బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–మాస్టార్లతో జీవితం-3

    ఏదో పెళ్ళైన మొదటి ఆర్నెల్లూ పరిస్థితులు అధ్యయనం చేసింది, ఏదో కొత్త స్కూలికి ట్రాన్స్ఫర్ అయిన టీచర్ లాగ. బుధ్ధులు ఎక్కడికి పోతాయీ? అప్పటిదాకా ఇష్టారాజ్యంగా ఉన్న నామీద అన్నీ ఆంక్షలే. స్కూల్లో అదీ 5-10 సంవత్సరాల పిల్లలకి పాఠాలు నేర్పేదేమో, ఇంక చూడండి ప్రారంభం అయింది- రెండు పూటలా స్నానం అంటుంది, ప్రతీ రోజూ బట్టలు మార్చాలి,స్నానం చేసీదాకా బ్రేక్ ఫాస్టులూ అవీ ఉండవు.. ఇలా చాలానే ఉండేవిలెండి.

   అప్పటిదాకా ఏదో నాకు తోచినప్పుడు స్నానం చేయడం ( ప్రతీరోజూ చేసేవాడిననుకోండి, కానీ అదో పెద్ద కార్యక్రమంలా కాదు!), స్నానం చేసేసి తువ్వాలు తలుపుమీద వేసే అలవాటు,
ఠాఠ్ అలా అసహ్యంగా తలుపుమీద వేస్తారేమిటీ,అనేది. నా అదృష్టం కొద్దీ మేముండేది రెండే రూమ్ముల కొంప, దానికి బాల్కనీలూ వగైరా ఏమీ ఉండేవికావు.తనే బయట ఆరేసేది.తలుపుమీద మాత్రం ఆరేయకూడదు.

    ఏదో సెకండ్ హాండులో ఓ ఫ్రెండు (తెలుగు వాడే) అంటకట్టిన సోఫా సెట్ మీద కాళ్ళేట్టి కుర్చోకూడదనేది. ఈ గొడవ భరించడంకంటే ఆ సోఫా ఎవరికో ఊరికే ఇచ్చేయడం మంచిదీ అని, మా పనిమనిషికి ఇచ్చేశాను!సుఖపడ్డాను. తన ప్రణాలికలన్నీ అమలుపరిచేటంత ఏరియా ఉండేది కాదు( ఇల్లు చాలా చిన్నది కదా!).అయినా తనుచేసేవన్నీ చేసేసింది.పెళ్ళికి ముందర మా ఇల్లు, బ్రహ్మచార్ల మఠంలా ఉండేది.అక్కడ దగ్గరలో ఉన్న తెలుగు వాళ్ళందరూ( అందరూ పెళ్ళైనవాళ్ళే) నా కొంపకి వచ్చేసి, క్యారంబోర్డూ, పుస్తకాలతోటీ కాలక్షేపం చేసేవారు. నేను తప్ప ప్రతీవాడూ సిగరెట్టు కాల్చేవాడే. వాళ్ళు యాష్ ట్రేల్లా వాడుకోడానికి ఖాళీ 400 గ్రాముల నెస్కెఫే పెట్టేవాడిని.ఖాళీ డబ్బాలేమీ కొన్నవి కాదు, వచ్చిన వాళ్ళందరికీ కాఫీలోటి కదా. అయినా ఒక్క మనిషి రోజుకి లీటరున్నర పాలు పోయించుకోడం ఎక్కడేనా విన్నారా? తర్వాత్తర్వాత అర్ధంఅయేది ఈ పెళ్ళైనవాళ్ళందరూ నాకొంపకే ఎందుకు చేరుతున్నారూ అని! అంటే అదో రిలాక్సేషన్ అన్నమాట! ఛేంజ్ ఆఫ్ సీన్ !

    రాత్రిళ్ళు ఒంటిగంటా, రెండు దాకా క్యారంబోర్డులు ఆడుకుంటూ కూర్చుంటే, ఇంక రూమ్ములు తుడుచుకోవడానికీ నీట్ గా ఉంచడానికీ టైమెక్కడిదీ? దాంతోటి, ఈవిడ వచ్చేసరికి, ఇంటినిండా న్యూస్ పేపర్లూ, పుస్తకాలూ, ఖాళీ డబ్బాలూ, అట్టకట్టుకుపోయిన ఫ్లోరూ ! ఇందులో ప్రతీదీ ఈవిడ బీ.పీ ఉధృతంగా పెంచేసేదే! ముందుగా కొత్తగా వెళ్ళిన స్కూల్లో చూసుకున్నట్లుగా, ఇన్వెంటరీ చెకింగ్ ప్రారంభించింది. ఈవిడ కాపురానికి వచ్చేముందర, మా అమ్మగారు చెప్పేరట ఈవిడకి, నాదగ్గర ఏమేమి వస్తువులు/గిన్నెలు ఉన్నాయో. దానికి సాయం మిక్సీ, గ్యాస్సు వగైరా అన్నీ పెళ్ళికి ముందరే కొనేశానుగా.ఈవిడ వచ్చేటప్పటికి సీన్ లో ఇవేమీ కనిపించలేదు. ఆ తరువాత ఎప్పుడో ధైర్యం చేసి అడిగింది, ఎక్కడైనా తాకట్టుపెట్టానేమో ( మనవైపు ఇలాటివి ఉంటూంటాయి కదా!)అని. అలాటిదేదీ లేదూ, ఫ్రెండ్ల ఇంటిలో ఉండి ఉండొచ్చూ అని చెప్పిన తరువాత అందరి ఇళ్ళకీ వెళ్ళి మొత్తానికి అన్నీ తెచ్చేసింది.

    ప్రతీ స్త్రీ లోనూ ఓ టిచరు/మాస్టారు దాగేఉంటుంది. అలాగే లేకపోతే మనం ఇంత పెరిగి పెద్దయేవాళ్ళమా? ఏదో టీచరు ఉద్యోగమే చెయ్యఖ్ఖర్లేదు, ఆ గుణాలు అన్నీ ‘ బిల్ట్ ఇన్’. అదేదో
ఫ్రిజ్జిలూ అవీచూస్తాము బిల్టిన్ స్టెబిలైజర్ల లాగన్నమాట ! ఇంక టీచర్లక్రింద ఉద్యోగం కూడా చేస్తే ఇంక అడగఖ్ఖర్లేదు. ప్రతీ ఇంట్లోనూ జరిగే విషయమే ఇది. బ్రహ్మచార్ల క్రింద అనుభవించిన స్వతంత్రం అంతా ఉఫ్ మని ఎగిరిపోతుంది.ప్రతీదానికీ ఓ క్లాసు తీసికుంటూంటారు.

    మా ఇంటావిడ క్రాస్వర్డ్ పజిల్సూ అవీ పూర్తిచేస్తూంటుంది, మధ్య మధ్యలో నన్ను అడుగుతూంటుంది. నాకు తెలియదు మొర్రో అన్నా వినదు. తెలిసే చెప్పడంలేదని అనుకుంటుంది.నా ఐ.క్యూ అంత పెద్ద లెవెల్ లోది కాదన్నా వినిపించుకోదు!నేను ఏదైనా చదువుకుంటున్నప్పుడైనా సరే, తను చెప్పేవాటిమీద ఓ చెవి వేస్తూంటాను.ఇదివరకైతే ఉద్యోగం వంకతో తప్పించుకునే వీలైనా ఉండేది. ఇప్పుడా ఛాన్స్ కూడా లేదు.మధ్య మధ్యలో ప్రశ్నలోటీ, మనం వింటున్నామా లేదా అని!

    అప్పుడే ఎక్కడ అయిందీ! గుర్తొచ్చినప్పుడు వ్రాస్తూంటానులెండి. మీ మీ కష్టాలు కూడా పంచుకోండి !!