బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అప్పులు

    ఈ క్రెడిట్ కార్డులూ అవీ రాకముందు, పచారీ కొట్లలో నెలవారీ సరుకులు కొన్నప్పుడు పద్దు రాసేవాళ్ళం.ఓ పుస్తకంలొ కొట్టువాడు వ్రాసుకునేవాడు, దాని డూప్లికేటు కాపీ మన దగ్గర ఒకటుండేది. నెల పూర్తి అవగానే మన సావకాశాన్ని బట్టీ, చేతిలోకొచ్చిన జితాన్ని బట్టీ ఆ ‘అప్పు’ తీర్చేవాళ్ళం. ఎప్పుడైనా పెద్దవాళ్ళకి కొట్టుకి వెళ్ళడానికి తీరికలేకపోయినా, పిల్లల్ని ఆ ‘పుస్తకం’ ఇచ్చి పంపితే, సరుకులు ఇచ్చేవాడు. ఆ రోజుల్లో వచ్చే జీతాల్ని బట్టి ఈ ‘ఖాతా’తప్పనిసరై ఉండేది. జీ.పీ.ఎఫ్ కీ, సొసైటీకీ, పోనూ చేతికి ఎంతోకొంత వచ్చేది. ఆ చేతిలొకి వచ్చిన దానిలోనే సర్దుకుని కాలక్షేపం చెసేవాళ్ళూ. స్వంత ఇంటి ‘కల’ కలగానే మిగిలిపోయేది.ఎప్పటికో, పిల్లల చదువులూ, పెళ్ళిళ్ళూ ఓ కొలిక్కి వచ్చిన తరువాత, ఇంటావిడ పోరు పెట్టగా పెట్టగా మొత్తానికి ఓ కొంప ఏర్పరుచుకునేవాళ్ళు.

ఈ లోపల రోగాలు వచ్చినా , రొచ్చులు వచ్చినా మళ్ళీ ఎవడిదగ్గరకో వెళ్ళి చెయ్యి చాచవలసివచ్చేది. ఆ ఇంటాయన అదృష్టం బాగుంటే రిటైర్ అయ్యేనాటికి, పిల్లల పెళ్ళిళ్ళూ,చదువులూ పూర్తిచేసి, స్వంత కొంపలో సెటిల్ అయ్యేవాళ్ళు.ఇంత హైరాణ పడినా ఏ పెద్దమనిషీ తను ఏదో త్యాగాలు చేసేనని ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలెదు.పెళ్ళి చేసికుని, ఓ సంసారం ఏర్పరుచుకున్నాడు కనుక వాళ్ళని పోషించడం ఓ బాధ్యత గా తీసికుని నిర్వర్తించే వాడు. సంసారం గురించి పట్టించుకోకుండా, తన త్రాగుడుకీ మిగిలిన వ్యసనాలకీ దాసులైన వాళ్ళూ ఉండేవారనుకోండి, కాని వారి శాతం బహు తక్కువ.

ఇంకొ సంగతేమంటే ఆ రోజుల్లో ‘కన్జ్యూమరిజం’ అంత ఎక్కువ కాదు, ఉన్నదాంట్లోనే సంతృప్తి గా బ్రతికేసేవాళ్ళు. పిల్లలకి అప్పో సొప్పో చేసి చదువులు చెప్పించేస్తే వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడితే చాలనుకునేవారు.ఎంత చెప్పినా ఆ జీవితంలోనే ఎంతో సంతోషమనిపించేది. అదీ ఓ సంతోషమేనా అని ఈ తరం పిల్లలు అంటారనుకోండి, అది వేరే విషయం.ఎవరి అభిప్రాయం వాళ్ళది.మేం పెట్టిన ఖర్చులు, మా తల్లితండ్రులకి వేస్ట్ గా కనిపించి ఉండవచ్చు.అలాగే ఇప్పటి తరంవాళ్ళు చేసే ఖర్చులు పాత తరంవాళ్ళకి వేస్టనిపించొచ్చు.

ఈ రొజుల్లో ఈ క్రెడిట్ కార్డుల ధర్మమా అని, ప్రతీ వాడూ ఈ అప్పుల బారిలో కూరుకుపోతున్నాడు.ఆఖరికి ఇదివరకు ‘పద్దు పుస్తకం’లో వ్రాయించుకున్న పచారీ కొట్టువాడుకూడా, క్రెడిట్ కార్డులు స్వీకరిస్తున్నాడు! ఇదివరకు వాడికి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు బ్యాంకు వాడు వేసే ‘ వడ్డీ’ తో కలిపి బ్యాంకు వాడికి ఇస్తున్నాము. అంతే తేడా! ఏదో ఆమధ్య ‘ఆర్ధిక మాంద్యం’ ధర్మమా అని కొంతలోకొంత ఇటువంటివి కంట్రోల్ అయ్యాయి . మళ్ళీ మామూలే.

ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ వేళ టి.వీ. చూస్తూంటే ఓ బ్యాంకు వాడి యూనియన్ బ్యాంకో ఇంకోటో యాడ్ చూశాను. వీడు ( అంటే అప్పు తీసికున్న ‘బక్రా’) ఫ్లాట్ కోసం ఏదో ఫలానా ఎమౌంటు అప్పు తీసికున్నాడుట,
వచ్చే 25 సంవత్సరాలూ ఆ అప్పు తీర్చుకోవచ్చుట, అప్పుడు ఈయనగారి ‘బేటా’ అనుకుంటాడుట ‘ మేరా బాప్ కిత్నా హోషియార్ థా నా!
అని.ఇదివరకటి రోజుల్లో ప్రతీ తండ్రీ అనుకునేవారు–‘ ఆస్థులు ఇచ్చినా లేకపోయినా, అప్పులు మాత్రం వారసత్వంలో ఇవ్వకూడదూ’ అని.దానికి ఉల్టా ఈ రోజుల్లో ! మనం ఎంత అప్పుచేస్తే అంత గౌరవం. మన బ్యాంకుల వాళ్ళు ఎన్.పీ.ఏ అనో ఇంకేదో ఓ పేద్ద గ్లామరస్ పేరు పెట్టి చెప్తూంటారు, ‘ నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్’అని.

మీరూ నేనూ ( మధ్య తరగతి లా ఎబైడింగ్ సిటిజెన్స్) అప్పు చేస్తే, గూబ పగలకొట్టి వసూలు చేస్తారు, మనం అప్పుచేసికొన్న ఫ్లాట్ వేలం వేసో, అప్పుచేసి కొన్న కారుని టౌ చేసి తీసికునిపోయో. వీళ్ళ ‘ఎన్.పీ.ఏ’ లలో సింహభాగం
సంఘంలో పెద్ద మనుష్యులుగా చెలామణీ అయ్యే రాజకీయ నాయకులూ, గూండాలూ మాత్రమే. వాళ్ళని ఏం చెయ్యలేరు.

ఈ క్రెడిట్ కార్డుల ధర్మమా అని వందరూపాయలు ఖర్చుపెట్టే చోట వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాము. 45 రోజులదాకా ఇవ్వఖర్లేదుగా! అప్పుడైనా ఓపిక ఉంటే ఇస్తాము, లేకపోతే ‘మినిమం ఎమౌంటు’ తో సరిపెట్టేసికుంటాము.
ఫోను ఎత్తితే చాలు, ఏ బ్యాంకు వాడో, మీకు క్రెడిట్ కార్డ్ ఇస్తామంటూ.నేను ఏం చేస్తూంటానంటే, కాలక్షేపానికి వాడు చెప్పే సోదంతా విని, చివరలో చెప్తూంటాను, ‘ నాకు జీతంభత్యం లేదోచ్, పెన్షన్ మీద బ్రతుకుతున్నానూ’అని.అంతే,తుపాకీ గుండుకు కూడా దొరక్కుండా ఫోన్ పెట్టేస్తాడు!అలాగే ఈ మధ్యన ‘హెల్త్ ఇన్స్యూరెన్స్’ వాళ్ళ గోల ఎక్కువైపోయింది. వాళ్ళ ఫోన్ రాగానే,వాడు చెప్పే బక్వాస్ అంతా విని ఆఖరున చెప్తాను- నాకు 65 ఏళ్ళు నిండాయీ అని!

ఇదివరకటి రోజుల్లో కొన్ని దుకాణాల దగ్గర బోర్డులుండేవి–‘అరువు లేదు’ అని. ఇప్పుడు అలా కాదు ‘ వుయ్ యాక్సెప్ట్ ఆల్ క్రెడిట్ కార్డ్స్’ అని. అదీ అప్పటికీ, ఇప్పటికీ తేడా !! ఇదివరకు కొట్ల వాళ్ళు కూడా మనల్ని అప్పులు చేయకుండా సహాయపడేవాళ్ళు. ఇప్పుడో మనం ఎంత ‘అప్పుల’ ఊబిలో కూరుకుంటే అంత ఆనందం అందరికీ. సర్వే జనా సుఖినోభవంతూ !!!

%d bloggers like this: