బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-British legacy

epaper-sakshi-com (1)epaper-sakshi-com (2)

    ఈ వేళ సాక్షి న్యూస్ పేపర్ లో ఒక వార్త వచ్చింది. పైన ఇచ్చిన లింకుమీద నొక్కండి. మా చిన్నప్పుడు చూసేవాడిని, మా నాన్నగారు హెడ్మాస్తర్ ( నాకు జ్ఞానం వచ్చేటప్పటికే) గా పనిచేయడం వలన ఎప్పుడూ ఇంటినిండా ప్యూన్ లే. నీళ్ళుతోడాడానికి ఒకడు,మొక్కలకి నీళ్ళు పోయడానికి ఒకడు,మార్కెట్ నుండి కూరలు తేవడానికి ఒకడూ.అసలు వీళ్ళంతా స్కూలు పని మానేసి, మా ఇంట్లోనే ఎందుకు పనిచేస్తారూ అనుకునేవాడిని. కానీ అలాటివి అడిగే చొరవా, జ్ఞానమూ లేవు ఆరోజుల్లో ( అంటే ఇప్పుడు జ్ఞానం ఉందని అపోహ పడకండి!). ఏది ఏమైనా అదోలా ఉండేది.

    పెద్దై ఉద్యోగంలో చేరిన తరువాత ,మా ఫాక్టరీ జనరల్ మేనేజర్ ఇంటి దగ్గర కూడా, ఓ అరడజను వర్కర్లని చూసేవాడిని.ఓహో ఏదైనా సంస్థలో పనిచేసే అందరికంటె పెద్దాయన దగ్గర ఇలా వెట్టిచాకిరీ చేసేవాళ్ళుంటారన్నమాట అనుకున్నాను. అదే జనరల్ మేనేజర్లు, మా ఫాక్టరీలలో పనిచేసినంతకాలం, మహారాజ భోగాలతో ఉండేవారు. వాళ్ళకి ప్రమోషన్ వచ్చి, కలకత్తా హెడ్ క్వార్టర్ లో వేసినప్పుడు చూడాలి వీళ్ళ తిప్పలు.ఒకసారి నాకు తెలిసిన ఓ పెద్దాయన మా హెడ్ క్వార్టర్ లో ఉన్నారు కదా అని, కలియడానికి వెళ్ళాను.ఆఫీసులో నన్ను చూడగానే ఆయన క్యాబిన్ కి తీసికెళ్ళి, కాఫీ, చాయ్ ఏం కావాలీ అని అడిగి బెల్లు కొట్టారు. ఓ పావుగంటైనా ఎవడూ రాకపోతే, పాపం ఈయనే వెళ్ళి కాఫీ తెచ్చాడు.’వాడు ఈవేళ శలవుమీదున్నాడూ అందుకనే రాలేదూ అని ఓ వెర్రినవ్వు నవ్వేశాడు. ఆ తరువాత తెలిసింది, అక్కడ అంటే హెడ్క్వార్టర్స్ లో ఈ ‘మహారాజు’ లని పట్టించుకునే నాధుడెవడూ ఉండడని, అన్ని పనులూ, ఆఖరికి టెబిల్ తుడుచుకోవడం దగ్గరనుండీ.

   అలాగే మా స్నేహితుడొకరు ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్ లో బ్రిగెడేయర్ గా ఉండేవాడు. ఒకసారి వాళ్ళింటికి వెళ్తే ఆశ్చర్యం వేసింది. నలుగురో అయిదుగురో ఆర్డర్లీలు షూస్ విప్పడానికోడూ, పాలిష్ చేయడానికోడూ, వంట చేయడానికోడూ వామ్మోయ్, వాళ్ళింట్లో ఉండే కుటుంబసభ్యులకన్నా, ఈ ఆర్డర్లీలే ఎక్కువ! ఇదేమిటి గురూ అంటే, ‘ఏం చేస్తాం వద్దన్నా వాళ్ళకి డ్యూటీ ఇక్కడే వేస్తారు, ఉన్నారుకదా అని చేయించుకుంటున్నానూ, రిటైర్ అయిన తరువాత ఈ భోగాలన్నీ ఎలాగూ ఉండవు కదా, అనుభవించినంతకాలం అనుభవించడమే’అన్నాడు.

   మేము రాజమండ్రీ లో ఉన్నప్పుడు (అంటే ఈ మధ్యనే) మా బిల్డింగులోనే ఓ రిటైర్ అయి దివంగతులైన పోలీసు అధికారి గారి భార్య ఒకరుండే వారు. ఆవిడ ఒక్కరే ఉండేవారు. ఆవిడకి సేవలు చేయడానికి ప్రతీ రోజూ ఓ పోలీసూ, ఆవిడకి తోడుండడానికి ఓ లేడీ పోలీసూ, అబ్బో ఇలా ఉండాలి భోగం అంటేనూ అనుకునేవాడిని.అక్కడ ఉండగానే పేపర్లలో లెటర్ వ్రాద్దామనుకున్నాను, మళ్ళీ పోలీసులూ వీళ్ళతో గొడవలెందుకూ, కారణం లేకుండానే ‘లోపల’ పెట్టేస్తారూ, లేనిపోని గొడవ మనకెందుకూ అనుకుని వదిలేశాను! పోనీ ఏదైనా జెడ్ క్యాటిగరీ మరేదో ఉందేమో అనుకున్నా అదీ లేదు. వీళ్ళెవరూ లేనప్పుడు ఈవిడ హాయిగా తిరిగేవారు! పోలీసులు తక్కువై శాంతి భద్రతలు కాపాడలేమంటూనే అసలు వీళ్ళేమిటీ, వీళ్ళ డ్యూటీలేమిటి?

    మనదేశంలో మహరాజభోగాలనుభవించాలంటే పోలీసుగానో, ఆర్మీ ఆఫీసరుగానో, లేక ఏ రాజకీయనాయకుడుగానో పుట్టాలి.

    ఇవన్నీ మనకి బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిన బహుమతులు. ‘సిరి అబ్బకపోయినా చీడ అబ్బిందంటారు. వాళ్ళకి ఉన్న డిసిప్లీన్ లేకపోయినా ఇలాటివన్నీ మాత్రం నేర్చుకున్నాం!

    ఇవే కాకుండా, ప్రభుత్వ వాహనాలు స్వంత పనులకు ఉపయోగించుకోవడం, ఎం.ఎల్.సి నుండి ప్రతీవాడికీ ఇద్దరు గార్డులూ.అసలు వీళ్ళందరికీ ఈ సెక్యూరిటీ ఎందుకో అర్ధం అవదు.వీళ్ళు మనల్ని ఏం ఉధ్ధరిస్తున్నారుట? మామూలు జనం కట్టే పన్నులు అన్నీ ఎలా వ్యర్ధం అవుతున్నాయో తలుచుకుంటే గుండె మండిపోతూంది.అయినా ఏం చేయలేము.

%d bloggers like this: