేమైనా మనకి వీలుండేటట్లుంటాయా అంటే, అక్కడ ఆరు నెలల బాబుకి, ఏ డ్రెస్సూ 800/- కి తక్కువలేదు. ఓ రెండు రోజులేసేసరికి వాడికి ఎలాగూ సరిపోదూ, మన ఎదురుగానే దాన్ని రద్దీలోకి పెట్టేస్తారు. ఇవన్నీ ఆలోచించి, అంతంత డబ్బులు పెట్టి ఇప్పుడు కొనకపోతేనే అనిపిస్తుంది.ఇక్కడే మధ్యతరగతి మనస్థత్వం ఏక్ దం ఫీల్డ్ లొకి వచ్చేస్తుంది.ఏమో మా పిల్లలైతే, ఇలాటివన్నీ ఆలోచించరేమో.

    అలాటి షాపుల్లోకి వచ్చేవాళ్ళందరినీ చూస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి డబ్బుల వాల్యూ తెలియదా, లేక ప్రతీ వస్తువూ 4-5 రెట్లెక్కువ పెడితేనే వాళ్ళ స్టేటస్ పెరిగుతుందా? ఇవే బ్రాండులు ఇంకో షాప్ లో తక్కువకే వస్తాయి.అయినా ఇలాటి వాటిల్లోకి వెళ్ళి షాపింగు చేయడం ఓ స్టేటస్ సింబల్.పైగా పిల్లలతో వస్తే ఇంకా హడావిడౌతుంది. వాళ్ళు కనిపించినదల్లా కొనమని పేచీ పెడతారు, మనవాళ్ళుకూడా, తమ చిన్నప్పుడు ‘కోల్పేయిన’ లగ్జరీస్ అన్నీ వాళ్ళ పిల్లలకి ఎలా సమకూర్చుతున్నారో అనే ఓ అపోహ తో ఆ షాప్పు వాడిని పోషిస్తూంటారు.ఈ బ్లాగ్గు చదివే చాలా మంది అనుకుంటూండవచ్చు-ఈయన తన మిడిల్ క్లాస్ మెంటాలిటీ గురించి క్లాసెందుకు తీసికుంటున్నారూ అని.ఏం లేదూ, ఉన్న విషయం ఏమిటో చెప్తున్నాను.ఏదో నాలాటి వాడు వెళ్ళకపోతే, ఆ షాపు వాడికి ఏమీ నష్టం లేదు.

    వాల్యూ ఫర్ మనీ అనే దాని గురించి ఆలోచిస్తే, ఇప్పటి వాళ్ళకి నచ్చదు. పైగా ఏమైనా అంటే, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తారూ అంటారు.ఇందుకే అంటాను, నాలాటివాళ్ళు ఈ మధ్యతరగతి మనస్థత్వం లోంచి బయటకు రానూలేరు, అందులో ఇమడా లేరు.

%d bloggers like this: