బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-మాస్టార్లతో జీవితం–1

    గత జన్మలో చేసిన పాపపుణ్యాల బట్టి దేముడు మనల్ని ఫలానా వాళ్ళింట్లో పుట్టూ,నీ జాతకం ఫలానా విధంగా ఉంటుందీ, ఫలానా సంవత్సరాలు ఫలానాగా బ్రతుకూ అని వ్రాసి పెడతాడుట! అలా దేముడి ఆశీర్వచనంతోనో, మరో కారణం చేతో, మన అదృష్టాన్ని బట్టి ఏ మాస్టారి ఇంట్లోనో పుట్టేమా, ఇంక మన సంగతి చెప్పఖర్లేదు!

అదేమిటో, నేను ఓ మాస్టారి ఇంట్లోనే పుట్టాను.ఊళ్ళోవాళ్ళందరికీ చూడ్డానికీ, వినడానికి బాగానే ఉంటుంది.పైగా నాకు జ్ఞానం వచ్చేసరికి, మా నాన్నగారు హెడ్మాస్టర్ కూడా అయ్యారు! ఈ మాస్టర్లనబడే వాళ్ళు వారి స్కూల్లో పాఠాలు చెప్పి చెప్పి, వాటిని ఇంట్లోకి కూడా తెస్తారు అదో ‘ ఎక్స్టెండెడ్ స్కూల్’ లాగ. ‘ఎక్స్టెండెడ్ ఫామిలీలు’ చూశాము,వాటిగురించి విన్నాము కానీ, ఈ ‘ఎక్స్టెండెడ్ స్కూళ్ళ’ గురించి మీరెవరూ వినలేదు కదూ, నన్నడగండి చెప్తాను!

7nbsp;   వీళ్ళకి జీవితంలో డిసిప్లీన్ తప్ప ఇంకోటి ఉంటుందని తెలియదు. ఓ ఆట లేదు ఓ పాట లేదు.స్కూల్లో పిల్లలందరినీ క్రమశిక్షణతో పెంచుతున్నారు కదా, మళ్ళీ ఈ బాదరబందీ అంతా ఇంట్లోకెందుకూ? వాళ్ళకి తట్టదూ, ఇంకోళ్ళు చెప్తే వినరూ.అయినా చెప్పేధైర్యం ఎక్కడ ఏడ్చిందిలెండి ? ఊరికే అనుకోవడం( అదీ ‘మమ’ అన్నట్లుగా మనస్సులోనే!) పైగా హెడ్మాస్టారి కొడుకవడంతో, పబ్లిక్కు లో ఓ ఇమేజ్ మైన్ టైన్ చేయాలి ఇదో గొడవ! మా అన్నయ్యలిద్దరూ అప్పటికి వాళ్ళ స్కూలు చదువు పూర్తిచేసేసికొని, కాలేజీలకెళ్ళిపోయారు, అదృష్టవంతులు!

నేను మాత్రం ఆయన చేతిలో పడిపోయాను. ఈ మాస్టర్లకి డిసిప్లీనూ అవీ ఎక్కువ. గట్టిగా మాట్లాడకూడదు,గట్టిగా నవ్వకూడదు,ఆఖరికి గట్టిగా ఏడవకూడదు కూడానూ! చాన్స్ దొరికితే
క్వార్టర్లీ , హాఫ్ ఇయర్లీ, వీటికి సాయం స్లిప్ టెస్టులోటి మార్కులెలా వచ్చాయీ, బాగా చదువుతున్నావా తప్పించి ఇంకో మాటుండేది కాదు. ఓ సినిమాకి వెళ్తావా, ఓ సర్కస్ కి వెళ్తావా అని అడగొచ్చుకదా అబ్బే.

ఈయనకి సాయం మా పెదనాన్నగారొకరుండేవారు, ఆయన్ని చూస్తే మొత్తం కోనసీమ అంతా ఫాంటు తడిపేసికునే వారు.నా అదృష్టం కొద్దీ ఆయన చేతిలో మాత్రం పడలేదు!ఒకళ్ళకి ఇద్దరు తోడైతే ఇంక అడక్కండి. ఇంక మా చుట్టాలందరూ టీచర్లే. ఇదెక్కడి గోలో తెలియదు, ఊళ్ళో ఉన్న చుట్టాలు కూడా టీచర్లైతే ఎలాగండి బాబూ. ఇంటా, బయటా, ఇలలో, కలలో ఎక్కడచూసినా వీళ్ళే కనిపించేవారు. అందరికీ నా మార్కుల గొడవే. మరీ హెడ్మాస్టారి కొడుకు ఫెయిల్ అయితే బాగోదు కదా, అందువలన ఏదో అత్తిసరు మార్కులతో మొత్తానికి స్కూల్ జీవితం పూర్తిచేసి, అమ్మయ్యా అనుకున్నాను.ఎస్.ఎస్.ఎల్.సీ లో మార్కులు బాగానే వచ్చాయనుకోండి.

నేను కాలేజీలో చేరే సమయానికి, మా అక్కయ్యగారొకరు కాలేజీ లెక్చెరర్ అదీ మాత్స్ కి ! అమలాపురం ఏం పేద్ద పట్టణం కాదు, పైగా మా ఇల్లు కాలేజీకి దగ్గరే ఉండేది.అప్పుడు మా నాన్నగారు హైస్కూలు హెడ్మాస్టారు. కాలేజీలో ఈవిడా, ఇంట్లోనూ, ఊళ్ళోనూ మా నాన్నగారూ, చూశారా ఎలాటి విషవలయంలో చిక్కుకుపోయానో!
కాలేజీ లో ఓ సరదాలేదు, ఓ అల్లరిలేదు,తుమ్మితే ఇంటికి ఖబురొచ్చేసేది!

నాకున్న హేమోఫీలియా( బోర్డర్ లైనే అనుకోండి) వలన ఏమీ దెబ్బలూ అవీ తగిలించుకోకూడదని, క్రికెట్టూ వగైరా ఆడనిచ్చేవారు కాదు. అయినా ఇలాటి గేమ్స్ రహస్యంగా ఆడతామా ఏమిటీ? సైకిలు మీంచి పడితే దెబ్బలు తగిలితే ప్రమాదమని, సైకిలు నేర్చుకోనీయలేదు. మా ఇంటిముందర టెన్నిస్ బాల్ తో మాత్రమే క్రికెట్టు ఆడనిచ్చేవారు.అలా క్రమక్రమంగా అసలు క్రికెట్ బాల్ తో ఆడడం మొదలెట్టేశాను. అయినా కాలేజీ లో సెకండ్ బి.ఎస్.సీ లొకి వచ్చేశాను కదా, మరీ కట్టడి చేస్తే బాగుండదేమో అని చూసీ చూడకుండా ఉండేవారు. నేను క్రికెట్ ఆడుతున్నానూ అని ఇంట్లో అందరికీ తెలుసు అయినా తెలియనట్లే ప్రవర్తించేవారు ( తండ్రికి కొడుకు సిగరెట్టు కాలుస్తాడని తెలుసు, అడిగితే మరీ తనెదురుగానే కాల్చేస్తాడేమో అనే భయం లాగన్నమాట!). నేను సిగరెట్లు కాల్చలేదండోయ్, ఊరికే సామ్యానికి చెప్పాను!

నా క్రికెట్టెంతదాకా వచ్చిందంటే మా కాలేజీలో సైన్సు వాళ్ళకి నేను కాప్టెన్ కూడానూ. అప్పటి సర్టిఫికేట్లున్నాయండోయ్ ఇప్పటికీనూ ! మాచ్చిలు హైస్కూల్ గ్రౌండు లో ఆడవలసివచ్చేది. దానికి హెడ్మాస్టారు కాబట్టి ఆయన పెర్మిషన్ తీసికోవలసి వచ్చేది. మా వాళ్ళందరూ నన్ను అడగమనేవారు. ఇందులో ఒక ఎడ్వాంటేజ్ ఉండేది, అక్కడి ప్యూన్నులూ వాళ్ళూ, అందరికీ మంచినీళ్ళూ అవీ తెచ్చిపెట్టేవారు ( హెడ్మాస్టారి కొడుకు ఆడుతున్నాడు కదా!).

7nbsp;   ఏదో ఈ బాలారిష్టాలన్నీ దాటుకుని దొరికిన మొదటి చాన్స్ లో ఉద్యోగంలో చేరిపోయాను.అక్కడ ఈ టీచర్లూ గొడవా ఉండదు కదా అని.అయినా అంత అదృష్టానికి నోచుకోవద్దూ. పూనా లో మా జి.ఎం గారు మాకు తెలిసీనవారని చెప్పానుగా, ఇంట్లో టీచర్ల గొడవ వదిలిందనుకుంటే, ఉద్యోగంలో చేరగానే ఈయన మొదలెట్టారు-ఏ.ఎం.ఐ.ఈ చదువూ, నాదగ్గరకు ప్రతీ శనాదివారాలు వచ్చేయి, నేను పాఠాలు చెప్తానూ అని! దరిద్రుడి నెత్తిమీద వడగళ్ళవాన లాగ, నేను ఎక్కడికెళ్ళినా, నా ప్రాణాలు తీయడానికి ఈ టీచర్లెక్కణ్ణించొచ్చారండి బాబూ! ఇంక తప్పేదేముంది, వెళ్ళకపోతే ఉద్యోగంలోంచి తీసేస్తారేమో అని భయం. అప్పటికింకా 18 సంవత్సరాల వయస్సేగా! ఇంకా భయాలు గట్రా ఉండెవి.

ఒకటి రెండేళ్ళలో ఆయన బదిలీ మీద ఇంకోచోటికి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన ఉన్నన్నాళ్ళూ అడిగేవారు చదువు ఎక్కడిదాకా వచ్చిందీ అని, అయినా ఆయనకీ ఇంకా పనులేలెవా, ఆయనా వదిలిపెట్టేశారు, వీడిని బాగుచేయడం కష్టం అనీ.

అవ్విధంబుగా నాకు 1965 నుండి, 1972 దాకా ఈ టిచర్లదగ్గరనుండి విముక్తి లభించింది. అదేదో ‘సాడే సాథీ ‘ ( అంటే మన భాషలో ఏల్నాటి శని) అంటారే అలాగ, ఆ ఏడేళ్ళూ హాయిగా ఉన్నాను.ఏల్నాటి శనిలో మంచైనా జరగొచ్చట, చెడైనా జరగొచ్చట ! ఏంత చెప్పినా ఆ ఏడేళ్ళూ, నాజీవితానికి స్వర్ణ యుగం. చుట్టుప్రక్కలెక్కడా టీచరు అనే మాటుండేది కాదు.
ఆ దేముడికి కూడా కళ్ళు కుట్టాయనుకుంటా నా ఆనందం చూసి…..
(ఇంకా ఉంది)

%d bloggers like this: