బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-పేర్లు గుర్తుకు రావు-2

    నిన్న ‘పేర్లుగుర్తుకు రావు’ అనే శీర్షిక క్రింద ఓ బ్లాగ్ వ్రాశాను.24 గంటలు తిరక్కుండా, ఈ వేళ వీధిన పడిపోయాను ! ప్రొద్దుటి కార్యక్రమాలు
గుడి, పిల్లలకి టాటా లు చెప్పడం,బ్రేక్ ఫాస్టూ పూర్తయిన తరువాత కంప్యూటర్ ముందు ఏదో కెలుకుదామని కూర్చున్నాను.ఇంతలో మాఇంటావిడ వచ్చి, ‘ఎవరో రమేష్ ట, మీ గురించి అడుగుతున్నారు, చూడండి’అని పిలిచింది.

    సరే అని వచ్చి చూస్తే, బయట ఒకాయన ఉన్నారు.ఎక్కడో చూసిన మొహంలాగే కనిపించింది.పేరు రమేష్ అని ఆయనే చెప్పడంతో, ఓ గండం తప్పింది! లోపలకి వచ్చిన తరువాత గొప్పగా, ఈయన రమేష్ అనీ..సాగతీసుకుంటూ పరిచయం చేయబోతే, మా ఇంటావిడ ఊరుకోచ్చా,’పేరు ఆయనే చెప్పారు…’ అని ఆపేసింది.అంటే దానర్ధం ‘ఆమాత్రం నాకూ తెలుసునూ, ఈయన గురించి మిగిలిన పరిచయం చెయ్యవోయ్’ అని!
ఇంక నా ఎక్సర్సైజ్ మొదలెట్టాను.ఎంత ప్రయత్నించినా ఎక్కడ చూశానో గుర్తుకు రాలేదు. తెలుగాయన అని తెలిసింది(తెలుగులో మాట్లాడారు కాబట్టి!). అయినా ఓ రాయేద్దామని, ‘మీరు బ్యాంకు లో కదూ పనిచేస్తోంట’. ‘కాదండీ సత్యం లోనూ’ అని ఆయన జవాబూ.మొదటి వికెట్టు డౌన్ !’ ఔనౌను చెప్పారుకదూ, సత్యం మహీంద్రా అని,గుర్తొచ్చింది’. అక్కడ ఆ ‘మహీంద్రా ‘ అని చెప్పడం దేనికీ, నా అప్రయోజకత్వాన్ని దాచుకోడానికి !!నేను ‘కంఫర్ట్ లెవెల్ ‘ కి రావడానికి, ఓ పావుగంట పట్టింది !అంతసేపూ, మా ఇంటావిడ అక్కడే కూర్చొని కదలదే! ఇంకా ఎన్నిసార్లు వెర్రిమొహం పెడతానో అని చూడ్డానికన్నమాట!ఇంక ఇది కాదు పధ్ధతీ అని,’ మీది ఏ ఊరూ, మీ భార్యగారిది ఏ ఊరూ’ లాటి రొటీన్ ప్రశ్నలు వేసి, ఇంక తనే సిట్యుఏషన్ కంట్రోల్ లోకి తీసేసికొంది !

    ఇంతట్లో నా బుర్రకి ‘తట్టూ’ అయింది, ఆయనని ఎక్కడ కలిశానో- చెప్పానుగా నాకున్న దురల్వాట్లలో ఒకటేమిటంటే, ఎవరి చేతుల్లోనైనా తెలుగు పేపర్ చూస్తే, పనిమాలా వాళ్ళని ఆపి, పరిచయం చేసికోవడం!పైగా దాంతో ఆగను, వాళ్ళెక్కడుంటున్నారూ, ఎంతకాలంనుండుంటున్నారూ,ఏ ఊరూ
లాటి అన్ని వివరాలూ అడగడం. దానికి సాయం, మేము ఎక్కడుంటున్నామో అదీ చెప్పడం. ఏం లేదూ, మేం ఉండే ఎపార్ట్మెంట్ చాలా సుళువుగా గుర్తుంటుంది.పైగా బిజీ గా ఉన్న రోడ్డు మీద,మంచి లొకేషన్ లో ఉంది.ఆ మాట అవతలివాళ్ళచేత ఓ సారి అనిపించుకుంటే అదో సంతోషం!
పోనీ ఇంతసేపు మాట్లాడింతరువాత గుర్తు పెట్టుకోవాలిగా, అబ్బే! అక్కడ ఎప్పుడూ బధ్ధకమే!అదండి సంగతి! కానీ నేను ఆయన్ని మొదటిసారి ఎక్కడ కలిశానో గుర్తొచ్చిన తరువాత, ఇంక నన్ను పట్టేవాళ్ళెవరూ ఉండరు!కబుర్లు చెప్పాలంటే నా తరువాతే! ఏమైనా ఆఫీసుకెళ్ళాలా,పిల్లల్నేమైనా ఎత్తుకోవాలా ? కబుర్లేగా, కావలిసినన్ని చెప్పగలను! మాకు దగ్గరలోనే ఉంటున్నారు. వచ్చే రెండు రోజుల్లోనూ వాళ్ళింటికి వస్తానని చెప్పాను. ఇంక మళ్ళీ మర్చిపోకుండా. అలాగ ఓ రెండు మూడు సార్లు కలిస్తే ఫర్వాలేదు, గుర్తుంటారు.ఆయనతో ఓ గంట గడిపాము.

    నా అలవాటు ప్రకారం, ఈవేళే ప్రొద్దుట ఓ అబ్బాయిని, ‘సాక్షి’ పేపరు చదువుతూంటే చూశాను. షరా మామూలే.. ఏ ఊరూ, పేరేమిటీ, ఎక్కడ ఉంటున్నారూ వగైరా వగైరా…వివరాలూ, మొహమూ ప్రస్తుతం వరకూ గుర్తున్నాయి. నా అదృష్టం ఎలా ఉందో? అయినా ఈవేళ కూర్చొని,
పరిస్థితి రివ్యూ చేశాను- ఎంతమందిని ఈ మధ్యన కలుసుకున్నానూ ఇలాగ అని. ఓ నలుగురు లెఖ్ఖకొచ్చారు. నా యోగం బాగుంటే, వారిని త్వరలోనే, ఏ రోడ్డుమీదో కలుస్తాననీ, ఆ టైములో మా ఇంటావిడ నాతో ఉండదనీ తలుస్తూ
….

%d bloggers like this: