బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-inspiring others.

    ఈ వేళ జీ తెలుగు లో చిన్నపిల్లల సంగీత కార్యక్రమం చూశాను.అందులో సినిమా నటుడు శ్రీ నూతన్ ప్రసాద్ గారిని అతిథిగా పిలిచారు. ఈ వేళ్టి కార్యక్రమం లో ‘ ఇన్సిపిరేషన్ పాటల’ పోటీ జరిగింది.అందరికీ తెలుసుగా-శ్రీ ప్రసాద్ గారు 21 సంవత్సరాలనుండీ,చక్రాల కుర్చీకే పరిమితమయ్యారుట ( ఆయనే చెప్పారు). ఇదివరలో రెండు నంది బహుమతులు, ఏక్సిడెంట్ అయిన తరువాత ఇంకో రెండు నందులూ, డాక్టరేటూ వచ్చాయిట.ఇది చాలా గొప్పవిషయం. ఈనాటి మీడియా ధర్మమా అని అందరికీ తెలిసింది.

    నేను చెప్పొచ్చేదేమిటంటే, ఈ మీడియా ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల, బయటి ప్రపంచానికి తెలియని ఘనాపాటీలు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి, మాకు దగ్గరలోనే మిలిటరీ వారి ‘పారాప్లెజిక్ హోమ్ ‘ అని ఒకటుంది.మేము వారంలో రెండురోజులు ఆ రోడ్డుమీదకు వెళ్తూంటాము.అక్కడ సాయంత్రం వేళల్లో చక్రాల బళ్ళమీద ఎందరో మాజీ సైనికులు తిరుగుతూ కనబడతారు.’ ఆహా వీళ్ళు మన సరిహద్దుల్లో ఉండడం వలనే కదా మనం ఈవేళ ఇంత హాయిగా శ్వేఛ్ఛా వాయువు పీల్చకలుగుతున్నాము కదా’ అనిపిస్తుంది.వీరిగురించి ఈ linkలో చదవండి. వీరందరూ ఏ స్వార్ధం లేకుండా తమ జీవితాన్ని త్యాగం చేశారు.

    నేను శ్రీ ప్రసాద్ గారిని చిన్నబుచ్చుతున్నానని కాదు.ఎవరికైనా కొంతకాకపోతే కొంతైనా ‘ఇన్ఫ్లుఎన్స్’ ఉంటేనే తప్ప వారి గొప్పదనం బయటివారికి తెలియదు.మరి ఏ విధమైన ‘వశీలా ‘ లేనివాళ్ళగురించి ఎలా తెలుసుకోవడం? నా ఉద్దేశ్యంలో , ఈ బ్లాగ్గులు చదువుతున్నవాళ్ళందరూ, అంతర్జాలం లో దేనికో దానికి వెదుకుతూంటారు కదా,ఆ వెదికే సమయంలో, కొంచెం కన్నేసి,తెర మరుగున ఉండే ప్రతిభావంతుల గురించి, మన బ్లాగ్గు మిత్రులందరికీ పరిచయం చేయమని నా విన్నపం. భగవంతుడు మనకి ఇంత అందమైన జీవితాన్ని ప్రసాదించాడు కాబట్టి దాన్ని ఈ విధంగా ఉపయోగిస్తే బాగుంటుందేమోనని నా కోరిక.

%d bloggers like this: