బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-ప్రజాసేవలు-2

    నిన్న రైళ్ళలో టి.టీ లు చేసే ప్రజా సేవ గురించి చూశాముగా. ఏదో తిప్పలు పడి మొత్తానికి ప్రయాణం చేసి మన గమ్యానికి చేరుతాము.అక్కడ ఇంకో రకమైన ప్రజా సేవకులు తారస పడతారు.అన్ని భాషల్లోనూ రైల్వే స్టేషన్లలో అరుస్తూంటారు–మీ సామాన్లు ఆథరైజ్డ్ కూలీ ద్వారానే తీసికెళ్ళండి, అతనికి ప్రభుత్వం విధించిన కూలీ మాత్రమే ఇవ్వండి. ‘అని చెప్పి ఏవేవో రేట్లు బోర్డులమీద కూడా వ్రాస్తూంటారు. నాకు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ అనుభవం చెప్పండి- ప్రభుత్వం వారు చెప్పిన రేటుకి ఏ కూలీ అయినా తీసికెళ్తాడా? ఛస్తే తీసికెళ్ళడు.మనం ఏ ఆర్డినరీ 3-టయర్ లోంచో దిగితే అసలు పట్టించుకోడు. వాళ్ళు ముందర ట్రైను కి ఆ చివరో, ఈ చివరో ఉన్న బోగీలకే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తారు, కారణం అక్కడే ఏ.సీ బోగీలుంటాయి.

   మన ఆంధ్రదేశంలో ఏ స్టేషనులోనూ, ఓవర్ బ్రిడ్జ్ మీద ర్యాంప్ సౌకర్యం ఉండదు. ప్రతీ స్టేషన్ ఓవర్ బ్రిడ్జ్ మీదా మెట్లే. ఈ మధ్యన వస్తున్న వీల్స్ సూట్ కేసులు అక్కడిదాకా లాక్కొచ్చినా, అక్కడికి వెళ్ళాక, నెత్తిమీద మోసుకుని వెళ్ళాల్సిందే. అందరికీ సౌకర్యంగా ఉండదుకదా ( నాలాటి 65 ఏళ్ళ వాడైతే మరీనూ!). అందువలన నచ్చినా నచ్చకపోయినా ఓ కూలీ ని మాట్లాడుకోవాల్సిందే. ఇంక ఆ పోర్టర్ తనకిష్టం వచ్చినంత రేటు చెప్తాడు. ‘టు హెల్ విత్ గవర్నమెంట్ రేట్స్ ‘. సో వీళ్ళు చేస్తున్నది కూడా ప్రజా సేవనే అనాలి కదా!

    ఇన్ని కష్టాలూ పడి బయటకు వస్తాము. ఇంక అక్కడ ఆటో వాళ్ళతో. మీటరు ఉన్నా సరే, వాడు చెప్పిన రేటుకే మాట్లాడుకోవాలి. ఏమైనా అంటే, మీటరు పనిచేయడంలేదంటాడు.రాజమండ్రీ లో అయితే మీటర్లే ఉండేవి కావు.మనల్నీ, మన సామాన్నీ చూసి వాడు ఏం చెప్తే అది నోరుమూసుకుని ఇచ్చేయడమే. అక్కడ అన్ని ఆటో వాళ్ళదీ ఒకే మాట ! ఇదీ ప్రజాసేవే.

    మీరు ఎప్పుడైనా మనవైపు రిజిస్టార్ ఆఫీసుకి వెళ్ళారా?నాకు తణుకు లో మూడు సార్లు వెళ్ళే అదృష్టం కలిగింది.అక్కడ రిజిస్టార్ అనబడే మహానుభావుడే అడిగేస్తాడు ‘కాఫికి డబ్బులివ్వండి’ అని! డబ్బులు ఇవ్వకపోతే మన రిజిస్ట్రేషన్ వ్యవహారం పూర్తే అవదు. కాగితాలు తెచ్చుకోడానికి, మూడు చెరువుల నీళ్ళు త్రాగించేస్తారు! ఇదీ ప్రజాసేవే !

    పాస్పోర్ట్ కి ఎప్లయ్ చేసిన తరువాత, మన ఇంటికి వెరిఫై చేసుకోడానికి వచ్చే పోలీసాడికి మామూలు ఇవ్వకపోతే, మన ప్రవర్తన ‘సందేహాత్మకంగా’ ఉందని వ్రాసినా వ్రాసేస్తాడు.పాస్ పోర్ట్ మాట దేముడెరుగు, మనం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగలెక చావాలి! ఇదీ ప్రజాసేవే !

    ఆఖరికి మన సొసైటీ లో ఉండే వాచ్ మన్ కి కూడా వాడడిగినప్పుడు పండగ మామూళ్ళు ఇవ్వాల్సిందే.మన వైపు ప్రతీ నెలా ఏదో పండగ వస్తూనే ఉంటుంది.మేము రాజమండ్రీ లో ఉన్నప్పుడు, అందరిలాగే దసరాకి మామూలిచ్చాను.మళ్ళీ దీపావళి అన్నాడు,ఆ తరువాత సంక్రాంతన్నాడు.ఇదేమిటీ అని అడిగినందుకు, ఎప్పుడైనా కరెంటు పోతే, జనరేటరు వేసేవాడు కాదు,నాలుగు అంతస్థులూ చచ్చినట్లు మెట్లమీదుగా వెళ్ళేవాడిని! వాడిదీ ప్రజాసేవే !

    నాకు ఆశ్చర్యకరమైన అనుభవం ఇప్పటిదాకా ఒకేసారి జరిగింది. 1992 లో మా అమ్మాయి, 12 క్లాసు పాస్ అవగానే, ఇంజనీరింగు లో ప్రవేశానికి, మహరాష్ట్రలో రెండు సర్టిఫికెట్లు ఇవ్వాలి.
మొదటిది ” డొమిసైల్” రెండోది ‘నేషనాలిటీ’. మొదటిది భుసావల్ తహసిల్దార్ ఇస్తాడు, రెండోది జలగాం లో కలెక్టరాఫీసు వాళ్ళిస్తారు. మొదటివాడు, 100 రూపాయలిచ్చిన తరువాతే నా కాగితాన్ని ముందరకి పంపించాడు.అది పుచ్చుకుని జలగాం వెళ్ళాను.అక్కడ రెండు గంటల్లో మా అమ్మాయి సర్టిఫికెట్ ఇచ్చారు. ఏమైనా ఇచ్చుకోవాలా అని నసుగుతూ అడిగితే ఆయనన్నాడూ,’ సార్, మీ అమ్మాయి తెచ్చిన మార్కులు ( 98%), మన జిల్లాకే గర్వకారణం, మీదగ్గర కూడా చాయ్ పానీకి డబ్బులు పుచ్చుకుంటే, అర్ధంలేదూ’ అని. కారణం ఏదైతేనే నేను ఏ దక్షిణ ఇచ్చుకోకుండా పని పూర్తిచేసికున్నాను.మరి దీన్ని ప్రజాసేవ అంటారో లేదో నాకు తెలియదు.జీవితంలో మొదటిసారీ, బహుశా ఆఖరిసారీ నాకు ఎదురైన మంచి అనుభవం !

    ఇంక పోస్ట్ మాన్లు. వాళ్ళు పాపం ఒక్కసారే మనవైపు దసరాకీ, ఇక్కడ దీపావళికీ మాత్రమే మామూలు అడుగుతారనుకునేవాడిని. కానీ వాళ్ళు పాస్ పోర్టులు స్పీడ్ పోస్ట్ లో తెచ్చినప్పుడు కూడా అడుగుతారు! అది ఇవ్వవలసిందేట! ఈ మధ్యన మా అబ్బాయి పాస్ పోర్ట్ రిన్యూ చేయించినప్పుడు తెలిసిన విషయం !!
ఇంక మామూలుగా రోడ్డుమీద వెళ్తున్నప్పుడు అందులోనూ ఏ గాడీ మీదో వెళ్తే, మన అదృష్టం బాగోపోతే, పోలీసువాడి ‘ప్రజా సేవ’ కి బలైపోతాం !!!!

మీ అనుభవాల్లో ఇంకేమైనా ఉంటే చెప్పండి !