బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-తృణమూలమ్మ

    ఈ వేళ లోక్ సభలో పెట్టిన రైల్వే బడ్జెట్ సందర్భంగా మన రైల్వే శాఖా మంత్రి, మమతా బెనర్జీ ప్రసంగం వినే అ(దుర)దృష్టం కలిగింది. అందులో ఆవిడేం చెప్పిందో ఏమీ అర్ధం అవలేదు. రైల్వే టైంటేబిల్ లో ఉన్న స్టేషన్ ల పేర్లు రమారమి అన్నీ వినిపించినట్లయింది. ఒక్క బెంగాల్ లో ఉండే స్టేషన్లు తప్పించి, మరే స్టేషను పేరూ సరీగ్గా పలకలేకపోయింది.

    ఆంధ్ర ప్రదేశ్ లోని స్టేషన్ ల పేర్లు అయితే మరీ దరిద్రంగా పలికింది. నాకు ఒక విషయం అర్ధంఅవదు–ఆ బడ్జెట్ వివరాలు చెప్పేముందర ఒకసారి
వాటి ఉఛ్ఛారణ గురించి, వారి మంత్రిత్వ శాఖలో ఉన్న ఎవరినైనా అడిగి తెలిసికుంటే ఏం పోయింది? పైగా ఇంకోటి,ఆవిడ మాట్లాడుతున్నంతసేపూ, ఎవడో ఒకడు లేచి నుంచొని అరుపులూ వగైరా…ఇంక ఈవిడేమో మన ‘సూర్యకాంతం’ గారిలాగ, తిరిగి వాళ్ళని కోప్పడడం.

    అంతంత ఊకదంపుడు అంతా చదవడం ఎందుకో అర్ధం అవదు. ఎలాగూ, అచ్చేసిన బడ్జెట్ పేపర్లు అందరికీ పంచుతారు కదా, ఈ కంఠశోష ఎందుకో? ఈ విషయంలో దక్షిణభారత మంత్రులు నయం.ఎక్కడి పేరైనా శుభ్రంగా పలుకుతారు.ఉత్తరభారతానికి చెందినవాళ్ళకే ఈ రోగం.అందులో బెంగాలీ వాళ్ళకి ఈ తెగులు ఎక్కువ.
వీళ్ళు ఓ సంగతి మర్చిపోతూంటారు-వారు జాతీయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు, అంతే కానీ ఏదో ప్రాంతీయ బడ్జెట్ కాదు.అదంతా ఓ కామెడీ లాగ ఉంది.ఇన్నాళ్ళూ, లాలూ పెట్టేవాడు. తనైతే ఓ గొప్ప జోకర్!

   ఇంక ఆ స్పీకర్ సీట్లో కూర్చొన్న మీరాకుమార్ సంగతి అడక్కండి. ఎవడిదారిన వాడు అరుస్తూంటారు. ఇక్కడేమో ఈవిడ ఓ హెడ్మిస్ట్రెస్స్ లాగ వాళ్ళని కూర్చోమంటూంది. ఎవడూ ఈవిడ మాట వినడు. పార్లమెంటవనీయండి, లేక మన గ్రేట్ శాసనసభ అవనీయండి, ఏ రోజైనా చిన్నపిల్లలు చూస్తే,ఇంక జీవితంలో వాళ్ళు ఎవరిమాటా వినరు!

    ప్రతిపక్షం అంటే ఏదో ఒక అల్లరిచేయడమే వారి ధ్యేయం. ఏమైనా అంటే బలమైన ప్రతిపక్షమే ప్రజాస్వామ్యానికి పెట్టనిగోడా వగైరా వగైరా…బ్లా బ్లా.. అని నీతులూ.అలాగని పాలక పక్షం ఏమీ పొడిచేయడంలేదు.మన దురదృష్టం ఏమిటంటే, ఈ బడుధ్ధాయిలందరినీ మనమే ఎన్నుకున్నాము.
అలాగని ప్రతీవారూ అలాగ అనికాదు-ఒక్కొక్కప్పుడు ఏ మధ్యాన్నం పూటో లోక్ సభ డిబేట్ లు వింటే, చాలా బాగుంటాయి.మంచిమంచి పాయింట్లు కూడా ఉంటాయి.

    మన ఎం.ఎల్.ఏ లగురించి ఎంతతక్కువ చెప్పుకుంటే అంత ఆరోగ్యం మనకి.మా చిన్నప్పటి రోజుల్లో ఉండే ఎం.పీ/ఎం.ఎల్.ఏ ఏ పార్టీకి చెందినవారైనా సరే-ఓ నీతీ నిజాయితీ ఉండేవి. భాష కూడా వినసొంపుగా ఉండేది. వాళ్ళ ప్రసంగాలు మర్నాటి పేపర్లలో చదవడానికి అందరూ ఎదురు చూసేవారు. అసెంబ్లీ లో శ్రీ తెన్నేటి విశ్వనాధం, శ్రీ వావిలాల, శ్రీ ఎన్.జి.రంగా, శ్రీ పుచ్చలపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే అతిరథ మహారథులుండేవారు.ఇంక పార్లమెంటు కొస్తే ఆచార్య కృపలానీ,నాథ్ పాయ్,రాజ్ నారాయణ్,నెహ్రూ,కృష్ణమీనన్ వగైరా వగైరా..

    మన తెలుగు చానెల్స్ లో అసెంబ్లీ సెషన్ ప్రత్యక్షప్రసారాలు వింటూంటే నవ్వాలో, ఏడవాలో తెలియదు.పైగా ఇంకో గొడవా-ఈమధ్యన జరిగిన పరిణామాల దృష్ట్యా, ఎవరో కొంతమంది రాజీనామాలు చేశారని చదివాము. మరి అలాటప్పుడు వీళ్ళ వెనక్కాలే ఉండే సెక్యూరిటీ కి మనం ఎందుకు డబ్బు పెట్టుకోవడం ఎందుకూ?

%d bloggers like this: