బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పూణే మే సురక్షా వ్యవస్థా

    చాలా రోజుల తరువాత, మా ఇంటావిడ ఈవెనింగ్ వాక్ కి వెళ్దామంటే, ఇద్దరమూ కలిసి రేంజ్ హిల్స్ వెనక్కాల ఉన్న యూనివర్సిటీ రోడ్ మీద నడుస్తూ వెళ్ళాము.ఆ రోడ్డంతా రక్షణ మంత్రిత్వ శాఖ వారి హయాములో ఉంది.ఓ ప్రక్కన ఖడ్కీ మిలిటరీ హాస్పిటలూ, ఓవైపున మిలిటరీ వారి క్వార్టర్సూ,ఇంకో వైపు సెంట్రల్ క్యాంటీనూ,పారాప్లెజిక్ హోమ్, ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో ఉన్నాయి.వాటికి ఆల్మోస్ట్ ప్రక్కనే, ఓ స్థలం అంతా
ఓ ప్రెవేట్ బిల్డర్ కి అమ్మేశారు.అతను అక్కడ లక్జరీ ఎపార్ట్మెంట్స్ కట్టేస్తున్నాడు.

    ఓ వైపు దేశ రక్షణా, సెక్యూరిటీ ఇంకా పటిష్టంగా ఉండాలీ అంటూ, రక్షణ విభాగాల ప్రక్కనే ఇలాటివి ఎలా అనుమతిస్తారో తెలియదు.అక్కడ కాలనీ ఇంకో రెండేళ్ళలో వచ్చేస్తుంది.అక్కడ సెక్యూరిటీ ఎలా చూస్తారో భగవంతుడికే తెలియాలి.

    ఈ బిల్డర్ కి రాజకీయ పలుకుబడి చాలా ఉంది.అయినా ఆమధ్య ఏదో కేసులో పాస్పోర్ట్ సీజ్ చేశారు.అయినా ఏ బెంగా లేకుండా హాయిగా, రక్షణ శాఖ వారి ప్రక్కనే ఓ పేద్ద కాలనీ కట్టేయకలుగుతున్నాడు.

    బాంబు పేలుళ్ళూ అవీ అయినప్పుడు, అదేదో ‘సాఫ్ట్ టార్గెట్’, హార్డ్ టార్గెట్’ అని పేర్లు పెట్టి, ఒకచోట సెక్యూరిటీ ఎక్కువగానూ, రెండో చోట ఏదో ఆషామాషీ గానూ పెడతామంటారు. ఈ సందర్భంలో పూణే రైల్వే స్టేషను ఏ వర్గంలోకి వస్తుందో ఆ పరమాత్మ కే తెలియాలి.ఈ సందర్భంలో PUNE MIRRORలో వ్రాసిన వార్త చదవండి. బయటకు వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరామంటే అదేదో సురక్షా వ్యవస్థ బాగా ఉందనికాదు అర్ధం. మన అదృష్టం బాగుందనిన్నీ, ఇంట్లో వాళ్ళ మంగళసూత్రాలు ఇంకా గట్టిగా ఉన్నాయనిన్నీ అర్ధం చేసికోండి.

   మన రాజకీయ నాయకులకి ఇస్తున్న జెడ్ క్యాటిగరీలూ, సినిమా వాళ్ళకీ, ఇంకా మిగిలిన రౌడీ షీటర్స్ కీ ఇస్తున్న సెక్యూరిటీ కవర్ లలో లక్షోవంతు, ఇవ్వవలసిన చోట ఇస్తే ఈ పేలుళ్ళూ అవీ ఉండవు. పైగా ఈ బడుధ్ధాయిలకి ఇస్తున్న సెక్యూరిటీ ఖర్చంతా మీరూ, నేనూ పెట్టుకుంటున్నాము.అయినా కామన్ మాన్ గురించి ఎవడూ పట్టించుకోడు. బ్రతక్క ఏం చేస్తాడులే!

%d bloggers like this: