బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మన దురదృష్టం !!

    నిన్నా, ఈవేళా లోక్ సభలో జరిగిన అల్లరి చూస్తూంటే, మన రాజకీయ నాయకులు ఎంత హీన స్థితికి వెళ్ళగలరో తెలుస్తుంది. మన గ్రామాల్లో చూస్తూంటాము, ‘అచ్చోసిన ఆంబోతులు’ అని, అలాగే మన నాయకులు కూడా, పార్లమెంటు లో ఏ చెత్త మాట్లాడినా, వాళ్ళని అడిగేవాడు లేడు.లాలూ అరుపులూ, ఆ తరువాత బి.జే.పి సభుడిని కొట్టడానికి వెళ్ళడం, ఇతనిని ములాయం సింగు ఆపడం చూస్తూంటే, ఏదో సినిమాల్లో రౌడీ షీటర్స్ ప్రవర్తన లా ఉంది. మన ఖర్మ కాలి, ఒకడు బీహార్ ని ముంచేశాడు, ఇంకోడు యు.పి. ని ముంచేశాడు.అసలు వీళ్ళకి ఇంకోళ్ళకి నీతులు చెప్పే అధికారం ఉందా అనిపిస్తూంటుంది. పార్లమెంటే కాదు, మన శాసన సభలూ అలాగే తగలడ్డాయి.స్పీకర్ అనేవాడు , ఈ దౌర్భాగ్యుల్ని అరికట్టలేక సభలని మాత్రం వాయిదా వేస్తూంటారు.ప్రపంచంలో మిగతా అన్ని పార్లమెంటులలోనూ ఇలాగే జరుగుతూంటుందా, ఏమో.

   ఈ మధ్యన వార్తల్లోకి వచ్చిన ఇంకో అంశం-మన దేశంలోని క్రీడా సంఘాలని, సంవత్సరాలనుండీ అంటిపెట్టుకుని ఉన్న రాజకీయ నాయకులు.చాలా మందికి ఓ అంటే ఢం రాదు క్రీడలగురించి, అయినా సరే సంవత్సరాలనుండీ కుర్చీ అంటిపెట్టుకునే ఉన్నారు.గవర్నమెంటు ఇచ్చే గ్రాంటులు అన్నీ జేబుల్లోకి వస్తాయి గా! ఎక్కడ చూడండి, ప్రతీ ఫెడరేషనుకీ ఎవడో ఒక రాజకీయ నాయకుడే హెడ్డు.వాడు పోతే, వాడి కొడుకో,కూతురో. మొత్తానికి కుటుంబంలోనే ఉండాలి.కొంతమంది 20-30 సంవత్సరాలనుండీ ఉన్నారుట.పోనీ వీళ్ళుండడం వల్ల మనకి అంతర్జాతీయ పోటీల్లో ఏమైనా పదకాలు వస్తున్నాయా అంటే అదీ లేదు.మరి ఈ నాయకులు చేస్తున్న నిర్వాకం ఏమిటంటా?

    ఏ క్రీడ తీసికున్నా దాంట్లో అన్నీ పాలిటిక్సే. సెలెక్షన్ లో కనిపిస్తూంటుంది.హాకీ లో కె.పి.ఎస్. గిల్ వచ్చిన తరువాత, ఎంతమంది కోచ్ లు, ఎంతమంది కెప్టెన్లు మారారో చూశారు కదా.అలాగే ఏదో ఒలింపిక్స్ లో అన్ని సంవత్సరాల తరువాత షూటింగులో గోల్డ్ మెడల్ వచ్చిందీ అనుకుంటే, అభినవ్ బింద్రాని ఆ తరువాత టీం లోంచే తీసేశారు! ఈ మధ్యన ఈ గొడవంతా ఇంత ప్రాముఖ్యంలోకి వచ్చిందంటే,మన క్రీడా మంత్రి శ్రీ గిల్ ( మాజీ ఎలక్షన్ కమిషనర్),ఇచ్చిన ప్రకటన వలన.ఇదంతా ఎందుకొచ్చిందంటే రాహుల్ మెహ్రా అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో వేసిన పి.ఐ.ఎల్ ధర్మమా అని.

    దీనికి సమాధానంగా, మన ‘నేతలు'( ఫెడరేషన్లని జలగల్లా పీల్చేస్తున్న దురంధరులు) ఏమంటున్నారంటే, మాలాటి రాజకీయ నాయకుల వల్లే, అసలు ఈ క్రీడలకి స్పాన్సర్ షిప్ వస్తోందీ అని.ఆ వచ్చేదేదో మన పెద్ద పెద్ద కంపెనీలనుండే కదా. మన దేశంలో ఉన్నవి మొత్తం ఓ పదిహేను క్రీడా ఫెడరేషన్లుంటాయనుకుంటాను. ఒక్కొక్క దానికీ, ఓ టాటా, ఓ బిర్లా,ఓ అంబానీ, ఓ మాల్యా,ఓ కుమారమంగళం అలా చెప్పుకుంటూ పోతే ఓ పాతిక యాభై ఉద్దండుల్లాంటీ వాళ్ళున్నారు. వాళ్ళనే అద్యక్షులు చేసేస్తే, వాళ్ళు ఎవరో ఒక ప్రొఫెషనల్ ని సి.ఈ.ఓ క్రింద పెట్టి, మెనేజ్ చేస్తారుకదా.అప్పుడు ఈ రాజకీయ నాయకుల గొడవా ఉండదు. వాళ్ళని దేశాన్ని ఉధ్ధరించమందాం, పార్లమెంటులో కావలిసినంత కాలక్షేపం.

    మా చిన్నప్పుడు మామూలుగా జనరల్ నాలెడ్జ్ లో మన దేశం లో రాష్ట్రాలెన్నో, గవర్నర్లెవరో, ముఖ్యమంత్రెవరో, కేంద్ర క్యాబినెట్ లో మంత్రులెవరో వగైరా వగైరా, సోషల్ స్టడీస్ లో బిట్ ప్రశ్నల్లో వచ్చేవి.వాటిగురించి పేపర్లలో చదవడం, ఆవి గుర్తు పెట్టుకోవడం ఆ ప్రశ్నలు పరీక్షల్లో వస్తే వ్రాయడం అంతా బాగా ఉండేది.ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎవడు గవర్నరో, ఎవడు ముఖ్యమంత్రో
ఎవరికైనా తెలుసునా? ఎవడెంత తిన్నాడో మాత్రం అందరూ గుర్తు పెట్టుకుంటారు.
టెల్కాం 2జి స్పెక్ట్రం విషయంలో డి.ఎం.కే కి చెందిన రాజా, లక్ష కోట్ల స్కాం కి బాధ్యుడు అని అందరూ మొత్తుకుంటూంటే, కరుణానిధి మాత్రం, ‘రాజా దళితుడు కాబట్టి, అతనిమీద కక్షకట్టారూ’ అంటాడు.కులానికీ, స్కాం కీ సంబంధం ఏమిటండి బాబూ? ఏదైనా సరే ఒకే పార్టీ అధికారం ఉండాలి కానీ,ఇలాటి కిచిడీ ప్రభుత్వాలు ఇలాగే తగలడతాయి.ఎవణ్ణంటే ఎవడికి కోపంవస్తుందో తెలియదు.ఒకే పార్టీ అదికారం లో ఉన్న ప్రభుత్వాలు చూడండి, హాయిగా ఉన్నారు.గొడవలుంటాయి లేవనము, కానీ వాళ్ళు తినేది తింటూ కొంచమైనా ప్రజలకి కూడా చేస్తూంటారు.ఎవడి బ్లాక్ మెయిలూ ఉండదు.వెస్ట్ బెంగాల్, గుజరాత్,పంజాబ్,ఆంధ్ర, కర్ణాటకా, బీహార్, యు.పి,ఎం.పి, మొ.. వాటిలో పరిపాలన ఫరవా లెదు.అప్పోజిషన్ పార్టీలవాళ్ళ సంగతి వదిలేయండి, వాళ్ళు అరుస్తూనే ఉంటారు.

    రాజకీయం లో డబ్బులుంటాయి కాబట్టే, అంతంత డబ్బులు ఖర్చుపెట్టి, అంతకింతా సంపాదించుకోవచ్చని వస్తారే కానీ, దేశాన్ని ఉధ్ధరించడానికి మాత్రం కాదు.వాడెవడో కేతన్ దేశాయి ట, ఏ ఊళ్ళో మెడికల్ కాలేజీ ఉండొచ్చో, ఎక్కడ ఉండకూడదో వాడే చెప్తాడుట.వాడు ఇన్నాళ్ళూ తిన్న డబ్బు కోట్లమీదే. ఇంకో జగన్ మోహన్-జాయింటు కలెక్టరుట.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ రోజూ మన ‘ హాల్ ఆఫ్ షేం’ లో జనం ఎక్కువైపోతున్నారు.

   ఇదివరకటి ( మేము చదువుకునే రోజుల్లో) పుస్తకాల్లో, దేశానికి స్వతంత్రం ఎలా వచ్చిందీ, వారందరూ ఎంతంత త్యాగాలు చేశారూ లాటివి చదివాము.ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎవరూ పట్టించుకోరు.ఇప్పుడు ఎవడెవడు ఏ ఏ స్కాం లో ఎంతంత తిన్నాడూ, వాడిని ఏమీ చెయ్యలేక, మన కోర్టులు కూడా వాళ్ళని ‘ ఫర్ లాక్ ఆఫ్ ఎవిడెన్స్’ ఎలా వదిలేస్తున్నారూ, అందులో మన న్యాయ వ్యవస్థ ఎంత ‘నీతి’ గా ఉందీ, వాళ్ళని పట్టుకోవలసిన పోలీసు యంత్రాంగం ఎంత ‘నీతి’ గా ఉందీ, వగైరా వగైరా..

సర్వేజనా సుఖినోభవంతూ …..

%d bloggers like this: