బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-కాలక్షేపం

    మా ఇంటావిడ మనవడితో బిజీ బిజీ అయిపోయింది.పాపం కంప్యూటర్ వైపు చూడ్డానికి సమయమే ఉండడం లేదు.నేను ఈ మధ్యన పూణే లోని సిటీ బస్సు వాళ్ళు, సీనియర్ సిటిజెన్స్ కి నెలవారీ (300 రూపాయలు) ఇచ్చే పాస్ ఒకటి పుచ్చుకున్నాను.

   ప్రొద్దుటే 8.15 కి మా నవ్య స్కూలు బస్సు వస్తుంది. ఈ లోపులో ఎదురుగా ఉండే గణపతి గుడికి వెళ్ళి ప్రసాదం తెస్తాను.ఇంతలో బస్సూ లో, మా పెద్ద మనవరాలూ(తాన్యా),మనవడు (ఆదిత్య) వస్తారు. ఈ ముగ్గురికీ ఈ ప్రసాదం ( పంచదార క్యూబ్బులు) ఇచ్చేసి టాటా చెప్పేసి, నా తరువాతి కార్యక్రమానికి
అంటే అయ్యప్ప గుడీ,దుర్గ గుడీ, హనుమాన్ గుడీ, దత్త మందిరం దర్శనం చేసికొని, దారిలో తెలుగు పేపరూ,ఓ ఇంగ్లీషు పేపరూ తెచ్చుకోవడం,కొంప చేరడం.బ్రేక్ఫాస్ట్ ఏ చపాతీయో,పరోఠా యో తినడం. అప్పుడప్పుడు బోరు కొడితే ఎదురుగా ఉన్న హొటల్ లో ఏదో ఇంకో వెరైటీ తినడం.

    10.00 గంటలకల్లా ఓ సంచీ, కెమేరా వేసికొని, ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కేయడం చివరిదాకా వెళ్ళడం.45 ఏళ్ళనుండి ఇక్కడే ఉన్నా చాలా ప్రాంతాలు తెలియవు.ఇంకో సంగతేమంటే పూణే నగరం అన్ని దిక్కుల్లోనూ పెరిగిపోయింది.కొన్ని కొన్ని పేర్లైతే అసలు వినలేదు కూడానూ. ఈ బస్సు పాస్ ధర్మమా అని ఊరంతా తిరగకలుగుతున్నాను.ఏ ఒంటిగంటకో ఇంటికి చేరడం. ఈ లోపులో మేము రెంటు కి పుచ్చుకున్న ఫ్లాట్ కి వెళ్ళి
అక్కడకూడా ఓ సారి చూసుకోవడం. ఏదో లాగించేస్తున్నాను.

    ఈ మధ్యలో ఏదైనా మిస్టరీ షాపింగ్ ఎసైన్మెంట్ వస్తే దానికి వెళ్ళడం. భోజనం చేసేసి, ఓ గంట నిద్రపోవడం. సాయంత్రం 5.30 కి మళ్ళీ నవ్య స్కూలునుండి తిరిగి వస్తుంది. అప్పుడు మళ్ళీ మా తాన్యా, ఆదిత్య లకు టాటా చెప్పడం.ప్రతీ రోజూ వాళ్ళని పలకరిస్తున్నాను కదా అని, మా అమ్మాయికి ఫోన్ చేయడం కొంచెం అశ్రధ్ధ చేశాను. ఈ వేళ ఓ లెక్చర్ ఇచ్చేసింది-కొడుకూ కోడలే కాదూ, మేము కూడా ఈ ఊళ్ళోనే ఉన్నామూ అంటూ.’తల్లీ ! మనవడూ, మనవరాల్నీ రోజూ రెండు సార్లు పలకరిస్తున్నాను కదా అని ఫోన్ చేయడం లేదూ’అన్నాను.అంటే తను అందీ’నా పిల్లల్ని పలకరిస్తున్నావు సరే, నీ పిల్లని కూడా గుర్తుంచుకోవాలి కదా’ అని. ఇంక రేపటినుండి మర్చిపోకుండా చేయాలి!

    ఇంట్లో చెప్పాను, పూణే లో ఏ ప్రాంతం లో పని ఉన్నా నాకు చెప్పేయండి, బస్సు పాస్ ‘పైసా వసూలీ’ చేయాలి అని! ఇన్నీ పూర్తి అయిన తరువాత సాయంత్రం 7.00 నుండి 8.00 దాకా, మా బిల్డింగ్ గేట్ దగ్గరే నుంచోవడం-ఎవరో ఒకరు రిటైర్ అయినవాళ్ళో, సర్వీసులో ఉన్నవాళ్ళో పలకరిస్తూంటారు.

    ఇన్ని పనుల కార్యక్రమాల మధ్యలో ఇంట్లో ఉన్న పాత ‘రచన’ లు అన్నీ చదవడం.మొదటి సంచిక నుండి అన్నీ జాగ్రత్త చేశాము! అవి చదువుతూంటే తెలుస్తోంది, 10-15 సంవత్సరాల క్రితం ఆ పత్రికల్లో వచ్చే కథలు ఎంత బాగుండేవో అని.ఇప్పటి ‘సెక్స్ విజ్ఞానాలూ’అవీ లేకుండా
హాయిగా చదువుకోడానికి బాగుండేవి. ఇప్పుడు మనందరం బ్లాగ్గుల్లో వ్రాసే విషయాలు, ఆ రోజుల్లోనే అప్పటి వారు వ్యాసాలలో వ్రాశారు.ఒక్కోటీ చదువుతూంటే అప్పటి రచయితలు ఎంత ముందుచూపుతో వ్రాశారో తెలుస్తుంది.వారు ఆ రోజుల్లో వ్రాసినవన్నీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాము.

    అదే కాకుండా ‘భక్తి’ ‘ఎస్.వి.బి.సి’ చానెల్లలో వచ్చే ‘ప్రవచనం’ కార్యక్రమాలు వింటూంటే, ‘అర్రే ఇప్పుడు ప్రపంచం లో జరుగుతున్నవన్నీ ఆ రోజుల్లోనే ఊహించేశారా’ అనిపిస్తుంది. మన పురాణాల్లో వ్రాసినవన్నీ నిజమే అనిపిస్తూంది.

    ఈ అంతర్జాల మహిమ ధర్మమా అని, కావలిసినవాటి అన్నింటిగురించీ తెలుసుకోకలుగుతున్నాను.ఇదివరకైతే అంతా మిడి మిడి జ్ఞానం! అలా అని ఇప్పుడు ఏదో మహా జ్ఞాని అయిపోయానని కాదు. కనీసం తెలియనివాటి గురించి, ఎవరో చెప్తే తల ఊపేయడం కాకుండా,స్వయంగా తెలిసికోవడానికి
ఓ ఉపకరణం దొరికింది.ఏమీ తెలియని నాకే ఇలాగుందంటే, కంప్యూటర్ లో ప్రవీణులైన మీకందరికీ ఎలా ఉంటుందో?

    అందుకే అంటాను-దేనికైనా టైము రావాలీ అని.మేము రాజమండ్రీ గోదావరి తీరానికి వెళ్ళుండకపోయినా, ఆ గాలి పీల్వకపోయినా, ఇంకా ‘ కూపస్థ మండూకం’ లాగానే ఉండేవాడిని .

బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు

శ్రీరామ నవమి పందిళ్ళల్లో పానకం తో పాటు ఇచ్చే ఓ చిరుకానుక.ఇప్పటి తరంలో ఎంతమంది చూశారు? క్రిందటేడాది రాజమండ్రీ వెళ్ళినప్పుడు,ఊరంతా వెదికి అపురూపరంగా కొనుక్కున్నాము. ఈ విసినకర్రలో ఉండే సుళువు ఇంక దేంట్లోనైనా చూస్తామా? ఎన్ని పవర్ కట్టులు ఉన్నా ఫర్వాలేదు. లాంగ్ లివ్ తాటాకు విసినకర్రా !!
Read it here

%d bloggers like this: