బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–ప్రభుత్వ కార్యాలయాలు

   ఈ వేళ సాయంత్రం ఎన్.టి.వి చూస్తూంటే అందులో ఒక కార్యక్రమం వచ్చింది.ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎలా ఉంటారు( అసలంటూ ఉంటే!), ఎప్పుడు వస్తారు వగైరా వగైరా.. ఒక్కకళ్ళనీ చూస్తూంటే ఒళ్ళు మండిపోయింది.ఎక్కడైనా సరే కార్యాలయ ముఖ్య అధికారి క్రమశిక్షణ పాటిస్తే, క్రింది వాళ్ళు కూడా పాటిస్తారు. ‘ కంచే చేను మేస్తే’ అన్నట్లు, ఆ అధికార్లే గడ్డితింటూంటే, క్రిందివాళ్ళు వాళ్ళిష్టం వచ్చినట్లు ఉంటారంటే ఆశ్చర్యం ఏమిటి?

   మామూలుగా చూస్తూంటాము-మార్కెట్ లో ఎక్కడ చూసినా ఆ ప్రాంతానికి సంబంధించని ప్రభుత్వ వాహనాలని.ఏ మ్యున్సిపాలిటీ వారిదో,లేక ఏ ఆరోగ్య శాఖ వారిదో వాహనం చూస్తే అనుకోవచ్చు, మార్కెట్ లో ఏదైనా డ్యూటీ మీద వచ్చేరేమో అని. అలవాటు ఏమిటంటే, ప్రభుత్వ అధికారులు, వాహనాల్ని తమ స్వంత పనులకీ,వాళ్ళ కుటుంబసభ్యుల పనులకీ ఇచ్చేరనుకుంటారు.

    ఇక్కడ పూణే లో చూస్తూంటాను- కేంద్రీయ విద్యాలయాల బయట ఆర్మీ వాళ్ళ కారులు. ఆ అధికారి కూతురో, కొడుకో అక్కడ చదువుతూండవచ్చు, వాడిని ఇంటికీ స్కూలుకీ తీసికెళ్ళడానికి, మేమ్ సాబ్ ని మార్కెట్ కి,బ్యూటీ పార్లర్ లకి తీసికెళ్ళడానికీ, ఈ వాహనాలు వాడేస్తూంటారు. ఈ మధ్యన నేను ప్రొద్దుటే ‘కాళీ మందిర్’ కి వెళ్ళినప్పుడు ‘ఓ గవర్నమెంట్ వెహికల్’ ని చుస్తూంటాను. ఇదిక్కడేం చేస్తూందని అడుగుదామనిపిస్తూంటుంది,కానీ అడగడానికి ఏదో సంకోచం!
ఆ అధికార్లకుండాలి క్రమ శిక్షణ అనేది.

    ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే గుమాస్తాలనే చూపించారు, పై అధికారుల గురించి కూడా చూపిస్తే, ఈ టి.వి వాళ్ళ సిన్సియారిటీ ని అంగీకరించేవాళ్ళం.కార్యాలయాలనేమిటి, బ్యాంకుల్లో ( ప్రభుత్వ బ్యాంకులు) వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? బ్యాంకులు జాతీయకరించక పూర్వం, పరిస్థితి కొద్దిగా బాగానే ఉండేది. ఇప్పుడు ఎక్కడ చూసినా యూనియన్ ల ధర్మమా అని, ఎవరినీ ఏమీ అనకూడదు. లేటు గా ఎందుకొచ్చేవూ అని కానీ,వచ్చిన రెండు మూడు గంటలకే ఎక్కడికి పారిపోయావూ అని కాని. ఏ అధికారైనా అడిగాడా, వాడి పనైపోయిందే.అదేదో ‘ టూల్ డౌన్ స్ట్రైక్కో’ మరోటో చేసేస్తారు.వాడు క్షమాపణ చెప్పేదాకా వదలరు.

   కలకత్తా లో మా అర్డ్నెన్స్ ఫాక్టరీ బోర్డ్ వాళ్ళ హెడ్క్వార్టర్ ఉందిలెండి. అక్కడికి మొదటి సారి వెళ్ళినప్పుడు చెప్పారు, అక్కడ సీట్ లో మనిషిని చూడడం చాలా కష్టం అని. ఆ బిల్డింగు 13 అంతస్థులు ఉంటుంది. ఒక్కో విభాగం ఒక్కో అంతస్థులో. వాళ్ళేం చేస్తూంటారంటే- మీరు ఏ అంతస్థులోకి వెళ్ళినా సరే,ఆ విభాగంలో మొత్తం 50 సీట్లకీ, నలుగురో అయిదుగురో కనిపిస్తారు. ఒక విచిత్రం ఏమంటే, మిగిలిన 45 సీట్లలోనూ, కుర్చీకి ఓ కోటో,సీతాకాలం అయితే ఓ స్వెట్టరో వెళ్ళాడుతూంటాయి. ‘ సొనే పే సుహాగా’ ఏమిటంటే, టేబిల్ మీద ఓ కళ్ళజోడు కూడా ఉంటుంది. అక్కడున్న ఒక్క ‘ప్రాణి’ నీ అడిగామనుకోండి, ఈ సీట్ ఆయన ఎక్కడికి వెళ్ళాడూ అని.
‘ అభీ తక్ యెహీ పే థా, షాయద్ అగలే ఫ్లోర్ మే గయా హోగా’ అంటాడు.అసలు సంగతేమంటే, ఆ సీట్ కి సంబంధించిన ఆసామీ, ఆఫీసుకే రాలేదు. మరి ఆ కోటూ/స్వెట్టరు, కళ్ళజోడూ ఏమిటయ్యా అంటే, అవి మనం దేముడికి పూజ చేస్తాం చూడండి ‘ అలంకారార్ధం గంధం సమర్పయామి’ అన్నట్లుగా, అది అలంకారార్ధమే. అసలువి వాడి వంటి మీదా, కంటి మీదా ఉన్నాయి! వాళ్ళకి ఓ ఎరేంజ్ మెంట్ ఉంటుంది– వారంలో మూడు రోజులు కొంతమందీ, రెండు రోజులు మిగిలినవాళ్ళూ ఆఫీసుకు రావఖ్ఖర్లేదన్నమాట. అంటే మనం వెళ్ళినప్పుడు చూసిన ‘ అక్కు పక్ష్క్షి’ ది ఆఫీసుడ్యూటీ అన్న మాట. మరీ రోజంతా డుమ్మా కొట్టేయరనుకోండి, ఏదో ‘హాఫ్ డే’ ఊళ్ళో పనులన్నీ చూసుకుని, మెల్లిగా అఫీసు మూసేసే టైముకి వస్తాడు.స్వంత పనులూ చూసుకోవచ్చు, జీతమూ వస్తుందీ! హాయి! పైగా దీనికి సాయం వారానికి అయిదు రోజులే ఆఫీసు. శుక్రవారం వెళ్తే ‘వీకెండ్’ అని పనిచేయరు, సోమ వారం వెళ్తే ‘ హాంగ్ ఓవర్’ తో పనిచేయరు. మరి ఫైళ్ళు కదలాలంటే ఎలా కదులుతాయీ?
రాజీవ్ గాంధీ టెల్ కాం లో అదేదో విప్లవం తెచ్చుండవచ్చు, కానీ ఆయన చేసిన పేద్ద దరిద్రపు పని ఏమిటంటే ఈ ‘ ఫైవ్ డే వీక్’.అందరినీ ఇలా చెరిగేస్తున్నారూ, మరి మీరేం చేశారూ 42 ఏళ్ళూ అనకండి.నేను పనిచేసినది ఫాక్టరీ లలో.

   అక్కడ మాకు ఓవర్ టైము అనేది ఒకటుండేది.వారానికి ( ఆరు రోజులు) 54-60 గంటలు ఉండాలి. దానికి ఓ.టీ ఎలవెన్స్ ఇచ్చేవారు.ఏ కారణం చేతైనా, శలవు పెడితే డబ్బులు తక్కువ వచ్చేవి.అందువలన చచ్చినట్లు సంవత్సరానికీ మూడు వందల రోజులూ డ్యూటీ కి వెళ్ళేవాళ్ళం. ఏ శలవైనా వచ్చిందంటే ఆ వారానికి 60 గంటలు పూర్తిచేయడానికి ఆదివారాలు పనిచేసేవాళ్ళం. అలాగని మా వాళ్ళేం బుధ్ధిమంతులనడంలేదు.ప్రొద్దుటే 7.30 కి వచ్చి కార్డ్ పంచ్ చేసి, మెల్లిగా కబుర్లు చెప్పుకుని,8.00 -8.30 కి కుర్చీలో సెటిల్ అవడం, 9.30 కి చాయ్ పేరు చెప్పి ఇంకో అరగంటా, 12.30 కి లంచ్, దానికోసం 11.30 నుండీ బిచాణా కట్టేయడం.తిండీ తిప్పలూ పూర్తిచేసికొని, ఓ కునుకు తీసి మెల్లిగా 2.30 కి సీట్ లోకి రావడం, మళ్ళీ 3.30 కి చాయ్ పానీ ! ఇన్నీ అయ్యేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతుంది….
ఇంకా ఉంది…

%d bloggers like this: