బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టి.వీ –

    ఒక విషయం నాకు అర్ధం అవడం లేదు. చూపించిన సినిమానే మన చానెల్స్ ఎన్నిసార్లు చూపిస్తాయో.ఒకసారి ‘బ్లాక్ బస్టర్’ అంటారు,ఇంకోసారి ‘మూవీ ఆఫ్ ద మంత్’అంటారు,ఇంకోసారి ఏదో సింగినాదం అంటారు. ఇంకో విచిత్రం ఏమంటే స్పాన్సర్స్ కూడా యాడ్ లు ఇస్తూనే ఉంటారు. ఈ హింస నుండి మనకు విముక్తే లేదా? ఒకసారి ఫర్వా లేదు.రెండో సారి ఓ నెలపోయిన తరువాత ఓ.కే. ఇదేమిటండీ వాళ్ళ దగ్గరున్న సో కాల్డ్ పాప్యులర్ సినిమాలు ఏడాది లోనూ 15-20 సార్లు చూపించాలా? ఆ స్పాన్సర్లు కూడా పట్టించుకోరా?

    ఇంక డ్యాన్సు పోటీల సంగతికొస్తే ఎంత తక్కువ చెప్తే ఆరోగ్యానికి అంత మంచిది! కార్యక్రమాల మధ్యలో ఆ డ్యాన్సు పోటిలు- ఢీ, మగధీర, ఇంకోటేదో–గురించి ప్రొమోస్. దానిలో, ఆ జడ్జీలు మాట్లాడే భాష వింటూంటే, వికారం పుట్టుకొస్తోంది. ఇదివరకటి రోజుల్లో ‘రికార్డింగ్ డ్యాన్సు’ అని ఉండేది, గుర్తుందా? వాటిగురించి ఇళ్ళల్లో మాట్లాడితే చాలు, చెప్పుదెబ్బలు తగిలేవి. ఇప్పుడు అవి తిన్నగా మన డ్రాయింగు రూం లలోకి వచ్చేశాయి.అందులో ఏం ఆనందం అనుభవిస్తారో వాళ్ళకే తెలియాలి.

    శాస్త్రీయ పధ్ధతి లో చేసే నృత్యాలకి ఇప్పటికీ ప్రక్కనే కూర్చొని పాట పాడతారు. ఈ టి.వీ డ్యాన్సులకి ( అవే ఆ కుప్పిగంతులు) ఈ గొడవేం అఖ్ఖర్లేదు.డాల్బీ సౌండు లో ఓ సి.డి.పెడితే, ఆ సో కాల్డ్ కళాకారులు ఏవేవో గంతులు వేస్తారు. సినిమాల్లో చూస్తున్నాముగా ఇంకా ఎందుకండీ బాబూ ఈ గోల? ఏమైనా అంటే మిమ్మల్నేమైనా చూడమన్నామా, అంత అసహ్యం అయితే మానేయండి. మీరొక్కరు మానేయడం వల్ల, మా టి.ఆర్.పీ లు ఏమీ తగ్గవు!

   ఇంక సీరియల్స్ కొస్తే, భారత దేశంలో ప్రతీ కుటుంబంలోనూ, ఒకళ్ళో, ఇద్దరో విలన్లు ఉంటారనుకుంటారు. ఈ మధ్యన కొంచెం వయస్సు పెద్దగా ఉండే స్త్రీలని కూడా విలన్లలాగ చూపిస్తున్నారు. ఇన్నాళ్ళూ, కనీసం ఇంట్లో పెద్దవాళ్ళకు కొంచెం ‘ఎథిక్స్’ ఉంటాయేమో అనుకునే వాళ్ళం. నా ఉద్దేశ్యంలో హిందీ లో ఉన్న ఏక్తా కపూర్ సీరియల్స్ చూసి చూసి, ఈ పెద్దాళ్ళ ఆలోచనా సరళి కూడా మారిపోయుండొచ్చు! హిందీ లో ఈ మధ్యన వస్తున్న కొన్ని సీరియల్స్ చూస్తూంటే, ఇన్నాళ్ళూ పెద్దవారంటే ఉన్న గౌరవం కూడా పోతూంది.

    తెలుగులో అదేదో ‘సతీ లీలావతి’ ట-అందులో హీరోయిన్ అనుకుంటా మాట్లాడే ఓ సీను అస్తమానూ యాడ్ వేస్తున్నారు. వీళ్ళనీ, ఈ సీరియల్స్ నీ చూస్తే ఇంకా పెళ్ళి కాని అబ్బాయిలెవరైనా ఉంటే ఖంగారు పడిపోతారు. పెళ్ళైతే ఇలా ఉంటుందేమో అని !

    నాకు ఒక విషయం ఇప్పటికీ మిస్టరీ గానే ఉండిపోయింది- ఇన్ని హింసలు, చిత్రహింసలూ పెడుతున్న టి.వి. ఛానెల్స్ ని ఆ డి.టి.ఎచ్ వాళ్ళు
మెనూ లో ‘ఎంటర్టైన్ మెంట్’ క్యాటిగరీలో ఎందుకు పెడతారూ
అని. అందులో రకాలు- న్యూస్, కిడ్స్, స్పోర్ట్స్,మూవీస్,రీజినల్,రెలిజియన్, మ్యూజిక్–అని. ఎంటర్టైన్ మెంట్ అనేది ఓ వర్గం.అందులో మన సీరియల్స్ అన్నీ వస్తాయి. ఎవరిని ఎంటర్ టైన్ చేస్తున్నారో?

    ఇంక సంగీత కార్యక్రమాలకొస్తే ప్రస్తుతం జీతెలుగు,మా, ఈటివీ లోనూ చూస్తున్నాము.ఎస్.పి బాలూ గారు చేస్తున్న కార్యక్రమంలో ఓ పాలసీ పెట్టారు.ఇంకే కార్యక్రమంలోనూ పాల్గొనని వారినే ఎలిజిబుల్ అన్నారు. దీని ధర్మమా అని ఓ గొడవ తప్పింది, చూసిన వాళ్ళనే, విన్నవాళ్ళనే అస్తమానూ భరించఖ్ఖర్లేదు. ఇంక మిగిలిన చానెల్స్ లో ఎప్పుడు చూసినా ‘ఆస్థాన/నిలయ విద్వాంసులే’ ఇదివరకు రేడియో లో ఉండేవారు-ఈ నిలయ విద్వాంసులు అనే వారు. ఏ ప్రోగ్రామూ లేకపోతే వారి కార్యక్రమాలు వినవలసి వచ్చేది.

    ఇప్పటి మన న్యూస్ చానెల్స్ లోలాగ, ఎక్కడ చర్చా కార్యక్రమం ఉన్నా వాళ్ళే కనిపిస్తూంటారు. ఈవేళ రైల్వే బడ్జెట్ గురించి, మన చానెల్ ఏదో, ఇద్దరు ఎం.పీ. లని వారి అభిప్రాయాలు అడిగింది. వాళ్ళు చెప్పేవి వింటూంటే, వాళ్ళ హావభావాలు చూస్తూంటే, ప్రజలని ఈ రాజకీయనాయకులు ఎంత వెర్రివెధవలు చేస్తున్నారో తెలుస్తుంది. వచ్చే ఏడాది ఎన్నికలొస్తున్నాయికదా అని తృణమూలమ్మకి బెంగాలు తప్ప ఇంకేమీ కనిపించవు.రైళ్ళన్నీ
అక్కడే ప్రారంభం అయి అక్కడే అంతం అవుతాయి.

    వాడెవడో ఎం.ఎల్.ఏ అదేదో ‘విక్రమార్కుడు’ సినిమాలోలాగ అందరినీ హింస పెట్టేస్తున్నాడుట. దానిమీద ఓ చానెల్ వాడు ‘స్టోరీ’ చేశాడు. ఓహో అలాగా ఈ ప్రభుత్వంలో ఎంత అరాచకంగా ఉందీ అనుకున్నంత సేపు పట్టలేదు, ఈవేళ సదరు’విక్రమార్కుడి’ లో ‘విలన్’ ని ఇంకో చానెల్ వాడు ఇంటవ్యూ చేసి, వీడంత అమాయకుడు లేడూ అన్నాడు. ఎవడిని నమ్ముదామూ? ఈ చానెల్స్ వాళ్ళు మనల్ని ‘బక్రా’ చేస్తూనే ఉంటారు.మనం వెధవలౌతూనే ఉంటాము, ప్రపంచం ఏమీ ఆగిపోదు !

%d bloggers like this: