బాతాఖానీ-లక్ష్మిఫణి కబుర్లు

    నా చదువు అంతా అంటే అదేదో పేద్ద పేద్ద చదువులు చదివేశానని కాదు,హైస్కూలూ,కాలేజీ లో డిగ్రీ లాటిది.అదికూడా ఎలా వచ్చిందో ఇప్పటికీ
ఆశ్చర్యమే!ఒక్కటీ అర్ధం అయేది కాదండి బాబూ!ఏదో ఇండియన్ హిస్టరీ,సివిక్సూ,ఎకనామిక్స్ ( బి.ఎస్.సీ లో జనరల్ ఎడ్యుకేషన్ అని ఉండేది)కొంచెం ఇంటరెస్టింగ్ గా ఉండేవి.మిగిలినవి అంటే లెఖ్ఖలూ,ఫిజిక్సూ,కెమిస్ట్రీ ఎందుకు చెప్తారో అర్ధం అయేది కాదు.అలాగని బట్టీ పట్టేద్దామా అంటే,అదీ లేదూ.కాలుక్లస్ ట–అందులో ఇంటెగ్రేషనూ, డిఫరెన్సియేషనూ అవి ఎందుకు చేస్తారో,వాటివలన భవిష్యత్తులో ఏం లాభమో తెలిసేది కాదు.జామెట్రీ,అస్ట్రానమీ కొంచెం అర్ధం అయేవి ( అదికూడా మా ప్రిన్సిపాల్ గారు శ్రీ గరిమెళ్ళ రామేశం గారి ధర్మమా అని).ఇంక ట్రిగ్నామెట్రీ ఆ త్రికోణాలూ,మళ్ళీ వాటిలో అవేవో ఆబ్ట్యూజ్,ఐసోలసిస్ ఇంకా ఏవేవో వెరైటీలూ.ఇంక ఫిజిక్స్ కొస్తే ప్రాక్టికల్స్-ఒక్క దానికీ రిజల్ట్ వచ్చేది కాదు.స్టాప్ వాచ్ ఎలా చూడాలో తెలిసేది కాదు.ఎలాగో మొత్తానికి యూనివర్సిటీ వాళ్ళు నన్ను భరించలేక ఓ డిగ్రీ ఇచ్చేశారు !!,/b>

ఈ మధ్యన ఇంట్లో ఉన్న పాత ఫొటోలు చూస్తూంటే, 1962 లో వాల్తేరు లో డిగ్రీ పుచ్చుకున్నప్పటి ఫొటో కనిపించింది.అందుకే ఈ గోలంతా !!
మామూలుగా డిసెంబర్ లో కాన్వొకేషన్ ఉండేది.లోపలికి వెళ్ళాలంటే కాన్వొకేషన్ గౌనూ అవీ వేసికోవాల్సివచ్చేది.వాటిని అద్దెకిచ్చేవారు.ఆ వేషం అంతా వేసికొని ఏమైతేనే డిగ్రీ పుచ్చుకున్నానండి. ఇంక ఆ తరువాత ఆ డ్రెస్ లో ఫొటో తీయించుకోవడం ఓ సరదా !!పోనీ ఆ గౌనూ అవీ తీసేసి, మామూలు డ్రెస్స్ లో వెళ్ళొచ్చుగా.అబ్బే అందరికీ తెలియాలిగా!పసుపు బట్టలతో పెళ్ళికూతుర్నీ, పెళ్ళికొడుకునీ అన్నవరమో, తిరుపతో తీసికెళ్తారే అలాగ, నేను కూడా, ఆ కన్వొకేషన్ గౌను లో జగదాంబా సెంటరు దాకా వెళ్ళి ఫుటో తీయించుకున్నాను !!అదొక్క ప్రూఫ్ నాకు డిగ్రీ వచ్చిందనడానికి! ఇంకో ప్రూఫ్ ఏమిటంటే నాడిగ్రీ సర్టిఫికేట్-పెళ్ళి అయిన తరువాత, పాపం మా మామగారు–ఆయన తణుకు స్కూల్లో ప్రింటింగ్ టీచర్ గా పనిచేసేవారు.ఆయన అల్లుడి గారి ప్రయోజకత్వం చూసి ఆనందపడిపోయి, ఆ డిగ్రీ సర్టిఫికెట్ ని, కాన్వాసు గుడ్డమీద అంటించి ఇచ్చారు. మరి ఆ రోజుల్లో లామినేషన్లూ వగైరా ఉండేవికాదుగా !

నా చదువు బ్యాక్ గ్రౌండ్ తెలిసిందిగా! ఆరోజుల్లో చదువుకునే వాళ్ళకి ( నాలాటివారు కాదు)బి.ఎస్.సీ (ఆనర్సూ), ఎం.ఎస్.సీ, ఆ తరువాత
డి.ఎస్.సీ (డాక్టర్ ఆఫ్ సైన్సు) అని ఉండేవి. పీ.ఎచ్.డీ ఆర్ట్స్ లోనే ఉండేదనుకుంటా.మా చిన్నన్నయ్య గారు డి.ఎస్.సీ చేశారు (చదువొచ్చిందికాబట్టి చేశారు!!).అప్పుడు మా ఇంట్లో అందరికీ ఎంతో గొప్పగా ఉండేది. నేను కూడా అడిగినవాడికీ, అడగనివాడికీ చెప్పేవాడిని, ఇలా మా అన్నయ్యగారు డాక్టరూ అని.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే,ఆంధ్ర దేశం లోని విద్యా విధానాన్ని ఇంకా హింస పెట్టడం ఇష్టం లేక, నేను చదువు ‘త్యాగం’ చేసేసి ఉద్యోగంలో చేరిపోయాను.నేను కర్కీ లో ఫాక్టరీ లో చేరగానే, ఓ చోట బోర్డ్ చూశాను-డి.ఎస్.సీ ఇన్ ఛార్జ్ అని.నాకు తెలిసిన డి.ఎస్.సీ మా అన్నయ్యగారు చదివినదే.అబ్బో ఈ ఫాక్టరీ లో చాలామంది తెలివైన వాళ్ళున్నారూ, ఎంతమంది డి.ఎస్.స్సీ లో అనుకున్నాను. పైగా వాళ్ళతో పరిచయం చేసికుందామనుకున్నాను కూడా! ఒకాయన దగ్గరకి వెళ్ళి గొప్పగా చెప్పాను- ‘ మా అన్నయ్య గారు కూడా డి.ఎస్.స్సీ యే అని.ఆయన బోల్డంత సంతోష పడిపోయి, ఏ ప్లెటూనూ అన్నారు! ఈ ప్లెటూన్లూ, కంపెనీలూ అవీ అప్పటికి తెలియవుగా, అందుకే ‘ఆంధ్రా యూనివర్సిటీ’ అన్నాను.పైగా ఫలానా, ప్యూర్ ఫిజిక్స్ లో చేశారూ, మీరెందులో చేశారూ అన్నాను?మనకి తెలియనప్పుడు అలాటి వాటిలో వేలు దూర్పడం ఎందుకూ,అబ్బే మనకున్న విజ్ఞానం అందరికీ తెలియాలిగా !!అవతలాయన ఖంగారు పడిపోయారు.ఇంక ఇది కాదు సంగతీ అనుకొని,ఉరుకోలేక నీకు డి.ఎస్.సీ అంటే తెలుసునా అన్నారు? డాక్టర్ ఆఫ్ సైన్సు కాదా అన్నాను. భయ్యా డి.ఎస్.సీ అంటే డిఫెన్స్ సెక్యూరిటీ కోర్, అంటే ఇప్పటి సి.ఐ.ఎస్.ఎఫ( సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) లాటిదన్నమాట !అంటే వాళ్ళనేదో కించపరుస్తున్నాననుకోకండి, తెలియకుండా ఊరికే ఏదో నోటికొచ్చింది వాగకూడదూ అని తెలిసింది. నిన్న నేను పనిచేసిన ఫాక్టరీ కి వెళ్ళాను. అక్కడ గేటులో ఉన్న డి.ఎస్.సీ గార్డ్ ని చూసినప్పుడు, 46 ఏళ్ళక్రితం జరిగిన సంగతి గుర్తుకొచ్చి నవ్వొచ్చింది
అలాగని ఈ 46 ఏళ్ళలోనూ ఏదో పరిజ్ఞానం పెరిగిందనికాదు, ఇప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ మాట్లాడుతూంటాను.
అప్పుడప్పుడు పాత రోజుల్లో నేను చేసిన ఘనకార్యాలు వ్రాసి మిమ్మల్ని బోరుకొడుతూంటాను !!

%d bloggers like this: