బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు-పుత్రోత్సాహం-9

    మా రోజుల్లో అమెరికాకి వెళ్ళడం అనేది కొంచెం తక్కువ అనుకుంటాను.ఇప్పుడు విదేశాలకి అంటే ప్రపంచంలో ఏ దేశానికైనా సరే-జాంబియా, సూడాన్ లనుండి అభివృధ్ధిచెందిన దేశాలదాకా వెళ్ళని వాడిది పాపం! చదువుకున్నవాడైనా సరే,లేనివాడైనా సరే బయటకు వెళ్ళడం అనేది ఒక ‘అబ్సెషన్’ అయిపోయింది.

మన దేశం కంటే బయట దేశాలలో ఆదాయం,గుర్తింపూ ఎక్కువా అనేది ఒక వాదం.అదే కాకుండా ‘వాతావరణం’ కూడా అనువుగా ఉంటుందనుకుంటా.ఇక్కడ ఉన్నన్ని రూల్సూ, రెగ్యులేషన్లూ,వాటిని అధిగమించడానికి కావలిసిన ‘ఇన్ఫ్లుయెన్సూ’ ‘లంచాలూ’ గొడవా తక్కువైఉండొచ్చు.బయట ఉండి వచ్చినవారిని ఎవర్నైనా అడగండి, ‘అబ్బో అమెరికాలో ‘ అయితేనా అని మొదలుపెడతారు.ఇక్కడ ఉండే ప్రతీదీ వాళ్ళకి ‘సఫొకేటింగ్’ గానే ఉంటుంది.ట్రాఫిక్,పొల్యూషన్,సివిక్ సెన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ విషయంలోనూ మనం వెనుకబడే ఉన్నామనిపించేలా మాట్లాడతారు.బహుశా వారు రైటేమోనేమో అనిపిస్తుంది.

కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి వస్తారా అంటే, అబ్బే అలా కాదు-వెళ్ళినప్పడినుండీ ‘గ్రీన్ కార్డ్’ కోసం ప్రయత్నాలు మొదలు. ఆఖరికి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే, వారం వారం టీ.వీ ల్లో వచ్చే జాతక ఫలాల్లో కూడా ‘ ఈ వారం మీరు చేసే గ్రీన్ కార్డ్ ప్రయత్నాలు కొంతవరకూ సఫలమౌతాయి‘ అని చెప్పేంతవరకూ !ఈ వ్యవహారం ఎక్కడదాకా వచ్చిందంటే,ఎవరైనా పాత స్నేహితుడు కనిపిస్తే ఇదివరకటి రోజుల్లో, ‘మీ నాన్నగారు ఎలా ఉన్నారూ, మీఅన్నయ్య కులాసాయేనా, చెల్లమ్మ ఎలా ఉందీ? ‘ అనే పలకరింపుల స్థానం లో, ‘మా అమ్మాయి లండన్ లోనూ,అబ్బాయి ఒకడు డిట్రాయిట్ లోనూ, ఒకడు వాన్కూవర్ లోనూ, నాలుగోవాడు జెనీవాలోనూ ఉంటున్నారు, ఈ మధ్యనే పిల్లలదగ్గరకు వెళ్ళి,అన్ని దేశాలూ చూసొచ్చాము’.కొంచెం సంస్కారం ఉన్నవాళ్ళు అక్కడితో ఆపేస్తారు. కొంతమందైతే’ మీ పిల్లలు ఎవరూ బయట లేరా, అయ్యో
అని పరామర్శ ఒకటీ. ఆ అడిగే పధ్ధతి ఎలా ఉంటుందంటే, ఈయన (అంటే పూర్తి స్వదేశీ పిల్లల తండ్రి), తన పిల్లలేదో అప్రయోజకులనీ,వాళ్ళకి ‘యాంబిషన్’ అనేది లేదనీ. ఆ చిరాకంతా ఇంట్లో పిల్లల మీదా, పెళ్ళాం మీదా చూపిస్తాడు.
ఉన్న ఉద్యోగంలో ఆన్ సైట్ దొరకడం లేదని ఉద్యోగాలు మార్చినవారిని చూశాను.జీవితంలో ఒక్కసారైనా బయటకు వెళ్ళకపోతే వాడి బ్రతుకు నిరర్ధకమేనా? ఏమో అలాగే అనిపిస్తోంది.నేను చెప్పానుగా మా పిల్లలు (కూతురూ,అల్లుడూ, కొడుకూ,కోడలూ)ఆన్సైట్ వెళ్ళమంటే ఉద్యోగం మార్చేస్తారు. అలాగని బయటకు వెళ్ళలేదా అంటే అందరూ కూడా ఏదో పనిమీద నాలుగైదు సార్లు వెళ్ళివచ్చిన వారే. నాకు వాళ్ళల్లో ఎలాటి అసంతృప్తీ కనిపించలేదు.ఇక్కడ జాబ్ ని (నలుగురూ సాఫ్ట్ వేర్ లోనే పనిచేస్తున్నారు) పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.మా ఇద్దరికీ ఎలాటి ‘కాంప్లెక్సూ’ లేదు, అయ్యో మన పిల్లలు మిగిలినవాళ్ళలా అమెరికాలోనూ, ఇంగ్లాండ్ లోనూ లేరే అని ! హాయిగా ప్రతీ రొజూ మా పిల్లల్నీ,మనవళ్ళూ, మనవరాళ్ళనీ హాయిగా మనసారా చూసుకుంటున్నాము.అలాగని ప్రతీరోజూ వాళ్ళతో ఏదో ఇంటర్ యాక్షన్ ఉంటుందనికాదు. అవసరం వచ్చినప్పుడు పిల్లలు దగ్గర్లో ఉన్నారా లేదా అనేదే ప్రశ్న. కొంతమందనుకోవచ్చు- ‘ఈయనకి బయటకు వెళ్ళడానికి అవకాశం లేదూ, అందని ద్రాక్షపళ్ళు పుల్లన’అని.

జన్మనిచ్చిన తల్లితండ్రులకి అందనంత దూరం లో ఉంటే, ఇక్కడ వీళ్ళు పడే బాధ ఏమైనా తెలుస్తుందా? ప్రతీ నెలా డబ్బు పంపి, ఓ పేలెస్సో, మేన్షనో కట్టించేసి, అందులో అమ్మా నాన్నా బిక్కుబిక్కు మంటూ ఉంటుంటే, ఒకళ్ళమొహాలొకళ్ళు చూసుకుంటూ, పిల్లల దగ్గరనుండి వచ్చే మెయిల్సూ, వెబ్ మీటింగుల కోసం కళ్ళు కాయలు కాసేట్లా ఆవురావురుమంటూ ఉండడం లోనే సంతోషం ఉందేమో.

ఈ పరిస్థితి ఎలాటిదంటే,ఎంత ఐశ్వర్యమున్నా నోటికి నిండుగా ఏమీ తినలేనివాడు ( సుగరో,బీ.పీ వల్లో), బ్యాక్ ఏక్ ధర్మమా అని, వట్టినేలమీదే దొర్లవలసిన వాడిలా! ఎంతమంది పిల్లలుంటే లాభం?అందరూ బయటే ఉన్నప్పుడు. అప్పుడెప్పుడో ‘బాపు’ గారు ఓ కార్టూన్ వేశారు-తండ్రి కాలధర్మం చెందినప్పుడు, కొడుకు రాలేకపోతే, పదోరోజుకి వచ్చిన కొడుకుతో పురోహితుడంటాడూ’ మీరు టైముకి రాలేదని బాధ పడకండీ,క్రింద పెట్టినప్పటినుండీ, అస్థికలు కలెక్ట్ చేసేదాకా అన్నీ వీడియో తీయించేశామూ’ అని !చివరకి తల్లితండ్రుల ఆఖరి చూపు కూడా దక్కడంలేదు. ఇవన్నీ
ప్యూర్లీ సెంటిమెంటల్ స్టఫ్, ఇమోషనల్ బ్లాక్ మెయిలూ అని కొట్టిపారేస్తారు.మా ఫ్యూచరూ, మా పిల్లల ఫ్యూచరే మాకు ముఖ్యం, మీరు ఇక్కడికి వచ్చేసి, మాతోనే ఉండమంటే రారూ, పుట్టిన ఊరూ,అనుబంధాలూ, సింగినాదం అంటూ ఇంకో రకం వాళ్ళంటారు.

రైటే కాదనడం లేదు, ఓ సారి మీకు జన్మనిచ్చిన తల్లితండ్రులగురించి కూడా ఆలోచించండి. వెళ్ళద్దనడం లేదు, వెళ్ళినా కొన్నిసంవత్సరాలు సంపాదించేదేదో సంపాదించి, ఆ ఆనందం ఏదో మీ తల్లితండ్రులతో కూడా పంచుకోండి. మీ అభివృధ్ధే వాళ్ళకి కావలిసింది. ఇదంతా ఎందుకు వ్రాశానంటే ఈ వేళ మా కజిన్ ఒకతనికి ఫోన్ చేసినప్పుడు చెప్పాడు వాళ్ళ అబ్బాయి గత పాతిక సంవత్సరాలూ మాస్కో లోనూ, లండన్ లోనూ ఉండి, ఇండియా తిరిగివచ్చేస్తున్నాడూ, పూణే లో ఉద్యోగానికీ అని. తనకి ఎంత ఆనందంగా ఉందో! ఈయనకి డెభ్భైఏళ్ళ పైమాటే.ఒక్క కొడుకైనా దగ్గర ఉంటాడూ అని ఆ వెర్రిప్రాణికి సంతోషం!

%d bloggers like this: