బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– కాలక్షేపం

    నిన్నా మొన్నా శ్రీ కాళహస్తీశ్వర స్వామి రాజగొపురం సంఘటన గురించి, మన టి.వి.చానెల్స్ లొ హోరెత్తించేశారు.20 సంవత్సరాలనుండీ, రాజగోపురం బీటలు తీస్తున్నా, ఎవరూ పట్టించుకోలెదు. కాని నారావారు, అదంతా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమె అని నొక్కి వక్కాణించేశారు! ఈ 20 సంవత్సరాలలొనూ వారుకూడా మన రాష్ట్రాన్ని పరిపాలించారని మర్చిపొయారు పాపం! ఎన్నిపనులో ఆయనకి. ఇంక మన టి.వీ వాళ్ళయితే కనిపించిన ప్రతీ వాడి అభిప్రాయం అడిగి మనకి జ్ఞానోదయం చేశారు.దేవాదయశాఖ వాళ్ళు, పురావస్తు శాఖవారిది తప్పు అన్నారు, వీళ్ళేమో అబ్బే కాదు, ప్రభుత్వానిదే అన్నారు! ఈ లోపులో ఇంకోడొచ్చి, అప్పుడే ఎస్టిమేట్లు అవీ తయారుచేసేసి, గోపురం తిరిగి నిర్మించడానికి టెండర్లు పిలుస్తామూ, అందులో ఎంతెంతమందికి ఎంత వాటాలో వగైరా సిధ్ధం చేశారు. ఇందులో చూపించే ‘ఎంథూజియాసం’, గత 20 సంవత్సరాల్లో ఏ ఒక్కడైనా చూపిస్తే ఈ స్థితికి వచ్చేది కాదు.

   ఛాన్స్ దొరికినప్పుడల్లా, మందీ మార్బలం తో ప్రత్యేక దర్శనాలకి వచ్చే ఈ రాజకీయనాయకులకీ, దేవాదయ శాఖవారికీ, రాజ గొపురం బీటలు కనిపించలేదంటే ఎలా నమ్ముతాము? క్యూల్లో నుంచోకుండా ప్రత్యేక దర్శనాలకి అలవాటు పడ్డ ఈ దౌర్భాగ్యులకి, వాళ్ళకి జరిగే రాజలాంఛనాలమీద కాకుండా, మిగిలినవాటి మీద దృష్టి ఉంటుందని ఆశించడం మన అత్యాశే. ఒక టి.వీ, చానెల్ ( టి.వి-9 అనుకుంటా), శ్రీకృష్ణదేవరాయలి ఆత్మ ఎంత సంక్షోభం చెందిందో చాలా నాటకీయంగా వివరించారు. అది ఎలా ఉందంటే అవకాశం దొరికితే– ‘ ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు స్వర్గాన్నుండి మనతో లైన్లో ఉన్నారు’ అనేంత!మన టి.వీ.. వాళ్ళు దేనికైనా తగుదురు!

    తమిళనాడు లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా,వారు ఆరాష్ట్రంలోని దేవాలయాల గురించి తీసికునే శ్రధ్ధ చూస్తే కడుపు నిండిపోతుంది.ఏ దేవాలయం చూసినా, అక్కడి రాజగోపురాలకి రెగ్యులర్ గా రంగులు వేయడం,రిపెర్లొస్తే బాగుచేయడం ఒక డ్యూటీ గా చేస్తారు.మరి మనవాళ్ళకేం రోగం? ఎక్కడ డబ్బులు దొరుకుతాయా, ఎలా తిందామా అనే కానీ ఇంకో ధ్యాస ఉండదు.తిరుమలలో ఆదికేశవులు, కోర్టులు ఎంత అరచి గీ పెట్టినా సరే, ఆనంద నిలయం లోపల, స్వర్ణమయం చేయాల్సిందే అంటాడు. పాపం ఆ శ్రీ వెంకటేశ్వరుడికి నోరు లేదు, అయినా స్వర్ణమయం చేయకపోతే ఆయనెమైనా అంటాడా ఏమిటీ?

    ఇంక ఈవేళంతా, అవేవో యాత్రలూ, ఫైరింగులూ, ఆత్మహత్యా ప్రయత్నాలూ అడక్కండి, మన సహనం ఎంతవరకూ పరీక్షించగలరో దానికి ఉదాహరణ ఈ వేళ్టి ప్రసారాలు.వాడెవడో ఎం.ఎల్.సీ ట వాడి గన్ మన్ ఠపా ఠపా మని కాల్చేశాడు.మరి పోలీసులేం చేస్తున్నారుట? ఇంక హైదరాబాద్ సంగతికొస్తే ఆ కుర్రాళెవరో సావకాశంగా రాళ్ళు రువ్వుతూ, దుకాణాల అద్దాలు పగలకొట్టేస్తున్నారు. మన టి.వీ. వాళ్ళేమో, నాలుగైదు పార్టీల వాళ్ళని ఎవరినో స్టూడియో కి పిలవడం, వాళ్ళచేత అవాకులూ చవాకులూ మాట్లాడించడం. ఇంక ఈ ఏంకర్లు, ఆ మాట్లాడేవాడు ఏదైనా చెప్పడం మర్చిపోయాడేమో అని .ఒకే ప్రశ్నని అడిగిందే అడగడం.

    ఆ అత్మహత్యా ప్రయత్నం- ఓ జోక్ ఆఫ్ ద డికేడ్! అసలు చేతిలో ఉన్నవి నిద్రమాత్రలా, హోమొపతీ మాత్రలా? రెండంటే రెండే నిద్ర మాత్రలతోనూ ఆత్మహత్యా ప్రయత్నం చేయొచ్చని మనకి జ్ఞానొదయం అయింది. ఈ యాత్రలూ, ఫైరింగులూ, ట్రైన్లు అంటించడాలూ, దుకాణాల అద్దాలు పగలకొట్టడాలూ చుస్తూంటే నాకో బ్రిలియంట్ ఐడియా వస్తోంది. ఇవి మన రాజకీయ నాయకులు బ్రతికున్నంత కాలమూ ఎలాగూ తప్పవు, మన టి.వి వాళ్ళు వాటిని ప్రత్యక్షప్రసారం చేయడం ఎలాగూ మానరు, హాయిగా ఏ కంపెనీ బ్రాండు వాళ్ళో వీటినికూడా స్పాన్సర్ చెసేస్తే ఆ కంపెనీకి లాభాలెనా వస్తాయి. టి.వీ. వాళ్ళూ బాగుపడతారు.

    ఉదాహరణకి కార్యక్రమం ఇలా ఉండాలి– ఈ వేళ్టి బంధ్ స్పాన్సర్స్ ఫలానా కంపెనీ ఠింగ్ ఠింగ్..- తరువాతి కార్యక్రమం తార్నాకా లో దుకాణాల లూటీ స్పాన్సర్డ్ బై ఫలానా కంపెనీ.. ఆత్మహత్యా ప్రయత్నం కొద్ది క్షణాల్లో స్పాన్సర్డ్ బై…’
కావలిస్తే మన కార్పొరేట్ స్కూల్స్ లో కూడా వీటి గురించి ఓ పాఠం నేర్పొచ్చు. ‘ బంధ్ నిర్వహించడం లో రాష్ట్రం లో నెంబర్ 1, ఫలానా విద్యాసంస్థ అని. ఇదంతా ఏదో హాస్యానికి వ్రాస్తున్నది కాదు. కడుపులో బాధని చెప్పుకోలేక, ఏడవలేక నవ్వడం. అంత పేద్ద రాష్ట్రంలో మన రాజకీయాలు ఎంత బ్రష్టు పడిపోతున్నాయో అని ఆలోచించేవారే కరువయ్యారా? అసలు వీటినుండి బయటపడి రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుందా అనిపిస్తూంది…
.

%d bloggers like this: