బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-హైపర్ ఏక్టివ్ తరం

    మా చిన్నప్పుడు ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళో, అమ్మా నాన్నల స్నేహితులో వచ్చినప్పుడు, ఆ చుట్టుపక్కల ఎక్కడా ఉండేవాళ్ళం కాదు.ఆడుకోవడానికి బయటకు వెళ్ళాలంటే అదే మంచి అవకాశంగా ఉండేది.మన తల్లితండ్రులు కూడా, పిల్లల్ని ఆ వచ్చినవారికి చూపించడం,వారి ప్రావీణ్యాలు ప్రదర్శించడం వగైరాలు ఉండేవి కావు.ఇంట్లో ఎవరైనా నానమ్మలో, అమ్మమ్మలో ఉంటే , అసలు వాళ్ళే అడ్డు పెట్టేవారు.’ ఊరికే అస్తమానూ పిల్లల్ని పిలవకండి, దిష్టి తగులుతుందీ’అనేవారు. ఏ కారణం చేతైనా బయటవాళ్ళు చూడడం పడితే, వాళ్ళు వెళ్ళగానే, దిష్టి తీసిపడేసేవారు! రాత్రిళ్ళు పసిబిడ్డ గుక్కతిప్పుకోకుండా ఏడిస్తే–‘ ఎవరి కళ్ళు పడ్డాయో కానీ, కొంచెం దిష్టి తీసేయండిరా’ అని ఓ ఆర్డరు వేసేవారు.
ఉప్పుచేతిలో వేసికొని, మూడుసార్లు ఇంట్లో ఉన్న చిన్నవాళ్ళందరి చుట్టూ తిప్పేసి,తడిచేయి చేసికొని,కళ్ళకీ, కాళ్ళకీ రాసేవారు.అదేం చిత్రమో స్విచ్ ఆఫ్ చేసేసినట్లుగా,ఏడుపు ఆపేసి, హాయిగా పడుక్కునేవారు.ఇవన్నీ ఈప్పటి వారికి విచిత్రంగా కనిపించొచ్చు.ఒక్కవిషయం మాత్రం ఒప్పుకోండి, ఈ బ్లాగ్గులు చదివే ప్రతీవారూ ఇలా పెరిగి పెద్దైనవాళ్ళే. కావలిసిస్తే మీ ఇంట్లో ఉన్న అమ్మనో, నాన్ననో అడగండి !

    ఇప్పటివాళ్ళు పెరిగే వాతావరణం ఇంకోలా ఉంది.న్యూక్లియర్ ఫామిలీలూ, అమ్మా, నాన్నా, ఒకరో ఇద్దరో పిల్లలు.వారి ప్రపంచం అంతా కలిపి ఆ నలుగురే, ఇంటికి ఎవరు వచ్చినా అందరూ కలిసే ఉంటారు.వీళ్ళెంతసేపు మాట్లాడుకున్నా, పిల్లలు కూడా అందులో భాగమే.అలాగే అమ్మా నాన్నా మాట్లాడుకుంటున్నా, ఆ పిల్లల ఎదురుగానే మాట్లాడుకోవాలి.ఈ పిల్లలు కూడా ‘ ఆవలిస్తే పేగులు లెఖ్ఖపెట్టే వారే ‘. అందువలన తల్లితండ్రులు మాట్లాడుకునేవి అన్నీ వాళ్ళ మైండ్ లో రిజిస్టర్ అయిపోతాయి.ప్రతీ రోజూ కొత్త కొత్త మాటలు నేర్చుకుంటూంటారు.అందువలన తల్లితండ్రులు కూడా, చాలా డిసిప్లీన్డ్ గా ఉంటున్నారు.అయినా ఒకటీ అరా ఇంకోళ్ళగురించి మాట్లాడుకుంటూంటారు. మా స్నేహితుడొకరు, వాళ్ళ ఫ్రెండ్’సత్యనారాయణ’ అని ఒకరుండేవారు. వీళ్ళు అస్తమానూ ఆయనగురించి మాట్లాడుకునేటప్పుడు ‘సత్తిపండు’ ఇలా అన్నాడూ, అలా అన్నాడూ అనుకునేవారు. ఆ మాట ఇంట్లో ఉన్న పిల్ల పట్టేసింది. ఓ రోజున ఆయన వీళ్ళింటికి వస్తే, ‘ డాడీ సత్తిపండు గారొచ్చారూ’ అంది.ఆయనకి షాక్కు కొట్టింది.ఇదేమిటి ఈ పిల్ల అలాగ అంటోందీ, అని ఇంక మాస్నేహితుడికి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు.

&nb;   ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మా మనవరాలు నవ్య కూడా ఈ తరానికి చెందినదేగా.వీలున్నంతవరకూ నేను ఎప్పుడూ నోరుమూసుకునే ఉంటాను. నోరెత్తితే ఏం అవాకులూ,చవాకులూ మాట్లాడుతానో అని.మా అబ్బాయీ, కోడలూ, మా ఇంటావిడా తన ఎదురుగుండా ఒక్క మాటా కాజుఅల్ గా మాట్లాడరు. నేను ఏం మాట్లాడినా క్యాజుఅల్ గానే మాట్లాడతాను! ఈ వయస్సులో ఇలాంటి కర్ఫ్యూలు ఉంటే కష్టం కదాండీ? అయినా నా జాగ్రత్తలో నేనుంటాను. మనకీ ఓ బాధ్యత ఉందిగా ! మా పిల్లలసంగతి చెప్పాలంటే పాపం వాళ్ళకి క్రమశిక్షణ కొంచెం ఎక్కువే. అది మేమేమీ నేర్పలేదు. ఇంట్లో ఎప్పుడూ వాళ్ళెదురుగా ఎవరిగురించీ మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఏం మాట్లాదుకుందామన్నా బయట వాక్ కి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవడమే.

    నేను బయటకు వెళ్ళినప్పుడు,ఏమైనా స్వీట్స్ తెస్తూంటాను. నాకు తినడానికి మెత్తగా ఉంటాయని మిఠాయి ఉండలు ప్రతీసారీ తెస్తూంటాను.మరీ అన్నీ నేనే తింటానూ అనలేనుగా, అందుకోసమని, మా మనవరాలు నవ్య తో చెప్తూంటాను-ఈ లడ్డూలు నీకూ, నాకూ మాత్రమే. మిగిలినవన్నీ అందరికీ ఇద్దాము అని.తెచ్చినవన్నీ తనే తినేస్తే ఏ అనారోగ్యమైనా వస్తుందేమో అని ఈ ఎరేంజ్ మెంటన్నమాట. ఇంతవరకూ బాగానే ఉంది, ఈ మధ్యన ఒక రోజు, మా అబ్బాయి స్నేహితుడు ఈమధ్యనే కొత్తగా పెళ్ళి అయింది, మా మనవడిని చూడడానికి తన భార్యతో వచ్చాడు. ఆ వచ్చిన వాళ్ళకేవో చాయ్ తోపాటు ఏదైనా పెట్టాలిగా. మా కోడలు, ఇంట్లో ఉన్న మిగిలిన స్నాక్స్ తోపాటు, మా (అంటే నాకూ, మానవ్యకీ మాత్రమే హక్కున్న) లడ్డూలు కూడా ప్లేట్ లో పెట్టింది.పాపం మా నవ్య ఎంతో ఫీల్ అయిపోతూ ‘తాతయ్యా ఆప్ అప్నేలియే లాయేహుఏ లడ్డూ అభీ దూస్రోంకే సాత్ షేర్ కర్నా పడ్ రహా హై, క్యా కరే’ అని ఆ వచ్చినవాళ్ళెదురుగుండానే చెప్పేసింది.తనకి తెలుగులో మాట్లాడడం చక్కగా వచ్చును, అయినా ఆ వచ్చినవాళ్ళు అర్ధం చేసికోరేమో అని హిందీ లో నన్ను వీధిన పెట్టేసింది.అది విని అందరూ నవ్వడమే ! పాపం ఆ వచ్చిన వాళ్ళుకూడా
ఆ లడ్డూలమీద చెయ్యిపెడితే ఒట్టు !
అందువలన చెప్పొచ్చేదేమిటంటే, ఈ కాలపు పిల్లలముందర అదేదో ఎడ్వర్టైజ్ మెంటులోలాగ నోటికి సీల్ వేసేసుకుని ఉంటే ఇంటికీ వంటికీ సర్వవిధాలా క్షేమం !

%d bloggers like this: