బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-Unsung Heroine

    కేంద్రప్రభుత్వం వారు ఇదివరకటి రోజుల్లో ఫిబ్రవరి 28 న సాయంత్రం 5.00 గంటలకి సాధారణ బడ్జెట్ సమర్పించేవారు. ఆ గొడవంతా గజిబిజి అయిపోయి, ఆ బడ్జెట్ కి ఓ తేదీ అన్నది లేకుండా, ఎప్పుడుబడితే అప్పుడే సమర్పించేస్తున్నారు.

7nbsp;  కానీ ఆ ‘తేదీ (ఫిబ్రవరి 28)’ తో ఎంతో ముఖ్యమైన అనుబంధం మారదుగా ! ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే ఆరోజున, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో, 38 సంవత్సరాల క్రితం, నేనూ ఓ ఇంటివాడినయ్యాను!!
అప్పుడే ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయా అని ఆశ్చర్యం వేస్తుంది. ఆ పెళ్ళి అయిన పరిస్థితులూ,వగైరా నేను ఇప్పటికే మీకు నా ‘బాతాఖానీ కబుర్లు’ 1-50 ద్వారా బోరుకొట్టాను. మళ్ళీ అవన్నీ చెప్తే ఇంక నా బ్లాగ్గులోకి ఎవరూ అడుగెట్టరు !!

ఇప్పటికీ నాకు ఓ విషయం అర్ధం అవదు–అసలు నాలో ఏంచూసి నన్ను అంగీకరించిందా తను అని.పోనీ అడుగుదామా అంటే ‘మిథునం’ లో లాగ ఏమైనా సమాధానం వస్తుందేమో అని భయం !ఓ రూపమా, చదువా, ఉద్యోగమా, పోనీ ఏదైనా విషయంలో ప్రావీణ్యతా, ఒక్కటంటే ఒక్కవిషయంలోనూ ఎటువంటి ప్రత్యేకతా లేని సాధారణ జీవిని.

మా ఇంటావిడ గురించి చెప్పాలంటే చాలా ( అంటే నాలో కాగడా పెట్టివెదికినా కనిపించనివి) ఉన్నాయి.తనో పేద్ద ‘క్రమశిక్షణ’ఇస్ట్.ప్రతీదానికీ, అలా మాట్లాడకూడదూ,ఇలా మాట్లాడకూడదూ అంటూ ఊరికే ఊదరకొట్టేస్తుంది. ఇంట్లో అన్నీ వేటి స్థానంలో అవి ఉండాలంటుంది.ప్రతీదీ శుభ్రంగా ఉండాలంటుంది.నా అప్పుఎంతో అడుగుతూంటుంది.ఇంట్లో ఏదైనా ఫంక్షన్ లాటిది జరిగితే, వీళ్ళకు పెట్టాలీ, వాళ్ళకు పెట్టాలీ అంటూ నాచేత ఎవేవో తెప్పిస్తూంటుంది.నేను ఎప్పుడైనా కోపం వచ్చి అరుస్తే సమాధానం ఇవ్వకుండా ‘కూల్’ గా ఉండిపోతుంది. సమాధానం చెప్తేనేకదా నాకూ ఇంకా అరవడానికి అవకాశం వస్తుందీ( ఏమిటో ఎవరూ అర్ధంచేసికోరూ !!). ఎప్పుడో జరిగిన సంగతులు అన్నీ గుర్తుపెట్టుకొని,ఛాన్స్ దొరికినప్పుడు ‘ర్యాగ్’ చేస్తూంటుంది.రోజుకో డ్రెస్ మార్చమంటుంది.నాకు చిరాకూ.సరీగ్గా బయటకు వెళ్ళే ముందర సాగతీసుకుంటూ’ఆ డ్రెస్ మాసిపోయిందేమో, పోనీ మార్చకూడదూ’అని.

ఏమిటో ఇలా రాసుకుంటూ పోతే ఎన్నెన్ని ఉన్నాయో! మీరనొచ్చు ఇలాటి గుణాలు ప్రతీ భార్యలోనూ ఉంటాయీ, మీరేమిటీ అదేదో పేద్ద గొప్ప విషయాలుగా చెప్తున్నారూ అని.అక్కడే ఉంది అసలు విషయం అంతా--ఎందుకూ పనికిరాని నాలాటి వాడిని పెళ్ళి చేసికోవడం ఎందుకూ, నన్ను ఉధ్ధరించడం ఎందుకూ?

ప్రతీ వారం నేను తెచ్చే పుస్తకాలు కొన్ని రోజులైనా (కొత్తపుస్తకం వచ్చేవరకైనా) దాచిపెట్టుకోవచ్చుగా, అబ్బే, వెంటనే చదివేయాలి.నేను ఈ గోలంతా భరించలేక, కంప్యూటర్ లో తెలుగు వ్రాయడం మొదలెట్టి ఏదో నా గొడవేదో నేను పడుతున్నానుగా,అబ్బే తనూ నేర్చేసికొని నాతో పోటీ!

ఇంక ఆవిడలో నాకు నచ్చే విషయాలకొస్తే–వంట బ్రహ్మాండంగా చేసేస్తుంది. ఇంటికి ఎవరు ఏ సమయంలో వచ్చినా ఢోకా లేదు. రెండు కూరలూ, పచ్చడీ,పప్పూ,పులుసూ తో శుభ్రంగా భోజనం పెడుతుంది.అందుకే, మా ఇంటికి వచ్చేవాళ్ళు నన్ను గుర్తు పెట్టుకొని రారు,ఆవిడనే గుర్తు పెట్టుకుంటారు.ఆవ పెట్టి పనసపొట్టుకూరా, కారం పెట్టి వంకాయ కూరా,కందా బచ్చలి కూరా – అద్భుతం!

నేను ఎక్కడికి రమ్మన్నా వచ్చేస్తుంది. అందుకే ఏం తోచక రాజమండ్రీ లో కాపరం పెడదామంటే వచ్చేసింది.ఇప్పుడు పూణే లో ఇంట్లో సామాన్లు అన్నీ పట్టవూ, ఇంకో ఫ్లాట్ అద్దెకు తీసికొని ఉందామూ అంటే, వెంటనే ఒప్పేసుకొంది.

జనవరిలో పుట్టిన మా మనవడు చి.అగస్త్య తో కలిపి నాకు ‘నవరత్న మాల’ తయారుచేయడానికి కారణం తనే కదా ! అసలు పెళ్ళే అవుతుందా అని అనుకున్న నాకు సమాజంలో ఓ స్థానం కలిగింది ఈవిడవల్లేగా.అయినా పాపం ఎవరుచెప్పినా ఫలానా ఫణిబాబు గారూ అంటారే కానీ
తను ఓ ‘అన్ సంగ్ హీరోయిన్’ గానే ఉండిపోతుంది.అసలు విజయమంతా ఆవిడదే.

పైన ఇచ్చిన ఫొటో, మా కోడలు, మా మనవడిని చూసుకుంటూ,స్వయంగా పైంట్ చేసి, వాటిలో మా ఫోటోలు పెట్టి మాకు వివాహ వార్షిక దినోత్సవ సందర్భంగా ఇచ్చినది.

%d bloggers like this: