బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మాస్టార్లతో జీవితం -2

    నేను మరీ సుఖపడిపోతున్నానని అనిపించింది ఆ దేముడికి, సరే వీణ్ణి కొంచెం నియంత్రణలో పెట్టాలీ, లేకపోతే పేట్రేగిపోతాడూ అనుకున్నారాయన.మరి అలాటప్పుడు మనకి కూడా, అదే దిక్కులో ఆలోచనలు తెప్పించేస్తారు.మనకి ఏది రాసిపెట్టుంటే అలాగే అగ్నికి ఆజ్యం పోసినట్లుగా, పరిస్థితులు కూడా తోసుకొచ్చేస్తాయి. హాయిగా ఉన్నవాడిని ఉండక, ఇంక నాకు పెళ్ళిచేయండీ అని అడగడం ఏమిటీ, అప్పటికి 29 ఏళ్ళొచ్చాయనుకోండి. దానికి సాయం అడిగేడు కదా అని మా ‘హెడ్మాస్టారు’ ( అంటే మా నాన్న గారు, అప్పటికి రిటైర్ అయ్యారులెండి), సరే చేద్దాం, ఇక్కడికి రా అన్నారు. మరీ నా అంతట నేను అడగ్గానే చెయ్యకపోతే ఇక్కడే ఏ పిల్లనో చేసికుంటే..( అంత ధైర్యం ఎక్కడుండేదీ, ఉంటే ఎప్పుడో బాగుపడేవాడిని!). రమ్మన్నారు కదా అని ఓ మూడు వారాలు శలవు పెట్టేసి వెళ్ళాను.

    చెప్పానుగా ఇదివరకోసారి, మా పెద్ద అన్నయ్య గారు( మళ్ళీ ఆయన ఓ ప్రిన్సిపాల్) బాధ్యత తీసికుని, నన్ను మా పెద్దమ్మ గారింటికి తణుకు తీసికెళ్ళారు.మేము భోజనాలు చేసి కబుర్లు చెప్పుకుంటూంటే ఇద్దరు లేడీస్ అక్కడికి వచ్చారు. మరీ అంత పరిశీలనగా చూడ్డానికి వీలు పడలేదు. కారణం, మనవైపు ఇళ్ళలో పగటిపూట లైట్లు వేసేవారు కాదు, ఇంకో కారణం, వచ్చిన ప్రతీ వారినీ మనం ‘ఆ దృష్టి’ తో చూడకూడదుగా ( ఇంట్లో మాస్టార్లు చిన్నప్పటినుండీ బోధించిన నీతి పాఠాల ప్రభావం!). కారణం ఏదైతేనేంలెండి, చూసీ చూడనట్లుగా చూశాను.మరీ కనిపించిన వాళ్ళందరితోనూ కబుర్లు చెప్పే చొరవా, ధైర్యం ఉండేది కాదు. నా నమ్మకం ఏమిటంటే ఆ వచ్చిన వాళ్ళు నన్ను చూడ్డానికే వచ్చుంటారేమో అని, ఎందుకంటే ఆ తరువాత నా జీవితంలో జరిగిన పరిణామాల బట్టి, ఇప్పుడు ఆలోచిస్తూంటే అనిపిస్తోంది !

   ఆరోజు రాత్రికి అమలాపురం వెళ్ళేక, మా అమ్మమ్మగారు నన్ను చూడ్డానికి మా ఇంటికి వచ్చి, నా పెళ్ళి టాపిక్కు ఎత్తారు. ఆ సందర్భంలో, తణుకు లో చిన్నక్కయ్య ( మా దొడ్డమ్మ గారిని అందరూ అలా పిలిచేవారు) వాళ్ళింట్లో చూసిన పిల్ల ఎలా ఉందీ అని అడిగారు. ఓహో అక్కడ జరిగినవి పెళ్ళి చూపులా అనుకుని ( ఆ మాటేదో ముందరే చెప్పొచ్చుగా, పరిశీలనాత్మకంగా చూసుండే వాడిని, పోన్లెండి, జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు!),మేము అక్కడ ఉండగా ఎవరో ఇద్దరు వచ్చారూ, ఇద్దరూ బాగానే ఉన్నారూ అన్నాను.నాకేం తెలుసూ అందులో ఒకావిడ నాకు కాబోయే అత్తగారని!( నా పాత బ్లాగ్గులు చదవని వారి సమాచారం కోసం!)

    మొత్తానికి అన్ని వ్యవహారాలూ జెట్ స్పీడ్ లో జరిగిపోయి, మా అవబోయే ఇంటావిడని ,మా అమ్మమ్మ గారు అమలాపురం పిలవడం, ఆవిడే నడుంకట్టుకుని మా పెళ్ళి నిశ్చయించడం జరిగింది.ఈ రోజుల్లో లాగ అప్పుడు, అమ్మాయినీ అబ్బాయినీ విడిగా మాట్లాడుకోనిచ్చారా ఏమిటీ. పైగా మా నాన్నగారికి ఎంత సంతోషమో, కొడుక్కి పెళ్ళవుతోందనీ, ఆ వచ్చే పిల్ల టీచర్ గా పనిచేసేదీ అని. ఈ ‘మాస్టార్ల జాతి’ అనేది ఉందే, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంతంత ప్రేమలూ, అభిమానాలో !ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుతూంటే చూడాలి ఆ ఆపేక్ష కారిపోతూంటుంది.

    ఆయనదేంపోయిందీ, మా అమ్మగారేమీ ‘ మాస్టారు’ కాదు. ‘ ఓరి నాయనోయ్, వచ్చి వచ్చి ఎలాటి చేతిలో పడ్డానురా దేముడోయ్’ ఇంట్లో ‘మాస్టర్ల ‘ బాధ తప్పిందనుకుంటే, ‘ ఫ్రైయింగ్ పాన్ లోంచి ఫైర్’ లో పడ్డట్టయ్యింది, నా పని! ‘రామా ఈజ్ ఏ గుడ్ బాయ్’ లాగ పితృవాక్యా బధ్ధుడై సరే అనేశాను. ( మనలో మన మాట బాగానే ఉంటుంది లెండి!). పోనీ అప్పుడైనా నా ‘ఫోబియా’ కారణం చేత వద్దనీ అనిపించలేదు. ఎప్పటికైనా నేనూ ఓ ఇంటివాడనౌతున్నానే, ‘మాయ’ లో పడి, ఆ ‘ఫోబియా’ గుర్తుకే రాలేదు!దేముడు తననుకున్నది జరిపించాలనుకున్నప్పుడు, ఇలాటి’మాయా, మైకం’ కప్పేస్తాడుట ( సినిమాల్లో చూస్తూంటాము!).

   ఇలా నాజీవితం లో ‘మాస్టారి’ ప్రభావం ఇంకో సారి ( ఇంకోసారేమిటిలెండి, జీవితాంతం) ప్రారంభం అయింది. ఇన్నింటిల్లోనూ విచిత్రం ఏమిటంటే, మా మామగారూ, అత్తగారూ కూడా టీచర్లే. నా జీవిత బంధం ఇంత పకడ్బందీగా ‘మాస్టర్’ లతో ముడి పడిపోయింది! అలాగ నా పుట్టిల్లూ, మెట్టినిల్లూ టీచర్ల మయం!
ఇంక వీళ్ళతో ఎలా నెగ్గుకొచ్చానా,( ఆర్ అదర్వైజ్) వచ్చే పోస్ట్ లో……
.

%d bloggers like this: