బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు–కంఠ శోష

    విజయవాడలో గత రెండు రోజులుగా జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరమైనవి.అందులో ఎటువంటి సందేహమూ లేదు. గత పదిహేను రోజుల్లో ఆంధ్రదేశం లో అన్నీ అలాగే ఉన్నాయి.ఓవైపు తెలంగాణా, సమైక్యాంధ్ర ఆందోళనలు, ఏదో అవి కొంచెంసేపు ఆగేయి అనుకుంటూంటే,ఇంతలో ఆంబాజీపేటలో కల్తీ సారా మరణాలూ,అది అయ్యేటప్పడికి అంతర్వేది దగ్గర
పడవ మునకా,ఆతరువాత విశాఖపట్నం దగ్గర ఇంకో పడవ ప్రమాదమూ.హైదరాబాద్,సోమాజీగూడా లో హాస్పిటల్ లో అగ్నిప్రమాదం.
మన రాష్ట్రానికి ఏదో శని పట్టిందనిపిస్తోంది.2010 సంవత్సరం లో ఇంకా ఎన్నెన్ని దురదృష్టకరమైన సంఘటనలు చూడాలని రాసిపెట్టుందో !

    ఇన్ని సంఘటనల్లోనూ ఒక విషయం ‘కామన్’ గా కనిపించింది. మన రాజకీయ నాయకులు ప్రతీ చోటా ప్రత్యక్షం అవడం,జరిగిన సంఘటనని తమ ఇష్టం వచ్చినట్లు రాజకీయం చేయడం.అందరూ చెప్పేది ఒకే మాట. ‘ లా ఎండ్ ఆర్డర్ ‘ అనే సంగతే మర్చిపోయిందీ ఈ ప్రభుత్వం అని. వీళ్ళు చెప్పేమాటలు ఎలా ఉంటాయంటే తమ పాలనలో అస్సలు ఎలాటి దుర్ఘటనలూ జరిగేవే కానట్లు !!ప్రతీ వారిదీ ఒకే లక్ష్యం-ప్రస్తుత ప్రభుత్వం చేతకానిదీ,రాజీనామా చెయ్యాలీ అని.ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి మనం అలాగే మాట్లాడాలి అనే అనుకోవడం.

    ఉదాహరణకి అంబాజీపేట కల్తీ సారా కేసు తీసికోండి. మరణించిన ప్రతీ వాడికీ 10 లక్షల పరిహారం ఇవ్వాలీ అని.వీళ్ళని అసలు ఆ కల్తీ సారా తాగమన్నదెవరూ,తాగి చావమన్నదెవరూ? అప్పటికీ ప్రభుత్వం ‘వెల్ఫేర్’ దృష్టిలో పెట్టుకొని ఏదో లక్ష రూపాయలదాకా పరిహారం ఇచ్చారు.సారా త్రాగిన ప్రతీ వాడికీ పరిహారాలు ఇవ్వడం మొదలెడితే ఇంక అదే బాగుందని మిగిలిన వాళ్ళుకూడా అదే మార్గంలో వెళ్తారు. ఒక విషయం గమనించండి, ఈ దొంగ సారా వ్యాపారంలో ఎప్పుడైనా ఇలాటి ప్రమాదాలు సంభవించాయంటే, దాని వెనక ఓ పవర్ఫుల్ రాజకీయనాయకుడి చేయి తప్పకుండా ఉండే ఉంటుంది.అలాటి వాటిని నిరోధించడం మంచిదేమో అని ఎవడూ ఆలోచించడు.లాభాలు ఎక్కువ వస్తాయికదా అని ఆ సారాలో ఏదో కలుపుతారు.అది కిక్కు ఎక్కువ వస్తుందని వీళ్ళు త్రాగేస్తూంటారు.అందులో కలిపిన సరుకేదో అంత ప్రమాదకరమైనదైతే, కల్తీ సారా త్రాగిన ప్రతీ వాడూ పోవాలికదా !అప్పటికే ఆరోగ్యం సరీగ్గా లేనివాడే టపా కట్టేస్తాడు.

   ఇంక అంతర్వేది ప్రమాదం గురించి చూస్తే–20-30 మంది ఎక్కవలసిన పడవ లో 70 మందిదాకా ఎక్కారని విన్నాము.మరి తిరగబడక ఏమౌతుందీ? ఆఖరికి ఈవేళ సోమాజీగూడా హాస్పిటల్ లో జరిగిన ప్రమాదం సంగతే తీసికోండి–ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఇంటీరియర్ డెకొరేషన్ కి ఇచ్చిన ప్రాధాన్యత, ‘డిజాస్టర్ కంట్రోల్ ఎక్విప్మెంట్’ కి ఇవ్వరు.అంత పెద్ద పెద్ద భవనాల్లో ఎక్కడ చూసినా కన్సీల్డ్ వైరింగులే ఉంటాయి. ఆ వైర్లన్నీ కనిపించకూడదూ.ఎక్కడో ఒకచోట షార్ట్ సర్క్యూట్ అయితే మొత్తం బిల్డింగులో మంటలొచ్చేస్తాయి.బిల్డింగ్లు అనుమతించేటప్పుడు, ఇలాటి ముఖ్యమైన విషయాల్లో ఎప్పుడూ కాంప్రమైజ్ చేయడమే.వచ్చిన గొడవల్లా ఆయా శాఖల్లో పనిచేసేవారి చేతివాటు తనమే.
ఈ సందర్భం లో నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తొచ్చింది. మేము పనిచేసే ఫాక్టరీ లో ఒక క్రొత్త బిల్డింగ్ మొదలెట్టడానికి, మా సెక్షన్ ( సేఫ్టీ ) వాళ్ళు ముందుగా పరిశీలించి అనుమతి ఇవ్వవలసి వచ్చేది.అప్పుడు ఒకాయనని ఆ పనిమీద పంపారు.ఎక్స్ప్లోజివ్ బిల్డింగ్ అవడ మూలాన, ఆ బిల్డింగుకి చుట్టూరా ఓ బ్లాస్ట్ వాల్ అనేది ఉంటుంది.(ఎప్పుడైనా ఎక్స్ప్లోజన్ జరిగినా చుట్టూ ఉన్న బిల్డింగులు ఎఫెక్ట్ అవకుండా). ఈయన అక్కడికి వెళ్ళి ఒక్కటే అడిగారు--దూరం నుండి అవసరం అయితే ఫైర్ హోస్ ద్వారా బిల్డింగు పైకి నీళ్ళు పోయగలమా అని!బిల్డింగులో ఫైర్ స్ప్రింక్లర్లూ అవీ ఉన్నాయి, అయినా సరే బయటనుండి కూడా ఫైర్ ఫైటింగు చేయగలమా లేదా అని. ఇది జరిగింది 1972 లో. నేచెప్పేదేమిటంటే ఆ రోజుల్లో ఉద్యోగులకి
నీతీ, నిజాయితీలమీద నమ్మకం ఉండేది లెండి. ఇప్పటి రోజుల్లో ఇనస్పెక్షన్ అనేది ఓ తమాషాగా చూస్తారు.హాస్పిటల్ లో ఫైర్ ఎక్విప్మెంట్ సరీగ్గా ఉండిఉంటే ఇవాళ్టి సంఘటన జరిగేదా? మళ్ళీ
వీళ్ళ మాటలు కోటలు దాటేస్తాయి, కమెటీ వేస్తాము, విచారిస్తామూ, ఫలానా ఫలానా… ఆ కమెటీ ఏదో నివేదికా సమర్పిస్తుంది, మళ్ళీ ఏదో ప్రమాదం జరిగేదాకా దీని గురించి ఎవడూ పట్టించుకోడు. మనవాళ్ళకి మాత్రం ఎన్ని పనులూ పాపం ధర్నాలు చెయ్యాలి, రాస్తా రోకోలు చెయ్యాలి, బస్సులు తగలెట్టాలి,నిరాహారదీక్షలు చెయ్యాలి, రోజుకో చానెల్ లో నోటికొచ్చింది మాట్లాడాలి. ఇన్ని హడావిడుల్లో కమెటీలూ, రిపోర్టులూ ఎవడు పట్టించుకుంటాడూ?

    ఏదైనా జరిగినా మీలాటి, నాలాటి ప్రజానీకానికేగా! మనం ఎలాగూ ‘ డిస్పోజబుల్ కాటిగరీ’ లోకే వస్తాము.అన్నీ బాగుంటే రాజకీయ నాయకుల కి కాలక్షేపం ఎలాగా ? ఏదో ఇలాటివన్నీ జరుగుతూంటే రాజకీయ నాయకులకి ఎంత పనో ! ప్రభుత్వం ఏమీ తక్కువ తిన లేదు, ఎప్పుడు ఏ సంఘటన జరిగినా వెంటనే ఓ ‘ఫాస్ట్ ట్రాక్ కోర్ట్’ వేస్తామంటారు.అదేమిటో ఇప్పటికీ అర్ధం అవదు.

%d bloggers like this: