బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఓ వారం ముందుగానే వచ్చేసిన అమ్మవారు…



    వచ్చేవారం 13,14,15 తేదీలలో, మా అబ్బాయీ,కోడలూ దగ్గరలో ఉన్న ఓ సీ రిసార్ట్ కి వెళ్ళడానికి ప్రొగ్రాం వేశారు. మమ్మల్ని కూడా రమ్మన్నారు.12 న వరలక్ష్మి వ్రతం చేసికుని, మూడు రోజులూ దీపం పెట్టకుండా ఉండడం, మా ఇంటావిడకి సుతరామూ ఇష్టం లేదు. దానితో, ఓ వారం ముందుగానే అమ్మవారిని ఆహ్వానించేసింది. ఆవిడకూడా, కాదూ కూడదూ అనకుండా వచ్చేశారు! పైన ఇచ్చిన ఫొటోల్లో మొదటిది మేముండే ఇంట్లో మా ఇంటావిడ అలంకరించిన అమ్మవారూ, రెండో ఫొటో లో మా స్వంత ఇంట్లో మా కోడలు అలంకరించిన అమ్మవారూ.

    ఇంక మామూలేగా, పూజా పునస్కారాలంటే అదీ వరలక్ష్మీ వ్రతం అంటే, మా ఇంటావిడ చేసే హడావిడీ, ఆ సందర్భంలో బయటనుండి ఏమేం కావాలో వాటినన్నిటినీ తెప్పించడం, వగైరా వగైరా.. నిన్న బయలుదేరి బజారు కెళ్ళి పువ్వులూ, పళ్ళూ,తమలపాకులూ, కొబ్బరికాయలూ తెచ్చాను. అక్కడికేదో నెను శ్రమ పడేనని కాదు, అసలు శ్రమంతా ఆవిడదే. తెల్లవారుఝామున లేచి, తొమ్మిది రకాల పిండివంటలూ, తయారుచేసి, పూజ చేసికొని, తొమ్మిదయ్యేసరికల్లా అన్నీ పూర్తయిపోవాలి. అంత ఓపికెక్కడినుండి వస్తుందో నాకైతే తెలియదు. నాకు తెలిసిందల్లా ఆవిడ చేసిన పిండివంటలు!

   మా నాన్నగారూ, అమ్మగారూ పోయిన సంవత్సరాలు తప్పించి, మిగిలిన 35/36 సంవత్సరాలూ తొమ్మిది పిండివంటలూ చేస్తూనే ఉంది. నేను ఆస్వాదిస్తూనే ఉన్నాను. ఏం చేయను చెప్పండి, మీలో ఎవరికీ పంపనూలేను! సరదాగా క్రింద పెట్టిన ఫొటోల్లో రుచి చూసేయండి! ఇంకా కావలిసొస్తే, రాజమండ్రీలో ఉన్నప్పుడు, ఆవిడ వ్రాసిన టపా1, టపా2,
టపా3 చదివి మీకూ ఏమైనా ఉపయోగిస్తాయేమో చూసుకోండి !
ఈవేళంతా భుక్తాయాసం. దాంతో ఏమీ వ్రాయలేకపోతున్నాను ప్రస్తుతానికి !!









9 Responses

  1. మాస్టారూ మీరు ఇలా నవ పాకాలు ఫోటోలో పెట్టి , భుక్తాయాసం నేను రాయలేను అని కూచుంటే..మా పరిస్థితి ఏంటి?… ఎడ్రస్ పంపిస్తా నిలవుండేవి కొన్ని పార్సిల్ పంపిస్తారా?..చూస్తుంటేనే నోరూరుతుంది..కనువిందు తప్ప మేము ఏవిందు చేస్కొలేము..సూర్యలక్ష్మి గారికి ధన్యవాదాలు//

    Like

  2. వచ్చే శుక్రవారం వ్రతం చేసుకునే వారికి వుపయోగపడే మంచి విషయాలు తెలియ చేశారు..
    మీ ఇద్దరికీ ధన్యవాదములు

    Like

  3. నాకు ఇలాంటి స్నేహితులు ఉన్నారు. పోనీ, సుబ్రహ్మణ్యం, ఈ వేళ మా ఇంట్లో వ్రతం.నువ్వు రా, నా భుక్తాయాసం నువ్వు కూడా పంచుకో అని అన్నారా?

    Like

  4. @నైమిష్,
    నా టీం (నాతో కలిపి) పదిమందిమి. ఇంక మీకేం పంపిస్తానూ? ఈ సారికి ఏదో సరిపెట్టేసికోండి !!

    @రాజీ,
    ధన్యవాదాలు.

    @సుబ్రహ్మణ్యం గారూ,

    అదేమిటోనండీ, తిండి రంధిలో పడి మీమాటే మర్చిపోయాను సుమా !!

    @కృష్ణప్రియా,

    థాంక్స్.

    Like

  5. బాబాయ్ గారు.. ఇదేవన్నా పద్ధతిగా వుందండీ.. మా కన్నా ముందే పూజ చేసేసుకుని, పిన్నిగారు చేసిన నవ పిండివంటలూ శుష్టిగా లాగించేసి, పైగ ఇలా బొమ్మలు పెట్టి మమ్మల్ని వూరించడం.. అస్సలు బాగులేదు.. అర్జంటుగా నేను పూనా వెళ్ళే రైలు ఎక్కేస్తున్నాను.. అపై మీ ఇష్టం…

    Like

  6. కళ్ళ విందు కళ్ళతో ఆగిపోతే బాగుండును. నాలిక కి తెలియకుండా! నాలుకని వచ్చేవారం దాకా పట్టి ఉంచుతాను. ఏం చేస్తాం! 😦

    Like

  7. వరలక్ష్మమ్మను ముందుగా పిలుపిన్చుకున్నదానికి అభినందనలు.
    అట్లతద్దికి (రిసార్ట్) శుభాకాంక్షలు.

    Like

  8. @శంకర్ వోలేటీ,
    అయితే ఎప్పుడూ రావడం ?

    @కొత్తావకాయ,
    జాగ్రత్త! మరీ ఎక్కువ పట్టేసి ఉంచకు !!

    @మోహన్ గారూ,

    థాంక్స్.

    Like

Leave a comment